Revised Common Lectionary (Complementary)
యాత్ర కీర్తన.
121 కొండల తట్టు నేను చూసాను.
కాని నిజానికి నా సహాయం ఎక్కడనుండి వస్తుంది?
2 భూమిని, ఆకాశాన్ని సృష్టించిన యెహోవా దగ్గరనుండి
నాకు సహాయం వస్తుంది.
3 దేవుడు నిన్ను పడిపోనివ్వడు.
నిన్ను కాపాడేవాడు నిద్రపోడు.
4 ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకడు.
దేవుడు ఎన్నడూ నిద్రపోడు.
5 యెహోవాయే నిన్ను కాపాడేవాడు.
యెహోవా తన మహా శక్తితో నిన్ను కాపాడుతాడు.
6 పగటి సూర్యుడు నీకు బాధ కలిగించడు.
రాత్రివేళ చంద్రుడు నీకు బాధ కలిగించడు.
7 ప్రతి అపాయం నుండి యెహోవా నిన్ను కాపాడుతాడు.
యెహోవా నీ ప్రాణాన్ని కాపాడుతాడు.
8 నీవు వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు యెహోవా నీకు సహాయంగా ఉంటాడు.
ఇప్పుడు, ఎల్లప్పుడూ యెహోవా నీకు సహాయంగా ఉంటాడు.
దేవుడు యెషయాను ప్రవక్తగా ఉండమని పిలుచుట
6 ఉజ్జియా రాజు చనిపోయిన సంవత్సరం నా ప్రభువును నేను చూశాను. మహా ఎత్తయిన సింహాసనంమీద ఆయన కూర్చొని ఉన్నాడు. ఆయన అంగీతో దేవాలయం నిండిపోయింది. 2 సెరాపులనే దేవదూతలు ఆయన పైగా నిలబడ్డారు. ఒక్కొక్క సెరాపు దేవదూతకు ఆరు రెక్కలు ఉన్నాయి. ఆ దేవదూతలు వారి ముఖాలు కప్పుకొనేందుకు రెండేసి రెక్కలు, పాదాలు కప్పుకొనేందుకు రెండేసి రెక్కలు మరియు ఎగిరేందుకు రెండేసి రెక్కలు ఉపయోగించారు. 3 దేవదూతలు ఒకరితో ఒకరు, “ప్రభువైన యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, ఆయన మహిమ భూలోకమంతా నిండిపోయింది” అని ఘనంగా స్తుతిస్తున్నారు. 4 వారి స్వరాలు గడప కమ్ముల్ని కదలించి వేశాయి. అంతలో దేవాలయం ధూమంతో నిండిపోవటం మొదలయింది.
5 “అయ్యో! నాకు శ్రమ, నేను నాశనమయ్యాను. నేను అశుద్ధమైన పెదవులున్న వాడను, నేను అపరిశుద్ధమైన పెదవులున్న జనుల మధ్య నివసిస్తున్నాను. సైన్యములకధిపతియైన యెహోవాను నేను చూశాను.”
6 బలిపీఠం మీద అగ్ని ఉంది. సెరాపు దేవదూతల్లో ఒకరు ఆ అగ్నిలో నుండి మండుచున్న ఒక నిప్పుకణాన్ని తీయటానికి ఒక పట్టకారు ఉపయోగించారు. మండుతున్న ఆ నిప్పుకణం చేతపట్టుకొని ఆ దేవదూత నా దగ్గరకు ఎగిరి వచ్చాడు. 7 ఆ సెరాపు దేవదూత ఆ వేడి నిప్పుకణంతో నా నోటిని తాకాడు. అప్పుడు ఆ దూత, “చూడు, ఈ వేడి నిప్పుకణం నీ పెదాలను తాకింది గనుక నీవు చేసిన తప్పులన్నీనీలో నుండి పోయాయి. ఇప్పుడు నీ పాపాలు తుడిచివేయబడ్డాయి.” అని చెప్పాడు.
8 అప్పుడు నా ప్రభువు స్వరం నేను విన్నాను. “నేను ఎవర్ని పంపగలను? మా కోసం ఎవరు వెళ్తారు?” అన్నాడు యెహోవా.
కనుక నేను “ఇదుగో నేను ఉన్నాను, నన్ను పంపించు” అన్నాను.
యేసు కొందరు శిష్యులను ఎన్నుకొనటం
(మత్తయి 4:18-22; మార్కు 1:16-20)
5 ఒక రోజు యేసు గెన్నేసరెతు సరస్సు ప్రక్కన నిలబడి దైవసందేశం ఉపదేశిస్తున్నాడు. ప్రజలు ఆయన ఉపదేశం వినటానికి త్రోసుకుంటూ ఆయన చుట్టూ చేరారు. 2 యేసు సరస్సు ప్రక్కన రెండు పడవలుండటం చూశాడు. బెస్తవాళ్ళు పడవలు దిగి ఆ ప్రక్కనే తమ వలలు కడుక్కుంటున్నారు. 3 యేసు సీమోను అనే వ్యక్తికి చెందిన పడవనెక్కి పడవను ఒడ్డునుండి కొంతదూరం తీసుకొని వెళ్ళమన్నాడు. ఆ తర్వాత ఆయన ఆ పడవలో కూర్చొని ప్రజలకు బోధించటం మొదలు పెట్టాడు.
4 ఆయన మాట్లాడటం ముగించాక సీమోనుతో, “పడవను నీళ్ళు లోతుగా ఉన్న చోటికి పోనిచ్చి వలవేయండి. మీకు చేపలు దొరకుతాయి” అని అన్నాడు.
5 సీమోను, “అయ్యా! మేము రాత్రంతా చాలా కష్టపడి పనిచేసినా చేపలు పట్టలేక పోయాము. అయినా మీరు చెబుతున్నారు కాబట్టి మేము వేస్తాము” అని అన్నాడు. 6 వాళ్ళు, ఆయన చెప్పినట్లు చేసి ఎన్నో చేపలు పట్టారు. ఆ బరువుకు వలలు చినగటం మొదలు పెట్టాయి. 7 కాబట్టి ప్రక్క పడవలో ఉన్న తమతోటి పని వాళ్ళను వచ్చి తమకు సహాయం చెయ్యమని అడిగారు. వాళ్ళు వచ్చి ఆ రెండు పడవల్ని పూర్తిగా చేపల్తో నింపారు. ఆ బరువుకు వాళ్ళ పడవలు మునగసాగాయి.
8 సీమోను పేతురు యిది చూసి యేసు కాళ్ళపైపడి, “నేనొక పాపిని. వెళ్ళిపొండి ప్రభూ!” అని అన్నాడు. 9 అతడు, అతనితో ఉన్న వాళ్ళు తాము పట్టిన చేపలు చూసి ఆశ్చర్యపోయారు. 10 వీళ్ళే కాక జెబెదయ కుమారులు యాకోబు, యోహానులు కూడా ఆశ్చర్యపోయారు. వీళ్లు సీమోను భాగస్థులు.
యేసు సీమోనుతో, “చింతించకు. ఇప్పటి నుండి నువ్వు మనుష్యుల్ని పడ్తావు!” అని అన్నాడు.
11 వాళ్ళు పడవలు ఒడ్డుకు చేర్చి అన్నీ వదిలేసి ఆయన్ని అనుసరించారు.
© 1997 Bible League International