Revised Common Lectionary (Complementary)
సంగీత నాయకునికి: మాహలతు రాగంలో పాడదగిన దావీదు ధ్యానం.
53 తెలివి తక్కువ వాడు మాత్రమే దేవుడు లేడని తలుస్తాడు.
అలాంటి మనుష్యులు చెడిపోయిన వారు, చెడు విషయాలను చేస్తారు.
సరియైనదాన్ని చేసేవాడు ఒక్కడూ లేడు.
2 నిజంగా దేవుడు పరలోకంలో ఉండి మనల్ని చూస్తూ ఉన్నాడు.
దేవునికొరకు చూసే జ్ఞానంగలవాళ్లు ఎవరైనా ఉన్నారేమో అని
కనుగొనేందుకు దేవుడు చూస్తూ ఉన్నాడు.
3 కాని ప్రతి మనిషీ దేవునికి వ్యతిరేకంగా తిరిగి పోయాడు.
ప్రతి మనిషీ చెడ్డవాడే.
మంచి చేసేవాడు లేడు.
ఒక్కడూ లేడు.
4 దేవుడు చెబుతున్నాడు, “ఆ దుర్మార్గులకు సత్యం బాగా తెలుసు.
కాని వారు నన్ను ప్రార్థించరు.
ఆ దుర్మార్గులు వారి భోజనం తినటానికి ఎంత సిద్ధంగా ఉంటారో నా ప్రజలను నాశనం చేయటానికి కూడ అంత సిద్ధంగా ఉంటారు.”
5 కాని ఆ దుర్మార్గులు ఇంతకు ముందెన్నడూ
భయపడనంతగా భయపడిపోతారు.
ఆ దుర్మార్గులు ఇశ్రాయేలీయులకు శత్రువులు. దేవుడు ఆ దుర్మార్గులను నిరాకరించాడు.
కనుక మీరు వారిని ఓడిస్తారు.
దేవుడు మీ శత్రువుల ఎముకలను చెదరగొట్టేస్తాడు.
6 ఇశ్రాయేలు ప్రజలారా,
సీయోనుకు విజయాన్ని ఎవరిస్తారు?
దేవుడు తన ప్రజలను తిరిగి వర్ధిల్లజేసేటప్పుడు
యాకోబు సంతోషిస్తాడు.
ఇశ్రాయేలు బహుగా ఆనందిస్తాడు.
ప్రాయశ్చిత్త దినం
26 మోషేతో యెహోవా చెప్పాడు, 27 “ఏడవ నెల పదవరోజు ప్రాయశ్చిత్త దినంగా ఉంటుంది. ఒక పవిత్ర సమావేశం ఉంటుంది. మీరు భోజనం చేయకూడదు, యెహోవాకు మీరు హోమ అర్పణ తీసుకొని రావాలి. 28 ఆ రోజున మీరు ఏ పని చేయకూడదు. ఎందుచేతనంటే అది ప్రాయశ్చిత్త దినం. ఆ రోజు, యాజకులు యెహోవా ఎదుటికి వెళ్లి, మిమ్మల్ని పవిత్రం చేసే ఆచారక్రమాన్ని జరిగిస్తారు.
29 “ఆ రోజున భోజనం చేయకుండా ఉండేందుకు ఎవరైనా తిరస్కరిస్తే, ఆ వ్యక్తిని తన ప్రజలనుండి వేరు చేయాలి. 30 ఆ రోజున ఎవరైనా పని చేస్తే ఆ వ్యక్తిని తన ప్రజల్లోనుంచి నేను నాశనం చేస్తాను. 31 మీరు అసలు ఏమీ పని చేయాకూడదు. మీరు ఎక్కడ నివసించినా ఈ ఆజ్ఞ శాశ్వతంగా కొనసాగుతుంది. 32 అది మీకు ఒక ప్రత్యేక విశ్రాంతి దినం. మీరు భోజనం చేయకూడదు. నెలలో తొమ్మిదవ రోజు తర్వాత సాయంకాలంనుండి ఈ ప్రత్యేక విశ్రాంతి దినం మీరు ప్రారంభించాలి. ఆ సాయంత్రంనుండి మర్నాటి సాయంకాలం వరకు ఈ ప్రత్యేక విశ్రాంతి దినం కొనసాగుతుంది.”
పర్ణశాలల పండుగ
33 మరల మోషేతో యెహోవా చెప్పాడు, 34 “ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు: ఏడవ నెల పదిహేనవ తేదీన పర్ణశాలల పండుగ. యెహోవాకు ఈ పండుగ ఏడు రోజులపాటు కొనసాగుతుంది. 35 మొదటి రోజున పవిత్ర సమావేశం ఉంటుంది. మీరు ఏ పనీ చేయకూడదు. 36 ఏడు రోజులు యెహోవాకు హోమార్పణలు మీరు అర్పించాలి. ఎనిమిదో రోజున మీకు మరో పవిత్ర సమావేశం జరుగుతుంది. మీరు యెహోవాకు హోమార్పణలు అర్పించాలి. ఇది పవిత్ర సమావేశంగా ఉంటుంది. మీరు ఏ పనీ చేయకూడదు.
37 “అవి యెహోవా ప్రత్యేక పండుగలు. ఆ పండుగల్లో పవిత్ర సమావేశాలు జరుగుతాయి. అర్పణలు, బలిఅర్పణలు, పానార్పణలు, దహనబలులు, ధాన్యార్పణలు మీరు యెహోవాకు తీసుకొని రావాల్సిన హోమార్పణలు. ఆ కానుకలు తగిన సమయంలో మీరు తీసుకొని రావాలి. 38 యెహోవా సబ్బాతు రోజులు జ్ఞాపకం చేసుకోవటంతోబాటు ఈ పండుగలన్నీ మీరు ఆచరించాలి. యెహోవాకు మీరు అర్పించే మీ ఇతర అర్పణలుగాక ఈ కానుకలు అర్పించాలి. మీ ప్రత్యేక వాగ్దానాల చెల్లింపుగా మీరు అర్పించే అర్పణలు గాక వీటిని మీరు అర్పించాలి. మీరు యెహోవాకు ఇవ్వాలనుకొన్న ప్రత్యేక అర్పణలుకాక ఇవి మీరు ఇవ్వాలి.
39 “ఏడవ నెల పదిహేనవ రోజున, దేశంలో మీరు పంటలు కూర్చుకొన్నప్పుడు, యెహోవా పండుగను ఏడు రోజుల పాటు మీరు ఆచరించాలి. మొదటి రోజున, ఏడో రోజున మీరు విశ్రాంతి తీసుకోవాలి. 40 మొదటి రోజు పండ్ల చెట్లనుండి మంచి పండ్లు మీరు కూర్చాలి. ఈత మట్టలు, గొంజి చెట్ల కొమ్మలు, కాలువల దగ్గరి నిరవంజి చెట్లు మీరు తీసుకోవాలి. మీ యెహోవా దేవుని ఎదుట ఏడు రోజులు మీరు పండుగ ఆచరించాలి. 41 ప్రతి సంవత్సరం ఏడు రోజులు యెహోవాకు పండుగగా మీరు దీనిని ఆచరించాలి. ఈ ఆజ్ఞ శాశ్వతంగా కొనసాగుతుంది. ఏడవ నెలలో మీరు ఈ పండుగను ఆచరించాలి.
దేవుణ్ణి స్తుతించండి
19 ఇది జరిగిన తర్వాత పరలోకంలో ఒక పెద్ద ప్రజాసమూహం మాట్లాడుతున్నట్లు నాకు ఒక స్వరం వినిపించి యిలా అన్నది:
“దేవుణ్ణి స్తుతించండి!
రక్షణ, మహిమ, అధికారం మన దేవునిదే.
2 ఆయన నీతిమంతుడు కనుక న్యాయంగా సత్యంగా తీర్పు చెబుతాడు.
తన వ్యభిచారంతో ప్రపంచాన్ని పాడు చేసిన
ఆ వేశ్యను ఆయన శిక్షించాడు.
తన సేవకుల రక్తానికి దానిపై కక్ష తీర్చుకొన్నాడు.”
3 వాళ్ళందరు మళ్ళీ, ఇలా అన్నారు:
“దేవుణ్ణి స్తుతించండి!
కాలిన ఆ మహానగరం నుండి పొగ ఆగకుండా మీదికి వెళ్తుంటుంది.”
4 ఆ యిరవై నాలుగు మంది పెద్దలు సాష్టాంగ పడి సింహాసనంపై కూర్చొన్న దేవుణ్ణి ఆరాధించారు. అదే విధంగా ఆ నాలుగు ప్రాణులు కూడా ఆరాధించాయి. వాళ్ళు ఇలా అన్నారు:
“ఆమేన్! దేవుణ్ణి స్తుతించండి!”
5 అప్పుడు సింహాసనం నుండి ఒక స్వరం యిలా అన్నది:
“ఆయన సేవకులైన మీరంతా, చిన్నా, పెద్దా అనే భేదం లేకుండా మన దేవుణ్ణి స్తుతించండి.
ఆయనకు భయపడే మీరంతా మన దేవుణ్ణి స్తుతించండి.”
6 ఆ తర్వాత నాకు ఒక ధ్వని వినిపించింది. ఆ ధ్వని పెద్ద ప్రజాసమూహం చేసిన ధ్వనిలా, జలపాతం చేసే ధ్వనిలా, పెద్ద ఉరుముల ధ్వనిలా ఉంది. వాళ్ళు యిలా అన్నారు:
“దేవుణ్ణి స్తుతించండి.
సర్వశక్తిసంపన్నుడు, మన ప్రభువు అయిన
దేవుడు మనల్ని పాలిస్తున్నాడు.
7 మనం ఆనందించుదాం. సంతోషంతో ఆయన్ని ఘనపర్చుదాం.
గొఱ్ఱెపిల్ల వివాహం కానున్నది.
ఆయన పెళ్ళి కూతురు తనకు తానే సిద్ధం అయింది.
8 సున్నితమైన నార బట్టలు ఆమె ధరించటానికి యివ్వబడ్డాయి.
అవి స్వచ్ఛంగా తెల్లగా ఉన్నాయి.”
(సున్నితమైన నారబట్టలు పవిత్రులు చేసిన నీతి పనులను సూచిస్తున్నాయి.)
© 1997 Bible League International