Revised Common Lectionary (Complementary)
సంగీత నాయకునికి: మాహలతు రాగంలో పాడదగిన దావీదు ధ్యానం.
53 తెలివి తక్కువ వాడు మాత్రమే దేవుడు లేడని తలుస్తాడు.
అలాంటి మనుష్యులు చెడిపోయిన వారు, చెడు విషయాలను చేస్తారు.
సరియైనదాన్ని చేసేవాడు ఒక్కడూ లేడు.
2 నిజంగా దేవుడు పరలోకంలో ఉండి మనల్ని చూస్తూ ఉన్నాడు.
దేవునికొరకు చూసే జ్ఞానంగలవాళ్లు ఎవరైనా ఉన్నారేమో అని
కనుగొనేందుకు దేవుడు చూస్తూ ఉన్నాడు.
3 కాని ప్రతి మనిషీ దేవునికి వ్యతిరేకంగా తిరిగి పోయాడు.
ప్రతి మనిషీ చెడ్డవాడే.
మంచి చేసేవాడు లేడు.
ఒక్కడూ లేడు.
4 దేవుడు చెబుతున్నాడు, “ఆ దుర్మార్గులకు సత్యం బాగా తెలుసు.
కాని వారు నన్ను ప్రార్థించరు.
ఆ దుర్మార్గులు వారి భోజనం తినటానికి ఎంత సిద్ధంగా ఉంటారో నా ప్రజలను నాశనం చేయటానికి కూడ అంత సిద్ధంగా ఉంటారు.”
5 కాని ఆ దుర్మార్గులు ఇంతకు ముందెన్నడూ
భయపడనంతగా భయపడిపోతారు.
ఆ దుర్మార్గులు ఇశ్రాయేలీయులకు శత్రువులు. దేవుడు ఆ దుర్మార్గులను నిరాకరించాడు.
కనుక మీరు వారిని ఓడిస్తారు.
దేవుడు మీ శత్రువుల ఎముకలను చెదరగొట్టేస్తాడు.
6 ఇశ్రాయేలు ప్రజలారా,
సీయోనుకు విజయాన్ని ఎవరిస్తారు?
దేవుడు తన ప్రజలను తిరిగి వర్ధిల్లజేసేటప్పుడు
యాకోబు సంతోషిస్తాడు.
ఇశ్రాయేలు బహుగా ఆనందిస్తాడు.
ప్రవక్తయొక్క విధవరాలైన భార్య ఎలీషాని సహాయం అడగటం
4 ప్రవక్తల బృందానికి చెందిన ఒకనికి భార్య ఉన్నది. అతడు మరణించాడు. అతని భార్య ఎలీషాతో, “నాభర్తకూడా నీకు ఒక సేవకుడు. ఇప్పుడు నా భర్త మరణించాడు. అతను యెహోవాని గౌరవించెనని నీకు తెలుసు. కాని అతను ఒక మనిషికి అప్పువుండెను. ఇప్పుడా వ్యక్తి నా ఇద్దరు కొడుకులను తీసుకు వెళ్లి వారిని తన బానిసులుగా చేసుకోవలెనని అనుకున్నాడు” అని విన్నవించింది.
2 “నేను నీకెలా సహాయం చేయగలను? మీ ఇంట్లో ఏమున్నదో చెప్పుము” అని ఎలీషా అడిగినాడు.
ఆమె, “మా ఇంట్లో ఏమీ లేదు. ఒలీవ నూనెగల ఒక జాడీ వున్నది” అని బదులు చెప్పింది.
3 అప్పుడు ఎలీషా, “వెళ్లి మీ ఇరుగు పొరుగు వారి వద్ద నుంచి పాత్రలు అడిగి తీసుకొనిరా. అవి ఖాళీగా ఉండాలి. చాలా పాత్రలు అడిగి తీసుకో. 4 తర్వాత మీ ఇంటికి పోయి తలుపులు మూసుకో. నీవు నీ కుమారులు మాత్రం ఇంటిలో వుండాలి. అటు తర్వాత నూనెను ఆ పాత్రలో పోయుము. వాటిని వేరే ఒక చోట ఉంచుము” అని చెప్పాడు.
5 అందువల్ల ఆ స్త్రీ ఎలీషాని విడిచి తన ఇంటిలోకి వెళ్లి తలుపులు మూసుకొనినది. ఆమెయు తన కొడుకులు మాత్రమే ఇంట్లో వున్నారు. ఆమె కుమారులు పాత్రలు తెచ్చారు. ఆమె వాటిలో నూనె పోసింది. 6 ఆమె చాలా పాత్రలు నింపింది. చివరికి, “మరొక పాత్ర తీసుకొని రమ్ము” అని తన కొడుకుతో చెప్పింది.
కాని అన్ని పాత్రలు నిండిపోయివున్నాయి. ఒక కుమారుడు ఆమెతో, “ఇక పాత్రలులేవు” అని చెప్పాడు. ఆ సమయంలో జాడీలోని నూనె కూడ పూర్తి అయింది.
7 ఏమి జరిగిందో, అప్పుడు ఆ స్త్రీ ఎలీషాతో చెప్పింది. ఎలీషా ఆమెతో అన్నాడు, “వెళ్లు, నూనెను అమ్మి నీ అప్పు తీర్చి వేయి. నీవు నూనెను అమ్మిన తర్వాత, నీ అప్పును తీర్చిన తర్వాత నీవు నీ కుమారులు మిగిలిన పైకంతో జీవించగలుగుతారు.”
యేసు ఐదువేల మందికి పైగా భోజనం పెట్టటం
(మత్తయి 14:13-21; మార్కు 6:30-44; యోహాను 6:1-14)
10 అపొస్తలులు తిరిగి వచ్చి తాము చేసినవన్నీ యేసుతో చెప్పారు. ఆ తర్వాత యేసు అపొస్తలులను ప్రజలకు దూరంగా బేత్సయిదా అనే పట్టణానికి తన వెంట తీసుకు వెళ్ళాడు. 11 ప్రజలకు ఈ విషయం తెలిసింది. వాళ్ళు యేసును చూడటానికి అక్కడికి కూడా వెళ్ళారు. ఆయన వాళ్ళను ఆహ్వానించి దేవుని రాజ్యాన్ని గురించి చెప్పి రోగాలున్న వాళ్ళకు నయం చేశాడు.
12 సూర్యాస్తమయమౌతుండగా ఆయన వద్దకు పన్నెండు మంది అపొస్తలులు వచ్చి, “మనం ఏ మూలో ఉన్నాం. ప్రజల్ని వెళ్ళమనండి. చుట్టూ ఉన్న పల్లెలకు, గ్రామాలకు వెళ్ళి ఆహారము, విశ్రమించటానికి స్థలం చూసుకొంటారు” అని అన్నారు.
13 యేసు వాళ్ళతో, “వాళ్ళు తినటానికి మీరేదైనా ఆహారం ఇవ్వండి” అని అన్నాడు.
వాళ్ళు, “మా దగ్గర అయిదు రొట్టెలు, రెండు చేపలు మాత్రమే ఉన్నాయి. మేము వెళ్ళి వీళ్ళందరికోసం ఆహారం కోనుక్కు రావాలని మీ ఉద్దేశ్యమా?” అని అన్నారు. 14 సుమారు ఐదువేలమంది పురుషులు అక్కడ ఉన్నారు.
కాని యేసు తన శిష్యులతో, “పంక్తికి యాభైమంది చొప్పున వాళ్ళను కూర్చో బెట్టండి” అని అన్నాడు.
15 శిష్యులు ఆయన చెప్పినట్లు చేసారు. వచ్చిన వాళ్ళందరూ కూర్చున్నారు. 16 యేసు ఆ ఐదు రొట్టెలు, రెండు చేపలు తీసుకొని ఆకాశం వైపు చూసి, దేవునికి కృతజ్ఞత చెప్పి వాటిని భాగాలు చేశాడు. వాటిని తన శిష్యులకిచ్చి ప్రజలకు పంచమన్నాడు. 17 అందరూ కడుపు నిండుగా తిన్నారు. ఆ తర్వాత శిష్యులు మిగిలిన ఆహారాన్ని పండ్రెండు గంపల నిండా నింపారు.
© 1997 Bible League International