Revised Common Lectionary (Complementary)
99 యెహోవాయే రాజు.
కనుక రాజ్యాలు భయంతో వణకాలి.
కెరూబు[a] దూతలకు పైగా దేవుడు రాజుగా కూర్చున్నాడు.
అందుచేత ప్రపంచం భయంతో కదలిపోతుంది.
2 సీయోనులో యెహోవా గొప్పవాడు.
ప్రజలందరి మీద ఆయన గొప్ప నాయకుడు.
3 ప్రజలంతా నీ నామాన్ని స్తుతించెదరుగాక.
దేవుని నామం భీకరం. దేవుడు పరిశుద్ధుడు.
4 శక్తిగల రాజు న్యాయాన్ని ప్రేమిస్తాడు.
దేవా, నీతిని నీవు చేశావు.
యాకోబుకు (ఇశ్రాయేలు) నీతి న్యాయాలను నీవే జరిగించావు.
5 మన దేవుడైన యెహోవాను స్తుతించండి.
ఆయన పవిత్ర పాదపీఠాన్ని[b] ఆరాధించండి.
6 మోషే, అహరోను దేవుని యాజకులలో కొందరు,
మరియు దేవుని ఆరాధకులలో సమూయేలు ఒకడు.
వారు యెహోవాను ప్రార్థించారు.
దేవుడు వారికి జవాబు యిచ్చాడు.
7 ఎత్తయిన మేఘం నుండి దేవుడు మాట్లాడాడు.
వారు ఆయన ఆదేశాలకు విధేయులయ్యారు.
దేవుడు వారికి ధర్మశాస్త్రం ఇచ్చాడు.
8 మా దేవా, యెహోవా, నీవు వారి ప్రార్థనలకు జవాబు ఇచ్చావు.
నీవు క్షమించే దేవుడవని, చెడు కార్యాలు చేసినందుకు
ప్రజలను నీవు శిక్షిస్తావని వారికి చూపించావు.
9 మన దేవుడైన యెహోవాను స్తుతించండి.
ఆయన పవిత్ర పర్వతంవైపు సాగిలపడి ఆయనను ఆరాధించండి.
మన దేవుడైన యెహోవా నిజంగా పరిశుద్ధుడు.
యెహోవా ఇశ్రాయేలీయులకు తోడుగా ఉంటాడు
9 “ఇశ్రాయేలు ప్రజలారా, వినండి, ఈ వేళ మీరు యొర్దాను నది దాటుతారు. మీకంటె బలంగల ఆ గొప్ప రాజ్యాలను బయటకు వెళ్లగొట్టేందుకు మీరు ఆ దేశంలో ప్రవేశిస్తారు. వారి పట్టణాలు చాలా పెద్దవి, వాటి గోడలు ఆకాశమంత ఎత్తున్నాయి. 2 అక్కడి ప్రజలు ఎత్తయిన వాళ్లు, బలం ఉన్నవాళ్లు. వారు అనాకీయ ప్రజలు. ఆ ప్రజలను గూర్చి మీకు తెలుసు. ‘అనాకీయ ప్రజల మీద ఎవడూ గెలవలేడు’ అని మన గూఢచారులు చెప్పటం మీరు విన్నారు. 3 అయితే మీ దేవుడైన యెహోవా నాశనం చేసే అగ్నిలా మీకు ముందర ఆ నదిని దాటుతాడని మీరు ధైర్యంగా ఉండొచ్చు. ఆ దేశాలను యెహోవా నాశనం చేస్తాడు. వాళ్లు మీ ముందు పతనమయ్యేలా ఆయన చేస్తాడు. ఆ దేశస్తులను మీరు బయటకు వెళ్లగొట్టేస్తారు. త్వరగా మీరు వారిని నాశనం చేస్తారు. ఇలా జరుగుతుందని యెహోవా మీకు వాగ్దానం చేసాడు.
4 “ఆ రాజ్యాల వాళ్లను మీనుండి మీ దేవుడైన యెహోవా బయటకు వెళ్లగొట్టిన తర్వాత ‘మా స్వంత నీతి జీవితాల మూలంగానే ఈ దేశంలో జీవించేందుకు యెహోవా మమ్మల్ని తీసుకొనివచ్చాడు’ అని మీలో మీరు అనుకోవద్దు. ఆ రాజ్యాలవాళ్లను మీనుండి యెహోవా వెళ్లగొట్టాడు, ఎందుకంటే వారు జీవించిన చెడు మార్గంవల్లనే. 5 మీరు వాళ్ల దేశాన్ని స్వాధీనం చేసుకొనేందుకు అందులో ప్రవేశిస్తున్నారంటే మీరేదో మంచివాళ్లు, నీతిగా బతుకుతున్నారు అని కాదు. వాళ్లు చెడుమార్గాలలో జీవించడంవల్లనే మీ దేవుడైన యెహోవా వాళ్లను బయటకు వెళ్లగొడుతున్నాడు, మీరు లోనికి వెళ్తున్నారు. మరియు మీ పూర్వీకులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు యెహోవా చేసిన వాగ్దానం నెరవేరాలని ఆయన కోరుచున్నాడు.
పేతురు ఉపన్యసించటం
11 ఆ భిక్షమెత్తుకొనేవాడు పేతురు, యోహానులను అంటిపెట్టుకొని ఉన్నాడు. ప్రజల్లో కలిగిన ఆశ్చర్యం తగ్గలేదు. వాళ్ళు సొలొమోను మంటపంలో ఉన్న పేతురు, యోహానుల దగ్గరకు పరుగెత్తుకొంటూ వెళ్ళారు.
12 పేతురు వాళ్ళను చూసి ఈ విధంగా అన్నాడు: “ఇశ్రాయేలు ప్రజలారా! ఇది మీకెందుకు ఆశ్చర్యం కలిగిస్తోంది? మేము మా స్వశక్తితో లేక మా మంచితనంతో యితణ్ణి నడిపించినట్లు మావైపు అంత దీక్షతో ఎందుకు చూస్తున్నారు? 13 అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు, మన వంశీయుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమ పర్చాడు. మీరాయన్ని అధికారులకు అప్పగించారు. పిలాతు ఆయన్ని విడుదల చెయ్యాలని నిర్ణయించినప్పుడు మీరు పిలాతు ముందు యేసును నిరాకరించారు. 14 పవిత్రుడు, నీతిమంతుడు అయిన ఆయన్ని నిరాకరించి, ఆయనకు మారుగా ఒక హంతకుణ్ణి విడుదల చెయ్యాలని మీరు కోరారు. 15 మీరు మీకు నిత్యజీవితాన్నిచ్చే దాతను చంపారు. కాని దేవుడాయన్ని చావు నుండి బ్రతికించాడు. మేము దీనికి సాక్షులం.
16 “మాకు ‘యేసు’ అనే పేరులో నమ్మకం ఉండబట్టే మీకు తెలిసిన యితనికి, మీరు చూస్తున్న యితనికి నయమైపోయింది. యేసు పేరు, ఆయన కలిగించిన విశ్వాసము యితనికి పూర్తిగా స్వస్థత కలిగించాయి. ఇది మీరు చూసారు.
© 1997 Bible League International