Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 39

సంగీత నాయకునికి, యెదూతూనునకు: దావీదు కీర్తన.

39 “నేను జాగ్రత్తగా నడచుకొంటాను.
    నా నాలుకతో నన్ను పాపం చేయనివ్వను” అని నేను అన్నాను.
    నేను దుర్మార్గులకు సమీపంగా ఉన్నప్పుడు నేను నా నోరు మూసుకొంటాను.[a]

మాట్లాడుటకు నేను తిరస్కరించాను.
    నేనేమి చెప్పలేదు.
    కాని నేను నిజంగా తల్లడిల్లిపోయాను.
నాకు కోపం వచ్చింది.
    దీని విషయం నేను తలంచిన కొలది నాకు మరింత కోపం వచ్చింది.
    కనుక నేను ఏదో అన్నాను.

యెహోవా, నాకు ఏమి జరుగుతుందో చెప్పుము.
    నేను ఎన్నాళ్లు జీవిస్తానో నాకు చెప్పుము.
    నిజానికి నా జీవితం ఎంత కొద్దిపాటిదో నాకు చెప్పుము.
యెహోవా, నీవు నాకు కొద్దికాలం జీవితం మాత్రమే ఇచ్చావు.
    నా జీవితం నీ ఎదుట శూన్యం.
ప్రతి మనిషి యొక్క జీవితం ఒక మేఘంలాంటిది మాత్రమే. ఏ మనిషి శాశ్వతంగా జీవించడు.

మేము జీవించే జీవితం అద్దంలోని ప్రతిబింబం వంటిది.
    మా ప్రయాసలన్నియు వ్యర్థము. మేము సామగ్రి సమకూర్చుకొంటూనే ఉంటాము.
    కాని ఆ సామగ్రి ఎవరికి దొరుకుతుందో మాకు తెలియదు.

కనుక ప్రభూ, నాకు ఏమి ఆశ ఉంది?
    నీవే నా ఆశ.
యెహోవా, నేను చేసిన చెడు కార్యాలనుండి నీవు నన్ను రక్షిస్తావు.
    దేవునియందు నమ్మకము లేనివానిలా, వెర్రివాడిలా నన్ను యితరులు చూడకుండా నీవు చేస్తావు.
నేను నా నోరు తెరవను.
    నేను ఏమీ చెప్పను.
    యెహోవా, నీవు చేయవలసింది చేశావు.
10 దేవా, నన్ను శిక్షించటం మానివేయుము.
    నీ శిక్షవల్ల నేను అలసిపోయాను.
11 యెహోవా, తప్పు చేసినవారిని నీవు శిక్షించుము. ప్రజలు జీవించాల్సిన సరైన విధానాన్ని నీవు అలా నేర్పిస్తావు.
    వారికి ప్రియమైన దాన్ని చిమ్మటవలె నీవు నాశనం చేస్తావు.
    మా జీవితాలు అంతలోనే మాయమయ్యే మేఘంలా ఉన్నాయి.

12 యెహోవా, నా ప్రార్థన ఆలకించుము.
    నేను నీకు మొరపెట్టే మాటలు వినుము.
    నా కన్నీళ్లు తెలియనట్లు ఉండవద్దు.
నేను దాటిపోతున్న ఒక అతిథిని.
    నా పూర్వీకులందరిలాగే నేను కూడా ఒక బాటసారిని.
13 యెహోవా, నా వైపు చూడకుము. నేను చనిపోక ముందు నన్ను సంతోషంగా ఉండనిమ్ము.
    కొంచెంకాలంలో నేను ఉండకుండా పోతాను.

యిర్మీయా 11:1-17

ఒడంబడిక ఉల్లంఘన

11 ఈ వర్తమానం యిర్మీయాకు వచ్చింది. ఈ వర్తమానం యెహోవా వద్దనుండి వచ్చినదిః “యిర్మీయా, ఈ ఒడంబడికలోని మాటలను వినుము. యూదా ప్రజలకు వీటి విషయం తెలియజేయుము. యెరూషలేము నగర వాసులకు కూడా ఈ విషయాలు తెలియజేయుము. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పినది ఇది: ‘ఈ ఒడంబడికను అనుసరించని ప్రతి వానికి కీడు వాటిల్లుతుంది.’ నేను మీ పూర్వీకులతో చేసుకొన్న ఒడంబడిక విషయం మాట్లాడుతున్నాను. వారిని ఈజిప్టునుండి నేను తీసుకొని వచ్చినప్పుడు నేనా ఒడంబడికను వారితో చేసుకొన్నాను. ఈజిప్టు అనేక కష్టాలున్న స్థలము అది ఇనుము కూడా కరిగి పోయేటంత వేడిగల పొయ్యిలాఉంది. నాకు విధేయులై, నేనాజ్ఞాపించినదంతా చేయండని ఆ ప్రజలకు చెప్పాను. మీరిది చేస్తే, మీరు నా ప్రజలవుతారు. పైగా నేను మీ దేవుడనవుతాను.

“నేను మీ పూర్వీకులకు చేసిన వాగ్దానం నెరవేర్చటానికి నేనిది చేశాను. వారికి నేనొక సారవంతమైన భూమిని ప్రసాదిస్తానని వాగ్దానం చేశాను. పాలు, తేనెలు ప్రవహించే భూమిని ఇస్తానని అన్నాను. ఈనాడు మీరు ఆ రాజ్యంలో నివసిస్తున్నారు.”

నేను (యిర్మీయా) “ఆ ప్రకారమే జరగాలి ప్రభువా” అని అన్నాను.

నాతో యెహోవా ఇలా అన్నాడు: “యిర్మీయా, ఈ సమాచారం యూదా పట్టణాలలోను, యెరూషలేము వీధులలోను ప్రకటించుము: ఈ ఒడంబడిక నియమాలు వినండి. ఆ ఒడంబడికలోని న్యాయసూత్రాలను పాటించండి. ఈజిప్టునుండి విడుదల చేసి మీ పితరులను నేను తీసుకొని వచ్చినప్పుడు వారికి ఒక హెచ్చరిక చేశాను. ఈ రోజువరకూ వారికి పదే పదే హెచ్చరికలు చేస్తూనే వచ్చాను. నాకు విధేయులై వుండమని వారికి చెప్పాను. కాని మీ పూర్వీకులు నా మాట వినలేదు. వారు మొండివైఖరి దాల్చారు. వారి దుష్ట హృదయాలు ఎలా చెపితే అలా ప్రవర్తించారు. ఒడంబడిక ప్రకారం వారు దానిని అనుసరించకపోతే వారికి కీడు వాటిల్లుతుంది. అందువల్లనే వారికి కష్టాలు సంభవించేలా నేను చేశాను! ఒడంబడికకు కట్టుబడి ఉండమని వారికి నేను ఆజ్ఞ ఇచ్చాను. కాని వారు పాటించలేదు.”

నాతో యెహోవా ఇలా అన్నాడు: “యిర్మీయా! యూదా ప్రజలు, యెరూషలేము వాసులు రహస్య పథకాలు వేశారని నాకు తెలుసు. 10 ఆ ప్రజలు వారి పితరులు చేసిన పాపములన్నీ చేస్తున్నారు! వారి పూర్వీకులు నా వర్తమానం వినటానికి నిరాకరించారు. వారు అన్యదేవతలను అనుసరించి, ఆరాధించారు. ఇశ్రాయేలు వంశం వారు, యూదా వంశం వారు వారి పూర్వీకులతో నేను చేసిన ఒడంబడికను ఉల్లంఘించినారు.”

11 కావున యెహోవా ఇలా చెప్పినాడు, “త్వరలో యూదా వారికి భయంకర విపత్తు సంభవించేలా చేస్తాను. వారు దానినుండి తప్పించుకోలేరు! వారు దుఃఖపడతారు. వారు నా సహాయంకొరకు రోదిస్తారు. అయినా నేను వారి రోదన వినను. 12 అప్పుడు యూదా వారు, యెరూషలేము వాసులు తమ విగ్రహాలవద్దకు వెళ్లి సహాయం అర్థిస్తారు. వారు విగ్రహాలకు సాంబ్రాణి పొగ వేస్తారు. కాని ఆ విపత్కాలం వచ్చినప్పుడు ఆ విగ్రహాలు యూదా ప్రజలను ఆదుకోలేవు.

13 “యూదా ప్రజలారా, మీకు చాలా విగ్రహాలున్నాయి. యూదా రాజ్యంలో ఎన్ని పట్టణాలున్నాయో అన్ని విగ్రహాలు మీలో వున్నాయి. ఆ ఏహ్యమైన బయలు దేవతను ఆరాధించటానికి మీరు చాలా బలిపీఠములను నిర్మించారు. యోరూషలేములో ఎన్ని వీధులున్నాయో అన్ని బలిపీఠాలున్నాయి.

14 “యిర్మీయా, నీవు మాత్రం యూదా ప్రజల కొరకు ప్రార్థన చేయవద్దు. వారి కొరకు అర్థించవద్దు. వారి కొరకు నీవు చేసే ప్రార్థన నేను వినను. ఆ ప్రజలకు బాధలు మొదలవుతాయి. అప్పుడు సహాయం కొరకు నన్ను పిలుస్తారు. కాని నేను వినను.

15 “నా ప్రియురాలు (యూదా) నా ఇంట్లో (ఆలయం) ఎందుకు ఉన్నది?
    అక్కడ ఉండే హక్కు ఆమెకు లేదు. ఆమె చాలా చెడుపనులు చేసింది.
యూదా! నీవర్పించే ప్రత్యేక ప్రమాణాలు, బలులు నీవు నాశనంగాకుండా ఆపగలవని నీవనుకుంటున్నావా?
    నాకు బలులు అర్పించటం ద్వారా నీవు శిక్షనుండి తప్పించుకోగలవని తలుస్తున్నావా?”

16 యెహోవా నీకొక పేరు ఇచ్చాడు.
    “కంటికింపైన పచ్చని ఒలీవ చెట్టు” అని నిన్ను పిలిచాడు
కాని ఆ చెట్టును బలమైన గాలిచే విసరబడే అగ్నితో యెహోవా కాల్చివేస్తాడు.
    దాని కొమ్మలన్నీ బూడిదై పోతాయి.[a]
17 సర్వశక్తిమంతుడైన యెహోవా మిమ్ములను నాటి స్థిరపర్చినా
    కాని ఆయనే మీకు విపత్తు వస్తుందని ప్రకటించాడు.
ఎందువల్లనంటే, ఇశ్రాయేలు వంశం వారు,
    యూదా వంశం వారు చెడు కార్యాలు చేశారు.
మీరు బూటకపు దేవత బయలుకు బయట సమర్పించి
    యెహహోవాకు కోపం తెప్పించారు.

రోమీయులకు 2:1-11

దేవుని తీర్పు

ఇతర్లపై తీర్పు చెప్పే నీవు, ఏ సాకూ చెప్పలేని స్థితిలో ఉన్నావు. ఎందుకంటే ఏవిషయాల్లో నీవు ఇతర్లపై తీర్పు చెపుతున్నావో అవే పనులు నీవుకూడా చేస్తున్నావు. అందువల్ల నీకు నీవే శిక్ష విధించుకుంటున్నావు. దేవుడు అలాంటి దుర్మార్గపు పనులు చేస్తున్నవాళ్ళకు సత్యం ఆధారం మీద న్యాయమైన శిక్ష విధిస్తాడని మనకు తెలుసు. మిత్రమా! ఏ కారణాలవల్ల నీవు వాళ్ళపై తీర్పు చెపుతున్నావో అవే పనులు నీవు కూడా చేస్తున్నావు. మరి అలాంటప్పుడు దేవుని శిక్షను తప్పించుకోగలనని ఎలా అనుకుంటున్నావు? లేక, నీవు దేవుని అనంతమైన దయను, క్షమను, సహనాన్ని ద్వేషిస్తున్నావా? నీవు మారుమనస్సు పొందాలని దేవుడు నీపై దయచూపాడు. ఈ విషయం నీకు తెలియదా?

కాని, నీది కఠిన హృదయం. అది పశ్చాత్తాపం పొందదు. కనుక దేవుడు ఆగ్రహం చూపే రోజున నీకు లభింపనున్న శిక్షను స్వయంగా ఎక్కువ చేసుకొంటున్నావు. ఆరోజు న్యాయమైన తీర్పు నీకు వ్యక్తమౌతుంది. ఆ రోజు దేవుడు ప్రతి ఒక్కనికి అతడు చేసిన పనిని బట్టి ప్రతిఫలం ఇస్తాడు.(A) కొందరు ఎప్పుడూ మంచిపనులు చేస్తూ ఉంటారు. వాళ్ళు తేజస్సును, గౌరవాన్ని, నశించని దేహాన్ని పొందాలని ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకే దేవుడు అనంత జీవాన్నిస్తాడు. మరికొందరు సత్యాన్ని తృణీకరించి, చెడును అనుసరిస్తూ స్వార్థంతో జీవిస్తూ ఉంటారు. దేవుడు అలాంటివాళ్ళపై తన ఆగ్రహాన్ని తీవ్రంగా చూపుతాడు. చెడును చేసిన ప్రతి మనిషికి కష్టాలు, దుఃఖాలు సంభవిస్తాయి. అవి యూదులకు, తర్వాత ఇతరులకు కూడా సంభవిస్తాయి. 10 మంచి చేసిన ప్రతి ఒక్కనికి తేజస్సు, గౌరవము, శాంతి లభిస్తాయి. అవి మొదట యూదులకు తర్వాత ఇతరులకు కూడా లభిస్తాయి. 11 దేవుడు పక్షపాతం చూపడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International