Revised Common Lectionary (Complementary)
సంగీత నాయకునికి: వాయిద్యాలతో స్తుతి కీర్తన.
67 దేవా, మమ్ములను కనికరించి, మమ్ములను ఆశీర్వదించుము.
దయచేసి మమ్ములను స్వీకరించుము.
2 దేవా, భూమి మీద ప్రతి మనిషినీ నిన్ను గూర్చి తెలుసుకోనిమ్ము.
నీవు మనుష్యులను ఎలా రక్షిస్తావో ప్రతి దేశం నేర్చుకోనిమ్ము.
3 దేవా, ప్రజలు నిన్ను స్తుతించెదరుగాక!
మనుష్యులంతా నిన్ను స్తుతించెదరుగాక!
4 దేశాలన్నీ ఆనందించి, సంతోషించుగాక!
ఎందుకంటే నీవు మనుష్యులకు న్యాయంగా తీర్పు తీరుస్తావు
మరియు ప్రతి దేశాన్నీ నీవు పాలిస్తావు.
5 దేవా, ప్రజలు నిన్ను స్తుతించెదరు గాక!
మనుష్యులంతా నిన్ను స్తుతించెదరు గాక!
6 దేవా, మా దేవా, మమ్మల్ని దీవించుము.
మా భూమి మాకు గొప్ప పంట ఇచ్చేటట్టుగా చేయుము.
7 దేవుడు మమ్మల్ని దీవించుగాక.
భూమిమీద వున్న ప్రతి ఒక్కరూ దేవునికి భయపడి, ఆయనను గౌరవించెదరు గాక.
జ్ఞానం చెప్పేది వినండి
2 నా కుమారుడా, నేను చెప్పే ఈ సంగతులు అంగీకరించు. నా ఆజ్ఞలు జ్ఞాపకం ఉంచుకో. 2 జ్ఞానం చెప్పేది విని, గ్రహించటానికి నీ శక్తి కొలది ప్రయత్నించు. 3 జ్ఞానం కోసం గట్టిగా మొరపెట్టు, అవగాహన కోసం గట్టిగా అడుగు. 4 వెండికోసం వెదకినట్టు జ్ఞానం కోసం వెదుకు. దాచబడిన ధనం కోసం వెదకినట్టు దానికోసం వెదకు. 5 వీటిని నీవు చేస్తే అప్పుడు నీవు యెహోవాను గౌరవించటం నేర్చుకొంటావు. నీవు నిజంగా దేవుణ్ణి గూర్చి నేర్చుకొంటావు.
పౌలు, బర్నబా విడిపోవటం
36 కొంతకాలం తర్వాత పౌలు బర్నబాతో, “ప్రభువు సందేశాన్ని ఉపదేశించిన ప్రతి పట్టణానికి, మనం మళ్ళీ వెళ్దాం. అక్కడి సోదరుల్ని కలుసుకొని వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నారో చూసి వద్దాం” అని అన్నాడు.
37 బర్నబా, మార్కు అని పిలివబడే యోహానును కూడా తమ వెంట పిలుచుకు వెళ్దామనుకొన్నాడు. 38 కాని తమతో పని చెయ్యకుండా తమను పంఫూలియలో వదిలి వేసాడు కాబట్టి పౌలు అతణ్ణి పిలుచుకు వెళ్ళటం మంచిది కాదనుకొన్నాడు. 39 బర్నబా, పౌలు మధ్య తీవ్రమైన వివాదము కలగటం వల్ల వాళ్ళు విడిపోయారు. బర్నబా మార్కును తన వెంట పిలుచుకొని ఓడలో సైప్రసుకు వెళ్ళాడు.
40 పౌలు, సీలను తన వెంట పిలుచుకొని వెళ్ళాడు. అక్కడున్న సోదరులు అతనికి ప్రభువు అనుగ్రహం కలగాలని దీవించి ప్రభువుకు అప్పగించారు. 41 అతడు సిరియ, కిలికియ పట్టణాల ద్వారా ప్రయాణం చేసి అక్కడి సంఘాలను ఆధ్యాత్మికంగా బలపరిచాడు.
© 1997 Bible League International