Revised Common Lectionary (Complementary)
దావీదు కీర్తన.
138 దేవా, నా హృదయపూర్తిగా నేను నిన్ను స్తుతిస్తాను.
దేవుళ్లందరి యెదుట నేను నీ కీర్తనలు పాడుతాను.
2 దేవా, నీ పవిత్ర ఆలయం వైపు నేను సాగిలపడతాను.
నీ నామం, నీ నిజప్రేమ, నీ నమ్మకములను బట్టి నేను స్తుతిస్తాను.
నీ నామాన్ని, నీ వాక్యాన్ని అన్నిటికన్నా పైగా హెచ్చించావు.
3 దేవా, సహాయం కోసం నేను నీకు మొరపెట్టాను.
నీవు నాకు జవాబు ఇచ్చావు. నీవు నాకు బలం ఇచ్చావు.
4 యెహోవా, భూరాజులందరూ నిన్ను స్తుతించెదరు గాక!
నీవు చెప్పిన విషయాలను వారు విన్నారు.
5 ఆ రాజులు అందరూ యెహోవా మార్గాన్ని గూర్చి పాడాలి అని నేను ఆశిస్తున్నాను.
యెహోవా మహిమ గొప్పది.
6 దేవుడు గొప్పవాడు.
అయితే దీనులను గూర్చి దేవుడు శ్రద్ధ వహిస్తాడు.
గర్విష్ఠులు చేసే పనులు యెహోవాకు తెలుసు.
కాని ఆయన వారికి సన్నిహితంగా ఉండడు.
7 దేవా, నేను కష్టంలో ఉంటే నన్ను బ్రతికించుము.
నా శత్రువులు నా మీద కోపంగా ఉంటే నన్ను వారినుండి తప్పించుము.
8 యెహోవా, నీవు వాగ్దానం చేసిన వాటిని నాకు ఇమ్ము.
యెహోవా, నీ నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
యెహోవా, నీవు మమ్మల్ని చేశావు కనుక మమ్మల్ని విడిచిపెట్టవద్దు.
కొత్త నాయకుడుగా యెహోషువ
12 అప్పుడు మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: “ఆ కొండమీదికి ఎక్కు. యొర్దాను నదికి తూర్పున ఉన్న కొండల్లో అది ఒకటి. ఇశ్రాయేలు ప్రజలకు నేను ఇస్తున్న దేశాన్ని నీవు అక్కడ నుండి చూస్తావు. 13 నీవు ఈ దేశాన్ని చూశాక, నీ సోదరుడు అహరోను మరణించినట్టే నీవు మరణిస్తావు. 14 సీను అరణ్యంలో నీళ్లకోసం ప్రజలు కోపగించుకోవటం జ్ఞాపకం చేసుకో. నీవూ, అహరోనూ కూడ నా ఆజ్ఞకు విధేయులయ్యేందుకు నిరాకరించారు. ప్రజల ముందు నీవు నన్ను ఘనపర్చలేదు, పవిత్రంగా చూడలేదు.” (ఇది సీను అరణ్యంలో కాదేషు దగ్గర మెరీబా నీళ్ల సంగతి.)
15 యెహోవాతో మోషే ఇలా అన్నాడు: 16 “ప్రజల ఆలోచనలు తెలిసిన దేవుడు యెహోవా ప్రభువు, నీవే ఈ ప్రజలకోసం మరో నాయకుడిని ఎంచుకోమని మనవి చేస్తున్నాను. 17 ఈ దేశంలోనుండి వీరిని బయటకు నడిపించి, కొత్త దేశంలో చేర్చగల నాయకుడిని ఎంచవలసిందిగా నేను యెహోవాకు మనవి చేస్తున్నాను. అప్పుడు యెహోవా ప్రజలు కాపరి లేని గొర్రెల్లా ఉండరు.”
18 కనుక మోషేతో యెహోవా ఇలా అన్నాడు: “నూను కుమారుడైన యెహోషువ నాయకుడుగా ఉంటాడు. యెహోషువ ఆత్మను పొందినవాడు. అతడిని కొత్త నాయకునిగా చేయి. 19 యాజకుడైన ఎలియాజరు ఎదుటా, ప్రజలందరి ఎదుటా నిలబడమని అతనితో చెప్పు. అప్పుడు అతడిని కొత్త నాయకునిగా నీవు చేయి.
20 “అతడిని నీవు నాయకునిగా చేస్తున్నావని ప్రజలకు చూపెట్టు, అప్పుడు ప్రజలంతా అతనికి లోబడతారు. 21 ఒకవేళ యెహోషువ ఒక కొత్త నిర్ణయం ఏదైనా చేయాలంటే అతడు యాజకుడైన ఎలియాజరు దగ్గరకు వెళతాడు. యెహోవా జవాబు తెలుసుకొనేందుకు ఎలియాజరు ఊరీమును ప్రయోగిస్తాడు. అప్పుడు యెహోషువ, ప్రజలందరూ దేవుడు చెప్పిన వాటిని చేస్తారు. ‘యుద్ధానికి వెళ్లండి’ అని అతడు చెబితే వారు యుద్ధానికి వెళ్తారు. ఒకవేళ ‘ఇంటికి వెళ్లండి’ అని అతడు చెబితే వారు ఇంటికి వెళతారు.”
22 మోషే యెహోవాకు విధేయుడయ్యాడు. యాజకుడైన ఎలియాజరు ముందు, ప్రజలందరి ఎదుట నిలబడమని యెహోషువాతో చెప్పాడు. మోషే, 23 అప్పుడు అతడే కొత్త నాయకుడు అని చూపెట్టేందుకు అతనిమీద మోషే చేతులు పెట్టాడు. అతనితో యెహోవా చెప్పినట్టే అతడు చేసాడు.
యెరూషలేములో సౌలు
26 సౌలు యెరూషలేముకు వచ్చాక శిష్యులతో కలిసిపోవటానికి ప్రయత్నించాడు. కాని వాళ్ళు అతడంటేనే భయపడిపోయారు. 27 కాని బర్నబా అతణ్ణి పిలుచుకొని అపొస్తలుల దగ్గరకు వచ్చి, వాళ్ళతో సౌలు ప్రయాణంలో ప్రభువును చూసిన విషయము, ప్రభువు అతనితో మాట్లాడిన విషయము, అతడు డెమాస్కసులో యేసు పేరును ధైర్యంగా ప్రకటించిన విషయము చెప్పాడు.
28 స్వేచ్ఛగా తిరుగుతూ ప్రభువు పేరును ధైర్యంగా ప్రకటిస్తూ సౌలు వాళ్ళతో కలిసి యెరూషలేములో ఉండిపోయాడు. 29 గ్రీకు మాట్లాడే యూదులతో మాట్లాడి వాదించాడు. వాళ్ళు అతణ్ణి చంపాలని నిశ్చయించారు. 30 సోదరులకు యిది తెలియగానే అతణ్ణి కైసరియకు తీసుకెళ్ళి అక్కడినుండి తార్సుకు పంపారు.
31 ఆ తర్వాత యూదయ, గలిలయ, సమరయలోని సంఘాలు కొద్ది రోజులు ప్రశాంతంగా గడిపాయి. ఆయా ప్రాంతాలలోని సంఘాలకు చెందిన సభ్యులు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతూ ప్రభువంటే భయభక్తులు కలిగి, పవిత్రాత్మ ద్వారా ప్రోత్సాహం పొందుతూ జీవించారు. సభ్యుల సంఖ్య పెరుగుతూ వచ్చింది.
© 1997 Bible League International