Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 122

దావీదు యాత్ర కీర్తన.

122 “మనం యెహోవా ఆలయానికి వెళ్దాం” అని ప్రజలు
    నాతో చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను.
ఇక్కడ యెరూషలేము ద్వారాల దగ్గర మనం నిలిచిఉన్నాము.
కొత్త యెరూషలేము
    ఒకే ఐక్యపట్టణంగా మరల కట్టబడింది.
దేవునికి చెందిన గోత్రాల వారు అక్కడికి వెళ్తారు.
    యెహోవా నామాన్ని స్తుతించుటకు ఇశ్రాయేలు ప్రజలు అక్కడికి వెళ్తారు.
ప్రజలకు న్యాయం తీర్చడానికి, రాజులు వారి సింహాసనాలు వేసుకొనే స్థలం అది.
    దావీదు వంశపు రాజులు వారి సింహాసనాలు అక్కడే వేసుకొన్నారు.

యెరూషలేములో శాంతి కోసం ప్రార్థించండి.
    “యెరూషలేమును ప్రేమించే ప్రజలకు అక్కడ శాంతి లభిస్తుందని నేను ఆశిస్తున్నాను.
    నీ ప్రాంగణాలలో శాంతి ఉంటుందని నేను ఆశిస్తున్నాను.
    నీ మహాభవనాల్లో భద్రత ఉంటుందని నేను ఆశిస్తున్నాను.”

నా పొరుగువారు, ఇతర ఇశ్రాయేలీయులు క్షేమంగాను,
    శాంతితోను ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను.
మన యెహోవా దేవుని ఆలయక్షేమం కోసం
    ఈ పట్టణానికి మంచి సంఘటనలు సంభవించాలని నేను ప్రార్థిస్తున్నాను.

ఎస్తేరు 8

యూదులకు అనుకూలంగా మహారాజు శాసనం

అదే రోజున అహష్వేరోషు మహారాజు యూదులకు శత్రువైన హామానుకు చెందిన చర స్థిరాస్తులున్నింటినీ ఎస్తేరు మహారాణికి దత్తం చేశాడు. మొర్దెకై తనకు బంధువన్న విషయాన్ని ఎస్తేరు మహారాజుకి చెప్పింది. అప్పుడు మొర్దెకై మహారాజు దర్శనానికి వచ్చాడు. మహారాజు తన రాజముద్రికను హామానునుంచి వెనక్కి తెప్పించి, తన వేలికి పెట్టుకున్నాడు. మహారాజు ఆ ఉంగరాన్ని మొర్దెకైకి ఇచ్చాడు. అప్పుడింక ఎస్తేరు హామానుకి చెందిన ఆస్తులన్నింటి అజమాయిషీనీ మొర్దెకైకి అప్పగించింది.

తర్వాత ఎస్తేరు మహారాజుతో మళ్లీ మాట్లాడింది. ఆమె రోదిస్తూ మహారాజు పాదాలపైపడి, అగాగీయుడైన హామాను దుష్ట పథకాన్ని రద్దు చేయవలసిందిగా మహారాజును వేడుకుంది. యూదులను హింసించేందుకు హామాను పన్నిన దుష్ట పథకం అది.

మహారాజు తన బంగారు రాజదండంతో ఎస్తేరును తాకాడు. ఎస్తేరు లేచి, మహారాజు ముందు నిలబడింది. అప్పుడు ఎస్తేరు మహారాజుతో ఇలా విన్నవించుకుంది: “మహారాజా, మీకు నేనంటే ఇష్టంవుంటే, తమ దయవుంటే, నా కోసం ఇలా చెయ్యండి. ఇది మంచి ఊహ అనుకుంటేనే ఈ పని చేయండి. నేను తమకి ప్రీతిపాత్రురాలినైతే, హామాను పంపిన ఆజ్ఞను రద్దుచేస్తూ ఒక శాసనం చేయండి. అగాగీయుడైన హామాను మహారాజా వారి సామంత దేశాలన్నింటిలోని యూదులందరినీ సమూలంగా నాశనం చేయమని తాఖీదులు జారీచేశాడు. నా ప్రజలు ఇలాంటి ఘోరమైన విపత్తులకు గురికావడం నేను సహించలేను. నా కుటుంబ సభ్యులు హతమార్చబడటం నేను భరించలేను. అందుకే, మహారాజావారిని ఈ ఘోరాన్ని ఆపు చెయ్యవలసిందిగా అర్థిస్తున్నాను.”

అహష్వేరోషు మహారాజు ఎస్తేరు మహారాణికీ, యూదుడైన మొర్దెకైకీ ఇలా సమాధానమిచ్చాడు, “హామాను యూదులకు శత్రువు కనుకనే వాని ఆస్తిని ఎస్తేరుకి ఇచ్చాను. నా సైనికులు వాడిని ఉరికంబానికెక్కించి, ఉరిదీశారు. ఇప్పుడిక మహారాజు ఆజ్ఞ మేరకు మరో ఆజ్ఞాపత్రం వ్రాయండి. మీకు సర్వోత్తమమని తోచిన పద్ధతిలో, యూదులకు తోడ్పడే విధంగా శాసనాన్ని వ్రాయండి. తర్వాత దానిమీద రాజముద్రికతో ముద్రవేసి మూసెయ్యండి. మహారాజు ఆజ్ఞ మేరకు వ్రాయబడి, దానిమీద రాజముద్రిక గుర్తువేయబడిన ఏ ఆధికారిక ఆజ్ఞాపత్రాన్ని రద్దుచేయ సాధ్యం కాదు.”

మహారాజు వెంటనే లేఖకులను పిలువనంపించాడు. మూడవ నెల, అనగా సీవాను నెల 23వ రోజున యీ ఘటన జరిగింది. లేఖకులు మొర్దెకై ఆజ్ఞలన్నింటినీ వ్రాశారు. అవి యూదులకీ, సామంత రాజులకీ, రాజ్యాధిపతులకీ, 127 దేశాల అధికారులకీ పంపబడ్డాయి. ఆ దేశాలు భారత దేశంనుంచి ఇథియోపియాదాకా విస్తరించి వున్నాయి. ఆ ఆజ్ఞాపత్రాలు ఆయా దేశాల భాషల్లో వ్రాయబడ్డాయి. ఆవి ఆయా ప్రజాబృందాల భాషల్లోకి అనువదించబడ్డాయి. కాగా ఆ ఆజ్ఞాపత్రాలు యూదులకు వాళ్ల స్వంత భాషలో, స్వంతలిపిలో వ్రాయబడ్డాయి. 10 మొర్దెకై ఆ ఆజ్ఞలను అహష్వేరోషు మహారాజు ఆమోదంతో వ్రాశాడు. తర్వాత అతను వాటిమీద రాజముద్రికతో ముద్ర వేయించాడు. అప్పుడిక, మొర్దెకై అశ్వారూఢులైన వార్తాహరుల ద్వారా వాటిని పంపించాడు. మహారాజు అశ్వశాలలోని గుర్రాలు అవి.

11 ఆ లేఖల్లోని మహారాజు ఉత్తరువు ఇలా సాగింది: ప్రతి ఒక్క నగరంలోని యూదులూ తమ ప్రాణ రక్షణ కోసం ఒకచోట గుమిగూడేహక్కు కలిగున్నారు. తమ స్త్రీలపైనా, తమ బిడ్డలపైనా ఏ జాతీయులకు చెందిన ఏ సైన్యాన్నయినా సరే నాశనం చేసే, హత మార్చే, పూర్తిగా రూపు మాపే హక్కు వాళ్లకి వుంది. యూదులకు తమ శత్రువుల ఆస్తిని వశంచేసుకొనే హక్కూ, నాశనం చేసే హక్కూ వున్నాయి.

12 యూదులకు ఈ హక్కు ఒక్క రోజే వుంటుంది. ఆ రోజు అదారు అనబడే 12వ నెల 13వ రోజు. అహష్వేరోషు సామ్రాజ్యంలోని దేశాలన్నింట్లోనూ యూదులకు హక్కు దాఖలు చేయబడింది. 13 మహారాజు ఆజ్ఞాపత్రపు ప్రతి ఒకటి బయటికి పంపబడింది. అదొక శాసనం అయింది. అది అన్ని సామంత దేశాల్లోనూ శాసనం అయింది. సామ్రాజ్యంలో నివసించే ప్రతి ఒక జాతి ప్రజలకీ ఈ శాసనం చాటబడింది. యూదులు ప్రత్యేకమైన ఈ రోజున సర్వసన్నద్ధంగా ఉండేందుకు వీలుగా వాళ్లీపని చేశారు. యూదులు తమ శత్రువులకు బదులు దెబ్బ కొట్టేందుకు ఆ రోజున అనుమతింపబడతారు. 14 వార్తాహరులు మహారాజావారి గుర్రాలమీద వేగంగా సాగిపోయారు. మహారాజు ఆ గుర్రాల రౌతులను వేగంగా వెళ్లమని ఆదేశించాడు. ఆ ఆజ్ఞ రాజధాని అయిన షూషను నగరానికి కూడా వర్తింప జేయబడింది.

15 మొర్దెకై మహారాజు సమక్షం నుంచి బయల్దేరాడు. అతను మహారాజు సమర్పించిన నీలం, తెలుపు ప్రత్యేక దుస్తులు, ఒకపెద్ద బంగారు కిరీటం ధరించాడు. అతని పైవస్త్రం ఊదా రంగులో వుంది. అది చాలా మంచి ఉన్నితో నేసినది. ఆ రోజున షూషను నగరంలో ప్రత్యేకమైన ఒక ఉత్సవం జరుగుతోంది. 16 అది యూదులకు ప్రత్యేకించి ఆనందదాయకమైన రోజుగా, అందరికీ సంతోషానంద భరితమైన రోజుగా పరిణమించింది.

17 మహారాజు ఆజ్ఞ చేరిన ప్రతి దేశంలోనూ, ప్రతి నగరంలోనూ, యూదుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. యూదులు విందులు, వేడుకలు చేసుకున్నారు. ఇతర జాతులకు చెందిన చాలామంది సామాన్య ప్రజలకు యూదులంటే భయంకలిగి, వాళ్లు యూదా మతం పుచ్చుకున్నారు.

ప్రకటన 2:8-11

స్ముర్నలోని సంఘానికి

“స్ముర్నలోని క్రీస్తు సంఘానికి చెందిన దూతకు ఈ విధంగా వ్రాయి:

“ఆదియు, అంతము అయిన వాడు, చనిపోయి తిరిగి బ్రతికి వచ్చినవాడు ఈ విధంగా చెబుతున్నాడు:

“మీ దుఃఖాలను గురించి, మీ దారిద్ర్యాన్ని గురించి నాకు తెలుసు. అయినా మీరు భాగ్యవంతులు. మిమ్మల్ని గురించి కొందరు చెడుగా మాట్లాడుతున్నారు. వాళ్ళు తాము యూదులమని చెప్పుకొంటారు గాని నిజానికి వాళ్ళు యూదులు కారు. వాళ్ళు సాతాను సమాజానికి చెందినవాళ్ళు. 10 మీరు అనుభవించబోయే శ్రమలను గురించి భయపడకండి. సాతాను మీలో కొందరిని చెరసాలలో వేస్తాడు. మీరు పది రోజులు హింసను అనుభవిస్తారు. ఇది మీకొక పరీక్ష. మరణానికి కూడా భయపడకుండా విశ్వాసంతో ఉండండి. నేను మీకు జీవ కిరీటాన్ని యిస్తాను.

11 “ఆత్మ సంఘాలకు చెబుతున్న వాటిని ప్రతివాడు వినాలి. వీటిని జయించిన వాడు రెండవ మరణాన్నుండి తప్పించుకొంటాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International