Revised Common Lectionary (Complementary)
36 “యొప్పే” అనే పట్టణంలో, తబితా అనే శిష్యురాలు ఉండేది. ఈమెను గ్రీకు భాషలో దొర్కా అని పిలిచేవాళ్ళు. ఈమె పేదలకు సహాయం చేస్తూ ఉండేది. ఎప్పుడూ మంచి పనులు చేసేది. 37 పేతురు అదే ప్రాంతాల్లో ఉండగా ఆమె జబ్బు పడి చనిపోయింది. ఆమె శవానికి స్నానం చేయించి మేడ మీది గదిలో ఉంచారు. 38 లుద్ద యొప్పే పట్టణానికి దగ్గరగా ఉండింది. పేతురు లుద్దలో ఉన్నాడని, శిష్యులు యిద్దరు మనుష్యుల్ని అతని దగ్గరకు పంపి వెంటనే రమ్మని వేడుకున్నారు.
39 పేతురు వాళ్ళ వెంట వెళ్ళాడు. అతడు రాగానే మేడ మీది గదికి తీసుకు వెళ్ళారు. అతని చుట్టూ చేరిన వితంతువులు, దొర్కా తమతో ఉన్నప్పుడు కుట్టిన రకరకాల దుస్తుల్ని చూపి విలపించారు. 40 పేతురు వాళ్ళందర్ని గదినుండి వెలుపలికి పంపి తన మోకాళ్ళపై ప్రార్థించాడు. శవం వైపు తిరిగి, “లే, తబితా!” అని అన్నాడు. ఆమె కళ్ళు తెరిచింది. పేతురును చూసి లేచి కూర్చుంది. 41 అతడు చేతులందించి ఆమె నిలబడటానికి సహాయం చేసాడు. ఆ తదుపరి పేతురు భక్తుల్ని, వితంతువుల్ని పిలిచి వాళ్ళకు ప్రాణంతో ఉన్న తబితాను చూపాడు.
42 యొప్పే ప్రాంతమంతా యిది తెలిసిపోయింది. అనేకులు ప్రభువు భక్తులయ్యారు. 43 పేతురు యొప్పేలో సీమోను అనే ఒక చెప్పులు కుట్టేవాని యింట్లో చాలా రోజులు గడిపాడు.
దావీదు కీర్తన.
23 యెహోవా నా కాపరి
నాకు కొరత ఉండదు
2 పచ్చటి పచ్చిక బయళ్లలో ఆయన నన్ను పడుకో పెడతాడు.
ప్రశాంతమైన నీళ్లవద్దకు ఆయన నన్ను నడిపిస్తాడు.
3 ఆయన తన నామ ఘనత కోసం నా ఆత్మకు నూతన బలం ప్రసాదిస్తాడు.
ఆయన నిజంగా మంచివాడని చూపించేందుకు ఆయన నన్ను మంచితనపు మార్గాల్లో నడిపిస్తాడు.
4 చివరికి మరణాంధకారపు లోయలో నడిచినప్పుడు కూడా
నేను భయపడను. ఎందుకంటే, యెహోవా, నీవు నాతో ఉన్నావు.
నీ చేతికర్ర, నీ దండం నన్ను ఆదరిస్తాయి కనుక.
5 యెహోవా, నా శత్రువుల ఎదుటనే నీవు నాకు భోజనం సిద్ధం చేశావు.
నూనెతో నా తలను నీవు అభిషేకిస్తావు.
నా పాత్ర నిండి, పొర్లిపోతుంది.
6 నా మిగిలిన జీవితం అంతా మేలు, కరుణ నాతో ఉంటాయి.
మరియు నేను ఎల్లకాలం యెహోవా ఆలయంలో నివసిస్తాను.
ఒక పెద్ద ప్రజల గుంపు
9 దీని తర్వాత ఎవ్వరూ లెక్క వెయ్యలేని ఒక పెద్ద ప్రజల గుంపు నా ముందు కనిపించింది. వాళ్ళలో ప్రతి దేశానికి చెందినవాళ్ళు ఉన్నారు. ప్రతి భాషకు చెందినవాళ్ళు ఉన్నారు. వాళ్ళు తెల్లటి దుస్తులు వేసుకొని, చేతుల్లో ఖర్జూర మట్టలు పట్టుకొని ఉన్నారు. వాళ్ళు సింహాసనం ముందు, గొఱ్ఱెపిల్ల ముందు నిలబడి ఉండటం నాకు కనిపించింది. 10 వాళ్ళందరు, “సింహాసనంపై కూర్చున్న మన దేవునికి, గొఱ్ఱెపిల్లకు రక్షణ చెందుగాక!” అని బిగ్గరగా అన్నారు.
11 సింహాసనం చుట్టూ, పెద్దల చుట్టూ, ఆ నాలుగు ప్రాణుల చుట్టూ దేవదూతలు నిలబడి ఉన్నారు. వాళ్ళు సింహాసనం ముందు సాష్టాంగపడి దేవుణ్ణి స్తుతించటం మొదలు పెట్టారు. 12 “ఆమేన్! మన దేవుణ్ణి స్తుతించుదాం! ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకొందాం. ఆయనలో తేజస్సు, జ్ఞానము, గౌరవము, అధికారము, శక్తి చిరకాలం ఉండుగాక! ఆమేన్!”
13 పెద్దల్లో ఒకడు నాతో, “తెల్లటి దుస్తులు వేసుకొన్న వాళ్ళెవరు? ఎక్కడి నుండి వచ్చారు?” అని అడిగాడు.
14 “అయ్యా! మీకే తెలియాలి!” అని నేను సమాధానం చెప్పాను.
“మహా శ్రమలనుండి వచ్చినవాళ్ళు వీళ్ళే. తమ దుస్తుల్ని గొఱ్ఱెపిల్ల రక్తంలో ఉతికి శుభ్రం చేసుకొన్నారు. 15 అందువల్ల వాళ్ళు దేవుని సింహాసనం ముందున్నారు. రాత్రింబగళ్ళు ఆయన మందిరంలో ఉండి ఆయన సేవ చేస్తారు. ఆ సింహాసనంపై కూర్చొన్నవాడు వాళ్ళందరిపై తన గుడారం కప్పుతాడు. 16 వాళ్ళకిక మీదట ఆకలి కలుగదు. దాహం కలుగదు. సూర్యుడు తన ఎండతో వాళ్ళను మాడ్చడు. వాళ్ళకు ఏ వేడీ తగులదు. 17 సింహాసనంపై కూర్చొన్న గొఱ్ఱెపిల్ల వాళ్ళ కాపరిగా ఉంటాడు. ఆయన సజీవమైన నీటి ఊటల దగ్గరకు వాళ్ళను పిలుచుకు వెళతాడు. దేవుడు వాళ్ళ కళ్ళనుండి కారే ప్రతి కన్నీటి బొట్టును తుడిచి వేస్తాడు.”
యూదులు విశ్వసించకపోవటం
22 ఆలయ ప్రతిష్టిత అనే పండుగ యెరూషలేములో జరుగుతూంది. 23 అది చలికాలం. యేసు మందిరావరణంలో సొలొమోను మంటపం దగ్గర నడుస్తూవున్నాడు. యూదులు ఆయన చుట్టూ గుమికూడారు. 24 వాళ్ళు, “నీవు మమ్మల్ని ఎంతకాలం సందేహంలో ఉంచుతావు? నీవు క్రీస్తువయినట్లైతే దాచకుండా చెప్పు” అని అన్నారు.
25 యేసు, “ఆ విషయం నేను ఇది వరకే చెప్పాను. కాని మీరు నమ్మటం లేదు. నా తండ్రి పేరిట నేను చేస్తున్న అద్భుతాలే నేను ఎవరన్న దానికి రుజువు. 26 కాని మీరు నా మందకు చెందిన వాళ్ళు కాదు. కాబట్టి నన్ను విశ్వసించటం లేదు. 27 నా గొఱ్ఱెలు నా మాట గుర్తిస్తాయి. నాకు వాటిని గురించి తెలుసు. అవి నన్ను అనుసరిస్తాయి. 28 వాటికి నేను అనంత జీవితం యిస్తాను. అవి ఎన్నటికీ మరణించవు. వాటిని నా అండ నుండి ఎవ్వరూ తీసుకొని పోలేరు. 29 వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరి కన్నా గొప్పవాడు. నా తండ్రి అండనుండి వాటిని ఎవ్వరూ తీసుకొని పోలేరు. 30 నేను, నా తండ్రి ఒకటే!” అని అన్నాడు.
© 1997 Bible League International