Revised Common Lectionary (Complementary)
115 యెహోవా, ఏ ఘనతా మేము స్వీకరించకూడదు. ఘనత నీకే చెందుతుంది.
నీ ప్రేమ, నమ్మకం మూలంగా ఘనత నీదే.
2 మా దేవుడు ఎక్కడ అని జనాంగాలు ఎందుకు ఆశ్చర్యపడాలి?
3 దేవుడు పరలోకంలో ఉన్నాడు, ఆయన కోరింది చేస్తాడు.
4 ఆ జనాంగాల “దేవుళ్లు” వెండి బంగారాలతో చేయబడ్డ విగ్రహాలే.
ఎవరో ఒక మనిషి చేతులతో చేసిన విగ్రహాలే అవి.
5 ఆ విగ్రహాలకు నోళ్లున్నాయి కాని అవి మాట్లాడలేవు.
వాటికి కళ్లున్నాయి కాని అవి చూడలేవు.
6 వాటికి చెవులున్నాయి కాని అవి వినలేవు.
వాటికి ముక్కులున్నాయి కాని అవి వాసన చూడలేవు.
7 వాటికి చేతులు ఉన్నాయి కాని అవి తాకలేవు.
వాటికి కాళ్లు ఉన్నాయి కాని అవి నడవలేవు.
వాటికి గొంతుల్లోనుంచి ఏ శబ్దాలూ రావు.
8 ఆ విగ్రహాలను చేసేవారు. వాటిని నమ్ముకొనే వారు కూడ సరిగ్గా వాటివలె అవుతారు.
9 ఇశ్రాయేలూ, యెహోవాను నమ్ము.
యెహోవా వారి బలము, ఆయన వారి డాలు.
10 అహరోను వంశస్థులు యెహోవాను నమ్ముతారు.
యెహోవా వారి బలము, డాలు అయివున్నాడు.
11 యెహోవా అనుచరులు యెహోవాను నమ్ముకొంటారు.
యెహోవా తన అనుచరులకు సహాయం చేసి కాపాడుతాడు.
12 యెహోవా మమ్మల్ని జ్ఞాపకం చేసికొంటాడు.
యెహోవా మమ్మల్ని ఆశీర్వదిస్తాడు.
యెహోవా ఇశ్రాయేలును ఆశీర్వదిస్తాడు.
యెహోవా అహరోను వంశాన్ని ఆశీర్వదిస్తాడు.
13 యెహోవా పెద్దవారైనా, చిన్నవారైనా తన అనుచరులను ఆశీర్వదిస్తాడు.
14 యెహోవా మీ కుటుంబాలను పెద్దవిగా చేస్తాడని నేను ఆశిస్తున్నాను. ఆయన మీ పిల్లల కుటుంబాలను పెద్దవిగా చేస్తాడని నేను ఆశిస్తున్నాను.
15 యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు.
ఆకాశాన్ని, భూమిని యెహోవా చేశాడు.
16 ఆకాశం యెహోవాకు చెందుతుంది.
కాని భూమిని ఆయన మనుష్యులకు ఇచ్చాడు.
17 చనిపోయినవాళ్లు యెహోవాను స్తుతించరు.
కింద సమాధిలో ఉన్న మనుష్యులు యెహోవాను స్తుతించరు.
18 అయితే మనం యెహోవాను స్తుతిస్తాం.
మనం యిప్పటినుండి ఎప్పటికీ ఆయనను స్తుతిస్తాము!
యెహోవాను స్తుతించండి!
15 ఒకరోజు ముందు యెహోవా సమూయేలుతో ఇలా అన్నాడు: 16 “రేపు ఇంచుమించు ఇదే సమయానికి నేను నీ వద్దకు ఒక వ్యక్తిని పంపుతాను. అతడు బెన్యామీనువాడు. నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద నాయకునిగా ఉండేందుకు నీవు అతనిని అభిషేకించాలి[a] నా ప్రజల బాధ నేను గమనించాను. నా ప్రజల రోదన నేను విన్నాను గనుక ఫిలిష్తీయుల బారినుండి నా ప్రజలను అతడు రక్షిస్తాడు.”
17 సమూయేలు ప్రథమంగా సౌలును చూసినప్పుడు యెహోవా అతనితో, “నేను నీకు చెప్పిన వ్యక్తి ఇతడే; నా ప్రజలను పాలించువాడితడే” అన్నాడు.
18 సౌలు పట్టణ ద్వారం దగ్గర సమూయేలుకు కనబడెను. “దీర్ఘదర్శి ఇల్లెక్కడ?” అని సౌలు సమూయేలును అడిగాడు.
19 “నేనే దీర్ఘదర్శిని. నాకు ముందుగా నడుస్తూ ఆరాధనా స్థలానికి వెళ్లు. ఈ రోజు నీవు, నీ సేవకుడు నాతో కలిసి భోజనం చేయాలి. రేపటి ఉదయం నీ ప్రశ్నలన్నింటికీ జవాబు చెప్పి నిన్ను ఇంటికి పంపుతాను. 20 మూడు రోజులనుండి మీరు పోగొట్టుకున్న గాడిదలను గురించి బాధ పడవద్దు. అవి దొరికాయి. ఇప్పుడు ఇశ్రాయేలు కోరుకుంటున్నది ఎవరిని? నీ తండ్రి కుటుంబాన్ని కదా?” అన్నాడు సమూయేలు.
21 అది విన్న సౌలు, “నేను బెన్యామీను వంశానికి చెందిన వాడిని! ఇశ్రాయేలు అంతటిలో నావంశం చిన్నదిగదా! అందులో నా ఇంటివారు అతి తక్కువ సంఖ్యలో వున్నారే! అలాంటి నన్ను ఇశ్రాయేలు కోరుతూ వుందని ఎందుకు చెబుతున్నావు?” అని అడిగాడు.
22 అప్పుడు సమూయేలు సౌలును, అతని సేవకుని భోజనాలు పెట్టే చోటికి తీసుకుని వెళ్లాడు. భోజనాల బల్లవద్ద సౌలుకి, అతని సేవకునికి ప్రముఖ స్థానాలను సమూయేలు ఇచ్చాడు. భోజనాల స్థలంలో సమాధాన అర్పణలో పాలుపుచ్చుకొనేందుకు సుమారు ముప్పది మంది ఆహ్వానించబడ్డారు. 23 వంటవానితో సమూయేలు, “నేను నీకిచ్చిన మాంసాన్ని తీసుకునిరా. ప్రత్యేకంగా భద్రపర్చమని నీతో చెప్పిన మాంస భాగం అది” అన్నాడు.
24 వంటవాడు తొడ మాంసాన్ని[b] తెచ్చి సౌలు ముందు బల్లమీద పెట్టాడు. అప్పుడు సమూయేలు, ఆ మాంసం అతని కోసం ప్రత్యేకించబడిందని సౌలుతో చెప్పాడు. ఈ ప్రత్యేకమైన సందర్భానికోసం అతని కొరకే ఈ మాంసం భద్రపర్చబడింది. కనుక సౌలును దాన్ని స్వీకరించుమని సమూయేలు చెప్పాడు. కావున సౌలు ఆ రోజు సమూయేలుతో కలిసి భోజనం చేశాడు.
25 భోజనాలు అయిన తరువాత వారు ఆరాధనా స్థలం నుండి క్రిందికి దిగి పట్టణంలోకి వెళ్లారు. ఒక మిద్దెమీద సౌలుకు పడక ఏర్పాటు చేసారు. అక్కడ సౌలు నిద్రపోయాడు.
26 మరునాడుతెల్లవారుఝామున సమూయేలు లేచి మిద్దెమీద ఉన్న సౌలును మేల్కొలిపాడు. “బయల్దేరు, నిన్ను నీ దారిని నేను పంపిస్తాను” అన్నాడు సమూయేలు. సౌలు లేచి సమూయేలుతో కలిసి బయటికి వెళ్లాడు.
27 సౌలు, అతని సేవకుడు సమూయేలుతో కలిసి ఊరి బయటకు రాగానే సమూయేలు సౌలును పిలిచి, “నీ సేవకుణ్ణి మనకు ముందు నడుస్తూ వుండ మని చెప్పు. నేను నీకు చెప్పాల్సిన దేవుని సందేశం ఒకటి ఉంది” అని చెప్పాడు.
సమూయేలు సౌలును అభిషేకించుట
10 సమూయేలు ఒక పాత్రలో ప్రత్యేక నూనె తీసుకుని సౌలు తలమీద పోసాడు. సమూయేలు సౌలును ముద్దు పెట్టుకొని, “యెహోవా తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు నిన్ను నాయకునిగా ఉండేందుకు అభిషేకించాడు. నీవు దేవుని ప్రజలకు ఆధిపత్యం వహించాలి. చుట్టూరా వున్న శత్రువుల బారినుండి వారిని నీవు కాపాడతావు. యెహోవా తన ప్రజల మీద పాలకునిగా ఉండేందుకు నిన్ను అభిషేకించాడు. ఇది సత్యమని ఋజువు చేసే గుర్తు ఇది.
పెద్దలు, పరిచారకులు
3 ఇక్కడొక నమ్మదగిన సంగతి: సంఘంలో పెద్ద కావాలనుకొన్నవాడు గొప్ప సంగతినే కోరుకొనుచున్నాడు. 2 పెద్ద నిందకు చోటివ్వనివాడై ఉండాలి. అతడు ఏకపత్నీవ్రతుడై ఉండాలి. మితంగా జీవించాలి. వివేకవంతుడై ఉండాలి. సంఘంలో గౌరవం కలిగి ఉండాలి. ఇతర్లకు సహాయం చేస్తూ ఉండాలి. బోధించగల సామర్థ్యం ఉండాలి. 3 అలాంటివాడు మద్యం త్రాగరాదు. అతనిలో కోపానికి మారుగ వినయం ఉండాలి. పోట్లాడే గుణం ఉండకూడదు. ధనం మీద ఆశ ఉండకూడదు. 4 తన సంసారాన్ని సక్రమంగా నడుపుకోగలిగి ఉండాలి. అతడు తన పిల్లలు తనపట్ల విధేయతగా ఉండేటట్లు, తనను మనస్ఫూర్తిగా గౌరవించేటట్లు చేసుకోవాలి. 5 తన సంసారాన్ని సక్రమంగా నడుపుకోలేనివాడు దేవుని సంఘాన్ని ఏ విధంగా నడపగలడు?
6 అతడు క్రొత్తగా నమ్మినవాడై ఉండకూడదు. అటువంటి వ్యక్తి ఉబ్బెక్కిపోయి సాతాను పొందిన శిక్షనే పొందవచ్చు. 7 సంఘానికి చెందనివాళ్ళలో కూడా అతనికి మంచి పేరు ఉండాలి. అప్పుడే అతడు చెడ్డ పేరు పొందకుండా సాతాను వలలో పడకుండా ఉంటాడు.
ప్రత్యేక పరిచారకులు
8 అదే విధంగా సంఘ పరిచారకులు గౌరవింపదగినవాళ్ళై ఉండాలి. నీతిపరులై ఉండాలి. త్రాగుబోతులు కాకూడదు. మోసాలు చేసి లాభాలు పొందేవాళ్ళు కాకూడదు. 9 దేవుడు చెప్పిన సత్యాలను వాళ్ళు పవిత్ర హృదయంతో ఆచరించాలి.
© 1997 Bible League International