Revised Common Lectionary (Complementary)
9 మాసిదోనియ ప్రాంతం వాడొకడు, “మాసిదోనియకు వచ్చి మమ్మల్ని రక్షించండి” అని వేడుకొన్నట్లు ఆ రాత్రి పౌలుకు ఒక దర్శనం కలిగింది. 10 పౌలుకు దర్శనం కలిగాక మాసిదోనియ నివాసులకు సువార్త ప్రకటించటానికి దేవుడు మమ్మల్ని ఎన్నుకొన్నాడని గ్రహించి తక్షణమే మేము అక్కడికి వెళ్ళటానికి సిద్ధం అయ్యాము.
లూదియ భక్తురాలు కావటం
11 “త్రోయ” నుండి సముద్ర ప్రయాణం చేసి నేరుగా సమొత్రాకేకు వెళ్ళి మరుసటి రోజు నెయపొలి చేరుకొన్నాము. 12 అక్కడినుండి ప్రయాణమై రోమా సామ్రాజ్యంలోని ఫిలిప్పీకి వెళ్ళాం. ఫిలిప్పీ మాసిదోనియలోని ప్రాంతంలో చాలా ముఖ్యమైన పట్టణం. మేము ఆ పట్టణంలో చాలా రోజులు గడిపాము.
13 ఒక విశ్రాంతి రోజున ప్రార్థనలు చేయటానికి స్థలం దొరుకుతుందని ఆశిస్తూ ఊరి బయట ఉన్న నది దగ్గరకు వెళ్ళాము. అక్కడికి వచ్చిన ఆడవాళ్ళతో కూర్చొని మాట్లాడటం మొదలుపెట్టాము. 14 మా మాటలు వింటున్న ఒకామె పేరు “లూదియ.” ఈమె తుయతైర గ్రామానికి చెందింది. ఊదారంగు పొడిని వ్యాపారం చేసే ఈ లూదియ భక్తురాలు. దేవుడు ఆమె మనస్సును మార్చి పౌలు సందేశం వినేటట్లు చేసాడు. 15 ఆమె, ఆమె యింట్లో ఉన్న వాళ్ళంతా బాప్తిస్మము పొందాక మమ్మల్ని యింటికి ఆహ్వానించింది. “నేను నిజంగా ప్రభువు భక్తురాలననే నమ్మకం మీలో ఉన్నట్లయితే వచ్చి మా యింట్లో ఉండండి” అని మమ్మల్ని వేడుకొని చాలా బలవంతం చేసింది.
సంగీత నాయకునికి: వాయిద్యాలతో స్తుతి కీర్తన.
67 దేవా, మమ్ములను కనికరించి, మమ్ములను ఆశీర్వదించుము.
దయచేసి మమ్ములను స్వీకరించుము.
2 దేవా, భూమి మీద ప్రతి మనిషినీ నిన్ను గూర్చి తెలుసుకోనిమ్ము.
నీవు మనుష్యులను ఎలా రక్షిస్తావో ప్రతి దేశం నేర్చుకోనిమ్ము.
3 దేవా, ప్రజలు నిన్ను స్తుతించెదరుగాక!
మనుష్యులంతా నిన్ను స్తుతించెదరుగాక!
4 దేశాలన్నీ ఆనందించి, సంతోషించుగాక!
ఎందుకంటే నీవు మనుష్యులకు న్యాయంగా తీర్పు తీరుస్తావు
మరియు ప్రతి దేశాన్నీ నీవు పాలిస్తావు.
5 దేవా, ప్రజలు నిన్ను స్తుతించెదరు గాక!
మనుష్యులంతా నిన్ను స్తుతించెదరు గాక!
6 దేవా, మా దేవా, మమ్మల్ని దీవించుము.
మా భూమి మాకు గొప్ప పంట ఇచ్చేటట్టుగా చేయుము.
7 దేవుడు మమ్మల్ని దీవించుగాక.
భూమిమీద వున్న ప్రతి ఒక్కరూ దేవునికి భయపడి, ఆయనను గౌరవించెదరు గాక.
10 అతడు నన్ను ఆత్మ ద్వారా ఎత్తుగా ఉన్న గొప్ప పర్వతం మీదికి తీసుకు వెళ్ళాడు. పరలోకంలో ఉన్న దేవుని దగ్గరనుండి దిగివస్తున్న పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమును చూపించాడు.
22 ఆ పట్టణంలో నాకు మందిరం కనిపించలేదు. సర్వశక్తి సంపన్నుడు, ప్రభువు అయినటువంటి దేవుడు మరియు గొఱ్ఱెపిల్ల ఆ పట్టణానికి మందిరమై ఉన్నారు. 23 దేవుని తేజస్సు ఆ పట్టణానికి వెలుగునిస్తుంది. గొఱ్ఱెపిల్ల ఆ పట్టణానికి జ్యోతి కాబట్టి ఆ పట్టణానికి వెలుగునివ్వటానికి సూర్యచంద్రులు అవసరం లేదు.
24 జనులు ఆ వెలుగులో నడుస్తారు. ప్రపంచంలో ఉన్న రాజులు తమ ఘనతను ఆ పట్టణానికి తీసుకు వస్తారు. 25 ఆ పట్టణంలో రాత్రి అనేది ఉండదు. కనుక ఆ పట్టణం యొక్క ద్వారాలు ఎన్నటికీ మూయబడవు. 26 జనముల గౌరవము, వారి కీర్తి ఈ పట్టణానికి తేబడతాయి. 27 అపవిత్రమైనది ఆ పట్టణంలో ప్రవేశింపదు. అదే విధంగా అవమానకరమైన పనులు చేసేవాళ్ళు, మోసగాళ్ళు ఆ పట్టణంలోకి ప్రవేశించరు. గొఱ్ఱెపిల్ల జీవ గ్రంథంలో ఎవరి పేర్లు వ్రాయబడ్డాయో వాళ్ళు మాత్రమే ప్రవేశించగలుగుతారు.
22 ఆ తర్వాత ఆ దేవదూత స్పటికంలా స్వచ్ఛంగా ఉన్న నదిని నాకు చూపాడు. దానిలో జీవజలం ఉంది. ఆ నది దేవుడు మరియు గొఱ్ఱెపిల్ల కూర్చున్న సింహాసనం నుండి మొదలై, 2 పట్టణంలోని గొప్ప వీధి మధ్యనుండి పారుతూ ఉంది. ఆ నదికి యిరువైపులా జీవ వృక్షం ఉంది. ఆ వృక్షానికి పన్నెండు కాపులు కాస్తాయి. ప్రతి నెలా ఆ వృక్షం ఫలాలనిస్తుంది. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను నయం చేయటానికి ఉపయోగింపబడుతాయి.
3 ఇక మీదట ఏ శాపం ఉండదు. దేవునికి మరియు గొఱ్ఱెపిల్లకు చెందిన సింహాసనం పట్టణంలో ఉంటుంది. ఆయన భక్తులు ఆయనకు సేవ చేస్తారు. 4 వాళ్ళు ఆయన ముఖం చూస్తారు. ఆయన పేరు వాళ్ళ నొసళ్ళపై ఉంటుంది. 5 ఇక మీదట చీకటి ఉండదు. ప్రభువైన దేవుడు వాళ్ళకు వెలుగునిస్తాడు. కనుక వాళ్ళకు దీపపు వెలుగు కాని, సూర్యుని వెలుగు కాని అవసరం ఉండదు. వాళ్ళు చిరకాలం రాజ్యం చేస్తారు.
23 యేసు, ఈ విధంగా సమాధానం చెప్పాడు: “నన్ను ప్రమించేవాడు నేను చెప్పినట్లు చేస్తాడు. అలాంటివాణ్ణి నా తండ్రి ప్రేమిస్తాడు. మేము వచ్చి అతనితో నివసిస్తాము. 24 నన్ను ప్రేమించనివాడు నా మాట వినడు. మీరు వింటున్న నా ఈ మాటలు నావి కావు. అవి నన్ను పంపిన తండ్రివి.
25 “నేను వెళ్ళిపోక ముందే ఈ విషయాలన్నీ మీకు చెప్పాను. 26 తండ్రి నా పేరిట పంపనున్న ఆదరణకర్త, అంటే పవిత్రాత్మ, మీకు సహాయం చెయ్యటానికి వస్తాడు. ఆయన మీకు అన్నీ బోధిస్తాడు. నేను చెప్పిన వన్నీ మీకు జ్ఞాపకం చేస్తాడు.
27 “‘శాంతిని’ మీకు యిస్తున్నాను. అది నాలో ఉన్న శాంతి. ప్రపంచం దాన్ని మీకివ్వ జాలదు. కనుక చింతించకండి. భయపడకండి. 28 నేను వెళ్తున్నానని, మళ్ళీ తిరిగి మీ దగ్గరకు వస్తానని చెప్పటం మీరు విన్నారు. మీకు నా మీద ప్రేమ ఉంటే నేను తండ్రి దగ్గరకు వెళ్తున్నందుకు మీరు ఆనందిస్తారు. ఎందుకంటే తండ్రి నాకన్నా గొప్పవాడు. 29 ఇది జరిగినప్పుడు మీరు విశ్వసించాలని మీకీ విషయం ముందే చెబుతున్నాను.
చిన్న కొలను దగ్గర నయం చేయటం
5 కొద్ది రోజుల తర్వాత యూదుల పండుగ వచ్చింది. యేసు యెరూషలేముకు వెళ్ళాడు. 2 అక్కడ యెరూషలేములో గొఱ్ఱెల ద్వారం దగ్గర ఒక కొలను ఉండేది. దీన్ని హీబ్రూ భాషలో బేతెస్థ అని అంటారు. దీని చుట్టూ ఐదు మండపాలు ఉండేవి. 3 చాలామంది వికలాంగులు, గ్రుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు, పక్షవాత రోగులు అక్కడ వేచి ఉండేవాళ్ళు. 4 [a] 5 అక్కడున్న వాళ్ళలో ఒకడు ముప్పైఎనిమిది సంవత్సరాల నుండి రోగంతో బాధ పడ్తూ ఉన్నాడు. 6 యేసు అతడక్కడ ఉండటం చూసాడు. చాలాకాలం నుండి అతడాస్థితిలో ఉన్నాడని గ్రహించి అతనితో, “నీకు నయం కావాలని ఉందా?” అని అడిగాడు.
7 ఆ వికలాంగుడు, “అయ్యా! నీళ్ళు కదిలినప్పుడు ఆ కోనేరులోకి దించటానికి ఎవరూ లేరు: అయినా వెళ్ళటానికి ప్రయత్నిస్తుండగానే, ఇంకొకడు నాకన్నా ముందు ఆ నీళ్ళలోకి దిగుతాడు” అని అన్నాడు.
8 అప్పుడు యేసు అతనితో, “లే! నీ చాప తీసుకొని నడువు!” అని అన్నాడు. 9 అతనికి వెంటనే నయమైపోయింది. అతడు తన చాపతీసుకొని వెళ్ళిపోయాడు.
ఈ సంఘటన విశ్రాంతి రోజున జరిగింది.
© 1997 Bible League International