Revised Common Lectionary (Complementary)
148 యెహోవాను స్తుతించండి!
పైన ఉన్న దూతలారా, ఆకాశంలో యెహోవాను స్తుతించండి!
2 సకల దూతలారా, యెహోవాను స్తుతించండి!
ఆయన సర్వ సైనికులారా,[a] ఆయనను స్తుతించండి!
3 సూర్యచంద్రులారా, యెహోవాను స్తుతించండి.
ఆకాశంలోని నక్షత్రాలూ, వెలుతురూ యెహోవాను స్తుతించండి!
4 మహా ఉన్నతమైన ఆకాశంలోని యెహోవాను స్తుతించండి.
ఆకాశం పైగా ఉన్న జలములారా, ఆయనను స్తుతించండి.
5 యెహోవా నామాన్ని స్తుతించండి.
ఎందుకనగా దేవుడు ఆజ్ఞ యివ్వగా ప్రతి ఒక్కటీ సృష్టించబడింది.
6 ఇవన్నీ శాశ్వతంగా కొనసాగేందుకు దేవుడు చేశాడు.
ఎన్నటికి అంతంకాని న్యాయచట్టాలను దేవుడు చేశాడు.
7 భూమి మీద ఉన్న సమస్తమా. యెహోవాను స్తుతించు!
మహా సముద్రాలలోని గొప్ప సముద్ర జంతువుల్లారా, యెహోవాను స్తుతించండి.
8 అగ్ని, వడగండ్లు, హిమము, ఆవిరి,
తుఫాను, గాలులు అన్నింటినీ దేవుడు చేశాడు.
9 పర్వతాలను, కొండలను, ఫలవృక్షాలను,
దేవదారు వృక్షాలను దేవుడు చేశాడు.
10 అడవి జంతువులను, పశువులను, పాకే ప్రాణులను, పక్షులను అన్నింటినీ దేవుడు చేశాడు.
11 భూమి మీద రాజ్యాలను రాజులను దేవుడు చేశాడు.
నాయకులను, న్యాయాధిపతులను దేవుడు చేశాడు.
12 యువతీ యువకులను దేవుడు చేశాడు.
వృద్ధులను, యవ్వనులను దేవుడు చేశాడు.
13 యెహోవా నామాన్ని స్తుతించండి!
ఆయన నామాన్ని శాశ్వతంగా ఘనపర్చండి!
భూమిపైన, ఆకాశంలోను ఉన్న
సమస్తం ఆయనను స్తుతించండి!
14 దేవుడు తన ప్రజలను బలవంతులుగా చేస్తాడు.
దేవుని అనుచరులను మనుష్యులు పొగడుతారు.
ఎవరి పక్షంగా అయితే దేవుడు పోరాడుతున్నాడో ఆ ఇశ్రాయేలీయులను మనుష్యులు పొగడుతారు. యెహోవాను స్తుతించండి!
8 “ఓ నరపుత్రుడా, నేను నీకు చెప్పే విషయాలు శ్రద్ధగా విను. ఆ తిరుగుబాటుదారుల్లా నీవు నాకు వ్యతిరేకం కావద్దు. నీ నోరు తెరచి, నా మాటలు స్వీకరించు. తిరిగి వాటిని ప్రజలకు తెలియజెప్పు. ఈ మాటలను నీవు జీర్ణించుకో.”
9 తరువాత నేను (యెహెజ్కేలు) ఒక చేయి నా మీదికి రావటం చూశాను. ఆ చేతిలో వ్రాయబడిన గ్రంథపు చుట్ట ఉంది. 10 చుట్టబడిన ఆ కాగితాన్ని విడదీసి చూడగా దానిమీద రెండు వైపులా వ్రాసివుంది. అందులో రకరకాల విషాద గీతికలు, విషాద గాథలు, హెచ్చరికలు ఉన్నాయి.
3 దేవుడు నాతో ఇలా చెప్పాడు: “ఓ నరపుత్రుడా, నీవు చూస్తున్న దానిని తిను. ఈ గ్రంథపు చుట్టను తిని, ఇశ్రాయేలు వంశం వారికి దీనిలోనున్న విషయాలన్నిటినీ తెలియజెప్పు.”
2 ఆ తరువాత నేను నా నోరు తెరువగా, అతడు గ్రంథపు చుట్టను నాకు తినిపించెను. 3 పిమ్మట దేవుడు ఇలా అన్నాడు: “నరపుత్రుడా, ఈ కాగితం చుట్టను నీకిస్తున్నాను. దానిని మ్రింగివేయి! ఆ గ్రంథపు చుట్ట నీ శరీరాన్ని నింపివేయనీ.”
నేను దానిని తినేశాను. అది తేనెలా మధురంగా ఉంది.
4 అప్పుడు దేవుడు నాతో ఇలా అన్నాడు, “నరపుత్రుడా, ఇశ్రాయేలు వంశంవారి వద్దకు వెళ్లు. వారికి నా మాటలన్నీ తెలియజేయుము. 5 భాష తెలియని పరదేశీయుల వద్దకు నిన్ను నేను పంపటంలేదు. ఏ ఇతర భాషను నీవు నేర్చుకునే పనిలేదు. నేను నిన్ను ఇశ్రాయేలు వంశం వారివద్దకు పంపుతున్నాను! 6 నీవు అర్థం చేసుకోలేని పలుభాషలు మాట్లాడే అనేక ఇతర దేశాల ప్రజల వద్దకు నేను నిన్ను పంపటం లేదు. నీవు గనుక వారి వద్దకు వెళ్లి మాట్లాడితే వారు వింటారు. కాని నీవాకఠిన భాషలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. 7 లేదు! నేను నిన్ను ఇశ్రాయేలు వంశం వద్దకు పంపుతున్నారు. వారున్నారే వారు తల బిరుసు కలిగి ఉన్నారు. వారు చాలా మొండివారు! ఇశ్రాయేలీయులు నీవు చెప్పేది వినటానికి నిరాకరిస్తారు. వారు నా మాట వినదల్చుకోలేదు! 8 కాని వారు ఎంత మొండివారో, నిన్ను కూడా అంత మొండివానిగా నేను చేస్తాను. నీ తల కూడా వారి తలలా కఠినంగా ఉంటుంది! 9 చెకుముకిరాయి కంటె వజ్రం కఠినమైనది. అదే రకంగా, నీ తల వారి తలకంటె గట్టిగా తయారవుతుంది. నీవు మిక్కిలి మొండిగా ఉంటావు. అందువల్ల వారంటే నీవు భయపడవు. ఎల్లప్పుడూ నా మీద తిరుగుబాటు చేసే ఆ ప్రజలంటే నీవు భయపడవు.”
10 ఇంకా దేవుడు ఇలా చెప్పాడు, “నరపుత్రుడా, నేను నీకు చెప్పే ప్రతీ మాటను వినాలి. విని, వాటిని జ్ఞాపకం పెట్టుకోవాలి. 11 పిమ్మట దేశాన్నుండి వెళ్ల గొట్ట బడిన నీ ప్రజలందరి వద్దకు వెళ్లు. వారి వద్దకు వెళ్లి, ‘మన ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పుతున్నాడు’ అని పలుకు. వారు వినరు. వారు పాపం చేయటం మానరు. అయినా నీవు ఈ విషయాలు చెప్పాలి.”
దేవదూత, చిన్న గ్రంథము
10 శక్తివంతుడైన మరొక దేవదూత పరలోకం నుండి క్రిందికి రావటం చూశాను. ఆయన మేఘాన్ని ఒక వస్త్రంగా ధరించి ఉన్నాడు. ఆయన తలపై మేఘధనుస్సు ఉంది. ఆయన ముఖం సూర్యునిలా ఉంది. ఆయన కాళ్ళు మండుతున్న స్తంభాల్లా ఉన్నాయి. 2 ఆయన చేతిలో ఒక చిన్న గ్రంథం ఉంది. అది తెరువబడి ఉంది. ఆయన తన కుడి కాలు సముద్రం మీద, ఎడమకాలు భూమ్మీద ఉంచి బిగ్గరగా అరిచాడు. 3 ఆ అరుపు సింహ ఘర్జనలా ఉంది. ఆయన అలా అరచినప్పుడు ఏడు ఉరుములు మాట్లాడాయి.
4 ఏడు ఉరుములు మాట్లాడిన వాటిని నేను వ్రాయటం మొదలుపెట్టాను. కాని పరలోకం నుండి ఒక స్వరం నాతో, “ఏడు ఉరుములు అన్న మాటల్ని దాచి ముద్ర వేయి, వాటిని వ్రాయవద్దు” అని అన్నది.
5 సముద్రం మీద, భూమ్మీద నిలబడి ఉన్న దూత నేను చూస్తుండగా తన కుడి చేతిని పరలోకం వైపుకు చాపాడు. 6 చిరకాలం జీవించేవాని మీద, పరలోకం, అందులో ఉన్నవాటిని సృష్టించినవాని మీద, భూమిని, అందులో ఉన్నవాటన్నిటినీ సృష్టంచినవానిమీద, సముద్రాన్ని, అందులో ఉన్నవాటన్నిటినీ సృష్టించినవాని మీద ప్రమాణం చేసి ఈ విధంగా అన్నాడు: “ఇక ఆలస్యం ఉండదు. 7 కాని ఏడవ దూత తన బూర ఊదటం మొదలు పెట్టే రోజులు వచ్చినప్పుడు దేవుని రహస్య ప్రణాళిక సమాప్తమౌతుంది. దేవుడు తన సేవకులైన ప్రవక్తలకు ఈ రహస్యాన్ని ముందే చెప్పాడు.” అని అన్నాడు.
8 నేను పరలోకం నుండి విన్న స్వరం మళ్ళీ నాతో, “వెళ్ళు. సముద్రం మీదా, భూమ్మీదా నిలబడి ఉన్న దూత చేతిలో తెరువబడివున్న గ్రంథాన్ని తీసుకో!” అని అన్నది.
9 అందువల్ల, నేను దేవదూత దగ్గరకు వెళ్ళి, ఆ చిన్న గ్రంథాన్నివ్వమని అడిగాను. ఆయన నాతో, “ఇది తీసుకొని తిను. అది నీ కడుపుకు చేదు కలిగిస్తుంది. కాని నీ నోటికి తేనెలా మధురంగా ఉంటుంది” అని అన్నాడు. 10 నేనా చిన్న గ్రంథాన్ని, దూత చేతినుండి తీసుకొని తినివేసాను. అది నా నోటికి తేనెలా మధురంగా ఉండెను. కాని అది తిన్నాక నా కడుపుకు చేదుగానుండెను. 11 ఆ తర్వాత ఆ దూత నాతో, “నీవు చాలమంది ప్రజల్ని గురించి, దేశాల్ని గురించి, రాజుల్ని గురించి మళ్ళీ ప్రవచనం చెప్పాలి” అని అన్నాడు.
© 1997 Bible League International