Revised Common Lectionary (Complementary)
93 యెహోవాయే రాజు!
ప్రభావము, బలము ఆయన వస్త్రములవలె ధరించాడు.
కనుక ప్రపంచం నాశనం చేయబడదు.
2 దేవా, నీవూ, నీ రాజ్యమూ శాశ్వతంగా కొనసాగుతాయి.
3 యెహోవా, నదుల ధ్వని చాలా పెద్దగా ఉంది.
ఎగిరిపడే అలలు చాలా పెద్దగా ధ్వనిస్తున్నాయి,
4 పెద్దగా లేస్తున్న సముద్రపు అలలు హోరెత్తుతున్నాయి, శక్తివంతంగా ఉన్నాయి.
కాని పైన ఉన్న యెహోవా అంతకంటే శక్తిగలవాడు.
5 యెహోవా, నీ న్యాయవిధులు శాశ్వతంగా కొనసాగుతాయి.
నీ పవిత్ర ఆలయం ఎల్లకాలం నిలిచి ఉంటుంది.
20 తరువాత రాజు హిల్కీయాకు, షాఫాను కుమారుడు అహీకాముకు, మీకా కుమారుడు అబ్దోనుకు, కార్యదర్శి షాఫాను మరియు సేవకుడైన ఆశాయాకును ఒక ఆజ్ఞ యిచ్చాడు. 21 రాజు యిలా చెప్పాడు: “మీరు వెళ్లి నా తరుపున ఇశ్రాయేలులోను, యూదాలోను మిగిలివున్న ప్రజల తరపున యెహోవాను మనకు దొరికిన ధర్మశాస్త్రంలో వ్రాయబడిన విషయాలను గురించి అడగండి. మన పూర్వీకులు యెహోవా ఆజ్ఞలను పాటించని కారణంగా ఆయన మనపట్ల ఎక్కువ కోపంగా వున్నాడు. ఈ గ్రంథం బోధించిన విషయాలను వారు పాటించలేదు!”
22 హిల్కీయా, రాజసేవకులు[a] కలిసి ప్రవాదిని హుల్దా వద్దకు వెళ్లారు. హుల్దా, షల్లూము భార్య. షల్లూము తాఖతు (తిక్వా) కుమారుడు. తాఖతు హస్రహూ (హస్రా) యొక్క కుమారుడు. హర్హహు (హస్రా) రాజవస్త్రాల విషయంలో శ్రద్ధ తీసికొనే అధికారి. హుల్దా క్రొత్త యెరూషలేములో నివసిస్తూ వుండేది. హిల్కీయా, రాజ సేవకులు జరిగిన సంగతంతా హుల్దాకు తెలిపారు. 23 హుల్దా వారితో యిలా చెప్పింది: “ఇశ్రాయేలు దేవుడగు యెహోవా యిలా తెలియజేస్తున్నాడు రాజైన యోషీయాకు తెలియజేయుము. 24 యెహోవా యిలా చెప్పుచున్నాడు: ‘ఈ ప్రదేశానికి, ఇక్కడ నివసిస్తున్న ప్రజలకు నేను కష్టాలు తెచ్చి పెడతాను. యూదా రాజు ముందర చదివిన పుస్తకంలో వ్రాసిన విధంగా భయంకర పరిస్థితులు తీసికొని వస్తాను. 25 ఇలా ఎందుకు చేస్తాననగా ప్రజలు నన్ను వదిలి అన్య దేవతలకు ధూపం వేయసాగారు. వారు చేసిన నీచ కార్యాలన్నిటితో వారు నాకు కోపం కలుగజేశారు. అందువల్ల ఈ ప్రదేశం మీద నా కోపాన్ని కుమ్మరిస్తాను. బడబాగ్నిలా[b] నా కోపం చల్లారదు!’
26 “కాని ఈ విషయం యూదా రాజైన యోషీయాకు చెప్పండి. దేవుని అడుగమని అతడు మిమ్మల్ని పంపాడు. ఇంతకు ముందు మీరు విన్న విషయాలపై ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యిలా చెప్పుచున్నాడు: 27 ‘యోషీయా, నీవు పశ్చాత్తాప పడినావు. నిన్ను నీవు తగ్గించుకొని, నీ దుస్తులు చింపుకున్నావు. నాముందు నీవు విలపించావు. నీ హృదయం మారినది గనుక, 28 నేను నిన్ను నీ పూర్వీకుల వద్దకు[c] తీసుకొని వెళతాను. నీవు నీ సమాధికి ప్రశాంతంగా వెళతావు. ఈ ప్రాంతం మీదికి, ఇక్కడ నివసించే ప్రజల మీదికి నేను రప్పించే గొప్ప నాశనం నీవు చూడవు.’” హిల్కీయా మరియు రాజు సేవకులు ఈ సందేశాన్ని రాజైన యోషీయాకు. అందజేశారు.
29 రాజైన యోషీయా యూదా, యెరూషలేము పెద్దలందరినీ తనను వచ్చి కలవమని పిలిచాడు. 30 రాజు యోహోవా ఆలయానికి వెళ్ళాడు. యూదా ప్రజలందరు, యెరూషలేము వాసులు, యాజకులు, లేవీయులు, ప్రముఖులు, సామాన్య ప్రజానీకం అంతా యోషీయావద్దకు వచ్చారు. ఒడంబడిక గ్రంథంలో వున్న విషయాలన్నీ యోషీయా ప్రజలకు చదివి వినిపించాడు. ఆ గ్రంథం ఆలయంలో దొరికింది. 31 తరువాత రాజు తన స్థానంలో లేచి నిలబడినాడు. అతడు యెహోవాతో ఒక ఒడంబడిక చేసికొన్నాడు. యెహోవాను అనుసరించటానికి, ఆయన ఆజ్ఞలు, ధర్మాశాస్త్రాన్ని నియమాలను పాటించటానికి అతడు అంగీకరించాడు. హృదయపూర్వకంగా, ఆత్మ పూర్వకంగా అనుసరించటానికి యోషీయా అంగీకరించాడు. ఈ గ్రంథంలో వ్రాసిన ఒడంబడికలోని అంశాలను పాటించటానికి యోషీయో అంగీకరించాడు. 32 పిమ్మట యెరూషలేము, బెన్యామీను ప్రజలందరూ ఈ ఒడంబడికను అంగీకరించేలా వారిచే యోషియా ప్రమాణం చేయించాడు. తమ పూర్వీకులు విధేయులైవున్న దేవుని ఒడంబడికకు యెరూషలేము ప్రజలు బద్ధులయ్యారు. 33 పైగా ఇశ్రాయేలీయులకు సంబంధించిన స్థలాలలో వున్న విగ్రహాలన్నిటినీ యోషీయా తీసిపారవేశాడు. దేవుడు ఆ విగ్రహాలను అసహ్యించు కున్నాడు. యోషీయా రాజు ఇశ్రాయేలులో ప్రతి ఒక్కడిని వారి దేవుడగు యెహోవాను ఆరాధించునట్లు చేసెను. యోషీయా జీవించినంతకాలం ప్రజలు తమ పూర్వీకుల దేవుడగు యెహోవాను ఆరాధించటం మానలేదు.
సుమెయోను యేసును చూడటం
25 ఇక్కడ యెరూషలేములో సుమెయోను అని పిలువబడే ఒక వ్యక్తివున్నాడు. ఇతడు భక్తితో నీతిగా జీవించేవాడు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎప్పుడు సహాయం చేస్తాడా అని కాచుకొని ఉండేవాడు. అతడు పవిత్రాత్మ పూర్ణుడు. 26 ప్రభువు వాగ్దానం చేసిన క్రీస్తును చూసే వరకు మరణించడని పవిత్రాత్మ అతనికి బయలుపర్చాడు. 27 పవిత్రాత్మ తన మీదికి రాగా అతడు దేవాలయంలోకి వెళ్ళాడు. అదే సమయానికి ధర్మశాస్త్రం చెప్పిన ఆచారం నెరవేర్చడానికి మరియ, యోసేపు బాలునితో సహా మందిరంలోకి వచ్చారు. 28 సుమెయోను ఆ బాలుణ్ణి తన చేతుల్తో ఎత్తి దేవుణ్ణి ఈ విధంగా స్తుతించడం మొదలు పెట్టాడు:
29 “మహా ప్రభూ! నీ మాట ప్రకారం నీ సేవకుణ్ణి శాంతంగా వెళ్ళనివ్వు.
30 నీవు నియమించిన రక్షకుణ్ణి కళ్ళారా చూసాను.
31 నీవు ఆయన్ని ప్రపంచములోని ప్రజలందరి ముందు ఎన్నుకొన్నావు!
32 యూదులుకాని వాళ్ళకు నీ మార్గాన్ని చూపే వెలుగు ఆయనే.
నీ ఇశ్రాయేలు ప్రజల కీర్తి చిహ్నం ఆయనే!”
33 యేసు తల్లితండ్రులు అతడు చెప్పిన విషయాలు విని ఆశ్చర్యపడ్డారు. 34 ఆ తర్వాత సుమెయోను వాళ్ళను ఆశీర్వదించి యేసు తల్లియైన మరియతో ఈ విధంగా అన్నాడు: “ఈ బాలుని కారణంగా ఎందరో ఇశ్రాయేలీయులు అభివృద్ధి చెందుతారు! మరెందరో పడిపోతారు! ఈ బాలుడు దేవుని చిహ్నం. ఈ చిహ్నాన్ని చాలా మంది ఎదిరిస్తారు. 35 తద్వారా మనుష్యుల మనస్సుల్లో ఉన్న రహస్యాలు బయట పడ్తాయి. ఒక కత్తి నీ గుండెను దూసుకుపోతుంది.”
అన్నా యేసును చూడటం
36 ఆ మందిరంలో, “అన్న” అనే ఒక ప్రవక్త్రి కూడా ఉండేది. ఈమె పనూయేలు కుమార్తె. ఆషేరు తెగకు చెందింది. ఆమె వయస్సులో చాలా పెద్దది. పెండ్లి అయిన ఏడు సంవత్సరాలకే ఆమె వితంతువు అయింది. 37 అప్పటికి ఆమెకు ఎనభై నాలుగు సంవత్సరాలు. మందిరం విడిచి వెళ్ళేది కాదు. రాత్రింబగళ్ళు ప్రార్థించేది. ఉపవాసాలు చేసేది.
38 మరియ, యోసేపులు అక్కడ ఉండగా ఆమె వాళ్ళ దగ్గరకు వచ్చింది. దేవునికి కృతజ్ఞతలు చెప్పి యెరూషలేములో విముక్తి కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళందరికి ఆ బాలుణ్ణి గురించి చెప్పింది.
© 1997 Bible League International