Revised Common Lectionary (Complementary)
సంగీత నాయకునికి: “దూరపు సింధూర మ్రానులోని పావురము” రాగం. ఫిలిప్తీయులు దావీదును గాతులో పట్టుకొన్నప్పుడు అతడు రచించిన అనుపదగీతం.
56 దేవా, ప్రజలు నా మీద దాడి చేసారు గనుక నాకు దయ చూపించుము.
రాత్రింబగళ్లు వారు నన్ను తరుముతూ పోరాడుతున్నారు.
2 నా శత్రువులు రోజంతా నా మీద దాడి చేసారు.
నాకు విరోధంగా పోరాడేవారు అనేకులు.
3 నేను భయపడినప్పుడు నేను నిన్ను నమ్ముకొంటాను.
4 నేను దేవుని నమ్ముకొన్నాను. కనుక నేను భయపడను. మనుష్యులు నన్ను బాధించలేరు.
దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం కోసం నేనాయనను స్తుతిస్తాను.
5 నా శత్రువులు ఎల్లప్పుడూ నా మాటలు మెలితిప్పుతున్నారు.
వారు ఎల్లప్పుడూ నాకు విరోధంగా చెడు పథకాలు వేస్తున్నారు.
6 వారంతా కలసి దాక్కొని నా ప్రతీ కదలికనూ గమనిస్తున్నారు.
నన్ను చంపుటకు ఏదో ఒక మార్గం కోసం ఎదురు చూస్తున్నారు.
7 దేవా, వారిని తప్పించుకోనియ్యకుము,
వారు చేసే చెడ్డ పనుల నిమిత్తం వారిని శిక్షించుము.
8 నేను చాలా కలవరపడిపోయానని నీకు తెలుసు.
నేను ఎంతగా ఏడ్చానో నీకు తెలుసు
నిజంగా నీవు నా కన్నీళ్ల లెక్క వ్రాసే ఉంటావు.
9 కనుక సహాయం కోసం నేను నీకు మొర పెట్టినప్పుడు నా శత్రువులు ఓడింపబడతారు.
దేవుడు నాతో ఉన్నాడు ఇది నాకు తెలుసు.
10 దేవుడి వాగ్దానం కోసం నేను ఆయనను స్తుతిస్తాను.
యెహోవా నాకు చేసిన వాగ్దానం కోసం నేను ఆయనను స్తుతిస్తాను.
11 నేను దేవుని నమ్ముకొన్నాను అందుచేత నేను భయపడను.
మనుష్యులు నన్ను బాధించలేరు.
12 దేవా, నేను నీతో ప్రత్యేక ప్రమాణం చేసాను. దాన్ని నెరవేరుస్తాను.
నా కృతజ్ఞతార్పణ నేను నీకు యిస్తాను.
13 ఎందుకంటే మరణం నుండి నీవు నన్ను రక్షించావు.
నేను ఓడిపోకుండా నీవు కాపాడావు.
కనుక బ్రతికి ఉన్న మనుష్యులు మాత్రమే
చూడగల వెలుగులో నేను దేవుని ఆరాధిస్తాను.
రెండు దర్శనాలు
11 యెహోవా యొక్క సందేశం నాకు చేరింది యెహోవా ఇలా అన్నాడు: “యిర్మీయా, నీవు ఏమి చూస్తూ ఉన్నావు?”
అప్పుడు యెహోవాకు నేనిలా సమాధాన మిచ్చాను: “బాదపు చెట్టుకొమ్మతో చేయబడిన ఒక కర్రను నేను చూస్తున్నాను.”
12 “నీవు చాలా బాగా కనిపెట్టావు. నేను నీకిచ్చిన సందేశం నిజం కావాలని ఎదురు చూస్తున్నాను”[a] అని యెహోవా అన్నాడు.
13 యెహోవా సందేశం నాకు మళ్లీ వినిపించింది. యెహోవా ఇలా అన్నాడు: “యిర్మీయా, నీవు ఏమి చూస్తున్నావు?”
“నేను ఒక మరుగుతున్న నీళ్ల కుండను చూస్తున్నాను. ఆ కుండ ఉత్తర దిశనుండి ఒరిగి ఉంది” అని నేను యెహోవాకు చెప్పాను.
14 నాతో యెహోవా ఇలా అన్నాడు: “ఉత్తర దిశనుండి ఉపద్రవం రాబోతూవుంది.
ఈ దేశంలో నివసిస్తూ ఉన్న వారందరికీ ఆ విపత్తు వస్తుంది.
15 అనతి కాలంలోనే ఉత్తర ప్రాంత సామ్రాజ్యాల ప్రజలందరికీ నేను పిలుపు యిస్తాను.”
ఇది యెహోవా వాక్కు.
“ఆయా రాజ్యాధినేతలు వస్తారు.
యెరూషలేము ద్వారాల వద్ద వారు తమ సింహాసనాలను ప్రతిష్ఠించుతారు.
యెరూషలేము నగర గోడలమీదికి దండెత్తి వస్తారు.
యూదా రాజ్యంలోని అన్ని నగరాలపై వారు దండయాత్రలు చేస్తారు.
16 అప్పుడు నా ప్రజలపై నా తీర్పును ప్రకటిస్తాను.
వారు చెడు నడతగల వారగుటచేతను, వారు నాపట్ల విముఖులైనందువల్లను నేనిది చేస్తున్నాను. నా ప్రజలు నన్ను విడిచిపెట్టారు.
ఇతర దేవతలకు వారు బలులు అర్పించారు. వారి చేతితో వారు చేసిన బొమ్మలనే వారు ఆరాధించారు.
17 “యిర్మీయా, నీవు మాత్రం సిద్ధంగా ఉండు.
ధైర్యంగా నిలబడి ప్రజలతో మాట్లాడు.
నిన్ను ఏమి చెప్పమని అంటానో అదంతా వారికి తెలియజేయి.
ప్రజలకు నీవు భయపడవద్దు.
నీవు ప్రజలకు భయపడితే,
వారిముందు నీవు భయపడటానికి తగిన కారణం కల్పిస్తాను.
18 నేను మాత్రం ఈ రోజు నిన్నొక
బలమైన నగరం మాదిరిగాను,
ఒక ఇనుప స్థంభం వలెను,
ఒక కంచుగోడ వలెను బలపరుస్తాను.
దానివల్ల ఈ రాజ్యంలో ప్రతి వాని ఎదుట
నీవు ధైర్యంగా నిలువగలవు.
యూదా రాజుల ఎదుట,
యూదా నాయకుల ఎదుట,
యూదా యాజకుల ఎదుట,
మరియు యూదా ప్రజల ఎదుట నీవు ధైర్యంగా నిలువగలవు.
19 వారంతా నిన్నెదిరిస్తారు;
కాని నిన్ను ఓడించలేరు.
ఎందుకంటె నేను నీతో ఉన్నాను;
నేను నిన్ను ఆదుకుంటాను.”
ఇది యెహోవా నుండి వచ్చిన సందేశం.
యేసు యెరూషలేమును చూచి యేడవటం
41-42 ఆయన యెరూషలేము సమీపిస్తూ ఆ పట్టణాన్ని చూసి ఈ విధంగా విలపించ సాగాడు: “శాంతిని స్థాపించటానికి ఏమి కావాలో నీకు ఈ రోజైనా తెలిసుంటే బాగుండేది. కాని అది నీకిప్పుడు అర్థం కాదు. 43 నీ శత్రువులు నీ చుట్టూ గోడకట్టి నాలుగు వైపులనుండి ముట్టడి చేసే రోజులు రానున్నాయి. 44 వాళ్ళు నిన్ను, నీ ప్రజల్ని నేల మట్టం చేస్తారు. దేవుని రాకను నీవు గమనించలేదు. కనుక వాళ్ళు ఒక రాయి మీద యింకొక రాయి ఉండకుండా చేస్తారు.”
© 1997 Bible League International