Revised Common Lectionary (Complementary)
సౌలు మార్పునొందటం
9 సౌలు ప్రభువు అనుచరుల్ని చంపిస్తానని ఇంకా ఎగిరిపడ్తూనే ఉన్నాడు. 2 ప్రధానయాజకుని దగ్గరకు వెళ్ళి డెమాస్కసు పట్టణంలోని సమాజ మందిరాలకు ఉత్తరాలు వ్రాసి యివ్వమని అడిగాడు. ప్రభువు మార్గాన్ని అనుసరించేవాళ్ళు కనిపిస్తే స్త్రీ, పురుష భేదం లేకుండా వాళ్ళను బంధించి యెరూషలేముకు తీసుకు రావాలని అతని ఉద్దేశ్యం.
3 అతడు డెమాస్కసు పొలిమేరలు చేరుకున్నాడు. అకస్మాత్తుగా ఆకాశంనుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. 4 అతడు నేలకూలిపొయ్యాడు. ఒక స్వరం, “సౌలా! సౌలా! నన్నెందుకు హింసిస్తున్నావు?” అని వినబడింది.
5 “ప్రభూ! మీరెవరు?” అని సౌలు అడిగాడు. “నేను నీవు హింసిస్తున్న యేసును. 6 లేచి పట్టణంలోకి వెళ్ళు. నీవేం చెయ్యాలో అక్కడ నీకు చెప్పబడుతుంది” అని ఆయన సమాధానం చెప్పాడు.
7 సౌలుతో ప్రయాణం చేస్తున్నవాళ్ళు మూగవాళ్ళలా నిల్చున్నారు. వాళ్ళు ఆ స్వరం విన్నారే కాని వాళ్ళకెవ్వరూ కనపడలేదు. 8 క్రింద పడ్డ సౌలు లేచి నిలుచొని కళ్ళు తెరిచాడు. కాని అతనికి ఏమీ కనిపించలేదు. వాళ్ళతని చేయి పట్టుకొని డెమాస్కసులోనికి నడిపించారు. 9 మూడు రోజుల దాకా అతడు గ్రుడ్డివానిగానే ఉండిపోయాడు. ఆహారం కాని, నీళ్ళు కాని ముట్టలేదు.
10 డెమాస్కసులో యేసు భక్తుడొకడుండేవాడు. అతని పేరు అననీయ. ప్రభువతనికి దివ్యదర్శనంలో కనపడి, “అననీయా!” అని పిలిచాడు.
“ఇదిగో, ఇక్కడున్నాను ప్రభూ!” అని అతడు జవాబు చెప్పాడు.
11 ప్రభువతనితో, “‘తిన్నని వీధి’ అని పిలువబడే వీధిలో ఉన్న ‘యూదా’ యింటికి వెళ్ళు, ‘తార్సు’ అనే పట్టణంనుండి వచ్చిన సౌలు అనే వ్యక్తి కోసం అడుగు. అతడు ప్రార్థిస్తూ ఉంటాడు. 12 అతడొక దివ్యదర్శనంలో ‘అననీయ’ అనే పేరుగలవాడు అతని దగ్గరకు వచ్చినట్లు, అతనికి దృష్టి రావటానికి అతనిపై చేతులుంచబడినట్లు చూసాడు” అని చెప్పాడు.
13 అననీయ, “ప్రభూ, అతడు యెరూషలేంలోని పరిశుద్ధులకు చాలా హాని చేసినట్లు చాలా మంది విన్నారు. 14 మిమ్మల్ని శరణుజొచ్చిన ప్రతి ఒక్కణ్ణి బంధించే అధికారం అతడు ప్రధానయాజకుల దగ్గరనుండి పొందాడు”, అని సమాధానం చెప్పాడు.
15 అప్పుడు ప్రభువు అననీయతో, “వెళ్ళు! నా పేరు యూదులు కానివాళ్ళకు, వాళ్ళ పాలకులకు, ఇశ్రాయేలు ప్రజలకు ప్రచారం చేయటానికి యితణ్ణి నేను ఒక సాధనంగా ఎన్నుకొన్నాను. 16 నా పేరిట అతడెన్ని కష్టాలు పడవలసి వస్తుందో నేనతనికి తెలియచేస్తాను” అని అన్నాడు.
17 ఆ తర్వాత అననీయ అక్కడినుండి బయలుదేరి సౌలు ఉన్న యింటికి వెళ్ళాడు. తన చేతుల్ని సౌలు మీద ఉంచి, “సోదరుడా! సౌలా! యేసు ప్రభువు నీవిక్కడికి వస్తున్నప్పుడు నీకు దారిలో కనిపించాడే, ఆయనే, నీవు మళ్ళీ చూడగలగాలని, పవిత్రాత్మ నీలో నిండాలని నన్ను పంపాడు” అని అన్నాడు. 18 వెంటనే పొరల్లాంటివి సౌలు కళ్ళనుండి రాలి క్రిందపడ్డాయి. అతడు మళ్ళీ చూడగలిగాడు. అతడు లేచి బాప్తిస్మము పొందాడు. 19 ఆ తర్వాత కొంత ఆహారాన్ని పుచ్చుకొన్నాక అతనికి బలం వచ్చింది.
సౌలు డెమాస్కసులో బోధించుట
సౌలు డెమాస్కసులో ఉన్న విశ్వాసులతో కొద్ది రోజులు గడిపాడు. 20 ఆ తర్వాత, యూదుల సమాజ మందిరాల్లో, “యేసు దేవుని కుమారుడు” అని బోధించటం మొదలు పెట్టాడు.
దావీదు కీర్తన. ఆలయ ప్రతిష్ఠ కీర్తన.
30 యెహోవా, నా కష్టాల్లో నుంచి నీవు నన్ను పైకి ఎత్తావు.
నా శత్రువులు నన్ను ఓడించి, నన్ను చూచి నవ్వకుండా నీవు చేశావు. కనుక నేను నిన్ను ఘనపరుస్తాను.
2 యెహోవా, నా దేవా నేను నిన్ను ప్రార్థించాను.
నీవు నన్ను స్వస్థపరచావు.
3 సమాధిలో నుండి నీవు నన్ను పైకి లేపావు.
నీవు నన్ను బ్రతకనిచ్చావు. చచ్చిన వాళ్లతోబాటు నేను గోతిలొ[a] ఉండవలసిన పనిలేదు.
4 దేవుని అనుచరులారా! యెహోవాకు స్తుతులు పాడండి.
ఆయన పవిత్ర నామాన్ని స్తుతించండి.
5 దేవునికి కోపం వచ్చింది కనుక “మరణం” నిర్ణయం చేయబడింది. కాని ఆయన తన ప్రేమను చూపించాడు.
నాకు “జీవం” ప్రసాదించాడు.
రాత్రి పూట, నేను ఏడుస్తూ పండుకొంటాను.
మర్నాటి ఉదయం నేను సంతోషంగా పాడుతూ ఉంటాను.
6 ఇప్పుడు నేను ఇది చెప్పగలను, ఇది సత్యం అని నాకు గట్టిగా తెలుసు.
నేను ఎన్నటికీ ఓడించబడను.
7 యెహోవా, నీవు నామీద దయ చూపావు.
బలమైన పర్వతంలా నీవు నన్ను నిలువబెట్టావు.
కొద్దికాలంపాటు, నీవు నా నుండి తిరిగిపోయావు.
మరి నేను చాలా భయపడిపోయాను.
8 దేవా, నేను మరల, నిన్ను ప్రార్థించాను.
నామీద దయ చూపించమని నేను నిన్ను అడిగాను.
9 “దేవా, నేను మరణించి,
సమాధిలోకి దిగిపోతే ఏమి లాభం?
ధూళి నిన్ను స్తుతిస్తుందా?
అది నీ నమ్మకమును గూర్చి చెబుతుందా?
10 యెహోవా, నా ప్రార్థన విని నామీద దయ చూపించుము.
యెహోవా, నాకు సహాయం చేయుము” అని అడిగాను.
11 నేను ప్రార్థించినప్పుడు, నీవు నాకు సహాయం చేశావు.
నా ఏడ్పును నీవు నాట్యంగా మార్చావు. నా దుఃఖ వస్త్రాలను నీవు తీసివేశావు.
నీవు నాకు సంతోషమనే వస్త్రాలు ధరింపజేశావు.
12 యెహోవా, నా దేవా, నిన్ను నేను శాశ్వతంగా స్తుతిస్తాను.
ఎన్నటికీ మౌనంగా ఉండను. నా దేవా! నిన్ను ఎల్లప్పుడూ స్తుతిస్తాను.
11 ఆ తర్వాత చూస్తే నాకు చాలమంది దేవదూతల స్వరం వినిపించింది. వాళ్ళ సంఖ్య కోట్లకొలదిగా ఉంది. వాళ్ళు సింహాసనం చుట్టూ, ప్రాణుల చుట్టూ, పెద్దల చుట్టూ గుమికూడి ఉన్నారు. 12 వాళ్ళు బిగ్గరగా,
“శక్తిని, ఐశ్వర్యాన్ని, జ్ఞానాన్ని, బలాన్ని, గౌరవాన్ని,
మహిమను, స్తుతిని పొందటానికి వధింపబడిన గొఱ్ఱెపిల్ల యోగ్యమైనవాడు”
అని పాడారు.
13 ఆ తర్వాత పరలోకంలో, భూమ్మీద, పాతాళంలో, సముద్రం మీద ఉన్న ప్రతి ప్రాణి ఈ విధంగా పాడటం విన్నాను:
“సింహాసనంపై కూర్చున్న వానికి, గొఱ్ఱెపిల్లకు చిరకాలం స్తుతి,
గౌరవము, మహిమ, శక్తి కల్గుగాక!”
14 ఆ నాలుగు ప్రాణులు, “ఆమేన్” అని అన్నాయి. పెద్దలు సాష్టాంగ నమస్కారం చేసి స్తుతించారు.
యేసు మళ్ళీ కనిపించటం
21 ఆ తర్వాత తిబెరియ సముద్రం దగ్గర యేసు మళ్ళీ కనిపించాడు. అది ఈ విధంగా జరిగింది: 2 సీమోను పేతురు, దిదుమ అని పిలువబడే తోమా, గలిలయలోని కానా పట్టణానికి చెందిన “నతనయేలు”, జెబెదయి కుమారులు, మరొక యిద్దరు శిష్యులు, అంతా కలిసి ఒక చోట ఉన్నారు. 3 సీమోను పేతురు, “నేను చేపలు పట్టటానికి వెళ్తున్నాను” అని అన్నాడు.
మిగతా వాళ్ళు, “మేము కూడా వస్తున్నాము” అని అన్నాక అంతా కలిసి వెళ్ళి పడవనెక్కారు. కాని ఆ రాత్రి వాళ్ళకు చేపలు దొరక లేదు.
4 తెల్లవారే సమయానికి యేసు ఒడ్డున నిలుచొని ఉన్నాడు. కాని శిష్యులు ఆయనే “యేసు” అని గ్రహించలేదు. 5 యేసు, “మిత్రులారా! చేపలు ఏమైనా దొరికాయా?” అని అడిగాడు.
“లేదు” అని వాళ్ళన్నారు.
6 ఆయన, “పడవ కుడి వైపు మీ వల వేయండి. మీకు చేపలు దొరుకుతాయి” అని అన్నాడు. వాళ్ళు ఆయన చెప్పిన విధంగా వల వేసారు. చేపలు ఎక్కువగా వలలో పడటంవల్ల వాళ్లు ఆ వల లాగలేక పొయ్యారు.
7 యేసు ప్రేమించిన శిష్యుడు పేతురుతో, “అదిగో చూడు ప్రభువు” అని అన్నాడు. సీమోను పేతురు, “అదిగో ప్రభువు!” అని అతడు అనటం విన్న వెంటనే, యిది వరకు తీసివేసిన తన పై వస్త్రాన్ని నడుముకు చుట్టుకొని నీళ్ళలోకి దూకాడు. 8 మిగతా శష్యులు ఒడ్డుకు వంద గజాల దూరంలో ఉన్నారు. అందువల్ల వాళ్ళు చేపలతో నిండిన వలను లాగుతూ పడవను నడుపుకుంటూ అతణ్ణి అనుసరిస్తూ ఒడ్డును చేరుకున్నారు. 9 వాళ్ళు పడవ దిగాక కాలుతున్న బొగ్గల మీద చేపలు ఉండటం చూసారు. కొన్ని రొట్టెలు కూడా అక్కడ ఉన్నాయి. 10 యేసు వాళ్ళతో “మీరు పట్టిన కొన్ని చేపలు తీసుకురండీ” అని అన్నాడు.
11 సీమోను పేతురు పడవ ఎక్కి వలను ఒడ్డుకు లాగాడు. ఆ వలనిండా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి. మొత్తం నూట ఏబది మూడు చేపలు ఉన్నాయి. అన్ని చేపలున్నా ఆ వల చినుగలేదు! 12 యేసు వాళ్ళతో, “రండి! వచ్చి భోజనం చెయ్యండి” అని అన్నాడు. “మీరెవరు” అని అడగటానికి శిష్యుల కెవ్వరికీ ధైర్యం చాలలేదు. 13 యేసు వాళ్ళ దగ్గరకు వచ్చి, రొట్టెను తీసుకొని వాళ్ళకిచ్చాడు. అదే విధంగా చేపల్ని కూడా యచ్చాడు.
14 ఆయన బ్రతికింపబడ్డాక తన శిష్యులకు కనిపించడం యిది మూడవసారి.
యేసు మరియు పేతురు
15 వాళ్ళు భోజనం చెయ్యటం ముగించాక యేసు, సీమోను పేతురుతో, “యోహాను కుమారుడవైన సీమోనూ! వీళ్ళకన్నా నన్ను నీవు ఎక్కువగా ప్రేమిస్తున్నావా?” అని అడిగాడు.
“ఔను ప్రభూ! ప్రేమిస్తున్నానని మీకు తెలియదా!” అని అన్నాడు.
యేసు, “నా గొఱ్ఱెల్ని మేపు!” అని అన్నాడు.
16 యేసు, “యోహాను కుమారుడవైన సీమోనూ! నీవు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా?” అని మళ్ళీ అడిగాడు.
అతడు, “ఔను ప్రభూ! నేను ప్రేమిస్తున్నానని మీకు తెలియదా!” అని అన్నాడు.
యేసు, “నా గొఱ్ఱెల్ని జాగ్రత్తగా చూసుకో!” అని అన్నాడు.
17 మూడవసారి అతనితో, “యోహాను కుమారుడవైన సీమోనూ! నన్ను ప్రేమిస్తున్నావా?” అని అన్నాడు.
మూడవసారి, “నన్ను ప్రేమిస్తున్నావా” అని అడిగినందుకు పేతురు మనస్సు చివుక్కుమన్నది. అతడు, “ప్రభూ! మీకన్నీ తెలుసు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని కూడా తెలుసు” అని అన్నాడు.
యేసు, “నా గొఱ్ఱెల్ని మేపు! 18 ఇది నిజం. వయస్సులో ఉన్నప్పుడు నీ దుస్తులు నీవు వేసుకొని నీ యిష్టం వచ్చిన చోటికి వెళ్ళే వాడవు. కాని వయస్సు మళ్ళిన తర్వాత నీవు చేతులు చాపితే మరొకళ్ళు నీకు దుస్తులు తొడిగించి నీకు యిష్టం లేదన్న చోటికి తీసుకు వెళ్తారు” అని అన్నాడు. 19 పేతురు ఎలాంటి మరణం పొంది దేవునికి మహిమ తెస్తాడో సూచించటానికి యేసు ఇలా అన్నాడు. ఆ తర్వాత అతనితో, “నన్ను అనుసరించు!” అని అన్నాడు.
© 1997 Bible League International