Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
యెషయా 50:4-9

దేవుని సేవకుడు దేవుని మీద ఆధారపడతాడు

ఉపదేశం చేయగల సామర్థ్యాన్ని నా ప్రభువైన యెహోవా నాకు ఇచ్చాడు. కనుక ఈ విచారగ్రస్థ ప్రజలకు ఇప్పుడు నేను ఉపదేశము చేస్తాను. ప్రతి ఉదయం ఆయన నన్ను మేల్కొలిపి, ఒక విద్యార్థిలా నాకు ఉపదేశిస్తాడు. నేను నేర్చుకొనేందుకు నా ప్రభువైన యెహోవా నాకు సహాయం చేస్తాడు. మరియు నేను ఆయన మీద తిరుగబడలేదు. నేను ఆయనను వెంబడించటం మానను. నేను ఆ ప్రజల్ని నన్ను కొట్టనిస్తాను. వాళ్లను నా గడ్డం పీకనిస్తాను. వాళ్లు నన్ను చెడ్డ మాటలు తిట్టి, నా మీద ఉమ్మి వేసినప్పుడు నేను నా ముఖం దాచుకోను. నా ప్రభువైన యెహోవా నాకు సహాయం చేస్తాడు. కనుక వారు చెప్పే చెడ్డ మాటలు నాకు హాని కలిగించవు. నేను బలవంతుడనై ఉంటాను. నేను నిరాశ చెందనని నాకు తెలుసు.

యెహోవా నాతో ఉన్నాడు. నేను నిర్దోషినని ఆయనకు తెలుసును. కనుక నేను దోషినని ఎవరూ చూపించలేరు. నాదే తప్పు అని ఎవరైనా రుజువు చేయాలనుకొంటే, ఆ వ్యక్తి నా దగ్గరకు రావాలి. మేము ఒక తీర్పు జరిగిస్తాం. అయితే చూడండి, నా ప్రభువైన యెహోవా నాకు సహాయం చేస్తాడు. అందుచేత నేను చెడ్డవాడినని ఎవ్వరూ చూపించలేరు. అలాంటి వాళ్లంతా పనికిమాలిన గుడ్డల్లా అవుతారు. వాటిని చెదలు తినేస్తాయి.

కీర్తనలు. 70

సంగీత నాయకునికి: ప్రజలు జ్ఞాపకం చేసికొనేందుకు సహాయంగా దావీదు కీర్తన.

70 దేవా, నన్ను రక్షించుము.
    దేవా త్వరపడి నాకు సహాయం చేయుము.
మనుష్యులు నన్ను చంపుటకు ప్రయత్నిస్తున్నారు.
    వారిని నిరాశపరచుము.
    వారిని అవమానించుము.
మనుష్యులు నాకు చెడు కార్యాలు చేయాలని కోరుతున్నారు.
    వారు పడిపోయి సిగ్గు అనుభవిస్తారని నా నిరీక్షణ.
మనుష్యులు నన్ను హేళన చేసారు.
    వారికి తగినదాన్ని పొందుతారని నా నిరీక్షణ.
నిన్ను ఆరాధించే ప్రజలంతా ఎంతో సంతోషంగా ఉన్నారని నేను ఆశిస్తున్నాను.
నీ మూలంగా రక్షించబడుటకు ఇష్టపడే మనుష్యులు ఎల్లప్పుడూ నిన్ను స్తుతించగలుగుతారు.

నేను నిరుపేదను, నిస్సహాయుణ్ణి.
    దేవా, త్వరపడి! వచ్చి నన్ను రక్షించుము.
దేవా, నన్ను తప్పించగలవాడవు నీవు ఒక్కడవు మాత్రమే.
    ఆలస్యం చేయవద్దు!

హెబ్రీయులకు 12:1-3

కుమారులు, క్రమశిక్షణ

12 అందువల్ల మన పక్షాన కూడా ఇందరు సాక్షులున్నారు గనుక మన దారికి అడ్డం వచ్చిన వాటన్నిటిని తీసిపారవేద్దాం. మనల్ని అంటుకొంటున్న పాపాల్ని వదిలించుకొందాం. మనం పరుగెత్తవలసిన పరుగు పందెంలో పట్టుదలతో పరుగెడదాం. మన దృష్టిని యేసుపై ఉంచుదాం. మనలో విశ్వాసం పుట్టించినవాడు, ఆ విశ్వాసంతో పరిపూర్ణత కలుగ చేయువాడు ఆయనే. తనకు లభింపనున్న ఆనందం కోసం ఆయన సిలువను భరించాడు. సిలువను భరించినప్పుడు కలిగిన అవమానాల్ని ఆయన లెక్క చెయ్యలేదు. ఇప్పుడాయన దేవుని సింహాసనానికి కుడివైపున కూర్చొని ఉన్నాడు. పాపాత్ములు తనపట్ల కనబరచిన ద్వేషాన్ని ఆయన ఏ విధంగా సహించాడో జాగ్రత్తగా గమనించండి. అప్పుడు మీరు అలిసిపోకుండా, ధైర్యం కోల్పోకుండా ఉంటారు.

యోహాను 13:21-32

యేసు వంచకుని గురించి మాట్లాడటం

(మత్తయి 26:20-25; మార్కు 14:17-21; లూకా 22:21-23)

21 యేసు మాట్లాడటం ముగించాడు. ఆయన మనస్సుకు చాలా వేదన కలిగింది. ఆయన, “ఇది నిజం. మీలో ఒకడు నాకు ద్రోహం చేస్తాడు” అని అన్నాడు.

22 ఆయన శిష్యులు, ఆయన ఎవర్ని గురించి అంటున్నాడో తెలుసుకోలేక ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. 23 యేసు ప్రేమించిన శిష్యుల్లో ఒకడు యేసు ప్రక్కనే కూర్చొని ఉన్నాడు. 24 సీమోను పేతురు ఆ శిష్యునితో, “ఎవర్ని గురించి అంటున్నాడో అడుగు” అని సంజ్ఞ చేసాడు.

25 అతడు యేసుకు దగ్గరగా ఒరిగి, “ప్రభూ! ఎవరు!” అని అడిగాడు.

26 యేసు, “నేనీ రొట్టె ముక్కను పాత్రలో ముంచి ఎవరికిస్తానో వాడే!” అని సమాధానం చెప్పాడు. తదుపరి రొట్టెముక్కను పాత్రలో ముంచి సీమోను కుమారుడైన ఇస్కరియోతు యూదాకు యిచ్చాడు. 27 రొట్టె తీసుకొన్న వెంటనే సైతాను వానిలోకి ప్రవేశించాడు. యేసు వానితో, “నీవు చేయబోయేదేదో త్వరగా చెయ్యి” అని అన్నాడు. 28 కాని, భోజనానికి కూర్చున్న వాళ్ళకెవ్వరికీ యేసు ఆ విధంగా ఎందు కంటున్నాడో అర్థం కాలేదు. 29 డబ్బు యూదా ఆధీనంలో ఉండేది. కాబట్టి పండుగకు కావలసినవి కొని తెమ్మంటున్నాడని కొందరనుకున్నారు. పేదలకు కొంత పంచి పెట్టమంటున్నాడని మరికొందరనుకున్నారు.

30 యూదా రొట్టె తీసుకొని వెంటనే బయటకు వెళ్ళిపోయాడు. అది రాత్రి సమయం.

యేసు తన మరణాన్ని గురించి మాట్లాడటం

31 యూదా వెళ్ళిపోయాక యేసు, “ఇప్పుడు మనుష్యకుమారుని మహిమ వ్యక్తమయింది. అలాగే ఆయనలో దేవుని మహిమ వ్యక్తమయింది. 32 దేవుడు అయన ద్వారా మహిమ పొందాక తన కుమారుణ్ణి తనలో ఐక్యం చేసికొని మహిమపరుస్తాడు. ఆలస్యం చేయడు” అని అన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International