Revised Common Lectionary (Complementary)
97 యెహోవా ఏలుతున్నాడు, భూమి సంతోషిస్తోంది.
దూర దేశాలన్నీ సంతోషిస్తున్నాయి.
2 దట్టమైన చీకటి మేఘాలు యెహోవాను ఆవరించాయి.
నీతి న్యాయాలు ఆయన రాజ్యాన్ని బలపరుస్తాయి.
3 యెహోవా ముందర అగ్ని బయలువెళ్తూ
ఆయన శత్రువులను నాశనం చేస్తుంది.
4 ఆయన మెరుపు ఆకాశంలో తళుక్కుమంటుంది.
ప్రజలు దాన్ని చూచి భయపడతారు.
5 యెహోవా ఎదుట పర్వతాలు మైనంలా కరగిపోతాయి.
భూలోక ప్రభువు ఎదుట అవి కరిగిపోతాయి.
6 ఆకాశములారా, ఆయన మంచితనం గూర్చి చెప్పండి.
ప్రతి మనిషీ దేవుని మహిమను చూచును గాక!
7 మనుష్యులు వారి విగ్రహాలను పూజిస్తారు.
వారు వారి “దేవుళ్లను” గూర్చి అతిశయిస్తారు.
కాని ఆ ప్రజలు యిబ్బంది పడతారు.
వారి “దేవుళ్లు” యెహోవాకు సాగిలపడి ఆయనను ఆరాధిస్తారు.
8 సీయోనూ, విని సంతోషించుము!
యూదా పట్టణములారా, సంతోషించండి!
ఎందుకంటే యెహోవా జ్ఞానముగల నిర్ణయాలు చేస్తాడు.
9 సర్వోన్నతుడవైన యెహోవా, నిజంగా నీవే భూమిని పాలించేవాడవు.
ఇతర “దేవుళ్ల” కంటే నీవు చాలా మంచివాడవు.
10 యెహోవాను ప్రేమించే ప్రజలు దుర్మార్గాన్ని ద్వేషిస్తారు.
కనుక దేవుడు తన అనుచరులను రక్షిస్తాడు. దేవుడు దుర్మార్గులనుండి తన ఆనుచరులను రక్షిస్తాడు.
11 మంచి మనుష్యుల మీద వెలుగు, సంతోషం ప్రకాశిస్తాయి.
12 మంచి మనుష్యులారా, యెహోవాయందు ఆనందించండి.
ఆయన పవిత్ర నామాన్ని ఘనపరచండి.
18 అప్పుడు మోషే, “అలాగైతే నీ మహిమ నాకు చూపించు” అన్నాడు.
19 అప్పుడు యెహోవా జవాబిచ్చాడు: “నా మంచితనం అంతా నీ ముందు నడిచేటట్లు చేస్తాను. నేను యెహోవాను. నీకు వినబడేటట్టు నా పేరు నేను ప్రకటిస్తాను. నేను ప్రకటించుకున్న వారికి ప్రేమ, దయ నేను చూపెడతాను. 20 కాని నా ముఖం నీవు చూడలేవు. ఏ మనిషీ నన్ను చూచి బ్రతకలేడు.
21 “అక్కడ నా దగ్గర ఒక చోట ఒక బండ వుంది. నీవు ఆ బండమీద నిలబడవచ్చు. 22 నా మహిమ ఆ స్థలాన్ని దాటి వెళ్తుంది. ఆ బండలోని ఒక పెద్ద సందులో నేను నిన్ను ఉంచి, నేను దాటి వెళ్లేటప్పుడు, నా చేతితో నిన్ను కప్పుతాను. 23 అప్పుడు నేను నా చేయిని తీసివేస్తాను. నీవు నా వెనుకవైపు చూస్తావు. కాని నా ముఖం మాత్రము నీవు చూడలేవు.”
14 ఆ జీవంగల వాక్యము మానవరూపం దాల్చి మానవుల మధ్య జీవించాడు. ఆయనలో కృప, సత్యము సంపూర్ణంగా ఉన్నాయి. ఆయన తండ్రికి ఏకైక పుత్రుడు. కనుక ఆయనలో ప్రత్యేకమైన తేజస్సు ఉంది. ఆ తేజస్సును మేము చూసాము. 15 యోహాను ఆయన్ని గురించి ఈ విధంగా నొక్కి చెప్పాడు: “ఈయన గురించి నేను యిదివరకే ఈ విధంగా చెప్పాను, ‘నా తర్వాత రానున్నవాడు నాకన్నా ముందునుండి ఉన్నావాడు. కనుక ఆయన నాకన్నా గొప్పవాడు.’”
16 ఆయన పరిపూర్ణతవల్ల మనమంతా అనుగ్రహం మీద అనుగ్రహం పొందాము. 17 దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. యేసు క్రీస్తు ద్వారా కృపను, సత్యాన్ని ఇచ్చాడు. 18 ఎవ్వరూ ఎన్నడూ దేవుణ్ణి చూడలేదు. దేవుని ప్రక్కనవున్న ఆయన ఏకైక పుత్రుడు దేవునితో సమానము. ఆయన మనకు దేవుణ్ణి గురించి తెలియచేసాడు.
© 1997 Bible League International