Revised Common Lectionary (Complementary)
దావీదు కీర్తన. అతడు యూదా అరణ్యంలో ఉన్నప్పటిది.
63 దేవా, నీవు నా దేవుడవు.
నాకు నీవు ఎంతగానో కావాలి.
నా ఆత్మ, నా శరీరం నీళ్లులేక ఎండిపోయిన భూమిలా
నీకొరకు దాహంగొని ఉన్నాయి.
2 అవును, నీ ఆలయంలో నేను నిన్ను చూశాను.
నీ బలము నీ మహిమలను నేను చూశాను.
3 నీ ప్రేమ జీవం కన్నా గొప్పది.
నా పెదాలు నిన్ను స్తుతిస్తున్నాయి.
4 అవును, నా జీవితంలో నేను నిన్ను స్తుతిస్తాను.
నీ పేరట నేను నా చేతులెత్తి నీకు ప్రార్థిస్తాను.
5 శ్రేష్ఠమైన ఆహారం భుజించినట్లు నేను తృప్తిపొందుతాను.
నా నోరు నిన్ను స్తుతిస్తుంది.
6 నేను నా పడక మీద ఉండగా నిన్ను జ్ఞాపకం చేసుకొంటాను.
రాత్రి జాములలో నిన్ను నేను జ్ఞాపకం చేసుకొంటాను.
7 నీవు నిజంగా నాకు సహాయం చేశావు.
నీవు నన్ను కాపాడినందుకు నేను సంతోషిస్తున్నాను.
8 నా ఆత్మ నిన్ను హత్తుకొంటుంది.
నీ కుడిచెయ్యి నన్నెత్తి పట్టుకొంటుంది.
19 అప్పుడు నెబుకద్నెజరు చాలా ఉగ్రుడయ్యాడు. షద్రకు, మేషాకు, అబేద్నెగోల వంక అతను చాలా కోపంగా చూశాడు. కొలిమి మామూలుకంటె ఏడు రెట్లు వేడిగా ఉండాలని అతను ఆజ్ఞాపించాడు. 20 తర్వాత నెబుకద్నెజరు తన సైన్యంలోని మహా బలాఢ్యులైన కొందరికి షద్రకు, మేషాకు, అబేద్నెగోలని బంధించి, వేడి కొలిమిలోకి తోసివేయుమని ఆజ్ఞాపించాడు.
21 అందువల్ల షద్రకు, మేషాకు, అబేద్నెగోలని బంధించి, వారిని వేడి కొలిమిలోకి తోసివేశారు. వాళ్లను మంటలోకి విసిరివేసినప్పుడు వారు తమ అంగీలు, పైవస్త్రాలు, తలపాగాలు మరియు ఇతర దుస్తులు ధరించారు. 22 రాజు చాలా ఉగ్రుడై ఉండటంవల్ల వారు కొలిమిని త్వరగా చాలా వేడి చేశారు. ఆ మంటలు ఎంత వేడిగా ఉన్నాయంటే, ఆ ముగ్గురిని మంటలో విసిరివేయడానికి మంట దగ్గరికి వెళ్లిన సైనికులు ఆ మంటలచేత వెంటనే కాలి చచ్చారు. 23 షద్రకు, మేషాకు, అబేద్నెగోలను గట్టిగా బంధించి అగ్నిగుండంలోకి త్రోసేశారు.
24 అప్పుడు జరిగింది చూసి నెబుకద్నెజరు ఆశ్చర్యపడ్డాడు. తన సలహాదారుల్ని పిలిచి, “మనం ముగ్గురినే బంధించి మంటల్లోకి త్రోసివేశాముగదా!” అని అడిగాడు.
“చిత్తం ప్రభూ” అని సలహాదారులు బదులు చెప్పారు.
25 “చూడండి! మంటల్లో నలుగురు నడుస్తున్నట్టు నేను చూస్తున్నాను. వారు బంధించబడినట్లుగాగాని, కాలిపోయినట్టుగాగాని లేరు. నాలుగవ వ్యక్తి దైవ కుమారునిగా కనిపిస్తున్నాడు” అని రాజు అన్నాడు.
26 తర్వాత నెబుకద్నెజరు వేడి కొలిమి వద్దకు వెళ్ళి, “అత్యున్నతుడైన దేవుని సేవకులైన షద్రకు, మేషాకు, అబేద్నెగోల్లారా! బయటికి రండి” అని పిలిచాడు.
అప్పుడు షద్రకు, మేషాకు, అబేద్నెగోలు మంటలనుండి వెలుపలికి వచ్చారు. 27 వారు వెలుపలికి రాగానే, పాలనాధికారులు, ఉన్నతాధికారులు, రాజుగారి సలహాదారులు వారిని చుట్టుముట్టారు. షద్రకు, మేషాకు, అబేద్నెగోలని మంటలు కాల్చలేదని, వారి దేహాలు ఏమీ కాలిపోలేదని, వారి వెంట్రుకలు కాలిపోలేదని, వారి బట్టలు కాలిపోలేదని, వాళ్ళమీద మంటల వాసనైనా లేదని వారు తెలుసుకొన్నారు.
28 తర్వాత నెబుకద్నెజరు ఇలా అన్నాడు: “నేను షద్రకు, మేషాకు, అబేద్నెగోల దేవుణ్ణి కీర్తిస్తున్నాను. వాళ్ల దేవుడు తన దూతను పంపించి తన సేవకుల్ని మంటలనుండి రక్షించాడు. ఈ వ్యక్తులు ముగ్గురు తమ దేవుని విశ్వసించారు. వారు నా ఆజ్ఞను ధిక్కరించి చనిపోవటానికిష్టపడ్డారు కాని, మరొక దేవుని కొలవడానికిగాని, పూజించుటకుగాని ఇష్టపడలేదు. 29 అందువల్ల నేనిప్పుడు ఈ ఆజ్ఞను ఇస్తున్నాను: ఏ దేశానికి చెందిన మనుష్యులుగాని, ఏ భాషకు చెందినవారుగాని, షద్రకు, మేషాకు, అబేద్నెగోల దేవునికి విరుద్ధంగా ఏమైనా చెప్పితే వారు ముక్కలుగా నరకబడతారు. ఆ వ్యక్తుల ఇళ్ళు పాడుదిబ్బలుగా నాశానం చేయబడతాయి. ఈ విధంగా ఏ ఇతర దేవుడుగాని తన మనుష్యులను రక్షించలేడు.” 30 ఆ తర్వాత షద్రకు, మేషాకు, అబేద్నెగోలకు రాజు బబులోను దేశంలో ఇంకా ముఖ్యమైన అధికారాలిచ్చాడు.
స్ముర్నలోని సంఘానికి
8 “స్ముర్నలోని క్రీస్తు సంఘానికి చెందిన దూతకు ఈ విధంగా వ్రాయి:
“ఆదియు, అంతము అయిన వాడు, చనిపోయి తిరిగి బ్రతికి వచ్చినవాడు ఈ విధంగా చెబుతున్నాడు:
9 “మీ దుఃఖాలను గురించి, మీ దారిద్ర్యాన్ని గురించి నాకు తెలుసు. అయినా మీరు భాగ్యవంతులు. మిమ్మల్ని గురించి కొందరు చెడుగా మాట్లాడుతున్నారు. వాళ్ళు తాము యూదులమని చెప్పుకొంటారు గాని నిజానికి వాళ్ళు యూదులు కారు. వాళ్ళు సాతాను సమాజానికి చెందినవాళ్ళు. 10 మీరు అనుభవించబోయే శ్రమలను గురించి భయపడకండి. సాతాను మీలో కొందరిని చెరసాలలో వేస్తాడు. మీరు పది రోజులు హింసను అనుభవిస్తారు. ఇది మీకొక పరీక్ష. మరణానికి కూడా భయపడకుండా విశ్వాసంతో ఉండండి. నేను మీకు జీవ కిరీటాన్ని యిస్తాను.
11 “ఆత్మ సంఘాలకు చెబుతున్న వాటిని ప్రతివాడు వినాలి. వీటిని జయించిన వాడు రెండవ మరణాన్నుండి తప్పించుకొంటాడు.
© 1997 Bible League International