Revised Common Lectionary (Complementary)
దావీదు ప్రార్థన.
17 యెహోవా, న్యాయంకోసం నా ప్రార్థన ఆలకించుము.
నా ప్రార్థనా గీతం వినుము.
యదార్థమైన నా ప్రార్థన వినుము.
2 యెహోవా, నన్ను గూర్చిన సరైన తీర్పు నీ దగ్గర్నుండే వస్తుంది.
నీవు సత్యాన్ని చూడగలవు.
3 నీవు నా హృదయాన్ని పరీక్షించుటుకు
దాన్ని లోతుగా చూశావు.
రాత్రి అంతా నీవు నాతో ఉన్నావు.
నీవు నన్ను ప్రశ్నించావు, నాలో తప్పేమి కనుగొన లేదు. నేనేమి చెడు తలపెట్టలేదు.
4 నీ ఆదేశాలకు విధేయుడనగుటకు
నేను మానవ పరంగా సాధ్యమైనంత కష్టపడి ప్రయత్నించాను.
5 నేను నీ మార్గాలు అనుసరించాను.
నీ జీవిత విధానంనుండి నా పాదాలు, ఎన్నడూ తొలగిపోలేదు.
6 దేవా, నేను నీకు మొరపెట్టినప్పుడెల్ల నీవు నాకు జవాబు యిచ్చావు.
కనుక ఇప్పుడు నా మాట వినుము.
7 ఆశ్చర్యమైన నీ ప్రేమను చూపించుము.
నీ ప్రక్కన కాపుదలను వెదకేవారిని వారి శత్రువులనుండి నీవు రక్షించుము.
నీ అనుచరులలో ఒకనిదైన ఈ ప్రార్థన వినుము.
8 నీ కంటిపాపవలె నన్ను కాపాడుము.
నీ రెక్కల నీడను నన్ను దాచిపెట్టుము.
9 యెహోవా, నన్ను నాశనం చేయాలని చూస్తున్న దుర్మార్గులనుండి నన్ను రక్షించుము.
నన్ను బాధించుటకు నా చుట్టూరా ఉండి ప్రయత్నిస్తున్న మనుష్యుల బారినుండి నన్ను కాపాడుము.
10 ఆ దుర్మార్గులు దేవుని మాట కూడ విననంతటి గర్విష్టులు అయ్యారు
మరియు వారిని గూర్చి వారు డంబాలు చెప్పుకొంటారు.
11 ఆ మనుష్యులు నన్ను తరిమారు.
ఇప్పుడు వాళ్లంతా నా చుట్టూరా ఉన్నారు.
నన్ను నేలకు పడగొట్టవలెనని వారు సిద్ధంగా ఉన్నారు.
12 చంపటానికి సిద్ధంగా ఉన్న సింహాలవలె ఉన్నారు ఆ దుర్మార్గులు.
వారు సింహాలవలె దాగుకొని మీద పడుటకు వేచియున్నారు.
13 యెహోవా, లెమ్ము, శత్రువు దగ్గరకు వెళ్లి వారు లొంగిపోయేటట్టుగా చేయుము.
నీ ఖడ్గాన్ని ప్రయోగించి, ఆ దుర్మార్గులనుండి నన్ను రక్షించుము.
14 యెహోవా, నీ శక్తిని ప్రయోగించి, సజీవుల దేశంలోనుండి ఆ దుర్మార్గులను తొలగించుము.
యెహోవా, నీ యొద్దకు అనేకులు సహాయం కోసం వస్తారు. వాళ్ళకు ఈ జీవితంలో ఏమీ లేదు. ఆ ప్రజలకు ఆహారం సమృద్ధిగా ఇచ్చి, వాళ్ల కడుపులను నింపుము.
ఆందువల్ల వారి పిల్లలు తినుటకు కూడా సమృద్ధిగా ఉంటుంది. దీనివల్ల వాళ్ల మనుమలు కూడా తినడానికి సమృద్ధిగా ఉంటుంది.
15 న్యాయం కోసం నేను ప్రార్థించాను. కనుక యెహోవా, నేను నీ ముఖం చూస్తాను.
మరియు యెహోవా, నేను మేలుకొన్నప్పుడు నిన్ను చూచి పూర్తిగా తృప్తి చెందుతాను.
ప్రధాన యాజకుడు
3 పిమ్మట దేవదూత ప్రధాన యాజకుడైన యెహోషువను నాకు చూపించాడు. యెహోవా దూత ముందు యెహోషువ నిలబడి ఉన్నాడు. యెహోషువకు కుడి పక్కగా సాతాను నిలబడి ఉన్నాడు. యెహోషు మీద చెడు పనులు చేసినట్లు నింద మోపటానికి సాతాను అక్కడ ఉన్నాడు. 2 అప్పుడు యెహోవా దూత ఇలా చెప్పాడు: “సాతానూ, యెహోవా నిన్ను విమర్శించు గాక! నీవు అపరాధివని యెహోవా తీర్పు ఇచ్చుగాక! యెరూషలేమును యెహోవా తన ప్రత్యేక నగరంగా ఎంపిక చేసుకున్నాడు. ఆయన ఆ నగరాన్ని రక్షించాడు. అది నిప్పులోనుండి లాగిన మండే కట్టెలా ఉంది.”
3 యెహోషువ దేవదూత ముందు నిలుచున్నాడు. యెహోషువ ఒక మురికి వస్త్రం ధరించివున్నాడు. 4 అప్పుడు దేవదూత తనవద్ద నిలబడిన ఇతర దేవ దూతలతో, “యెహోషువ వేసుకున్న మురికి వస్త్రాలను తీసివేయండి” అని చెప్పాడు. పిమ్మట దేవదూత యెహోషువతో మాట్లాడాడు. అతడు ఇలా అన్నాడు: “ఇప్పుడు నీ నేరాన్ని నేను తీసివేశాను. నీకు నూతన వస్త్రాలను ఇస్తున్నాను.”
5 అప్పుడు నేను, “అతని తలపై శుభ్రమైన తలపాగా ఉంచు” అని అన్నాను. కావున ఒక శుభ్రమైన తల పాగాను వారతని తలపై పెట్టారు. యెహోవా దూత అక్కడ నిలబడి వుండగా వారు అతనికి నూతన వస్త్రాలు తొడిగారు. 6 పిమ్మట యెహోషువకు యెహోవా దేవదూత ఈ విషయాలు చెప్పాడు:
7 సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు:
“నేను చెప్పిన విధంగా జీవించు.
నేను చెప్పినవన్నీ చెయ్యి.
నీవు నా ఆలయానికి అధికారివిగా ఉంటావు.
నీవు దాని ఆవరణ విషయం శ్రద్ధ తీసుకుంటావు.
ఇక్కడ నిలబడిన దేవదూతలవలె
నీవు నా ఆలయంలో ఎక్కడికైనా వెళ్లటానికి నీకు స్వేచ్ఛ ఉంది.
8 కావున యెహోషువా, నీవూ, నీతో ఉన్న ప్రజలూ నేను చెప్పేది తప్పక వినాలి.
నీవు ప్రధాన యాజకుడవు. నీతో ఉన్న జనులు నిజంగా అద్భుతాలు నెరవేర్చగలరు.
నేను నిజంగా నా ప్రత్యేక సేవకుని తీసుకువస్తాను.
అతడు ‘కొమ్మ’ (చిగురు) అని పిలువబడతాడు.
9 చూడండి, యెహోషువ ముందు నేనొక రాతిని పెట్టాను.
ఆ రాతికి ఏడు పక్కలు (కండ్లు) ఉన్నాయి.
ఆ రాతి మీద నేనొక ప్రత్యేక వర్తమానం చెక్కుతాను.
నేను ఒక్క రోజులో ఈ దేశంలోని పాపాలన్నీ తీసివేస్తానని ఇది తెలియ జేస్తుంది.”
10 సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు:
“ఆ సమయంలో ప్రజలు తమ స్నేహితులతోను,
పొరుగువారితోను కూర్చొని మాట్లాడుకుంటారు.
ప్రతి ఒక్కడూ తన అంజూరపు చెట్టు క్రింద,
తన ద్రాక్షాలత క్రింద ప్రశాంతంగా కూర్చుంటాడు.”
4 దేవుడు పాపం చేసిన దేవదూతల్ని కూడా విడిచిపెట్టకుండా నరకంలో[a] వేసాడు. తీర్పు చెప్పే రోజుదాకా అక్కడ వాళ్ళను అంధకారంలో బంధించి ఉంచుతాడు.
5 దేవుడు పురాతన ప్రపంచంపై సానుభూతి చూపలేదు. దుర్మార్గులైన ఆనాటి ప్రజలమీదికి ప్రళయం రప్పించాడు. నీతిని బోధించిన నోవహు, మిగతా ఏడుగురు తప్ప అందరూ నాశనమైపొయ్యారు.
6 దుర్మార్గులకు ఏమి సంభవిస్తుందో చూపడానికి దేవుడు సొదొమ, గొమొఱ్ఱా పట్టణాలను భస్మం చేసి వాటిని ఉదాహరణలుగా చూపించాడు. 7 కాని దేవుడు నీతిమంతుడైన లోతును రక్షించాడు. ప్రజలు అరాచకంగా, అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉండటంవల్ల లోతు చాలా బాధపడ్తూ ఉండేవాడు. 8 ఆ నీతిమంతుడు దుర్మార్గుల మధ్య ప్రతిరోజూ నివసిస్తూ, వాళ్ళ దుష్ప్రవర్తనల్ని చూస్తూ, వింటూ ఉండేవాడు. వాళ్ళు చేస్తున్న దుష్ట పనులు చూసి అతని హృదయం తరుక్కుపోయేది.
9 విశ్వాసుల్ని పాపాలు చేయకుండా చేసి ఎలా కాపాడుకోవాలో ఆ ప్రభువుకు తెలుసు. తీర్పు చెప్పే రోజుదాకా దుర్మార్గుల్ని ఎలా శిక్షిస్తూ ఉండాలో కూడా ఆ ప్రభువుకు తెలుసు. 10 అధికారాన్నుల్లంఘిస్తూ, అసహ్యకరమైన ఐహిక వాంఛల్ని తీర్చుకుంటూ గర్వాంధులై పరలోక నివాసుల్ని దూషించటానికి భయపడనివాళ్ళ విషయంలో యిది ముఖ్యంగా నిజమౌతుంది.
ఇలాంటి దుర్బోధకులు ధైర్యంగా గర్వంతో గొప్పవాళ్ళను దూషిస్తారు. 11 వాళ్ళకన్నా బలవంతులు, శక్తివంతులు అయినటువంటి దేవదూతలు కూడా ప్రభువు సమక్షంలో ఆ గొప్పవాళ్ళపై నేరారోపణ చేసి దూషించారు.
12 తమకు తెలియనివాటిని ఆ దుర్బోధకులు దూషిస్తారు. వాళ్ళు అడవి జంతువుల్లాంటివాళ్ళు. ఇలాంటి జంతువులు పట్టుకుని చంపబడటానికే పనికి వస్తాయి. ఆ జంతువుల్లాగే వాళ్ళు కూడా నశించిపోతారు. 13 వాళ్ళు చేసిన చెడ్డకార్యాలకు ప్రతిఫలంగా వాళ్ళకు హాని కలుగుతుంది. పట్టపగలు శారీరక వాంఛల్ని తీర్చుకోవటమే వాళ్ళకు ఆనందం.
వాళ్ళు తాము చేసిన మోసాలకు ఆనందిస్తూ మీతో కలిసి విందులు చేయటం మీకు అవమానం. అది మీకు తీరని కళంకం. 14 వాళ్ళు కళ్ళనిండా కామాన్ని నింపుకొని, పాపం చేయటం ఎన్నటికీ మానరు. వాళ్ళు మనస్సు స్థిరంలేనివాళ్ళను అడ్డదారి పట్టిస్తారు. దేవుని శాపానికి గురియైన వాళ్ళు, డబ్బు లాగటంలో నిపుణులు.
15 వాళ్ళు సక్రమ మార్గాన్ని వదిలేసి, దారితప్పి బిలాము మార్గాన్ని అనుసరిస్తారు. బిలాము, అధర్మంగా ధనార్జన చేసిన బెయోరు[b] కుమారుడు. 16 కాని ఈ బిలామును అతడు చేసిన తప్పుకు మాటలురాని ఒక గాడిద మానవుని గొంతుతో గద్దించి, ఆ ప్రవక్త పిచ్చితనాన్ని ఆపింది.
17 ఇలాంటి దుర్బోధకులు నీళ్ళు లేని బావుల్లాంటివాళ్ళు. తుఫాను గాలికి కొట్టుకొనిపోయే మేఘాల్లాంటివాళ్ళు. గాఢాంధకారాన్ని దేవుడు వాళ్ళకోసం దాచి ఉంచాడు. 18 ఆ బోధకులు ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. అంతేకాక, అప్పుడే మోసగాళ్ళ నుండి తప్పించుకొన్న వ్యక్తుల శారీరక వాంఛల్ని ప్రేరేపించి, అడ్డదారి పట్టిస్తూ ఉంటారు. 19 తాము స్వయంగా దుర్వ్యసనాలకు బానిసలై ఉండి, యితరులకు స్వేచ్ఛ కలిగిస్తామని వాగ్దానం చేస్తూ ఉంటారు. తనను జయంచినదానికి మానవుడు బానిసై పోతాడు.
20 ప్రపంచంలో ఉన్న దుర్నీతి నుండి తప్పించుకోవాలంటే, మన ప్రభువు, రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తును తెలుసుకోవాలి. వాళ్ళు మళ్ళీ ఆ దుర్నీతిలో చిక్కుకొని బానిసలైతే యిప్పటి స్థితి మునుపటి స్థితికన్నా అధ్వాన్నంగా ఉంటుంది. 21 వాళ్ళకందివ్వబడిన పవిత్ర ఆజ్ఞను తెలుసుకుని వెనక్కి మళ్ళటం కన్నా ఆ ధర్మమార్గాన్ని తెలుసుకోకపోయినట్లయితే ఉత్తమంగా ఉండేది.
© 1997 Bible League International