Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 133

దావీదు యాత్ర కీర్తనల్లో ఒకటి.

133 సహోదరులు ఐక్యంగా శాంతి కలిగి జీవించటం
    ఎంతో మంచిది, ఎంతో ఆనందం.
అది యాజకుని తలమీద పోయబడిన కమ్మని వాసనగల తైలంలాగా ఉంటుంది. అది అహరోను గడ్డం మీదికి కారుతున్న తైలంలాగా ఉంటుంది.
    అది అహరోను ప్రత్యేక వస్త్రాల మీదికి కారుతున్న తైలంలాగ ఉంటుంది.
అది హెర్మోను పర్వతం మీద నుండి సీయోను కొండమీద పడుతున్న మంచులా ఉంటుంది.
    సీయోను వద్దనే యెహోవా తన ఆశీర్వాదం ఇచ్చాడు. శాశ్వతజీవాన్ని ఆశీర్వాదంగా యెహోవా ఇచ్చాడు.

1 సమూయేలు 20:1-23

దావీదు, యోనాతానుల ఒడంబడిక

20 దావీదు రామాలో వున్న నాయోతునుంచి పారిపోయాడు. తిన్నగా యోనాతాను వద్దకు వెళ్లి, “నేనేమి తప్పు చేశాను? నా నేరం ఏమిటి? నీ తండ్రి ఎందుకు నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నాడు?” అని అడిగాడు.

అది విన్న యోనాతాను ఇలా అన్నాడు, “నా తండ్రి నిన్ను చంపటానికి ప్రయత్నం చేయటం లేదు. నా తండ్రి ముందుగా నాకు చెప్పకుండా ఏ పనీచేయడు. అది అతి ముఖ్యమైన పనిగాని, లేక అతి స్వల్పమైన విషయంగాని మా తండ్రి ఎప్పుడూ నాకు చెబుతాడు. ఆయన నిన్ను చంపాలనే తన ఆలోచనను నాకెందుకు చెప్పకుండా ఉంటాడు? లేదు. అది నిజం కాదు!”

కానీ దావీదు, “నేను నీ స్నేహితుడనని నీ తండ్రికి బాగా తెలుసు. యోనాతానుకు ఈ విషయం తెలియకూడదు అతనికి తెలిస్తే దావీదుకు చెప్పేస్తాడు అని నీ తండ్రి అనుకుని ఉంటాడు. దేవుడు జీవిస్తున్నాడు అన్నంత నిజంగా, నీవు జీవుస్తున్నావన్నంత నిజంగా నేను మృత్యువుకు చాలా చేరువలో ఉన్నాను.” అని జవాబిచ్చాడు.

యోనాతాను, “సరే, ఇప్పుడు నీవు ఏమి చేయమంటే అది నేను చేస్తాను” అని దావీదుతో అన్నాడు.

అప్పుడు దావీదు, “అయితే చూడు. రేపు అమావాస్య విందు. నేను రాజుతో కలిసి విందారగించవలసివుంది. కాని రేపు సాయంత్రం వరకు నన్ను పొలాల్లో దాగివుండనీ. నేను రాలేదని నీ తండ్రి గమనించినపుడు ‘దావీదు తన స్వగ్రామమైన బేత్లెహేముకు వెళ్లాలని కోరాడు. ఈ నెలసరి బలి అర్పణకు అతని కుటుంబంవారు స్వంతంగా విందు చేసుకోవాలని కోరారు. కనుక దావీదు తన కుటుంబంతో కలసి ఉండేందుకు తనను వెళ్లనివ్వాల్సిందిగా నన్ను అడిగాడు’ అని నీ తండ్రికి చెప్పు అన్నాడు. ‘సరే మంచిది’ అని మీ తండ్రి అంటే నేను హాయిగా ఉన్నట్లే. కానీ ఆయనకు కోపం వస్తే మాత్రం నాకు కీడు చేస్తాడని నీవు నమ్మవచ్చు. యోనాతానూ! నేను నీ సేవకుడను. నన్ను కనికరించు. యెహోవా ఎదుట నీవు నాతో ఒక ఒడంబడిక చేసావు. నేను దోషినయితే నీకై నీవే నన్ను చంపవచ్చు! కానీ నన్ను మాత్రం నీ తండ్రి వద్దకు తీసుకుని వెళ్లకు” అన్నాడు.

యోనాతాను, “లేదు ఎప్పటికీ అలా జరగదు! నా తండ్రి నీకు కీడు తలపెడితే నేను నీకు తెలియజేస్తాను” అని చెప్పాడు.

10 దావీదు, “నీ తండ్రి నిన్ను తిడితే అది నాకెవరు తెలియజేస్తారు?” అన్నాడు.

11 అప్పుడు యోనాతాను, “అయితే, రా! మనం పొలంలోకి వెళదాము” అని అనగా యోనాతాను, దావీదు కలిసి పొలంలోకి వెళ్లారు.

12 యెనాతాను దావీదుతో ఇలా అన్నాడు: “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సమక్షంలో నేను నీకు వాగ్దానం చేస్తున్నాను. నా తండ్రి నీ విషయంలో ఏ తలంపుతో ఉన్నాడో తెలుసుకుంటానని నీకు ప్రమాణం చేస్తున్నాను. నీ పట్ల ఆయన వైఖరి బాగుందో లేదో తెలుసుకుంటాను. ఆ విషయం మూడురోజుల్లో నీకు పొలానికి కబురు చేస్తాను. 13 నా తండ్రి గనుక నీకు కీడు తలపెడితే, అది నీకు తెలియపర్చి, నిన్ను క్షేమంగా వెళ్లిపోనిస్తాను. ఇది నేను చేయకపోతే యెహోవా నన్ను శిక్షించునుగాక! యెహోవా నా తండ్రికి తోడై యున్నట్లు, నీకు కూడ తోడైవుండునుగాక! 14 నేను జీవించినంత కాలం, నా మీద దయచూపించు. నేను మరణించాక 15 నా కుటుంబంపట్ల నీ దయాదాక్షిణ్యాలు చూపించటం ఎన్నడూ మానవద్దు. ఈ భూమి మీద నీ శత్రువుల నందరినీ యెహోవా నాశనం చేయునుగాక! 16 ఆ సమయంలో యోనాతాను కుటుంబం దావీదునుండి వేరు చేయబడాల్సి వస్తే, అలాగే జరుగనివ్వు. దావీదు శత్రువులను యెహోవా శిక్షించునుగాక!”

17 అప్పుడు యోనాతాను తన మీద దావీదుకు ఉన్న ప్రేమ వాగ్దానాన్ని మరల చూపించమన్నాడు. ఎందువల్ల నంటే యోనాతాను తనను తాను ప్రేమించుకున్నంతగా దావీదును ప్రేమించాడు గనుక అలా చేశాడు.

18 “రేపు అమావాస్య విందుగదా! అక్కడ నీ స్థానం ఖాళీగా వుంటుంది. కనుక నా తండ్రి నీవు రాలేదని గమనిస్తాడు. 19 ఈ కష్టాలన్నీ ప్రారంభమైనప్పుడు నీవు ముందుగా ఎక్కడ దాగివున్నావో అక్కడికే మూడవ రోజున కూడ నీవు వెళ్లు. అక్కడ కొండ పక్కన వేచివుండు. 20 మూడవ రోజున కొండ పక్కగా నేనొక గురిని బాణంతో కొడుతున్నట్టు నేను నటిస్తాను. నేను కొన్ని బాణాలు వదులుతాను. 21 అప్పుడు ఆ వదిలిన బాణాన్ని వెదికేందుకుగాను ఒక కుర్రవానిని పంపుతాను. వానితో నేను ‘మరీ దూరం వెళ్లిపోయావు. బాణాలు అక్కడ నాకు దగ్గర్లోనే ఉన్నాయి గదా, వెనక్కు వచ్చేసి వాటిని తీసుకొనిరా’ అని చెబుతాను. నేను గనుక అలా చెబితే అప్పుడు నీవు బయటకి రావచ్చు. యెహెవా జీవిస్తున్నంత వాస్తవంగా నీకు క్షేమం కలుగుతుందని వాగ్దానం చేస్తున్నాను. ప్రమాదం ఏమీ లేదు. 22 కానీ ఒకవేళ ఏదైనా తొందర ఉంటే, ‘బాణాలు చాలా దూరంగా ఉన్నాయి. వెళ్లి వాటిని తీసుకురా’ అని ఆ కుర్రవానితో నేను అంటాను. నేను గనుక అలా చెబితే నీవు తప్పక పారిపోవల్సిందే. అంటే యెహోవా నిన్ను దూరంగా పంపుతున్నాడన్న మాట. 23 మనిద్దరి మధ్యవున్న ఈ ఒడంబడిక జ్ఞాపకం ఉంచుకో. యెహోవా మనకు శాశ్వతంగా సాక్షి” అని యోనాతాను దావీదుకు చెప్పాడు.

1 సమూయేలు 20:35-42

యోనాతాను, దావీదు వీడ్కోలు చెప్పుకోవడం

35 ఆ మరునాటి ఉదయం యోనాతాను పొలానికి వెళ్లాడు. వాళ్లనుకున్నట్లుగా దావీదును కలవటానికి అతడు వెళ్లాడు. యోనాతాను తన వెంట ఒక చిన్న పిల్లవానిని కూడ తీసుకొని వెళ్లాడు. 36 “నేను వేసే బాణాన్ని పరుగున పోయి వెదికి తీసుకొనిరా” అని యోనాతాను పిల్లవానితో చెప్పాడు. ఆ పిల్లవాడు పరుగెత్తుచుండగా యోనాతాను వాని తల మీదగా అవతలికి బాణాలు వేశాడు. 37 బాణాలు పడిన చోటుకి బాలుడు పరుగెత్తాడు. కానీ యోనాతాను “బాణాలు ఇంకా చాలా దూరంలో ఉన్నాయి” అని అరిచాడు. 38 “వెళ్లు! త్వరగా వెళ్లు! ఆ బాణాలు తీసుకురా, ఆగకు!” అంటూ యోనాతాను కేకలు వేశాడు. ఆ బాలుడు బాణాలు తీసుకొని తన యజమాని వద్దకు తెచ్చాడు. 39 ఈ సందర్భంలో ఇక్కడ అతి రహస్యంగా ఏమి జరిగిందో ఆ బాలునికి ఏమీ తెలియదు. యోనాతానుకు, దావీదుకు మాత్రమే అది తెలుసు. 40 యోనాతాను తన విల్లు, అంబులను ఆ బాలునికి ఇచ్చి, “పట్టణానికి వెళ్లి పో” అని చెప్పాడు.

41 ఆ కుర్రవాడు వెళ్లిపోయాక, కొండ ఆవలి ప్రక్క తాను దాగివున్న చోటనుండి దావీదు బయటకి వచ్చాడు. దావీదు యోనాతాను ముందు ప్రణమిల్లాడు. అలా మూడుసార్లు దావీదు చేశాడు. తరువాత దావీదు, యోనాతాను ఒకరినొకరు ముద్దు పెట్టుకున్నారు. వారు ఇద్దరూ బాగా ఏడ్చారు. దావీదు యోనాతాను కంటె ఎక్కువగా ఏడ్చాడు.

42 “శాంతితో వెళ్లు. మనము స్నేహితులుగా కొనసాగుతామని యెహోవా నామంలో వాగ్దానం చేసుకున్నాము. మనమధ్య, మన తరువాత మన తరాల వారి మధ్య యెహోవా శాశ్వతంగా సాక్షిగా ఉంటాడని మనము చెప్పుకున్నాము” అని యోనాతాను దావీదుతో అన్నాడు.

అపొస్తలుల కార్యములు 11:19-26

అంతియొకయ ప్రజలకు శుభవార్త తెలియటం

19 స్తెఫను చనిపోయిన తర్వాత జరిగిన హింసలకు భక్తులు చెదిరిపోయారు. వీళ్ళలో కొందరు ఫొనీషియ, సైప్రసు, అంతియొకయ పట్టణాలకు వెళ్ళి దైవసందేశాన్ని యూదులకు మాత్రమే చెప్పారు. 20 సైప్రసు, కురేనీ పట్టణాలకు చెందిన వీళ్ళలో కొందరు అంతియొకయకు వెళ్ళి, గ్రీకువారితో కూడా మాట్లాడటం మొదలు పెట్టారు. 21 ప్రభువు అభయ హస్తం వాళ్ళ వెంట ఉంది. కనుక అనేకులు వాళ్ళు చెప్పిన దానిలో ఉన్న సత్యాన్ని గ్రహించి ప్రభువునందు విశ్వాసులయ్యారు.

22 యెరూషలేములో వున్న సంఘం ఈ వార్త విని బర్నబాను అంతియొకయకు పంపింది. 23 అతడు అంతియొకయకు వెళ్ళి అక్కడి ప్రజలపై దైవానుగ్రహం అమితంగా ఉండటం గమనించి చాలా ఆనందించాడు. ప్రభువు పట్ల మనసారా భక్తి చూపుతూ ఉండమని అక్కడి వాళ్ళందర్ని వేడుకున్నాడు. 24 బర్నబా ఉత్తముడు. పరిశుద్ధాత్మ ప్రభావం అతనిపై సంపూర్ణంగా ఉంది. అంతేకాక దేవుని పట్ల సంపూర్ణమైన విశ్వాసం ఉంది. అనేకులు ప్రభువునందు విశ్వాసులయ్యారు.

25 ఆ తర్వాత బర్నబా, తార్సు అనే పట్టణానికి వెళ్ళి సౌలు కోసం చూసాడు. అతణ్ణి కలుసుకొని అంతియొకయకు పిలుచుకు వచ్చాడు. 26 సౌలు, బర్నబా ఒక సంవత్సరం అంతియొకయలో ఉన్నారు. అక్కడి సంఘాన్ని కలుసుకొంటూ అనేకులకు బోధించేవాళ్ళు. అంతియొకయలోని శిష్యులు మొదటిసారిగా “క్రైస్తవులు” అని పిలువబడ్డారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International