Revised Common Lectionary (Complementary)
93 యెహోవాయే రాజు!
ప్రభావము, బలము ఆయన వస్త్రములవలె ధరించాడు.
కనుక ప్రపంచం నాశనం చేయబడదు.
2 దేవా, నీవూ, నీ రాజ్యమూ శాశ్వతంగా కొనసాగుతాయి.
3 యెహోవా, నదుల ధ్వని చాలా పెద్దగా ఉంది.
ఎగిరిపడే అలలు చాలా పెద్దగా ధ్వనిస్తున్నాయి,
4 పెద్దగా లేస్తున్న సముద్రపు అలలు హోరెత్తుతున్నాయి, శక్తివంతంగా ఉన్నాయి.
కాని పైన ఉన్న యెహోవా అంతకంటే శక్తిగలవాడు.
5 యెహోవా, నీ న్యాయవిధులు శాశ్వతంగా కొనసాగుతాయి.
నీ పవిత్ర ఆలయం ఎల్లకాలం నిలిచి ఉంటుంది.
ఇతర సైనికులు దావీదుతో చేరటం
16 బెన్యామీను, యూదా వంశాలకు చెందిన ఇతర ప్రజలు కూడ కోటలో వున్న దావీదు వద్దకు వచ్చారు. 17 దావీదు వారిని కలిసేందుకు ఎదురు వెళ్లి, వారితో ఇలా అన్నాడు: “మీరు శాంతి భావంతో నాకు సహాయం చేయగోరి వస్తే నేను మిమ్మల్ని ఆహ్వానిస్తాను! నాతో కలిసి ఉండండి. ఒకవేళ నేను ఏమీ తప్పు చేయకపోయినా మీరు నా మీద నిఘావేసి నన్ను శత్రువులకు అప్పజెప్పటానికి కనుక వస్తే, మన పూర్వీకుల దేవుడు మీరు చేసేది చూచి మిమ్మల్ని శిక్షించుగాక!”
18 అప్పుడు దేవుని ఆత్మ అమాశై మీదికి వచ్చింది. అమాశై ముప్పదిమంది వీరుల నాయకుడు. అమాశై అప్పుడు ఇలా అన్నాడు:
“ఓ దావీదూ, మేము నీవారం!
ఓ యెష్షయి కుమారుడా, మేము నీతో వున్నాము.
శాంతి! నీకు శాంతి కలుగుగాక!
నీకు సహాయపడే ప్రజలకు కూడ శాంతి. ఎందువల్లననగా నీ దైవం నీకు సహాయపడుతున్నాడు!”
అప్పుడు దావీదు వారికి స్వాగతం పలికి వారిని చేరదీశాడు. తన పక్షాన వారిని దళాధిపతులుగా నియమించాడు.
19 కొందరు మనష్షే వంశంలోని వారు కూడ వచ్చి దావీదు పక్షం వహించారు. అతడు ఫిలిష్తీయులతో కలిసి సౌలుపై యుద్ధానికి వెళ్లినప్పుడు వారు వచ్చి దావీదు పక్షం వహించారు. కాని దావీదు, అతని మనుష్యులు నిజానికి ఫిలిష్తీయులకు సహాయపడలేదు. దావీదు తమకు సహాయం చేసే విషయం ఫిలిష్తీయుల అధికారులు చర్చించి, పిమ్మట అతనిని పంపివేయటానికి నిశ్చయించారు. ఫిలిష్తీయుల పాలకులు ఇలా అన్నారు: “ఒకవేళ దావీదు మధ్యలో తన యజమాని సౌలు వద్దకు వెళ్లిపోతే మన తలలు తెగిపోతాయి!” 20 దావీదు సిక్లగు పట్టణానికి వెళ్లినప్పుడు అతనితో కలిసిన మనష్షీయులు ఎవరనగా: అద్నా, యోజాబాదు, మెదీయవేలు, మిఖాయేలు, యోజాబాదు, ఎలీహు మరియు జిల్లెతై. వీరిలో ప్రతి ఒక్కడూ మనష్షే వంశీయులలో వెయ్యి మందికి నాయకుడు. 21 దుష్టశక్తులను ఎదుర్కొనటంలో వారు దావీదుకు తోడ్పడ్డారు. ఈ దుష్టులు దేశం మీద పడి ప్రజలను దోచుకోసాగారు. దావీదును చేరిన మనష్షీయులంతా ధైర్యంగల సేనానులు. వారు దావీదు సైన్యంలో అధిపతులయ్యారు.
22 రోజురోజుకూ దావీదు వద్దకు వచ్చి సహాయపడేవారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. దానితో దావీదుకు శక్తివంతమైన ఒక మహా సైన్యం ఏర్పడింది.
5 సింహాసనంపై కూర్చొన్నవాడు, “నేను ప్రతి వస్తువును క్రొత్తగా చేస్తాను” అని అన్నాడు. “ఇవి విశ్వసింప దగినవి, సత్యం, కనుక యివి వ్రాయి” అని అన్నాడు.
6 ఆయన నాతో, “అంతా సమాప్తమైంది. అల్ఫా (ఆది), ఓమెగా (అంతం) నేనే. మొదటివాణ్ణి, చివరివాణ్ణి నేనే. దాహంతోవున్నవానికి ఊటనుండి జీవజలాన్ని ఉచితంగా ఇస్తాను. 7 జయించినవాడు వీటన్నిటికీ వారసుడౌతాడు. నేను అతనికి దేవునిగా, అతడు నాకు కుమారునిగా ఉంటాము. 8 కాని, పిరికివాళ్ళు, విశ్వాసం లేనివాళ్ళు, నీచులు, హంతకులు, అవినీతిపరులు, మంత్రగాళ్ళు, విగ్రహారాధకులు, అసత్యాలాడేవాళ్ళు మండే గంధకమున్న భయానకమైన గుండంలో ఉంటారు. యిది రెండవ మరణం” అని అన్నాడు.
9 ఏడు పాత్రలతో ఏడు చివరి తెగుళ్ళు పట్టుకొని ఉన్నవారిలో ఒక దూతవచ్చి నాతో, “పెళ్ళికూతుర్ని, అంటే గొఱ్ఱెపిల్ల భార్యను చూపిస్తాను, రా!” అని అన్నాడు. 10 అతడు నన్ను ఆత్మ ద్వారా ఎత్తుగా ఉన్న గొప్ప పర్వతం మీదికి తీసుకు వెళ్ళాడు. పరలోకంలో ఉన్న దేవుని దగ్గరనుండి దిగివస్తున్న పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమును చూపించాడు.
11 అది దేవుని మహిమతో వెలుగుతూ ఉంది. దాని మహిమ అమూల్యమైన ఆభరణంగా, అంటే సూర్య కాంతమణిలా ఉంది. అది స్ఫటికంలా స్వచ్ఛంగా ఉంది. 12 దాని చుట్టూ ఎత్తైన ఒక ప్రాకారం ఉంది. ఆ ప్రాకారానికి పన్నెండు ద్వారాలు ఉన్నాయి. పన్నెండుమంది దేవదూతలు ఆ ద్వారాల యొద్ద ఉన్నారు. ఆ ద్వారాల మీద ఇశ్రాయేలీయుల పన్నెండు గోత్రాల పేర్లు వ్రాయబడ్డాయి. 13 తూర్పు వైపు మూడు ద్వారాలు, ఉత్తరం వైపు మూడు ద్వారాలు, దక్షిణం వైపు మూడు ద్వారాలు, పడమర వైపు మూడు ద్వారాలు ఉన్నాయి. 14 ఆ నగర ప్రాకారానికి పన్నెండు పునాదులున్నాయి. వాటి మీద గొఱ్ఱెపిల్ల యొక్క పన్నెండుగురు అపొస్తలుల పేర్లు ఉన్నాయి.
© 1997 Bible League International