Revised Common Lectionary (Complementary)
దావీదు యాత్ర కీర్తన.
122 “మనం యెహోవా ఆలయానికి వెళ్దాం” అని ప్రజలు
నాతో చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను.
2 ఇక్కడ యెరూషలేము ద్వారాల దగ్గర మనం నిలిచిఉన్నాము.
3 కొత్త యెరూషలేము
ఒకే ఐక్యపట్టణంగా మరల కట్టబడింది.
4 దేవునికి చెందిన గోత్రాల వారు అక్కడికి వెళ్తారు.
యెహోవా నామాన్ని స్తుతించుటకు ఇశ్రాయేలు ప్రజలు అక్కడికి వెళ్తారు.
5 ప్రజలకు న్యాయం తీర్చడానికి, రాజులు వారి సింహాసనాలు వేసుకొనే స్థలం అది.
దావీదు వంశపు రాజులు వారి సింహాసనాలు అక్కడే వేసుకొన్నారు.
6 యెరూషలేములో శాంతి కోసం ప్రార్థించండి.
“యెరూషలేమును ప్రేమించే ప్రజలకు అక్కడ శాంతి లభిస్తుందని నేను ఆశిస్తున్నాను.
7 నీ ప్రాంగణాలలో శాంతి ఉంటుందని నేను ఆశిస్తున్నాను.
నీ మహాభవనాల్లో భద్రత ఉంటుందని నేను ఆశిస్తున్నాను.”
8 నా పొరుగువారు, ఇతర ఇశ్రాయేలీయులు క్షేమంగాను,
శాంతితోను ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను.
9 మన యెహోవా దేవుని ఆలయక్షేమం కోసం
ఈ పట్టణానికి మంచి సంఘటనలు సంభవించాలని నేను ప్రార్థిస్తున్నాను.
హామాను ఉరితీయ బడుట
7 మహారాజూ, హామానూ మహారాణి ఎస్తేరు విందుకి వెళ్లారు. 2 విందు రెండోరోజున వాళ్లు ద్రాక్షారసం సేవిస్తూవుండగా మహారాజు ఎస్తేరును మరల ఇలా అడిగాడు: “మహారాణి ఎస్తేరూ, నీకేం కావాలి? నువ్వేమి కోరుకున్నా సరే, దాన్ని నీకు ఇస్తాను. నీ కోరిక ఏమిటి? నీకు ఏదైనా సరే, చివరకు అర్ధ రాజ్యమైనా సరే ఇస్తాను.”
3 అప్పుడు మహారాణి ఎస్తేరు ఇలా సమాధానం యిచ్చింది: “మహారాజా, మీకు నేనంటే ఇష్టంవుంటే, మీరు నన్ను అనుగ్రహిస్తే, నాకూ, నా ప్రజలకీ కూడా ప్రాణదానం చెయ్యండి! నేను కోరుకొనేది అంత మాత్రమే. 4 ఎందుకంటే నాశనం చేయబడేందుకు, చంపివేయబడేందుకు, నిర్మూలించబడేందుకు నేనూ, నా ప్రజలూ అమ్మివేయబడ్డాం. మేము కేవలం బానిసలుగా అమ్మివేయబడివుంటే, నేను ఊరక ఉండి పోదును. ఎందుకంటే, అది మహారాజును విసిగించవలసినంతటి సమస్య అయ్యుండేది కాదు.”
5 మహారాజు అహష్వేరోషు మహారాణి ఎస్తేరును ఇలా ప్రశ్నించాడు: “మీ విషయంలో ఇలా చేసింది ఎవరు? నీ ప్రజలకు ఇలా చేయ సాహసించిన వ్యక్తి ఎవరు?”
6 “మాకు విరోధి, శత్రువు దుర్మార్గుడైన ఈ హామానే” అని జవాబిచ్చింది ఎస్తేరు.
దానితో, మహారాజు ముందు నిలబడ్డ హామాను భయ భీతుడయ్యాడు. 7 మహారాజుకి పట్టరాని కోపం వచ్చింది. ఆయన లేచి నిలబడ్డాడు. ద్రాక్షాసారా అక్కడే వదిలేసి, బయటి తోటలోకి వెళ్లాడు. కాని, హామాను మహారాణిని క్షమాభిక్ష వేడుకునేందుకు అక్కడే నిలిచిపోయాడు. అప్పటికే మహారాజు తనని చంపి వేయాలని నిర్ణయించుకున్నట్లు హామాను గ్రహించినందువల్లనే, మహారాణి ఎస్తేరును క్షమాభిక్ష అడుక్కునేందుకు అక్కడ ఉండి పోయాడు. 8 సరిగ్గా తోటనుంచి విందుశాలకి వస్తూన్నప్పుడే ఎస్తేరు వాలి కూర్చున్న శయ్యమీద హామాను పడుతూవుండటం మహారాజు కంటపడింది. మహారాజు కోపస్వరంతో, “నేనీ ఇంట్లో ఉండగానే నువ్వు మహారాణి మీద దాడి చేస్తున్నావా?” అని గర్జించాడు.
మహారాజు కేక వినగానే, సేవకులు లోనికి వచ్చి హామానుని పట్టుకున్నారు. 9 మహారాజు సేవకుల్లో ఒకడి పేరు హార్బోనా. ఆ నపుంసకుడు మహారాజుతో ఇలా చెప్పాడు: “హామాను యింటి దగ్గర 75 అడుగల ఉరికంబం వుంది మహారాజా. దానిమీద మొర్దెకైని ఉరి తీయించేందుకు హామాను దాన్ని నిర్మింపజేశాడు. మిమ్మల్మి హత్య చేసేందుకు కుట్రలు పన్నుతున్నప్పుడు, ఆ సమాచారాన్ని తెలియజేసి, మీకు సహాయపడినది యీ మొర్దెకైయేనండి.”
“హామానుని అదే ఉరికంబం మీద ఉరి తియ్యండి” అని ఆజ్ఞాపించాడు మహారాజు.
10 దానితో, మొర్దెకైని ఉరితీయించేందు కోసం హామాను నిర్మించిన ఉరికంబం మీదనే హామాను ఉరితీయబడ్డాడు.
9 నేను యోహానును, మీ సోదరుణ్ణి. యేసుతో పొందిన ఐక్యత వల్ల మనము ఆయన రాజ్యంలో ఒకటిగా ఉన్నాము. సహనంతో కష్టాలు అనుభవిస్తున్నాము. యేసు చెప్పిన సత్యాన్ని దేవుని సందేశాన్ని ప్రకటించటం వల్ల నన్ను వాళ్ళు పత్మాసు ద్వీపంలో ఒంటరిగా ఉంచారు. 10 ఆదివారమునాడు నేను దేవుని ఆత్మపూర్ణుడనైయుండగా బూర ఊదినట్లు నా వెనుకనుండి ఒక పెద్ద శబ్దం వినిపించింది. 11 అది నాతో, “నీవు చూసినదాన్ని ఒక గ్రంథంగా వ్రాసి ఈ ఏడు సంఘాలకు అనగా, ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియ, లవొదికయకు పంపుము” అని అన్నది.
12 నాతో మాట్లాడుతున్న స్వరం ఎవరిదో చూడాలని వెనక్కు తిరిగి చూసాను. వెనక్కు తిరిగి చూడగా ఏడు బంగారు దీపస్తంభాలు కన్పించాయి. 13 వాటి మధ్య ఒక వ్యక్తి కనిపించాడు. ఆయన మనుష్యకుమారునిలా[a] ఉన్నాడు. ఆయన వేసుకొన్న అంగీ ఆయన పాదాల వరకు ఉంది. ఆయన రొమ్మునకు బంగారు దట్టి కట్టబడివుంది. 14 ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నిలా ఉన్నాయి. ఆయన వెంట్రుకల్ని మంచుతో కూడా పోల్చవచ్చు. ఆయన కళ్ళు అగ్నిజ్వాలల్లా ఉన్నాయి. 15 ఆయన పాదాలు కొలిమిలో కాలే యిత్తడిలా ఉన్నాయి. ఆయన కంఠధ్వని జల ప్రవాహం చేసే శబ్దంలా ఉంది. 16 ఆయన తన కుడి చేతిలో ఏడు నక్షత్రాలను పట్టుకొని ఉన్నాడు. ఇరువైపులా పదునుగానున్న ఒక కత్తి ఆయన నోటి నుండి బయటకు వచ్చింది. ఆయన ముఖం దివ్యంగా ప్రకాశిస్తున్న సూర్యునిలా ఉంది.
17 నేనాయన్ని చూసి, ప్రాణం పోయిన వానిలా ఆయన పాదాల ముందు పడ్డాను. అప్పుడు ఆయన తన కుడి చేతిని నా తలపై ఉంచి, “భయపడకు. ఆదిని, అంతాన్ని నేనే!” అని అన్నాడు. 18 నేను చిరకాలం జీవించేవాణ్ణి. ఒకప్పుడు నేను మరణించి ఉంటిని. కాని యిక శాశ్వతంగా జీవించి ఉంటాను. మరణంపై నాకు అధికారం ఉంది. మృత్యులోకపు తాళంచెవులు నా దగ్గర ఉన్నాయి. 19 అందువల్ల యిప్పుడున్నవాటిని, ముందు జరుగబోయేవాటిని, నీవు చూసినవాటిని గురించి వ్రాయి. 20 నీవు నా కుడి చేతిలో చూసిన ఏడు నక్షత్రాల రహస్యము, ఏడు దీపస్తంభాల రహస్యము యిది. ఆ ఏడు నక్షత్రాలు ఏడు సంఘాలకు చెందిన దూతలు, ఆ ఏడు దీపస్తంభాలు ఏడు సంఘాలు.
© 1997 Bible League International