Revised Common Lectionary (Complementary)
నిజంగా సంతృప్తిపరచే ఆహారం దేవుడు ఇస్తాడు
55 “దాహంతో ఉన్న ప్రజలారా
మీరంతా వచ్చి నీళ్లు త్రాగండి!
మీ వద్ద డబ్బు లేకపోతే చింతపడకండి.
రండి, మీకు తృప్తి కలిగేంతవరకు తినండి, త్రాగండి!
మీకు డబ్బు అవసరం లేదు.
మీకు తృప్తి కలిగేంతవరకు తినండి, త్రాగండి. ఆహారం, ద్రాక్షారసం ఉచితం!
2 నిజంగా ఆహారం కానిదానికోసం మీ ధనం వ్యర్థం చేయటం ఎందుకు?
మిమ్మల్ని నిజంగా సంతృప్తి పరచని దానికోసం మీరు ప్రయాసపడటం ఎందుకు?
నా మాట జాగ్రత్తగా వినండి, అప్పుడు మీరు మంచి ఆహారం భోజనం చేస్తారు.
మీ ఆత్మను తృప్తిపరచే ఆహారం మీరు భోజనం చేస్తారు.
3 నేను చెప్పే మాటలు జాగ్రత్తగా వినండి,
మీ ఆత్మలు జీవించునట్లుగా మీరు నా మాట వినండి. నా వద్దకు రండి!
శాశ్వతంగా కొనసాగే ఒడంబడిక నేను మీతో చేస్తాను.
అది నేను దావీదుతో చేసిన ఒడంబడికలా ఉంటుంది. దావీదు ఎడల శాశ్వతంగా దయగలిగి ఉంటానని నేను అతనికి వాగ్దానం చేసాను.
మరి మీరు ఆ వాగ్దానాన్ని నమ్ముకోవచ్చు.
4 రాజ్యాలన్నింటిలో నా శక్తికి దావీదును సాక్షిగా నేను చేశాను.
దావీదు అనేక రాజ్యాలకు పరిపాలకునిగాను, సర్వసేనానిగాను ఉంటాడని నేను అతనికి వాగ్దానం చేశాను.”
5 నీవు యెరుగని స్థలాల్లో రాజ్యాలు ఉన్నాయి,
కానీ ఆ రాజ్యాలను నీవు పిలుస్తావు.
ఆ రాజ్యాలకు నీవు తెలియదు.
కానీ అవి నీ దగ్గరకు పరుగెడతాయి.
నీ దేవుడు యెహోవా ఇలా కోరుతున్నాడు కనుక ఇది జరుగుతుంది.
ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు నిన్ను గౌరవిస్తున్నాడు. కనుక ఇది జరుగుతుంది.
6 కనుక సమయం మించిపోక ముందే
నీవు యెహోవా కోసం వెదకాలి.
ఆయన సమీపంగా ఉన్నప్పుడు,
ఇప్పుడే నీవు ఆయనను వేడుకోవాలి.
7 దుర్మార్గులు వారి దుర్మార్గ జీవితాలు విడిచిపెట్టాలి.
వారు తమ దురాలోచనలు నిలిపివేయాలి.
వారు తిరిగి యెహోవా దగ్గరకు రావాలి.
అప్పుడు యెహోవా వారిని ఆదరిస్తాడు.
మన దేవుడు క్షమిస్తాడు గనుక
ఆ మనుష్యులు యెహోవా దగ్గరకు రావాలి.
మనుష్యులు దేవుణ్ణి అర్థం చేసుకోలేరు
8 యెహోవా చెబుతున్నాడు, “మీ తలంపులు నా తలంపుల వంటివి కావు.
మీ మార్గాలు నా మార్గాలవంటివి కావు.
9 ఆకాశాలు భూమికంటె ఉన్నతంగా ఉన్నాయి.
అదే విధంగా మీ మార్గాలకంటె నా మార్గాలు ఉన్నతంగా ఉన్నాయి. మరియు మీ తలంపులకంటె నా తలంపులు ఉన్నతంగా ఉన్నాయి.”
యెహోవా తానే ఈ సంగతులు చెప్పాడు.
దావీదు కీర్తన. అతడు యూదా అరణ్యంలో ఉన్నప్పటిది.
63 దేవా, నీవు నా దేవుడవు.
నాకు నీవు ఎంతగానో కావాలి.
నా ఆత్మ, నా శరీరం నీళ్లులేక ఎండిపోయిన భూమిలా
నీకొరకు దాహంగొని ఉన్నాయి.
2 అవును, నీ ఆలయంలో నేను నిన్ను చూశాను.
నీ బలము నీ మహిమలను నేను చూశాను.
3 నీ ప్రేమ జీవం కన్నా గొప్పది.
నా పెదాలు నిన్ను స్తుతిస్తున్నాయి.
4 అవును, నా జీవితంలో నేను నిన్ను స్తుతిస్తాను.
నీ పేరట నేను నా చేతులెత్తి నీకు ప్రార్థిస్తాను.
5 శ్రేష్ఠమైన ఆహారం భుజించినట్లు నేను తృప్తిపొందుతాను.
నా నోరు నిన్ను స్తుతిస్తుంది.
6 నేను నా పడక మీద ఉండగా నిన్ను జ్ఞాపకం చేసుకొంటాను.
రాత్రి జాములలో నిన్ను నేను జ్ఞాపకం చేసుకొంటాను.
7 నీవు నిజంగా నాకు సహాయం చేశావు.
నీవు నన్ను కాపాడినందుకు నేను సంతోషిస్తున్నాను.
8 నా ఆత్మ నిన్ను హత్తుకొంటుంది.
నీ కుడిచెయ్యి నన్నెత్తి పట్టుకొంటుంది.
ఇశ్రాయేలు చరిత్ర నుండి హెచ్చరికలు
10 సోదరులారా! ఈ సత్యమును గ్రహించకుండా యుండుట నాకిష్టం లేదు. మన పూర్వికులు మేఘం క్రింద యుండిరి. సముద్రాన్ని చీల్చి ఏర్పరచబడిన దారి మీద వాళ్ళు నడిచి వెళ్ళారు. 2 వాళ్ళు మేఘంలో, సముద్రంలో బాప్తిస్మము పొందాక, మోషేలోనికి ఐక్యత పొందారు. 3 అందరూ ఒకే ఆత్మీయ ఆహారం తిన్నారు. 4 అందరూ ఒకే విధమైన ఆత్మీయ నీటిని త్రాగారు. ఈ నీటిని వాళ్ళ వెంటనున్న ఆత్మీయమైన బండ యిచ్చింది. ఆ బండ క్రీస్తే. 5 అయినా వాళ్ళలో కొందరు మాత్రమే దేవునికి నచ్చిన విధంగా జీవించారు. మిగతావాళ్ళు ఎడారిలో చనిపొయ్యారు.
6 వాళ్ళలా మనం చెడు చేయరాదని వారించటానికి ఇవి దృష్టాంతాలు. 7 కొందరు పూజించినట్లు మీరు విగ్రహాలను పూజించకండి. ధర్మశాస్త్రంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది: “ప్రజలు తిని, త్రాగటానికి కూర్చొన్నారు. లేచి నృత్యం చేసారు.”(A) 8 మనం వాళ్ళు చేసినట్లు వ్యభిచారం చేయరాదు. వ్యభిచారం చెయ్యటం వల్ల ఒక్క రోజులో వాళ్ళలో ఇరవై మూడు వేలమంది మరణించారు. 9 వాళ్ళు ప్రభువును శోధించిన విధంగా మనం శోధించరాదు. పరీక్షించిన వాళ్ళను పాములు చంపివేసాయి. 10 వాళ్ళవలె సణగకండి. సణగిన వాళ్ళను మరణదూత చంపివేశాడు.
11 మనకు దృష్టాంతముగా ఉండాలని వాళ్ళకు ఇవి సంభవించాయి. మనల్ని హెచ్చరించాలని అవి ధర్మశాస్త్రంలో వ్రాయబడ్డాయి. ఈ యుగాంతములో బ్రతుకుతున్న మనకు బుద్ధి కలుగుటకై ఇవి వ్రాయబడ్డాయి. 12 కనుక గట్టిగా నిలుచున్నానని భావిస్తున్నవాడు క్రింద పడకుండా జాగ్రత్త పడాలి. 13 మానవులకు సహజంగా సంభవించే పరీక్షలు తప్ప మీకు వేరే పరీక్షలు కలుగలేదు. దేవుడు నమ్మకస్థుడు. భరించగల పరీక్షలకన్నా, పెద్ద పరీక్షలు మీకు ఆయన కలుగనీయడు. అంతేకాక, పరీక్షా సమయం వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొని జయం పొందే మార్గం కూడా దేవుడు చూపుతాడు.
పాపాలు చెయ్యటం మానుకోండి
13 ఆ సమయంలో అక్కడున్న వాళ్ళలో కొందరు యేసుతో, “పిలాతు గలిలయ ప్రజల రక్తాన్ని బలి యిచ్చిన జంతువుల రక్తంతో కలిపాడని” చెప్పారు. 2 యేసు వాళ్ళకు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “ఈ విధంగా చనిపోయినందుకు వీళ్ళు యితర గలిలయ ప్రజలకంటే ఎక్కువ పాపం చేసారని మీ అభిప్రాయమా? 3 నేను కాదంటాను. మీరు వాళ్ళలా నాశనం కాకముందే మారుమనస్సు పొందండి. 4 గోపురం మీదపడి సిలోయములో చనిపోయిన ఆ పద్దెనిమిది మంది సంగతేమిటి? యెరూషలేములో నివసించే ఇతర ప్రజలకు కాకుండా వీళ్ళకు ఈ గతి పట్టటం సమంజసమని మీ అభిప్రాయమా? 5 నేను కాదంటాను. మీరు వాళ్ళలా నాశనం కాకముందే మారుమనస్సు పొందండి.”
పండ్లుకాయని అంజూరపు చెట్టు యొక్క ఉపమానం
6 ఆ తర్వాత యేసు ఈ ఉపమానం చెప్పాడు: “ఒకడు తన ద్రాక్షాతోటలో ఒక అంజూరపు చెట్టు నాటాడు. పండ్లు కోసం ఆ అంజూరపు చెట్టు దగ్గరకు వెళ్ళి అతడు తరచు చూస్తూవుండేవాడు. కాని అతనికి పండ్లు కనిపించలేదు. 7 అతడు తోటమాలితో, ‘ఈ చెట్టుకు పండ్లు కాస్తాయేమోనని మూడేళ్ళు చూసాను. కాని దానికి పండ్లు కాయలేదు. దాన్ని కొట్టేయి. అది అనవసరంగా భూమి సారాన్ని గుంజి వేస్తోంది’ అని అన్నాడు. 8 ఆ తోట మాలి, ‘అయ్యా! దీన్ని యింకొక సంవత్సరం వదిలెయ్యండి. నేను చుట్టూ పాదు త్రవ్వి ఎరువు వేస్తాను. 9 వచ్చే సంవత్సరం పంట కాస్తే, మంచిదే. కాయకపోతే అప్పుడు కొట్టి వేయవచ్చు’ అని అన్నాడు.”
© 1997 Bible League International