Revised Common Lectionary (Complementary)
రాబోతున్న యెహోవా దినం
2 సీయోనులో బూర ఊదండి.
నా పవిత్ర పర్వతంమీద హెచ్చరికగా కేకవేయండి.
దేశంలో నివసించే ప్రజలందరూ భయంతో వణుకుదురు గాక.
యెహోవా ప్రత్యేకదినం వస్తుంది.
యెహోవా ప్రత్యేకదినం సమీపంగా ఉంది.
2 అది ఒక చీకటి దుర్దినంగా ఉంటుంది.
అది అంధకారపు మేఘాలు కమ్మిన దినంగా ఉంటుంది.
సూర్యోదయాన సైన్యం పర్వతాలలో నిండి ఉండటం నీవు చూస్తావు.
అది మహాశక్తిగల సైన్యంగా ఉంటుంది.
ఇంతకుముందు ఇలాంటిది ఏదీ, ఎన్నడూ ఉండలేదు.
మరియు ఇలాంటిది ఏదీ, ఎన్నటికీ మరోసారి ఉండదు.
ప్రజలు మార్పు చెందాలని యెహోవా చెప్పుట
12 ఇది యెహోవా సందేశం:
“ఇప్పుడు మీ పూర్ణహృదయంతో నా దగ్గరకు తిరిగిరండి.
మీరు చెడ్డ పనులు చేసారు.
ఏడువండి, ఏడువండి. భోజనం ఏమీ తినకండి.
13 మీ వస్త్రాలు కాదు
మీ హృదయాలు చింపుకోండి.”
మీ దేవుడైన యెహోవా దగ్గరకు తిరిగి రండి.
ఆయన దయ, జాలిగలవాడు.
ఆయన త్వరగా కోపపడడు.
ఆయనకు ఎంతో ప్రేమఉంది.
ఒక వేళ ఆయన తలపెట్టిన చెడ్డ శిక్ష విషయంలో
ఆయన తన మనస్సు మార్చుకొంటాడేమో.
14 ఒకవేళ యెహోవా తన మనస్సు మార్చుకొంటాడేమో ఎవరికి తెలుసు.
మరియు ఒకవేళ ఆయన తన వెనుక నీ కోసం ఒక ఆశీర్వాదం విడిచి పెడతాడేమో.
అప్పుడు నీవు నీ యెహోవా దేవునికి
ధాన్యార్పణం, పానీయార్పణం అర్పించవచ్చు.
యెహోవాను ప్రార్థించు
15 సీయోనులో బూర ఊదండి.
ఒక ప్రత్యేక ఉపవాస సమయం ఏర్పాటు చేయండి.
16 ప్రజలను సమావేశం చేయండి.
ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయండి.
పెద్దవాళ్లను సమావేశపరచండి.
చిన్న పిల్లలను, తల్లుల స్తనములను ఇంకా కుడిచే చిన్న శిశువులను సహితం సమావేశపరచండి.
పెండ్లికుమార్తెను, ఆమె పెండ్లికుమారున్ని
వారి పడకగదినుండి బయటకు రప్పించండి.
17 యాజకులను, యెహోవా సేవకులను
మండపానికి బలిపీఠానికి మధ్య విలపించనివ్వండి
ఆ ప్రజలందరూ ఈ విషయాలు చెప్పాలి: “యెహోవా, నీ ప్రజలను కరుణించు.
నీ ప్రజలను సిగ్గుపడనియ్యకు.
నీ ప్రజలనుగూర్చి ఇతరలను హేళన చేయనియ్యకు.
ఇతర దేశాల్లోని ప్రజలు నవ్వుతూ
‘వారిదేవుడు ఎక్కడ?’ అని చెప్పనియ్యకు.”
ప్రజలు దేవుణ్ణి వెంబడించాలని చెప్పాలి
58 మీకు చేతనైనంత గట్టిగా కేకలు వేయండి. మీరు ఆపవద్దు.
బూరలా కేకలు వేయండి.
ప్రజలు చేసిన చెడు పనులను గూర్చి వారికి చెప్పండి.
యాకోబు వంశానికి వారి పాపాలను గూర్చి చెప్పండి.
2 అప్పుడు వారు నన్ను ఆరాధించేందుకు రోజూ వస్తారు.
మరియు ప్రజలు నా మార్గాలు తెలుసుకోవాలని కోరుతారు.
అప్పుడు వారు సరైన పనులు చేసే ఒక రాజ్యం అవుతారు.
ఆ ప్రజలు దేవుని మంచి ఆదేశాలను పాటించడం మానివేయరు.
వారికి న్యాయంగా తీర్పు తీర్చమని ఆ ప్రజలు నన్ను అడుగుతారు.
దేవుని న్యాయ నిర్ణయాలకోసం వారు దేవుని దగ్గరకు వెళ్లాలని కోరుకొంటారు.
3 ఇప్పుడు ఆ ప్రజలు చెబుతారు: “నీ గౌరవ సూచకంగా మేము భోజనం మానివేశాం. నీవెందుకు మమ్మల్ని చూడవు? నీ గౌరవ సూచకంగా మేము మా దేహాలను బాధించుకొంటాం. నీవెందుకు మమ్మల్ని గమనించవు?”
అయితే యెహోవా అంటున్నాడు, “ఆ ప్రత్యేక దినాల్లో భోజనం చేయకుండా ఉండి మిమ్మల్ని మీరే సంతోషపెట్టుకొనేందుకు ఈ పనులు చేస్తారు. మరియు మీరు మీ శరీరాలను గాక, మీ సేవకుల్ని శిక్షిస్తారు. 4 మీరు ఆకలిగా ఉన్నారు కాని అన్నంకోసర కాదు. ఆహారంకోసం గాక వాదనకోసం, పోరాటం కొసం మీరు ఆకలిగా ఉన్నారు. మీ చెడ్డ చేతులతో ప్రజలను కొట్టాలని మీరు ఆకలిగా ఉన్నారు. మీరు భోజనం మానివేయటం నాకోసం కాదు. నన్ను స్తుతించుటకు మీరు మీ స్వరం వినియోగించటం మీకు ఇష్టం లేదు. నేను కోరేది అంతా 5 ఆ ప్రత్యేక దినాల్లో ప్రజలు భోజనం మానివేసి, వారి శరీరాలను శిక్షించు కోవటం చూడాలని మాత్రమేనని మీరు తలస్తున్నారా? ప్రజలు దుఃఖంగా కనబడాలని నేను కోరుతున్నానని మీరు తలుస్తున్నారా? ప్రజలు చచ్చిన మొక్కల్లా తలలు వంచుకోవాలనీ, దుఃఖసూచక వస్త్రాలు ధరించాలని నేను కోరుతున్నానని మీరు తలస్తున్నారా? ప్రజలు వారి దుఃఖాన్ని తెలియచేసేందుకు బూడిదలో కూర్చోవాలని నేను కోరుతున్నానని మీరు తలుస్తున్నారా? భోజనం మానివేసే ఆ ప్రత్యేక దినాల్లో మీరు చేసేది అదే. యెహోవా కోరేది కూడా అదే అని మీరు తలస్తున్నారా?
6 “నేను కోరే ప్రత్యేక రోజు, ప్రజలను స్వతంత్రులను చేసే రోజు ఎలాంటిదో నేను మీకు చెబుతాను. ప్రజల మీద నుండి భారాన్ని మీరు తొలగించే రోజు నాకు కావాలి. కష్టాలుపడే ప్రజలను మీరు స్వతంత్రులుగా చేసే రోజు నాకు కావాలి. వారి భుజాలమీది భారాన్ని మీరు తొలగించే రోజు నాకు కావాలి. 7 ఆకలిగొన్న ప్రజలతో మీరు మీ భోజనం పంచుకోవాలని నేను కోరుతున్నాను. ఇళ్లులేని పేద ప్రజలను మీరు వెదికి, వారిని మీరు మీ స్వంత ఇళ్లలోనికి తీసుకొని రావాలని నేను కోరుతున్నాను. బట్టలు లేనివాడ్ని మీరు చూచినప్పుడు, మీ బట్టలు వానికి ఇవ్వండి. ఆ మనుష్యులకు సహాయం చేయకుండా దాచుకోవద్దు; వాళ్లూ మీలాంటి వారే.”
8 వీటిని మీరు చేస్తే, మీ వెలుగు ఉదయకాంతిలా ప్రకాశిస్తుంది. అప్పుడు మీ గాయాలు బాగవుతాయి. మీ “మంచితనం” (దేవుడు) మీకు ముందు నడువగా, యెహోవా మహిమ మీ వెనుకగా మిమ్మల్ని వెంబడిస్తుంది. 9 అప్పుడు మీరు యెహోవాకు మొరపెడ్తారు, యెహోవా మీకు జవాబు ఇస్తాడు. మీరు యెహోవాకు గట్టిగా కేకెలు వేస్తారు. ఆయన “ఇదిగో నేనిక్కడే ఉన్నాను” అంటాడు.
మీరు ప్రజలకు కష్టాలు, భారాలు కలిగించటం మానివేయాలి. విషయాలను బట్టి మీరు ప్రజలమీద కోపంగా మాట్లాడటం. వారిని నిందించటం మీరు మానివేయాలి. 10 ఆకలితో ఉన్న ప్రజలను గూర్చి మీరు విచారపడి, వారికి భోజనం పెట్టాలి. కలవరపడిన వారికి మీరు సహాయం చేయాలి వారి అవసరాలు తీర్చాలి. అప్పుడు మీ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది. మరియు మీకు దుఃఖం ఉండదు. మధ్యాహ్నపు సూర్యకాంతిలా మీరు ప్రకాశిస్తారు.
11 అప్పుడు యెహోవా మిమ్మల్ని సదా నడిపిస్తాడు. ఎండిన భూములలో ఆయన మీ ఆత్మకు సంతృప్తినిస్తాడు. మీ ఎముకలకు యెహోవా బలం ఇస్తాడు. విస్తారమైన నీళ్లుగల తోటలా మీరు ఉంటారు. ఎల్లప్పుడు నీళ్లు ఉబుకుతూ ఉండే ఊటలా మీరుంటారు.
12 ఎన్నెన్నో సంవత్సరాలుగా మీ పట్టణాలు నాశనం చేయబడ్డాయి. కానీ క్రొత్త పట్టణాలు నిర్మించబడతాయి. మరియు ఈ పట్టణాల పునాదులు ఎన్నెన్నో సంవత్సరాల వరకు నిలిచి కొనసాగుతాయి. “కంచెలను బాగు చేసేవాడు” అని నీవు పిలువబడతావు, “త్రోవలు, ఇళ్లు నిర్మించువాడు” అని నీవు పిలువబడతావు.
సంగీత నాయకునికి: దావీదు కీర్తన. బత్షెబతో దావీదు పాపం చేసిన తర్వాత నాతాను ప్రవక్త దావీదు దగ్గరకి వెళ్లినప్పుడు వ్రాసిన కీర్తన.
51 దేవా, నీ నమ్మకమైన ప్రేమ మూలంగా
నా మీద దయ చూపించుము.
నీ మహా దయ మూలంగా
నా పాపాలన్నీ తుడిచివేయుము.
2 దేవా, నా దోషం అంతా తీసివేయుము.
నా పాపాలు కడిగివేసి, నన్ను మరల శుద్ధి చేయుము.
3 నేను పాపం చేశానని నాకు తెలుసు.
నేను ఎల్లప్పుడు నా పాపాన్ని ఎరిగియున్నాను.
4 తప్పు అని నీవు చెప్పే వాటినే నేను చేసాను.
దేవా, నీకే వ్యతిరేకంగా నేను పాపం చేసాను.
కనుక నేను దోషినని నీవు అన్నప్పుడు నీ మాట నిజమే.
నీవు నన్ను నిందించేటప్పుడు నీవు న్యాయవంతుడవే.
5 నేను పాపంలో పుట్టాను.
పాపంలోనే నా తల్లి నన్ను గర్భాన ధరించింది.
6 దేవా, సంపూర్ణ భక్తిని లేదా యదార్థతను నీవు కోరతావు.
అందుచేత నా హృదయంలో నాకు జ్ఞానమును బోధించుము.
7 హిస్సోపు ముక్కను ప్రయోగించి నన్ను పవిత్రం చేసే క్రమం జరిగించుము.
నేను హిమం కంటె తెల్లగా ఉండేంతవరకు నన్ను కడుగుము.
8 నీవు విరుగ గొట్టిన ఎముకలను సంతోషించనిమ్ము.
నన్ను సంతోషపరచుము! మరల నన్ను సంతోషపరచుము.
9 నా పాపాలను చూడకుము!
వాటన్నింటినీ తుడిచి వేయుము.
10 దేవా, నాలో పవిత్ర హృదయాన్ని కలిగించుము
నా ఆత్మను నూతనపరచి బలపరచుము.
11 నన్ను త్రోసివేయకుము!
నీ పవిత్ర ఆత్మను నాలోనుండి తీసివేయకుము.
12 నీచేత రక్షించబడుట మూలంగా
కలిగే ఆనందం నాకు తిరిగి ఇమ్ము!
నీకు విధేయత చూపుటకు నా ఆత్మను సిద్ధంగా, స్థిరంగా ఉంచుము.
13 నీ జీవిత మార్గాలను నేను పాపులకు నేర్పిస్తాను.
వారు తిరిగి నీ దగ్గరకు వచ్చేస్తారు.
14 దేవా, నన్ను ఘోర మరణమునుండి రక్షించుము.
నా దేవా, నీవే నా రక్షకుడవు.
నీవు ఎంత మంచివాడవో నన్ను పాడనిమ్ము.
15 నా ప్రభువా, నా నోరు తెరచి, నీ స్తుతులు పాడనిమ్ము.
16 నీవు బలులు కోరటం లేదు.
లేనియెడల నేను వాటిని అర్పిస్తాను. దహనబలులను నీవు కోరవు.
17 దేవా, నా విరిగిన ఆత్మయే నీకు నా బలి అర్పణ.
దేవా, విరిగి నలిగిన హృదయాన్ని నీవు త్రోసివేయవు.
20 మేము క్రీస్తు రాయబారులం. దేవుడే మా ద్వారా ఈ విజ్ఞప్తి చేస్తున్న విషయం గ్రహించండి. క్రీస్తు పక్షాన దేవునితో సమాధానపడమని మిమ్మల్ని వేడుకొంటున్నాము. 21 క్రీస్తు పాపం చెయ్యలేదు. కాని మనకోసం దేవుడు ఆయన్ని పాపంగా చేసాడు. మనం క్రీస్తులో ఐక్యత పొంది దేవుని దృష్టిలో నీతిమంతులంగా ఉండాలని ఇలా చేసాడు.
6 దేవునితో సహపనివారంగా మేము, దైవానుగ్రహాన్ని వృథా చేసుకోవద్దని మిమ్మల్ని వేడుకొంటున్నాము. 2 ఎందుకంటే, దేవుడే ఈ విధంగా అన్నాడు:
“నేను సరియైన సమయానికి మీ మనవి విన్నాను.
రక్షించే రోజున మీకు సహాయం చేసాను.”(A)
నేను చెప్పేదేమిటంటే, దేవుడు అనుగ్రహించే సమయం ఇదే. రక్షించే రోజు ఈ దినమే.
3 మేము చేసే సేవ చెడుపేరు పొందరాదని, మేము ఎవరి దారికి ఆటంకాలు కలిగించము. 4 దానికి మారుగా మేము అన్ని విషయాలలో దేవుని సేవకులమని రుజువు చేసుకొంటున్నాము. ఆ గొప్ప సహనం మాకు కష్టాలు, దుఃఖాలు, అవసరాలు కలిగినప్పుడు, 5 దెబ్బలు తిన్నప్పుడు, చెరసాలలో పడినప్పుడు, ప్రజలు ఎదురు తిరిగినప్పుడు, నిద్రాహారాలు లేక కష్టపడి పని చేసినప్పుడు, 6 నిష్కల్మషంగా ఉండటంలో, యితర్లను అర్థం చేసుకోవటంలో, సహనం, దయ చూపటంలో, పరిశుద్ధాత్మ విషయంలో, నిజమైన ప్రేమ వ్యక్తం చేయటంలో, 7 సత్యంగా మాట్లాడటంలో, దేవుని శక్తి విషయంలో, కుడి ఎడమ చేతుల్లో ఉన్న నీతి ఆయుధాల విషయంలో, 8 కీర్తి వచ్చినా, అవమానాలు కలిగినా, పొగడ్తలు వచ్చినా, నిందలు కలిగినా, సత్యవంతులన్నా, మోసగాళ్ళన్నా, 9 మేము తెలిసినా మమ్మల్ని తెలియనివాళ్ళుగా చూసినప్పుడు, చనిపోవుచున్నను చనిపోనివారిగా ఉన్నప్పుడు, కొట్టబడినా చంపబడకుండా ఉన్నప్పుడు, 10 దుఃఖంతో ఉన్నా ఆనందంగా ఉన్నప్పుడు, దరిద్రులమైనా యితరులను ధనవంతులుగా చేస్తున్నప్పుడు, మా దగ్గర ఏమీ లేకున్నా అన్నీ ఉన్నాయన్నట్టుగా ఉన్నప్పుడు మేము దేవుని సేవకులంగా రుజువు చేసుకొంటున్నాం.
యేసు ఇచ్చుటను గురించి బోధించటం
6 “జాగ్రత్త! మీరు చేసే నీతికార్యాలు ఇతర్లు చూసేలా చెయ్యకండి. అలా చేస్తే పరలోకంలో ఉన్న మీ తండ్రి మీకు ప్రతిఫలమివ్వడు.
2 “అందువల్ల మీరు దానం చేసినప్పుడు చాటింపు వేయించుకొని నలుగురికి తెలుపకండి. కపటులు సమాజాల్లో, వీధుల్లో, ప్రజలు గౌరవించాలని అలా చేస్తారు. ఇది సత్యం, వాళ్ళకు లభించవలసిన ప్రతి ఫలం అప్పుడే పూర్తిగా లభించింది. 3 కాని, మీరు దానం చేసేటప్పుడు మీ కుడిచేయి ఏమి యిస్తుందో మీ ఎడమచేతికి తెలియనివ్వకండి. 4 అప్పుడే మీ దానం గుప్తంగా ఉంటుంది. అప్పుడు, మీరు రహస్యంగా చేస్తున్నది చూసి మీ తండ్రి మీకు ప్రతిఫలం యిస్తాడు.
యేసు ప్రార్థన గురించి బోధించటం
(లూకా 11:2-4)
5 “మీరు ప్రార్థించేటప్పుడు కపటుల్లా ప్రార్థించకండి. వాళ్ళు సమాజమందిరాల్లో, వీధుల ప్రక్కన నిలుచొని నలుగురూ చూడాలని ప్రార్థిస్తారు. అది వాళ్ళకు ఆనందాన్నిస్తుంది. కాని ఇది సత్యం—వాళ్ళకు లభించవలసిన ఫలితం వాళ్ళకప్పుడే పూర్తిగా లభించింది. 6 మీరు ప్రార్థించేటప్పుడు గదిలోకి వెళ్ళి తలుపు వేసికొని కనిపించని మీ తండ్రికి ప్రార్థించండి. అప్పుడు రహస్యంలో ఉండే మీ తండ్రి మీకు ప్రతిఫలం యిస్తాడు.
యేసు ఉపవాసమును గురించి బోధించటం
16 “కపటులు ఉపవాసం చేసినప్పుడు ప్రజలు గమనించాలని తమ ముఖాలు నీరసంగా కనిపించేటట్లు చేసుకొంటారు. మీరు ఉపవాసం చేసినప్పుడు అలా చేయకండి. ఇది సత్యం, వాళ్ళు పొందవలసిన ఫలాన్ని పొందారు. యింకేమీ లభించదు. 17 మీరు ఉపవాసం చేసినప్పుడు తలకు నూనె రాసుకొని ముఖాన్ని కడుక్కొండి. 18 అలా చేస్తే, మీరు ఉపవాసం చేస్తున్నట్లు ప్రజలకు కనిపించదు. కాని కనిపించని మీ తండ్రికి మాత్రమే మీరు ఉపవాసం చేస్తున్నట్లు తెలుస్తుంది. అందువలన రహస్యంగా చూసే మీ తండ్రి మీకు ప్రతిఫలం యిస్తాడు.
నీవు ఇద్దరు యజమానులను సేవించలేవు
(లూకా 12:33-34; 11:34-36; 16:13)
19 “మీకోసం ఈ ప్రపంచంలో ధనాన్ని కూడబెట్టుకోకండి. ఇక్కడ ఆ ధనానికి చెదలు పడుతుంది. తుప్పు ఆ ధనాన్ని తినివేస్తుంది. దొంగలు పడి దోచుకొంటారు. 20 మీ ధనాన్ని పరలోకంలో కూడబెట్టుకొండి. అక్కడ చెదలు పట్టవు, తుప్పు తినివేయదు. దొంగలు పడి దోచుకోరు. 21 మీ సంపద ఎక్కడ ఉంటే మీ మనస్సు కూడా అక్కడే ఉంటుంది.
© 1997 Bible League International