Revised Common Lectionary (Complementary)
91 మహోన్నతుడైన దేవుని ఆశ్రయంలో నివసించే వాడు
సర్వశక్తిమంతుడైన దేవుని నీడలో విశ్రాంతి తీసుకొంటాడు.
2 “నీవే నా క్షేమ స్థానం, నా కోట. నా దేవా, నేను నిన్నే నమ్ముకొన్నాను.”
అని నేను యెహోవాకు చెబుతాను.
9 ఎందుకంటే నీవు యెహోవాను నమ్ముకొన్నావు గనుక.
సర్వోన్నతుడైన దేవుణ్ణి నీ క్షేమ స్థానంగా చేసుకొన్నావు గనుక.
10 కీడు ఏమీ నీకు జరగదు.
నీ ఇంట ఎలాంటి వ్యాధి ఉండదు.
11 ఎందుకంటే నిన్ను కనిపెట్టుకొని ఉండుటకు దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నీవు ఎక్కడికి వెళ్లినా వారు నిన్ను కాపాడుతారు.
12 నీ పాదం రాయికి తగులకుండా
దేవదూతలు వారి చేతులతో నిన్ను పైకి ఎత్తుతారు.
13 సింహాల మీద, విషసర్పాల మీద
నడిచే శక్తి నీకు ఉంటుంది.
14 యెహోవా చెబుతున్నాడు: “ఒక వ్యక్తి నన్ను నమ్ముకొంటే, నేను అతన్ని రక్షిస్తాను.
నా పేరు అతనికి తెలుసు కనుక నేను కాపాడుతాను.
15 నా అనుచరులు సహాయంకోసం నాకు మొరపెడ్తారు.
నేను వారికి జవాబు ఇస్తాను.
వారికి కష్టం కలిగినప్పుడు నేను వారితో ఉంటాను. నేను వారిని తప్పించి, ఘనపరుస్తాను.
16 నా అనుచరులకు నేను దీర్ఘాయుష్షు యిస్తాను.
నేను వాళ్లను రక్షిస్తాను.”
ప్రతిదానికి ఒక తరుణం
3 ప్రతిదానికి సరైన సమయం ఒకటుంది. ఈ భూమి మీద ప్రతీది సరైన సమయంలో సంభవిస్తుంది.
2 పుట్టేందుకొక సమయం వుంది,
చనిపోయేందుకొక సమయం వుంది.
మొక్కలు నాటేందుకొక సమయం వుంది,
మొక్కలు పెరికేందుకొక సమయం వుంది.
3 చంపేందుకొక సమయం వుంది,
గాయం మాన్పేందుకొక సమయం వుంది.
నిర్మూలించేందుకొక సమయం వుంది,
నిర్మించేందుకొక సమయం వుంది.
4 ఏడ్చేందుకొక సమయం వుంది,
నవ్వేందుకొక సమయం వుంది.
దుఃఖించేందుకొక సమయం వుంది.
సంతోషంతో నాట్య మాడేందుకొక సమయం వుంది.
5 ఆయుధాలు పడవేసేందుకొక సమయం వుంది,
వాటిని తిరిగి చేపట్టేందుకొక సమయం వుంది.
ఒకరిని కౌగిలించు కొనేందుకొక సమయం వుంది,
ఆ కౌగిలిని సడలించేందుకొక సమయం ఉంది.[a]
6 దేన్నయినా వెదికేందుకొక సమయం వుంది,
అది పోగొట్టుకొనేందుకొక సమయం వుంది.
వస్తువులు పదిలపర్చు కొనే సమయం వుంది,
వాటిని పారవేసే సమయం వుంది.
7 వస్త్రం చింపేందుకొక సమయం వుంది,
దాన్ని కుట్టేందుకొక సమయం వుంది.
మౌనానికొక సమయం వుంది.
మాట్లాడేందు కొక సమయం వుంది.
8 ప్రేమించేందుకొక సమయం వుంది,
ద్వేషించేందుకొక సమయం వుంది.
సమరానికొక సమయం వుంది,
శాంతికొక సమయం వుంది.
యేసు తన మరణాన్ని గురించి మాట్లాడటం
27 “ఇక నా ఆత్మ కలవరం చెందుతున్నది. తండ్రీ నేనేమనాలి? ఈ గడియనుండి నన్ను రక్షించుమని అడగాలా? కాదు! నేను వచ్చింది ఈ గడియ కోసమే కదా! 28 తండ్రీ నీ పేరుకు మహిమ కలిగించుకో.”
అప్పుడు పరలోకం నుండి ఒక స్వరం, “నేను యిదివరలో నా పేరుకు మహిమ కలిగించాను. మళ్ళీ దానికి మహిమ కలిగిస్తాను!” అని అన్నది.
29 అక్కడ నిలుచున్న ప్రజలు యిది విన్నారు. కొందరు ఉరిమిందన్నారు.
మరి కొందరు, “దేవదూత ఆయనతో మాట్లాడాడు” అని అన్నారు.
30 యేసు, “ఆ గొంతు మీ కోసం పలికింది. నా కోసం కాదు. 31 ఈ ప్రపంచంపై తీర్పు చెప్పే సమయం వచ్చింది. ఈ లోకాధికారిని బయటకు తరిమి వేసే సమయం వచ్చింది. 32 కాని దేవుడు నన్ను ఈ భూమ్మీదినుండి పైకెత్తినప్పుడు నేను ప్రజలందర్ని నా యొద్దకు ఆకర్షిస్తాను. వాళ్ళను నా దగ్గరకు పిలి పించుకుంటాను” అని అన్నాడు. 33 ఇది చెప్పి తాను ఏ విధంగా మరణించనున్నాడో సూచించాడు.
34 ప్రజలు, “మేము ధర్మశాస్త్రం ద్వారా ‘క్రీస్తు’ చిరకాలం ఉంటాడని విన్నాము. అలాంటప్పుడు మనుష్యకుమారుణ్ణి దేవుడు పైకెత్తుతాడని ఎట్లా అనగలుగుతున్నావు? ఈ మనుష్యకుమారుడెవరు?” అని అన్నారు.
35 అప్పుడు యేసు వాళ్ళతో, “వెలుగు మీకోసం యింకా కొంత కాలం మాత్రమే ఉంటుంది. చీకటి రాకముందే, అంటే వెలుగు ఉండగానే ప్రయాణం సాగించండి. చీకట్లో నడిచే వ్యక్తికి తానెక్కడికి వెళుతున్నాడో తెలియదు. 36 వెలుగు ఉన్నప్పుడే దాన్ని విశ్వసించండి. అప్పుడు మీరు వెలుగు యొక్క సంతానంగా లెక్కింపబడతారు” అని అన్నాడు. యేసు మాట్లాడటం ముగించాక వాళ్ళకు కనిపించకుండా ఉండాలని దూరంగా వెళ్ళిపోయాడు.
© 1997 Bible League International