Revised Common Lectionary (Complementary)
దావీదు దైవధ్యాన కీర్తన.
32 పాపాలు క్షమించబడినవాడు ధన్యుడు.
తన పాపాలు తుడిచి వేయబడినవాడు ధన్యుడు.
2 అపరాధి అని యెహోవా చేత ప్రకటించబడనివాడు ధన్యుడు.
తన పాపాలను దాచిపెట్టేందుకు ప్రయత్నించనివాడు ధన్యుడు.
3 దేవా, నేను నీతో మరల మరల మాట్లాడాను.
కాని నా రహస్య పాపాలను గూర్చి నేను చెప్పలేదు.
నేను ప్రార్థించిన ప్రతిసారీ నేను బలహీనుడను మాత్రమే అయ్యాను.
4 దేవా, నీవు రాత్రింబవళ్లు నా జీవితాన్ని నాకు మరింత కష్టతరమైనదిగా చేశావు.
తీవ్రమైన వేసవిలో బాగా ఎండిపోయిన భూమిలా నేను తయారయ్యాను.
5 అయితే అప్పుడు నేను నా పాపాలన్నిటినీ యెహోవా దగ్గర ఒప్పుకోవాలని నిర్ణయించుకొన్నాను.
కనుక యెహోవా, నా పాపాలను గూర్చి నేను నీతో చెప్పుకొన్నాను.
నా దోషాన్ని ఏదీ నేను దాచిపెట్టలేదు.
మరియు నీవు నా పాపాలను క్షమించావు.
6 దేవా, ఈ కారణంచేత నీ అనుచరులు అందరూ నీకు ప్రార్థించాలి.
కష్టాలు మహా ప్రవాహంలా వచ్చినాసరే, నీ అనుచరులు నిన్ను ప్రార్థించాలి.
7 దేవా, నేను దాగుకొనేందుకు నీవే ఆశ్రయం.
నా కష్టాల నుండి నీవే నన్ను విడిపించుము.
నీవు నన్ను ఆవరించి, కాపాడుము.
నీవు నన్నురక్షించిన విధమును గూర్చి నేను పాటలు పాడతాను.
8 యెహోవా చెబతున్నాడు, “నీవు పోవాల్సిన మార్గం గూర్చి
నేను నీకు నేర్చించి, నడిపిస్తాను.
నేను నిన్ను కాపాడుతాను, నీకు మార్గదర్శిగా ఉంటాను.
9 కనుక గుర్రంలా, గాడిదలా తెలివి తక్కువగా ఉండకుము.
ఆ జంతువులు కళ్లెంతోను, వారుతోను నడిపించబడతాయి.
నీవు కళ్లెంను, వారును ఉపయోగిస్తే గాని ఆ జంతువులు నీ దగ్గరకు రావు.”
10 చెడ్డవాళ్లకు ఎన్నో బాధలు కలుగుతాయి.
కాని యెహోవాను నమ్ముకొనేవారిని ప్రేమ ఆవరిస్తుంది.
11 మంచి మనుష్యులారా, యెహోవాయందు ఆనందించండి, బాగుగా సంతోషించండి.
పవిత్ర హృదయాలుగల మనుష్యులారా మీరంతా ఆనందించండి.
7 అదే సమయంలో మోషేతో యెహోవా ఇలా అన్నాడు: “ఈ పర్వతం దిగి వెళ్లు. నీ ప్రజలు, ఈజిప్టు దేశం నుండి నీవు బయటకు తీసుకు వచ్చిన ప్రజలు భయంకర పాపం చేసారు. 8 వాళ్లు చేయాలని నేను ఆజ్ఞాపించిన సంగతుల నుండి వాళ్లు చాల త్వరగా తప్పి పోయారు. కరిగించిన బంగారంతో వాళ్లు ఒక దూడను చేసుకొన్నారు. వాళ్లు ఆ దూడను పూజిస్తూ దానికి బలులు చెల్లిస్తున్నారు. ‘ఇశ్రాయేలూ, ఈజిప్టు నుండి నిన్ను బయటకు రప్పించిన దేవుడు ఇదే, అని ప్రజలు చెప్పుకొనుచున్నారు.’”
9 “ఈ ప్రజలను నేను చూశాను. వీళ్లు ఎప్పుడూ నన్ను వ్యతిరేకించే మొండి ప్రజలని నాకు తెలుసు. 10 కనుక కోపంతో వాళ్లను నాశనం చేయనివ్వు, అప్పుడు నీలోనుండి ఒక జనాన్ని నేను తయారు చేస్తాను” అని మోషేతో యెహోవా అన్నాడు.
11 అయితే, మోషే తన దేవుడైన యెహవాను బ్రతిమాలుకొని: “ప్రభూ! నీ కోపం చేత నీ ప్రజలను నాశనం చేయకు. నీవే నీ మహాశక్తితో బలంతో ఈ ప్రజలను ఈజిప్టు నుండి తీసుకువచ్చావు. 12 అయితే, నీవే నీ ప్రజలను నాశనం చేస్తే, ‘యెహోవా తన ప్రజలకు చెడ్డకార్యాలను చేయాలని తలపెట్టాడు. అందుకే ఆయన వాళ్లను ఈజిప్టు నుండి బయటకు రప్పించాడు. పర్వతాల్లోనే వాళ్లను చంపాలని ఆయన అనుకున్నాడు. భూమి మీద తన ప్రజల్ని నాశనం చేయాలని ఆయన అనుకొంటున్నాడు’ అని ఈజిప్టు ప్రజలు చెప్పవచ్చు. కనుక నీ ప్రజల మీద కోపగించవద్దు. నీ కోపం విడిచిపెట్టేయి. నీ ప్రజల్ని నాశనం చేయకు. 13 నిన్ను సేవించిన మనుష్యులు అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలును (యాకోబు) జ్ఞాపకం చేసుకో. నీవు నీ పేరు ప్రయోగించి ఆ మనుష్యులకు వాగ్దానం చేసావు. ‘నీ ప్రజలను ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో అంతగా చేస్తాను. నేను వారికి వాగ్దానం చేసిన ఈ దేశం అంతా నీ ప్రజలకు ఇస్తాను. ఈ దేశం శాశ్వతంగా వారిదే అవుతుంది’ అని నీవు చెప్పావు.”
14 కనుక యెహోవా తన ప్రజలను గూర్చి సంతాపపడ్డాడు. ఆయన చేస్తానన్న కీడును వారికి చేయలేదు. అంటే, ప్రజలను ఆయన నాశనం చేయలేదు.
తప్పిపోయిన గొఱ్ఱె ఉపమానం
(మత్తయి 18:12-14)
15 ఒక రోజు పన్నులు వసూలు చేసే వాళ్ళు, పాపులు ఆయన చెప్పినవి వినటానికాయన చుట్టూ సమావేశమయ్యారు. 2 కాని పరిసయ్యులు, శాస్త్రులు, “ఇతడు పాపుల్ని పిలిచి వాళ్ళతో కలిసి తింటాడు” అని గొణిగారు.
3 అప్పుడు యేసు వాళ్ళకు ఈ ఉపమానం చెప్పాడు: 4 “మీలో ఒకని దగ్గర వంద గొఱ్ఱెలు ఉన్నాయనుకోండి. అందులో ఒక గొఱ్ఱె తప్పిపోతే అతడు తన తొంబది తొమ్మిది గొఱ్ఱెల్ని అక్కడ బయల్లో వదిలేసి ఆ తప్పిపోయిన గొఱ్ఱె దొరికేదాకా వెతకడా? 5 అది దొరికిన వెంటనే దాన్ని భుజాలపై మోసికొని ఆనందంతో 6 యింటికి వెళ్ళి తన స్నేహితుల్ని, ఇరుగు పొరుగు వాళ్ళను పిలిచి, ‘తప్పిపోయిన నా గొఱ్ఱె దొరికింది. మనమంతా ఆనందించుదాం’ అని అంటాడు. 7 నేను చెప్పేదేమిటంటే అదేవిధంగా మారుమనస్సు పొందనవసరం లేని తొంభైతొమ్మిది మంది నీతిమంతుల విషయంలో కలిగె ఆనందంకన్నా పాపం చేసిన ఒక్కడు మారుమనస్సు పొందితే పరలోకంలో ఉన్న వాళ్ళు ఎక్కువ ఆనందిస్తారు.
8 “ఒక స్త్రీ దగ్గర పది వెండి నాణాలు ఉన్నాయనుకోండి. అందులో ఒక నాణెం పోగొట్టుకొంటే ఆమె దీపం వెలిగించి యిల్లంతా వూడ్చి అది దొరికే దాకా జాగ్రత్తగా వెతకదా? 9 దొరికిన వెంటనే తన స్నేహితుల్ని, ఇరుగు పొరుగు వాళ్ళను పిలిచి పోగొట్టుకున్న నా నాణెం దొరికింది. మనమంతా ఆనందించుదాం! అని అంటుంది. 10 నేను చెప్పేదేమిటంటే అదే విధంగా ఒక పాపాత్ముడు మారుమనస్సు పొందితే దేవదూతలు ఆనందిస్తారు” అని అన్నాడు.
© 1997 Bible League International