Revised Common Lectionary (Complementary)
కృతజ్ఞత కీర్తన.
100 భూమీ, యెహోవాను గూర్చి పాడుము!
2 నీవు యెహోవాను సేవిస్తూ సంతోషంగా ఉండు!
ఆనంద గీతాలతో యెహోవా ఎదుటికి రమ్ము.
3 యెహోవా దేవుడని తెలుసుకొనుము.
ఆయనే మనలను సృజించాడు.
మనం ఆయన ప్రజలము. మనము ఆయన గొర్రెలము.
4 కృతజ్ఞతా కీర్తనలతో యెహోవా పట్టణంలోనికి రండి.
స్తుతి కీర్తనలతో ఆయన ఆలయంలోనికి రండి.
ఆయనను గౌరవించండి. ఆయన నామాన్ని స్తుతించండి.
5 యెహోవా మంచివాడు.
ఆయన ప్రేమ నిరంతరం ఉంటుంది.
ఆయన్ని శాశ్వతంగా నమ్ము కోవచ్చు.
యూదా, ఇశ్రాయేలు ఏకమవటం
15 యెహోవా వాక్కు నాకు మళ్నీ వినిపించింది. ఆయన ఇలా అన్నాడు: 16 “నరపుత్రుడా, ఒక కట్టెపుల్లను తెచ్చి ఈ వర్తమానం దానిమీద వ్రాయి, ‘ఈ పుల్ల యూదాకు, దాని స్నేహితులైన (తోటివారు) ఇశ్రాయేలీయులకు చెందింది.’ తరువాత మరో పుల్లను తీసుకొని దాని మీద; ‘ఈ ఎఫ్రాయిము పుల్ల యోసేపుకు, అతని స్నేహితులైన (తోటివారు) ఇశ్రాయేలీయులకు చెందింది,’ అని వ్రాయుము. 17 పిమ్మట ఆ రెండు పుల్లలను కలుపుము. నీ చేతిలో ఆ రెండూ ఒక్క పుల్లలా ఉంటాయి.
18 “దీని భావమేమిటని నీ ప్రజలు నిన్నడుగుతారు. 19 ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడని వారికి చెప్పు. ‘ఎఫ్రాయిము చేతిలో ఉన్న యోసేపు పుల్లను మరియు అతని స్నేహితులగు ఇశ్రాయేలీయులను నేను తీసుకుంటాను. దానిని యూదా యొక్క పుల్లతో కలిపి ఒక్క పుల్లగా చేస్తాను. నా చేతిలో అవి ఒక్క కట్టె పుల్ల అవుతాయి!’
20 “నీకు ముందుగా వారి కండ్ల ఎదుట ఆ కర్రలను నీ చేతిలో ఎత్తి పట్టుకొనుము. ఆ పేర్లను ఆ కట్టెపుల్లల మీద నీవు వ్రాశావు. 21 నా ప్రభువైన యెహోవా ఈ విధంగా చెపుతున్నాడని అనుము, ‘వారు చెదరిపోయిన దేశాల నుండి ఇశ్రాయేలు ప్రజలను నేను తీసుకొంటాను. అన్ని చోట్ల నుండి వారిని సమావేశపర్చి, వారి స్వంత దేశానికి తిరిగి తిసుకొని వస్తాను. 22 ఇశ్రాయేలు పర్వతం మీద వారిని ఒక్క దేశంగా చేస్తాను. వారందరికి ఒక్కడే రాజు ఉంటాడు. వారు రెండు రాజ్యాలుగా కొనసాగరు. వారిక ఎంతమాత్రం రెండు రాజ్యాలుగా విడిపోరు. 23 వారి విగ్రహాలతోను, భయంకర శిల్పాలతోను, తదితర ఘోరమైన నేరాలతోను వారు తమను తాము మలినపర్చుకోవటం కొనసాగించరు. వారెక్కడున్నా వారి భయంకర పాపాలన్నిటి నుండి వారిని నేను కాపాడుతాను. నేను వారిని కడిగి పవిత్ర పర్చుతాను. వారు నా ప్రజలవుతారు. నేను వారికి దేవుడనై యుంటాను.
24 “‘నా సేవకుడైన దావీదు వారికి రాజుగా ఉంటాడు. వారంతా ఒకే ఒక్క కాపరిని కలిగి ఉంటారు. వారు నా నీతికి, న్యాయానికి బద్ధులై జీవిస్తారు. నేను చెప్పినవన్నీ వారు చేస్తారు. 25 నేను నా సేవకుడైన యాకోబుకు ఇచ్చిన భూమి మీద వారు నివసిస్తారు. నీ పూర్వీకులు ఆ ప్రదేశంలో నివసించారు. నా ప్రజలూ అక్కడే నివసిస్తారు. వారు, వారి పిల్లలు మరియు వారి మనుమలు అక్కడే శాశ్వతంగా నివసిస్తారు. మరియు నా సేవకుడైన దావీదు సదా వారికి రాజై ఉంటాడు. 26 నేను వారితో శాంతి ఒడంబడిక ఒకటి చేసుకుంటాను. ఈ ఒడంబడిక ఎల్లకాలం కొనసాగుతుంది. వారి దేశాన్ని వారికి ఇవ్వటానికి నేను అంగీకరించాను. వారి సంతానం విస్తారమవడానికి నేను అంగీకరించాను. పైగా నా పవిత్ర స్థలాన్ని అక్కడ శాశ్వతంగా వారితో ఉంచటానికి నేను అంగీకరించాను. 27 నా పవిత్ర గుడారం వారి మధ్య అక్కడ ఉంటుంది. అవును, నేను వారి దైవంగా, వారు నా ప్రజలుగా ఉంటాము. 28 మరియు ఇతర దేశాలు కూడ నేను యెహోవానని తెలుసుకుంటాయి. నా పవిత్ర స్థలాన్ని శాశ్వతంగా ఇశ్రాయేలు ప్రజల మధ్య ఉంచటం ద్వారా నేను ఇశ్రాయేలీయులను నా ప్రత్యేక జనులుగా చేశానని కూడ వారు తెలుసుకుంటారు.’”
ఏడు తెగుళ్ళతో ఏడుగురు దూతలు
15 నేను పరలోకంలో యింకొక అద్భుతమైన దృశ్యం చూశాను. ఏడుగురు దూతలు ఏడు చివరి తెగుళ్ళు పట్టుకొని ఉండటం చూశాను. వీటితో దేవుని కోపం సమాప్తమౌతుంది. కనుక యివి చివరివి.
2 నిప్పుతో కలిసిన గాజు సముద్రం లాంటి ఒక సముద్రం నాకు కనిపించింది. మృగాన్ని, దాని విగ్రహాన్ని జయించినవాళ్ళు, దాని నామానికున్న సంఖ్యను జయించినవాళ్ళు సముద్రతీరం మీద నిలబడి ఉండటం చూసాను. వాళ్ళు తమ చేతుల్లో దేవుడుంచిన వీణల్ని పట్టుకొని ఉన్నారు. 3 దేవుని సేవకుడైన మోషే గీతాన్ని, గొఱ్ఱెపిల్ల గీతాన్ని వాళ్ళు ఈ విధంగా పాడుతూ ఉన్నారు:
“ప్రభూ! సర్వశక్తి సంపన్నుడవైన దైవమా!
నీ కార్యాలు గొప్పవి. అద్భుతమైనవి.
యుగయుగాలకు రాజువు నీవు.
నీ మార్గాలు సత్యసమ్మతమైనవి. న్యాయసమ్మతమైనవి.
4 ఓ ప్రభూ! నీకెవరు భయపడరు?
నీ నామాన్ని స్తుతించనివారెవరున్నారు?
నీ వొక్కడివే పరిశుద్ధుడవు.
నీ నీతికార్యాలు ప్రత్యక్షమైనవి.
కనుక ప్రజలందరూ వచ్చి నిన్ను ఆరాధిస్తారు.”
© 1997 Bible League International