Revised Common Lectionary (Complementary)
దావీదు కీర్తన. ఆలయ ప్రతిష్ఠ కీర్తన.
30 యెహోవా, నా కష్టాల్లో నుంచి నీవు నన్ను పైకి ఎత్తావు.
నా శత్రువులు నన్ను ఓడించి, నన్ను చూచి నవ్వకుండా నీవు చేశావు. కనుక నేను నిన్ను ఘనపరుస్తాను.
2 యెహోవా, నా దేవా నేను నిన్ను ప్రార్థించాను.
నీవు నన్ను స్వస్థపరచావు.
3 సమాధిలో నుండి నీవు నన్ను పైకి లేపావు.
నీవు నన్ను బ్రతకనిచ్చావు. చచ్చిన వాళ్లతోబాటు నేను గోతిలొ[a] ఉండవలసిన పనిలేదు.
4 దేవుని అనుచరులారా! యెహోవాకు స్తుతులు పాడండి.
ఆయన పవిత్ర నామాన్ని స్తుతించండి.
5 దేవునికి కోపం వచ్చింది కనుక “మరణం” నిర్ణయం చేయబడింది. కాని ఆయన తన ప్రేమను చూపించాడు.
నాకు “జీవం” ప్రసాదించాడు.
రాత్రి పూట, నేను ఏడుస్తూ పండుకొంటాను.
మర్నాటి ఉదయం నేను సంతోషంగా పాడుతూ ఉంటాను.
6 ఇప్పుడు నేను ఇది చెప్పగలను, ఇది సత్యం అని నాకు గట్టిగా తెలుసు.
నేను ఎన్నటికీ ఓడించబడను.
7 యెహోవా, నీవు నామీద దయ చూపావు.
బలమైన పర్వతంలా నీవు నన్ను నిలువబెట్టావు.
కొద్దికాలంపాటు, నీవు నా నుండి తిరిగిపోయావు.
మరి నేను చాలా భయపడిపోయాను.
8 దేవా, నేను మరల, నిన్ను ప్రార్థించాను.
నామీద దయ చూపించమని నేను నిన్ను అడిగాను.
9 “దేవా, నేను మరణించి,
సమాధిలోకి దిగిపోతే ఏమి లాభం?
ధూళి నిన్ను స్తుతిస్తుందా?
అది నీ నమ్మకమును గూర్చి చెబుతుందా?
10 యెహోవా, నా ప్రార్థన విని నామీద దయ చూపించుము.
యెహోవా, నాకు సహాయం చేయుము” అని అడిగాను.
11 నేను ప్రార్థించినప్పుడు, నీవు నాకు సహాయం చేశావు.
నా ఏడ్పును నీవు నాట్యంగా మార్చావు. నా దుఃఖ వస్త్రాలను నీవు తీసివేశావు.
నీవు నాకు సంతోషమనే వస్త్రాలు ధరింపజేశావు.
12 యెహోవా, నా దేవా, నిన్ను నేను శాశ్వతంగా స్తుతిస్తాను.
ఎన్నటికీ మౌనంగా ఉండను. నా దేవా! నిన్ను ఎల్లప్పుడూ స్తుతిస్తాను.
ముగ్గురు అతిథులు
18 తర్వాత మళ్లీ అబ్రాహాముకు యెహోవా ప్రత్యక్షమయ్యాడు. మమ్రేలోని సింధూర వనమునకు దగ్గర్లో అబ్రాహాము నివసిస్తున్నాడు. ఒకనాడు మిట్ట మధ్యాహ్నం అబ్రాహాము తన గుడార ద్వారం దగ్గర కూర్చున్నాడు. 2 అబ్రాహాము తలెత్తి చూడగా, తన ముందర నిలచిన ముగ్గురు మనుష్యులు కనబడ్డారు. అబ్రాహాము వాళ్లను చూడగానే అతడు వారి దగ్గరకు వెళ్లి, వారి ముందు వంగి, 3 ఇలా అన్నాడు, “అయ్యలారా, మీ దాసుడనైన నా దగ్గర దయచేసి కొంత కాలం ఉండండి. 4 మీ కాళ్లు కడుక్కొనేందుకు నేను నీళ్లు తెస్తాను. చెట్ల క్రింద మీరు విశ్రాంతి తీసుకోవచ్చు. 5 మీ కోసం నేను భోజనం తెస్తాను, కడుపు నిండా భోంచేయండి. తర్వాత మీ దారిన మీరు వెళ్లొచ్చు.”
“చాలా బాగుంది, అలాగే కానీయి” అని ఆ ముగ్గురు మనుష్యులు అన్నారు.
6 అబ్రాహాము తన గుడారము దగ్గరకు త్వరత్వరగా వెళ్లాడు. “మూడు రొట్టెలకు సరిపడె గోధుమలు త్వరగా తయారు చేయి” అని అబ్రాహాము శారాతో అన్నాడు. 7 తర్వాత అబ్రాహాము తన పశువుల దగ్గరకు పరుగెత్తాడు. అబ్రాహాము చాలా మంచి లేత దూడను తీసుకొని తన సేవకునికి ఇచ్చాడు. త్వరగా ఆ దూడను వధించి, దానితో భోజనం సిద్ధం చేయమని అబ్రాహాము చెప్పాడు. 8 ఆ మాంసాన్ని ఆ ముగ్గురు మనుష్యులు భోంచేసేందుకు అబ్రాహాము ఇచ్చాడు. అతడు పాలు, వెన్న కూడ వాళ్లకు ఇచ్చాడు. ఆ ముగ్గురు చెట్టు క్రింద భోజనం చేస్తూ ఉండగా అబ్రాహాము వారి దగ్గర నిలబడ్డాడు.
నీకు ప్రతిఫలము దొరుకుతుంది
12 అప్పుడు యేసు తన అతిథితో, “భోజనానికి లేక విందుకు ఆహ్వానించదలచినప్పుడు మీ స్నేహితుల్ని కాని, మీ సోదరుల్ని కాని, మీ బంధువుల్ని కాని ధనికులైన మీ ఇరుగు పొరుగు వాళ్ళను కాని ఆహ్వానించకండి. అలా చేస్తే మిమ్మల్ని కూడా వాళ్ళు ఆహ్వానిస్తారు. అప్పుడు వాళ్ళ రుణం తీరిపోతుంది. 13 కనుక మీరు విందు చేసినప్పుడు పేదవాళ్ళను, వికలాంగులను, కుంటివాళ్ళను, గ్రుడ్డివాళ్ళను ఆహ్వానించండి. 14 వాళ్ళు మీ రుణం తీర్చలేరు. కనుక మీరు ధన్యులౌతారు. ఎందుకంటే మంచి వాళ్ళు బ్రతికి వచ్చినప్పుడు దేవుడు మీరు చేసిన మంచి పనికి మంచి బహుమతి నిస్తాడు” అని అన్నాడు.
© 1997 Bible League International