Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 20

సంగీత నాయకునికి: దావీదు కీర్తన.

20 నీకు కష్టాలు కలిగినప్పుడు సహాయంకోసం నీవు చేసే ప్రార్థనకు యెహోవా నీకు జవాబు ఇచ్చును గాక.
    యాకోబు దేవుడు నీ పేరును ప్రసిద్ధి చేయును గాక.[a]
దేవుడు తన పవిత్ర స్థలం నుండి నీకు సహాయం పంపించునుగాక.
    సీయోను[b] నుండి ఆయన నిన్ను బలపర్చునుగాక!
నీవు అర్పించిన కానుకలు అన్నింటినీ దేవుడు జ్ఞాపకం చేసుకొనునుగాక.
    నీ బలి అర్పణలు అన్నింటిని ఆయన స్వీకరించును గాక.
నీకు నిజంగా కావల్సిన వాటిని దేవుడు నీకు అనుగ్రహించును గాక.
    నీ పథకాలన్నింటినీ ఆయన నెరవేర్చును గాక.
దేవుడు నీకు జయము నిచ్చినప్పుడు మనం సంతోషించుదుముగాక.
    దేవుని నామమునకు స్తోత్రము కలుగును గాక.
నీవు అడిగినది అంతా యెహోవా నీకు అనుగ్రహించును గాక.

ఇప్పుడు, యెహోవా ఏర్పాటు చేసుకొన్న రాజుకు ఆయనే సహాయం చేస్తాడని నాకు తెలుసు.
    దేవుడు తన పవిత్ర పరలోకంలో నుండి, ఆయన ఏర్పాటు చేసుకొన్న రాజుకు జవాబు ఇచ్చాడు.
    ఆ రాజును రక్షించుటకు దేవుడు. తన మహత్తర శక్తిని ప్రయోగించాడు.
కొందరు మనుష్యులు వారి రథాలను నమ్ముకొంటారు. మరికొందరు వారి గుర్రాలను నమ్ముకొంటారు.
    కాని మనం మన దేవుడైన యెహోవాను నమ్ముకొంటాము.
ఆ మనుష్యులు ఓడించబడ్డారు, వారు యుద్ధంలో మరణించారు.
    కాని మనం గెలిచాము! మనం విజయులముగా నిలిచాము!

దేవుడు రాజును రక్షించును గాక!
    మేము సహాయము కొరకు పిలుచునప్పుడు మాకు ఉత్తర మిమ్ము.

హబక్కూకు 3:2-15

యెహోవా, నిన్ను గూర్చిన వార్త విన్నాను.
    యెహోవా, పూర్వం నీవు చేసిన శక్తివంతమైన పనుల విషయంలో నేను విస్మయం చెందాను.
అట్టి గొప్ప పనులు మా కాలంలో జరిపించమని నేను నిన్ను వేడుకుంటున్నాను.
    ఆ పనులు మాకాలంలోనే జరిపించమని నేను ప్రార్థిస్తున్నాను.
కాని నీ ఆవేశంలో (ఉద్రేకం) మా పట్ల కరుణ చూపటం గుర్తుపెట్టుకొనుము.

దేవుడు తేమానులోనుండి వస్తున్నాడు.
    పరిశుద్ధుడు పారాను పర్వతం[a] మీది నుండి వస్తున్నాడు.

యెహోవా మహిమ ఆకాశాన్ని కప్పి వేసింది!
    ఆయన ప్రభావంతో భూమి నిండి పోయింది!
అది ప్రకాశమానమై మెరుస్తున్న వెలుగు. ఆయన చేతినుండి కాంతి కిరణాలు ప్రసరిస్తున్నాయి.
    అట్టి మహత్తర శక్తి ఆయన చేతిలో దాగివుంది.
వ్యాధి ఆయనకు ముందుగా వెళ్లింది.
    ఆయన వెనుక వినాశకారి అనుసరించి వెళ్లింది.
యెహోవా నిలుచుండి భూమికి తీర్పు తీర్చాడు.
    ఆయన అన్ని దేశాల ప్రజలవైవు చూశాడు.
    వారు భయంతో వణికి పోయారు.
అనాదిగా పర్వతాలు బలంగా నిలిచి ఉన్నాయి.
    కాని ఆ పర్వతాలు బద్దలై పోయాయి.
చాల పాత కొండలు పడిపోయాయి.
    దేవుడు ఎల్లప్పుడూ అలానే ఉంటాడు!

కుషాను (కూషీయుల) నగరాలలో ఆపద సంభవించటం నేను చూశాను.
    మిద్యాను దేశీయుల ఇండ్లు భయంతో కంపించాయి.
యెహోవా, నీవు నదులపట్ల కోపంగా ఉన్నావా?
    వాగులపట్ల నీవు కోపంగా ఉన్నావా? సముద్రంపట్ల నీవు కోపంగా ఉన్నావా?
నీవు నీ గుర్రాలను,
    రథాలను విజయానికి నడిపించినప్పుడు నీవు కోపంగా ఉన్నావా?

అప్పుడుకూడ నీ రంగుల కాంతిపుంజాన్ని (ఇంద్ర ధనుస్సును) నీవు చూపించావు. భూవాసులతో
    నీవు చేసుకున్న ఒడంబడికకు అది నిదర్శనం.

ఎండు భూమి నదులను విభజించింది.
10     పర్వతాలు నిన్ను చూచి వణికాయి.
నీరు నేల విడిచి పారుతున్నది. సముద్రపు నీటికి పట్టు తప్పినందున అది పెద్దగా ధ్వని చేసింది.
11 సూర్యుడు, చంద్రుడు వాటి కాంతిని కోల్పోయాయి.
    నీ దేదీప్యమానమైన మెరుపు కాంతులు చూడగానే అవి ప్రకాశించటం మానివేశాయి.
    ఆ మెరుపులు గాలిలో దూసుకుపోయే ఈటెలు, బాణాలవలె ఉన్నాయి.
12 నీవు కోపంతో భూమిపై నడిచి
    దేశాలను శిక్షించావు.
13 నీ ప్రజలను రక్షించటానికి నీవు వచ్చావు.
    అభిషేకం చేయబడిన నీ వ్యక్తిని రక్షించటానికి నీవు వచ్చావు.
ప్రతి చెడ్డ కుటుంబంలోనూ మొదట పుట్టిన వానిని నీవు చంపివేశావు.
    ఆ కుటుంబం దేశంలో అతి తక్కువదా,
    లేక అతి గొప్పదా అనే విభేదం నీవు చూపలేదు.

14 శత్రు సైనికులను ఆపటానికి నీవు
    మోషే చేతి కర్రను ఉపయోగించావు.
ఆ సైనికులు మామీద యుద్ధానికి
    పెనుతుఫానులా వచ్చారు.
రహస్యంగా ఒక పేదవాణ్ణి దోచుకున్నట్టు,
    వారు మమ్మల్ని తేలికగా ఓడించవచ్చనుకున్నారు.
15 కాని నీవు నీ గుర్రాలతో సముద్రంగుండా నడిచావు.
    ఆ మహా జలరాశిని దూరంగా దొర్లిపోయేలా చేశావు.

లూకా 18:31-34

యేసు తన మరణాన్ని గురించి మళ్ళీ మాట్లాడటం

(మత్తయి 20:17-19; మార్కు 10:32-34)

31 యేసు పన్నెండుమందిని ప్రక్కకు పిలుచుకు వెళ్ళి, “మనం యెరూషలేము వెళ్ళాలి. మనుష్యకుమారుణ్ణి గురించి ప్రవక్తలు వ్రాసినవన్నీ నిజం కాబోతున్నాయి. 32 ఆయన యూదులుకాని వాళ్ళకు అప్పగింపబడతాడు. వాళ్ళాయన్ని హేళన చేస్తారు. అవమానిస్తారు, ఆయనపై ఉమ్మి వేస్తారు, 33 కొరడా దెబ్బలు కొడతారు. చివరకు చంపివేస్తారు. మూడవ రోజు ఆయన బ్రతికి వస్తాడు” అని అన్నాడు. 34 శిష్యులకు ఆయన చెప్పింది ఏ మాత్రం అర్థం కాలేదు. ఆయన చెప్పిన దానిలో గూఢార్థం ఉంది. కాని వాళ్ళకది బోధపడలేదు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International