Revised Common Lectionary (Complementary)
సంగీత నాయకునికి: దావీదు కీర్తన.
20 నీకు కష్టాలు కలిగినప్పుడు సహాయంకోసం నీవు చేసే ప్రార్థనకు యెహోవా నీకు జవాబు ఇచ్చును గాక.
యాకోబు దేవుడు నీ పేరును ప్రసిద్ధి చేయును గాక.[a]
2 దేవుడు తన పవిత్ర స్థలం నుండి నీకు సహాయం పంపించునుగాక.
సీయోను[b] నుండి ఆయన నిన్ను బలపర్చునుగాక!
3 నీవు అర్పించిన కానుకలు అన్నింటినీ దేవుడు జ్ఞాపకం చేసుకొనునుగాక.
నీ బలి అర్పణలు అన్నింటిని ఆయన స్వీకరించును గాక.
4 నీకు నిజంగా కావల్సిన వాటిని దేవుడు నీకు అనుగ్రహించును గాక.
నీ పథకాలన్నింటినీ ఆయన నెరవేర్చును గాక.
5 దేవుడు నీకు జయము నిచ్చినప్పుడు మనం సంతోషించుదుముగాక.
దేవుని నామమునకు స్తోత్రము కలుగును గాక.
నీవు అడిగినది అంతా యెహోవా నీకు అనుగ్రహించును గాక.
6 ఇప్పుడు, యెహోవా ఏర్పాటు చేసుకొన్న రాజుకు ఆయనే సహాయం చేస్తాడని నాకు తెలుసు.
దేవుడు తన పవిత్ర పరలోకంలో నుండి, ఆయన ఏర్పాటు చేసుకొన్న రాజుకు జవాబు ఇచ్చాడు.
ఆ రాజును రక్షించుటకు దేవుడు. తన మహత్తర శక్తిని ప్రయోగించాడు.
7 కొందరు మనుష్యులు వారి రథాలను నమ్ముకొంటారు. మరికొందరు వారి గుర్రాలను నమ్ముకొంటారు.
కాని మనం మన దేవుడైన యెహోవాను నమ్ముకొంటాము.
8 ఆ మనుష్యులు ఓడించబడ్డారు, వారు యుద్ధంలో మరణించారు.
కాని మనం గెలిచాము! మనం విజయులముగా నిలిచాము!
9 దేవుడు రాజును రక్షించును గాక!
మేము సహాయము కొరకు పిలుచునప్పుడు మాకు ఉత్తర మిమ్ము.
పవిత్ర గుడారాన్ని మోషే నిలబెట్టాడు
40 అప్పుడు మోషేతో యెహోవా యిలా చెప్పాడు: 2 “మొదటి నెల మొదటి రోజున పవిత్ర గుడారాన్ని నిలబెట్టు. 3 ఒడంబడిక పెట్టెను సమావేశ పవిత్ర గుడారంలో పెట్టు. తెరతో ఆ పెట్టెను కప్పివేయి. 4 తర్వాత బల్లను లోపలికి తీసుకురా. బల్లమీద ఉండాల్సిన వస్తువులను దాని మీద ఉంచు. తర్వాత దీపస్తంభాన్ని గుడారంలో ఉంచు. 5 ధూపార్పణ కోసం బంగారపు వేదికను గుడారంలో పెట్టు, ఒడంబడిక పెట్టెకు ముందర ఈ వేదికను పెట్టు. తర్వాత పవిత్ర గుడారపు ప్రవేశానికి తెరవేయి.
6 “పవిత్ర గుడారపు (సన్నిధి గుడారం) ప్రవేశానికి ముందర దహనబలి అర్పణల పీఠాన్ని ఉంచు. 7 ఈ బలిపీఠానికి, సన్నిధి గుడారానికి మధ్య గంగాళం ఉంచు. గంగాళంలో నీళ్లు పోయాలి. 8 ఆవరణ చుట్టూ తెరలు తగిలించాలి. తర్వాత ఆవరణ ప్రవేశం దగ్గర తెరవేయాలి.
9 “అభిషేకతైలం ఉపయోగించి పవిత్ర గుడారాన్ని, అందులో ఉండే సమస్తాన్ని అభిషేకించు. ఈ వస్తువుల మీద నీవు తైలం పోసినప్పుడు వాటిని నీవు పవిత్రం చేస్తావు. 10 దహన బలులను దహించే బలిపీఠాన్ని, అభిషేకించు, బలిపీఠం మీద ఉండే సమస్తాన్నీ అభిషేకించు. ఆ బలిపీఠాన్ని నీవు పవిత్రం చేస్తావు. అది అతి పరిశుద్ధంగా ఉంటుంది. 11 తర్వాత గంగాళాన్ని, దాని కింద దిమ్మను అభిషేకించు. ఆ వస్తువులను పవిత్రం చేసేందుకు ఇలా చేయి.
12 “అహరోనును, అతని కుమారులను సన్నిధి గుడారం ప్రవేశం దగ్గరకు తీసుకురా. నీళ్లతో వాళ్లకు స్నానం చేయించాలి. 13 తర్వాత అహరోనుకు ప్రత్యేక వస్త్రాలను తొడిగించాలి. తైలంతో అతన్ని అభిషేకించి అతన్ని పవిత్రం చెయ్యి. అప్పుడే అతడు యాజకుడుగా సేవచేయగలడు. 14 తర్వాత అతని కుమారులకు వస్త్రాలు తొడిగించాలి. 15 వాళ్ల తండ్రిని నీవు అభిషేకించినట్టే కుమారులను కూడా అభిషేకించు. అప్పుడు వాళ్లు కూడా యాజకులుగా నా సేవ చేయగలరు. వాళ్లను నీవు అభిషేకించినప్పుడు వాళ్లు యాజకులవుతారు. రాబోయే కాలమంతా ఆ కుటుంబము యాజకులుగా కొనసాగుతారు.”
విశ్వాసాన్ని వదులుకోకండి
19 సోదరులారా! యేసు తన రక్తాన్ని అర్పించాడు. తద్వారా అతి పవిత్ర స్థానానికి వెళ్ళగలమనే విశ్వాసం మనలో కలిగింది. 20 ఆయన శరీరం ఒక తెరగా ఉంది. దాన్ని తొలగించి మనకోసం సజీవమైన నూతన మార్గాన్ని వేశాడు. 21 అంతేకాక, ఆ ప్రధాన యాజకుడు మన దేవాలయంపై అధికారిగా పనిచేస్తున్నాడు. 22 తప్పు చేసి బాధపడ్తున్న మన హృదయాలపై రక్తం ప్రోక్షింపబడింది. స్వచ్ఛమైన నీళ్ళతో మన దేహాలు పరిశుభ్రం చేయబడ్డాయి. ఇప్పుడిక మంచి హృదయాలతో, సంపూర్ణ విశ్వాసంతో దైవ సన్నిధిని చేరుకొందాం. 23 మనకు వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. అందువల్ల మనం బహిరంగంగా ప్రకటిస్తున్న విశ్వాసాన్ని విడవకుండా ధైర్యంతో ఉందాం.
ఒకరికొకరు సహాయం చేసుకొంటూ బలవంతులై యుండండి
24 ప్రేమిస్తూ మంచిపనులు చేస్తూ ఉండమని పరస్పరం ప్రోత్సాహపరుచుకొందాం. 25 సమావేశాలకు రాకుండా ఉండటం కొందరికి అలవాటు. కాని, మనం పరస్పరం కలుసుకొంటూ ఉందాం. ముఖ్యంగా ప్రభువు రానున్నదినం[a] సమీపిస్తోంది గనుక పరస్పరం ప్రోత్సాహపరచుకొంటూ ఉందాం.
© 1997 Bible League International