Revised Common Lectionary (Complementary)
93 యెహోవాయే రాజు!
ప్రభావము, బలము ఆయన వస్త్రములవలె ధరించాడు.
కనుక ప్రపంచం నాశనం చేయబడదు.
2 దేవా, నీవూ, నీ రాజ్యమూ శాశ్వతంగా కొనసాగుతాయి.
3 యెహోవా, నదుల ధ్వని చాలా పెద్దగా ఉంది.
ఎగిరిపడే అలలు చాలా పెద్దగా ధ్వనిస్తున్నాయి,
4 పెద్దగా లేస్తున్న సముద్రపు అలలు హోరెత్తుతున్నాయి, శక్తివంతంగా ఉన్నాయి.
కాని పైన ఉన్న యెహోవా అంతకంటే శక్తిగలవాడు.
5 యెహోవా, నీ న్యాయవిధులు శాశ్వతంగా కొనసాగుతాయి.
నీ పవిత్ర ఆలయం ఎల్లకాలం నిలిచి ఉంటుంది.
ఆసా చేసిన మార్పులు
15 దేవుని ఆత్మ అజర్యా మీదికి వచ్చింది. అజర్యా ఓబేదు కుమారుడు. 2 ఆసాను కలుసుకోవటానికి అజర్యా వెళ్లాడు. అజర్యా యిలా అన్నాడు: “ఆసా, యూదా ప్రజలారా, బెన్యామీను ప్రజలారా నేను చేప్పేది వినండి! మీరు యెహోవాను నమ్మకొని ఉన్నన్ని రోజులూ, యెహోవా మీతో వుంటాడు. మీరు యెహోవాను వెదికితే, మీరాయనను కనుగొంటారు. కాని మీరు ఆయనను వదిలివేస్తే, ఆయన మిమ్మల్ని వదిలివేస్తాడు. 3 చాలాకాలం ఇశ్రాయేలుకు ఒక నిజమైన దేవుడు లేకుండా వుండిపోయింది. వారు బోధించే యాజకుడుగాని, ధర్మశాస్త్రంగాని లేకుండా వుండి పోయారు. 4 కాని ఇశ్రాయేలు ప్రజలకు కష్టంవచ్చినప్పుడు వారు మళ్లీ దేవుడైన యెహోవాను ఆశ్రయించారు. ఆయన ఇశ్రాయేలు దేవుడు. వారాయనను వెదకగా, యెహోవా వారికి కన్పించాడు. 5 ఆ కష్టకాలంలో ఏ ఒక్కడూ క్షేమంగా ప్రయామాణం చేయగలిగేవాడు కాదు. రాజ్యాలన్నిటిలో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పాడ్డాయి. 6 ఒక రాజ్యం మరో రాజ్యాన్ని, ఒక నగరం మరో నగరాన్ని నాశనం చేసికోసాగాయి. దేవుడు వాటిని సర్వవిధాలుగా కల్లోల పెట్టిన కారణంగా ఆ పరిణామాలు వచ్చాయి. 7 కావున ఆసా, నీవు మరియు యూదా, బెన్యామీను ప్రజలు బలవంతులై యుండండి. బలహీనులు కావద్దు. అధైర్యపడవద్దు. ఎందుకంటే, మీ మంచి పనులకు తగిన ఫలితం దొరుకుతుంది!”
8 ప్రవక్త ఓబేదు మాటలు, వర్తమానం విన్న ఆసాకు చాలా ధైర్యం వచ్చింది. తరువాత అతడు యూదా, బెన్యామీను ప్రాంతాలన్నిటిలో వున్న అసహ్యకరమైన విగ్రహాలను తొలగించాడు. తానువశపర్చుకున్న ఎఫ్రాయిము కొండల ప్రాంతంలోని పట్టణాలలో వున్న హేయమైన విగ్రహాలను కూడా ఆసా తొలగించాడు. ఆలయ ముఖమండపంలో వున్న దేవుని బలిపీఠాన్ని కూడా అతడు బాగు చేయించాడు.
9 పిమ్మట యూదా, బెన్యామీను ప్రజలందరినీ ఆసా సమావేశపర్చాడు. అంతేగాక ఎఫ్రాయిము, మనష్షే, మరియు షిమ్యోను కుటుంబాల వారిని కూడా పిలిచాడు. వీరు ఇశ్రాయేలునుండి వలసపోయి యూదాలో స్థిరపడినవారు. వారిలో చాలామంది యూదాకు వచ్చిన కారణమేమంటే, ఆసా దేవుడైన యెహోవా ఆసా పక్షాన వున్నట్లు వారు గమనించారు.
10 ఆసా పరిపాలనలో పదిహేను సంవత్సరాలు దాటి మూడవనెల గడుస్తూవుండగా ఆసా, అతని ప్రజలూ యెరూషలేములో సమావేశమయ్యారు. 11 ఆ సమయంలో వారు ఏడువందల గిత్త దూడలను, ఏడువేల గొర్రెలను, మేకలను యెహోవాకు బలి యిచ్చారు. ఆ జంతువులను, ఇతర విలువైన వస్తువులను ఆసా సైన్యం తమ శత్రువుల నుండి తీసుకొన్నారు. 12 తరువాత వారు తమ పూర్ణ హృదయంతోను, తమ ఆత్మసాక్షితోను యెహోవాను సేవించటానికి ఒక ఒడంబడిక చేసుకొన్నారు. ఆయన వారి పూర్వీకులు సేవించిన దేవుడు. 13 ఎవ్వరైనా దేవాధి దేవుని పూజించటానికి నిరాకరిస్తే అతడు చంపబడాలి. అట్టి మనిషి ఉన్నతుడేగాని, అల్పుడేగాని, పురుషుడే గాని, స్త్రీయేగాని ఎవ్వరైనా విచారణ లేకుండా చంపబడవలసినదే. 14 అప్పుడు ఆసా మరియు ప్రజలు యెహోవాకు ఒక ప్రమాణం చేశారు. వారు ఏకగ్రీవంగా పెద్దగా అరిచారు. వారు బూరలు, పొట్టేలు కొమ్ములు వూదారు. 15 యూదా ప్రజలంతా వారు చేసిన ప్రమాణం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. వారు పూర్ణ హృదయంతో ప్రమాణం చేశారు. గనుక వారికా సంతోషం. పూర్ణ హృదయంతో వారు దేవుని అనుసరించారు. వారు దేవుని కొరకు వెదకి, ఆయనను దర్శించారు. కావున యెహోవా వారికి దేశమంతా శాంతియుత వాతవరణం నెలకొనేలా చేశాడు.
15 నాతో మాట్లాడిన దూత దగ్గర బంగారంతో చేసిన కొలత బద్ద ఉంది. అతడు దాని పట్టణాన్ని, దాని ప్రాకారాన్ని, ద్వారాలను కొలవటానికి తెచ్చాడు. 16 ఆ పట్టణం చతురస్రంగా కట్టబడి ఉంది. దాని వెడల్పు, పొడవు సమానంగా ఉన్నాయి. అతడు కొలతబద్దతో పట్టణాన్ని కొలిచాడు. దాని పొడవు, వెడల్పు, ఎత్తు, 1,500 మైళ్ళు[a] ఉన్నట్లు కనుగొన్నాడు. 17 ఆ పట్టణం యొక్క ప్రాకారాన్ని కొలిచి దాని ఎత్తు ఆ నాటి కొలత పద్ధతి ప్రకారం 144 మూరలు[b] ఉన్నట్లు కనుగొన్నాడు. 18 ఆ ప్రాకారం సూర్యకాంతములతో కట్టబడి ఉంది. ఆ పట్టణం బంగారంతో కట్టబడి ఉంది. అది గాజువలె స్వచ్ఛంగా ఉంది.
19 ఆ ప్రాకారాల పునాదులు రకరకాల రత్నాలతో అలంకరింపబడి ఉన్నాయి. మొదటి పునాదిరాయి సూర్యకాంతం, రెండవది నీలం, మూడవది యమున, నాలుగవది పచ్చ, 20 ఐదవది వైఢూర్యం, ఆరవది కెంపు, ఏడవది సువర్ణ రత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, పదవది సువర్ణ సునీయము, పదకొండవది పద్మరాగము, పన్నెండవది సుగంధము. 21 ఆ పన్నెండు ద్వారాలు పన్నెండు ముత్యాలతో చేయబడి ఉన్నాయి. ఒక్కొక్క ద్వారం ఒక్కొక్క ముత్యంతో చేయబడి ఉంది. ఆ పట్టణపు వీధులు మేలిమి బంగారంతో చేయబడి ఉన్నాయి. అవి గాజువలె స్వచ్ఛంగా ఉన్నాయి.
22 ఆ పట్టణంలో నాకు మందిరం కనిపించలేదు. సర్వశక్తి సంపన్నుడు, ప్రభువు అయినటువంటి దేవుడు మరియు గొఱ్ఱెపిల్ల ఆ పట్టణానికి మందిరమై ఉన్నారు.
© 1997 Bible League International