Revised Common Lectionary (Complementary)
118 యెహోవా దేవుడు గనుక ఆయనకు కృతజ్ఞత తెలపండి.
నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది.
2 “నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది”
అని ఇశ్రాయేలూ, నీవు చెప్పుము.
14 యెహోవా నా బలం, నా విజయ గీతం!
యెహోవా నన్ను రక్షిస్తాడు!
15 మంచివాళ్ల ఇండ్లలో విజయ ఉత్సవం మీరు వినగలరు.
యెహోవా తన మహా శక్తిని మరల చూపించాడు.
16 యెహోవా చేతులు విజయంతో పైకి ఎత్తబడ్డాయి.
యెహోవా తన మహా శక్తిని మరల చూపించాడు.
17 నేను జీవిస్తాను! కాని మరణించను.
మరియు యెహోవా చేసిన వాటిని గూర్చి నేను చెబుతాను.
18 యెహోవా నన్ను శిక్షించాడు,
కాని ఆయన నన్ను చావనియ్య లేదు.
19 మంచి గుమ్మములారా, నా కోసం తెరచుకోండి,
నేను లోనికి వచ్చి యెహోవాను ఆరాధిస్తాను.
20 అవి యెహోవా గుమ్మాలు.
ఆ గుమ్మాలలో నుండి మంచివాళ్లు మాత్రమే వెళ్లగలరు.
21 యెహోవా, నా ప్రార్థనకు జవాబు ఇచ్చినందుకు నేను నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.
నన్ను రక్షించినందుకు నేను నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.
22 ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి
మూలరాయి అయ్యింది.
23 ఇలా జరుగునట్లు యెహోవా చేశాడు.
అది ఆశ్చర్యంగా ఉందని అనుకొంటున్నాము.
24 ఈ వేళ యెహోవా చేసిన రోజు.
ఈ వేళ మనం ఆనందించి సంతోషంగా ఉందాము!
17 కానీ సీసెరా పారిపోయాడు. యాయేలు అను స్త్రీ నివసిస్తున్న గుడారం దగ్గరకు అతడు వచ్చాడు. యాయేలు హెబెరు అనువాని భార్య. అతడు కెనితీ ప్రజల్లో ఒకడు. హెబెరు కుటుంబం హసోరు రాజగు యాబీనుతో సమాధానంగా ఉంది. కనుక సీసెరా యాయేలు గుడారానికి పరుగెత్తాడు. 18 సీసెరా రావటం యాయేలు చూసింది గనుక అతనిని కలుసుకొనేందుకు ఆమె బయటకు వెళ్లింది. యాయేలు, “అయ్యా, నా గుడారంలోనికి రండి. రండి, భయపడవద్దు” అని సీసెరాతో చెప్పింది. కనుక సీసెరా, యాయేలు గుడారంలోనికి వెళ్లాడు. ఆమె అతనిని గొంగళితో కప్పింది.
19 “నాకు దాహంగా వుంది. దయచేసి తాగేందుకు నాకు కొంచెం నీళ్లు ఇవ్వు” అన్నాడు సీసెరా యాయేలుతో. జంతు చర్మంతో చేయబడిన ఒక బుడ్డి యాయేలు దగ్గర ఉంది. అందులో ఆమె పాలు పోసి ఉంచింది. సీసెరా తాగటానికి యాయేలు ఆ పాలు ఇచ్చింది. అప్పుడు ఆమె సీసెరాను కప్పివేసింది.
20 అప్పుడు సీసెరా యాయేలుతో, “వెళ్లి, గుడార ద్వారం దగ్గర నిలువబడు. ఎవరైనా అటువైపు వచ్చి, ‘లోపల ఎవరైనా ఉన్నారా?’ అని అడిగితే ‘లేరు’ అని చెప్పు” అన్నాడు.
21 కానీ యాయేలు ఒక గుడారపు మేకును, ఒక సుత్తెను చూసింది. యాయేలు త్వరగా సీసెరా దగ్గరకు వెళ్లింది. సీసెరా చాలా అలసిపోయినందువల్ల, నిద్రపోతున్నాడు. యాయేలు గుడారపు మేకును సీసెరా కణతల మీద పెట్టి, సుత్తెతో దిగ గొట్టేసింది. ఆ గుడారపు మేకు సీసెరా కణతల్లో నుండి నేల మీదికి దిగిపోయింది. సీసెరా మరణించాడు.
22 సరిగ్గా అప్పుడే సీసెరా కోసం వెదుక్కొంటూ బారాకు యాయేలు గుడారంవైపు వచ్చాడు. యాయేలు బారాకును కులుసుకొనేందుకు బయటకు వెళ్లి, “ఇక్కడ లోపలికి రా, నీవు వెదుకుతున్న మనిషిని నేను నీకు చూపిస్తాను” అంది. కనుక బారాకు యాయేలుతో కలిసి గుడారంలో ప్రవేశించాడు. అక్కడ కణతల్లో నుండి నేలమీదికి గుడారపు మేకు దిగిపోయి, చచ్చిపడి ఉన్న సీసెరా బారాకుకు కనిపించాడు.
23 ఆ రోజు కనాను రాజు యాబీనును ఇశ్రాయేలు ప్రజలకోసం దేవుడు ఓడించాడు.
24 కనానీయుడైన హెబెరు భార్య యాయేలు.
ఆమె స్త్రీలలో దీవెన నొందును.
25 సీసెరా నీళ్లను అడిగెను.
యాయేలు అతనికి పాలను ఇచ్చెను.
తరువాత సర్దారులకు తగిన పాత్రతో
మీగడ తెచ్చియిచ్చెను.
26 మరియు యాయేలు డేరా మేకు చేత పట్టుకొనెను.
పనివారు ఉపయోగించు సుత్తెను కుడి చేత పట్టుకొనెను.
తరువాత మేకుతో అతని తలను పగులగొట్టెను.
అప్పుడు సీసెరా కణత పగిలి అక్కడే పడిపోయెను.
27 యాయేలు పాదాల మధ్య కుప్ప కూలిపోయాడు
అతను పడిపోయాడు. అతను అక్కడే పడి ఉన్నాడు!
ఆమె పాదాల మధ్య అతడు కుప్పకూలిపోయాడు.
అతడు పడిపోయాడు!
సీసెరా ఎక్కడ పడ్డాడో
అక్కడ కూలిపోయాడు. చనిపోయాడు!
28 “సీసెరా తల్లి కిటికీలోంచి చూసి ఏడుస్తు వున్నది.
సీసెరా తల్లి తెరలలో నుండి చూస్తు వున్నది,
‘సీసెరా రథం ఎందుకు ఆలస్యమైంది?
అతని రథం, గుర్రాల ధ్వనులు ఎందుకు ఆలస్యం అయ్యాయి.’
29 “ఆమె పరిచారికలలో అతి తెలివిగల ఒకతె ఆమెకు జవాబిస్తుంది.
అవును, సేవకురాలు ఆమెకు జవాబిస్తుంది.
30 ‘నిశ్చయంగా వారు గెలిచారు!
వారు ఓడించిన ప్రజలనుండి వస్తువులను వారు తీసుకుంటున్నారు!
వారిలో వారు ఆ వస్తువులను పంచుకొంటున్నారు!
ఒక్కో సైనికుడు ఒకరు లేక ఇద్దరు అమ్మాయిలను తీసుకుంటున్నారు.
ఒక వేళ సీసెరా రంగు వేయబడిన ఒక గుడ్డ ముక్క తీసుకుంటున్నాడేమో.
అదీ సంగతి! విజయశాలి సీసెరా ధరించేందుకు ఒకటి రెండు విచిత్ర బుట్టా నేత బట్టలు తెచ్చుకుంటున్నాడు కాబోలు.’
31 “యెహోవా, నీ శత్రువులంతా ఇలానే మరణించెదరు గాక!
కానీ నిన్ను ప్రేమించే మనుష్యులందరూ తేటగా ప్రకాశించే సూర్యునిలా ఉందురు గాక!”
ఆ దేశంలో 40 సంవత్సరాల వరకు శాంతి నెలకొన్నది.
స్త్రీ, ఘటసర్పం
12 పరలోకంలో ఒక గొప్ప అద్భుతమైన దృశ్యం కనిపించింది. సూర్యుణ్ణి తన వస్త్రంగా, చంద్రుణ్ణి తన పాదాల క్రింద, పన్నెండు నక్షత్రాల కిరీటాన్ని తలపై పెట్టుకొన్న ఒక స్త్రీ కనిపించింది. 2 ఆమె గర్భంతో ఉంది. ప్రసవించే సమయం రావటంవల్ల ఆమె నొప్పులతో బిగ్గరగా కేక వేసింది.
3 అప్పుడు పరలోకంలో ఇంకొక దృశ్యం కనిపించింది. ఒక పెద్ద ఘటసర్పం, ఏడు తలలతో, పది కొమ్ములతో కనిపించింది. అది ఎర్రగా ఉంది. ఆ ఏడు తలలమీద ఏడు కిరీటాలు ఉన్నాయి. 4 ఆ ఘటసర్పం తన తోకతో ఆకాశం నుండి నక్షత్రాలలో మూడవభాగాన్ని ఊడ్చి, వాటిని భూమ్మీదికి పారవేసింది. ఆ స్త్రీ ప్రసవించిన వెంటనే ఆ శిశువును మ్రింగి వేద్దామని, ఆ ఘటసర్పం ప్రసవించబోయే ఆ స్త్రీ ముందు నిలబడివుంది.
5 ఆమె ఒక మగ శిశువును ప్రసవించింది. ఆ బాలుడు దేశాలను గొప్ప అధికారంతో పాలిస్తాడు. ఆ శిశువు ఎత్తబడి దేవుని సింహాసనం దగ్గరకు తీసుకు వెళ్ళబడ్డాడు. 6 ఆ స్త్రీ ఎడారి ప్రాంతానికి పారిపోయింది. ఆమెను పన్నెండువందల అరువది రోజుల దాకా జాగ్రత్తగా చూసుకోవటానికి దేవుడు ఒక స్థలం ఏర్పాటు చేశాడు.
7 పరలోకంలో ఒక యుద్ధం జరిగింది. మిఖాయేలు, అతని దూతలు ఘటసర్పంతో యుద్ధం చేసారు. ఘటసర్పం తన దూతలతో తిరిగి యుద్ధం చేసింది. 8 ఆ ఘటసర్పానికి తగినంత శక్తి ఉండనందువల్ల ఓడిపోయి పరలోకంలో వాటి స్థానాన్ని పోగొట్టుకొన్నాయి. 9 వాళ్ళు ఆ ఘటసర్పాన్ని భూమ్మీదికి త్రోసి వేశారు. ఇది ప్రపంచాన్ని తప్పుదారి పట్టించే ఆది సర్పం. చాలాకాలం నుండి ఉన్న ఈ ఘటసర్పానికి దయ్యమని, సాతాను అని పేరు. ఆ ఘటసర్పాన్ని, దాని దూతల్ని వాళ్ళు క్రిందికి త్రోసివేశారు.
10 పరలోకం నుండి ఒక పెద్ద స్వరం బిగ్గరగా యిలా అనటం విన్నాను: “మనదేవుని ముందు మన సోదరుల్ని రాత్రింబగళ్ళు నిందించే వాడు క్రిందికి త్రోసివేయబడ్డాడు. అందుకే మన దేవుని రాజ్యం వచ్చింది. రక్షణ శక్తి లభించింది. ఆయన క్రీస్తుకు అధికారం వచ్చింది. 11 గొఱ్ఱెపిల్ల రక్తంతో, తాము బోధించిన సత్యంతో మన సోదరులు వాణ్ణి ఓడించారు. వాళ్ళు తమ జీవితాల్ని, చావుకు భయపడేటంతగా ప్రేమించ లేదు. 12 కనుక పరలోకమా! ఆనందించు. పరలోకంలో ఉన్నవారలారా! ఆనందించండి. ప్రపంచమా! నీలో సాతాను ప్రవేశించాడు కనుక నీకు శాపం కలుగుతుంది! సముద్రమా! నీకు శాపం కలుగుతుంది! సాతానుకు తన కాలం తీరిందని తెలుసు. కనుక వాడు చాలా కోపంతో ఉన్నాడు.”
© 1997 Bible League International