Revised Common Lectionary (Complementary)
14 యోబు ఈ విధంగా చెప్పాడు:
“మనమందరం కష్టంతో నిండిన
కొద్దిపాటి జీవితం కోసమేపుట్టాం.
2 మనిషి జీవితం పువ్వులాంటిది.
అతడు త్వరగా పెరిగి, త్వరగా చస్తాడు.
కొంచెం సేపు ఉండి, ఆ తర్వాత ఉండని నీడలాంటిది మనిషి జీవితం.
3 దేవా, నీవు అలాంటి మనిషిని గమనిస్తావా?
నీతో తీర్పు పొందటానికి నన్ను నీ ముందుకు తీసుకొనిరమ్ము.
4 “మురికి దానిలో నుండి శుభ్రమైన దాన్ని ఎవరు తీయగలరు? ఎవ్వరూ తీయలేరు.
5 నరుని జీవితం పరిమితం.
దేవా, నరుని మాసాల సంఖ్య నీవు నిర్ణయం చేశావు.
నరుడు మార్చజాలని హద్దులు నీవు ఉంచావు.
6 కనుక దేవా, నరునికి దూరంగా చూడు. వానిని ఒంటరిగా విడిచిపెట్టు.
అతని కాలం తీరేవరకు అతని కష్టజీవితం అతణ్ణి అనుభవించనివ్వు.
7 “అయితే ఒక చెట్టుకు నీరీక్షణ ఉంది.
దాన్ని నరికివేస్తే, అది మరల పెరుగుతుంది.
అది కొత్త కొమ్మలు వేస్తూనే ఉంటుంది.
8 భూమిలో దాని వేర్లు పాతవైపోవచ్చును.
దాని మొద్దు మట్టిలో చీకిపోవచ్చును.
9 కానీ నీళ్లు ఉంటే అది కొత్త చిగుళ్లు వేస్తుంది.
మొక్కల్లా అది కొమ్మలు వేస్తుంది.
10 అయితే మనిషి మరణిస్తాడు.
అతని శరీరం పాతి పెట్టబడుతుంది. మనిషి చనిపోయినప్పుడు, అతుడు వెళ్లిపోయాడు.
11 సముద్రంలో నీరు ఇంకిపోయినట్టు,
ఒక నది నీరు ఎండిపోయినట్టు
12 సరిగ్గా అదే విధంగా ఒక వ్యక్తి మరణించినప్పుడు,
అతడు పండుకొని, మళ్లీ లేవలేడు.
మరణించే మనుష్యులు, ఆకాశాలు ఉండకుండా పోయేంత వరకు
మేల్కొనరు, నిద్రించటం మానుకోరు.
13 “నీవు నన్ను నా సమాధిలో దాచిపెడితే బాగుండునని నా (యోబు) ఆశ.
నీ కోపం పోయేవరకు, నీవు నన్ను అక్కడ దాచిపెడితే బాగుండుననిపిస్తుంది నాకు.
అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనేందుకు నీవు ఒక సమయాన్ని ఏర్పరచుకోవచ్చు
14 ఒక మనిషి మరణిస్తే, అతడు మరల బ్రతుకుతాడా?
నేను వేచి ఉంటాను, నేను విడుదల అయ్యేంత వరకు కష్టపడి పోరాడుతాను.
శ్రమ భావం
3 నేను కష్టాలు అనుభవించిన వ్యక్తిని.
యెహోవా కోపపు కర్ర క్రింద నేను సంకట పరిస్థితులు చూశాను.
2 యెహోవా నన్ను చీకటిలోకి
నడపించాడేగాని వెలుగులోకి కాదు.
3 యెహోవా తన చేతిని నా మీదకి ఎత్తాడు.
రోజంతా పదే పదే ఆయన అలా చేశాడు.
4 ఆయన నా మాంసం, నా చర్మం కృశింపజేశాడు.
ఆయన నా ఎముకలు విరుగగొట్టాడు.
5 యెహోవా నా పైకి కష్టాలను, వేదనను రప్పించాడు.
ఆయన నాచుట్టూ విషాన్ని, సంకట పరిస్థితిని కలుగచేశాడు.
6 ఆయన నన్ను చీకటిలో కూర్చునేలా చేశాడు.
ఏనాడో చనిపోయిన వ్యక్తిలా నన్ను ఆయన చేశాడు.
7 యెహోవా నన్ను బయటకు రాకుండా బంధించాడు.
ఆయన నాకు బరువైన గొలుసులు తగిలించాడు.
8 సహాయం కొరకు నేను మొర్ర పెట్టుకుని అర్థించినా,
యెహోవా నా ప్రార్థన ఆలకించలేదు.
9 ఆయన నా మార్గాన్ని రాళ్లతో అడ్డగించాడు.
ఆయన నా మార్గాన్ని వక్రంగా, గతుకులమయం చేశాడు.
19 ఓ యెహోవా, నా దుఃఖాన్ని,
నేను నా నివాసాన్ని కోల్పోయిన తీరును గుర్తుపెట్టుకొనుము.
నీవు నాకిచ్చిన చేదుపానీయాన్ని, విషం (శిక్ష) కలిపిన పానీయాలను జ్ఞాపకం పెట్టుకొనుము.
20 నా కష్టాలన్నీ నాకు బాగా జ్ఞాపకం ఉన్నాయి.
నేను మిక్కిలి విచారిస్తున్నాను.
21 కాని నేను మరలా ఆలోచించగా నాకు కొంత ఆశ పొడచూపింది.
నేను ఇలా అనుకున్నాను.
22 యెహోవా యొక్క ప్రేమ, దయ అంతంలేనివి.
యెహోవా కృపా కటాక్షాలు తరగనివి.
23 అవి నిత్య నూతనాలు.
ఓ యెహోవా, నీ విశ్వసనీయత గొప్పది.
24 “యెహోవా నా దేవుడు.
అందువల్లనే నాకీ ఆశ పొడచూపింది,” అని నేను అనుకున్నాను.
సంగీత నాయకునికి: దావీదు కీర్తన.
31 యెహోవా, నీవే నా కాపుదల.
నన్ను నిరాశపరచవద్దు.
నా మీద దయ ఉంచి, నన్ను రక్షించుము.
2 దేవా, నా మాట ఆలకించుము.
వేగంగా వచ్చి నన్ను రక్షించి
నా బండగా ఉండుము. నా క్షేమస్థానంగా ఉండుము.
నా కోటగా ఉండుము. నన్ను కాపాడుము.
3 దేవా, నీవే నా బండవు, కోటవు
కనుక నీ నామ ఘనత కోసం నన్ను నడిపించుము, నాకు దారి చూపించుము.
4 నా శత్రువులు నా ఎదుట ఉచ్చు ఉంచారు.
వారి ఉచ్చు (వల) నుండి నన్ను రక్షించుము. నీవే నా క్షేమస్థానం.
15 నా ప్రాణం నీ చేతుల్లో ఉంది.
నా శత్రువుల నుండి నన్ను రక్షించుము. నన్ను తరుముతున్న మనుష్యుల నుండి నన్ను రక్షించుము.
16 దేవా, నీ సేవకునికి దయతో స్వాగతం పలుకుము.
నన్ను రక్షించుము.
మారిన జీవితాలు
4 క్రీస్తు శారీరకమైన బాధననుభవించాడు గనుక మీరు కూడా ఆ గుణాన్ని ఆయుధంగా ధరించండి. 2 ఎందుకంటే శారీరకమైన బాధననుభవించే వ్యక్తి తన మిగతా భౌతిక జీవితాన్ని, మానవులు కోరే దురాశల్ని తీర్చుకోవటానికి ఉపయోగించకుండా దైవేచ్ఛ కోసం ఉపయోగిస్తాడు. అలాంటివానికి పాపంతో సంబంధముండదు. 3 గతంలో మీరు యూదులుకాని వాళ్ళవలే పోకిరి చేష్టలకు, దురాశకు, త్రాగుడుకు, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుడు విందులకు, చేయతగని విగ్రహారాధనలకులోనై జీవించారు. వారి ఇష్టము నెరవేర్చుచుండుటకు గడచిన కాలమే చాలును.
4 కాని ప్రస్తుతం మీరు వాళ్ళవలె మితిమీరిన దుష్ప్రవర్తనకు లోనై వాళ్ళతో సహ పరుగెత్తనందుకు, వాళ్ళు ఆశ్చర్యపడి మిమ్మల్ని దూషిస్తున్నారు. 5 అయితే చనిపోయినవాళ్ళ మీద బ్రతికియున్నవాళ్ళ మీద, తీర్పు చెప్పే ఆ దేవునికి వాళ్ళు సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది. 6 ఈ కారణంగానే సువార్త ఇప్పుడు చనిపోయినవాళ్ళకు కూడా ప్రకటింపబడింది. వాళ్ళు కూడా ఆధ్యాత్మికంగా జీవించాలని దేవుడు మానవులపై తీర్పుచెప్పినట్లుగానే వాళ్ళమీద కూడా తీర్పు చెపుతాడు.
దేవుని వరాలకు మంచి నిర్వాహకులుగా ఉండండి
7 అన్నీ అంతమయ్యే సమయం దగ్గరకు వచ్చింది. అందువల్ల స్థిరబుద్ధితో, ఆత్మనిగ్రహంతో ఉండండి. అప్పుడే మీరు ప్రార్థించ గలుగుతారు. 8 అన్నిటికన్నా ముఖ్యంగా, “ప్రేమ” పాపాలన్నిటినీ కప్పివేస్తుంది గనుక పరస్పరం హృదయపూర్వకంగా ప్రేమించుకోండి.
యేసును సమాధి చేయటం
(మార్కు 15:42-47; లూకా 23:50-56; యోహాను 19:38-42)
57 సాయంత్రం అయ్యింది. యోసేపు అనే ధనవంతుడు అరిమతయియ గ్రామం నుండి వచ్చాడు. యోసేపు కూడా యేసు శిష్యుల్లో ఒకడు. 58 అతడు పిలాతు దగ్గరకు వెళ్ళి యేసు దేహాన్ని యివ్వమని కోరాడు. పిలాతు యివ్వమని ఆజ్ఞాపించాడు. 59 యోసేపు ఆ దేహాన్ని తీసుకొని ఒక క్రొత్త గుడ్డలో చుట్టాడు. 60 ఒక పెద్ద రాయిని తొలిచి తన కోసం నిర్మించుకొన్న క్రొత్త సమాధిలో దాన్ని ఉంచాడు. ఒక రాయిని ఆ సమాధి ద్వారానికి అడ్డంగా దొర్లించి వెళ్ళిపొయాడు. 61 మగ్దలేనే మరియ, యింకొక మరియ ఆ సమాధికి ఎదురుగా అక్కడే కూర్చొని ఉన్నారు.
సమాధిని కాపలా కాయటం
62 అది విశ్రాంతికి సిద్ధమయ్యే రోజు. మరుసటి రోజు పరిసయ్యులు పిలాతు సమక్షంలో సమావేశమయ్యారు, 63 “అయ్యా! ఆ మోసగాడు బ్రతికి ఉండగా ‘మూడు రోజుల్లో నేను తిరిగి బ్రతికి వస్తాను’ అని అనటం మాకు జ్ఞాపకం ఉంది. 64 అందువల్ల మూడవ రోజు వరకు ఆ సమాధిని జాగ్రత్తగా కాపలా కాయమని ఆజ్ఞాపించండి. అలా చెయ్యకపోతే అతని శిష్యులు వచ్చి అతని దేహాన్ని దొంగిలించి, ‘అతడు బ్రతికాడు’ అని ప్రజలతో చెప్పవచ్చు. ఈ చివరి మోసం మొదటి మోసం కన్నా ఘోరంగా ఉంటుంది” అని అన్నారు.
65 పిలాతు, “భటుల్ని తీసుకు వెళ్ళండి. వాళ్ళు సమాధిని జాగ్రత్తగా కాపలా కాయటం మీ బాధ్యత” అని చెప్పాడు. 66 వాళ్ళు వెళ్ళి రాతికి ముద్రవేసి భటుల్ని ఆ సమాధికి కాపలా ఉంచి దాన్ని భద్రం చేసారు.
యేసును సమాధి చేయటం
(మత్తయి 27:57-61; మార్కు 15:42-47; లూకా 23:50-56)
38 ఆ తర్వాత “అరిమతయియ” గ్రామానికి చెందిన యోసేపు, యేసు దేహాన్నివ్వమని పిలాతును అడిగాడు. యోసేపు యూదులంటే భయపడేవాడు. కనుక రహస్యంగా యేసు శిష్యుడైనాడు. పిలాతు అంగీకారం పొంది అతడు యేసు దేహాన్ని తీసుకు వెళ్ళాడు.
39 అతని వెంట “నీకొదేము” కూడా ఉన్నాడు. క్రితంలో ఒక నాటి రాత్రి యేసును కులుసుకున్న వాడు యితడే. ఇతడు ముప్పై అయిదు కిలోలబోళం, అగరుల మిశ్రమాన్ని తన వెంట తీసుకు వచ్చాడు. 40 వాళ్ళిద్దరూ కలిసి యేసు దేహాన్ని సుగంధ ద్రవ్యాల్లో ఉంచి, దాన్ని నారగుడ్డలో చుట్టారు. ఇలా చెయ్యటం యూదుల సాంప్రదాయం. 41 యేసును సిలువకు వేసిన చోట ఒక తోట ఉంది. ఆ తోటలో ఒక కొత్త సమాధిఉంది. ఆ సమాధిలో అంతవరకు ఎవర్నీ ఉంచలేదు. 42 అది యూదులు పండుగకు సిద్ధం అవ్వ బోయే రోజు. పైగా ఆ సమాధి సిలువకు సమీపంలో ఉంది. కనుక వాళ్ళు ఆయన దేహాన్ని ఆ సమాధిలో ఉంచారు.
© 1997 Bible League International