Revised Common Lectionary (Complementary)
సంగీత నాయకునికి: “దూరపు సింధూర మ్రానులోని పావురము” రాగం. ఫిలిప్తీయులు దావీదును గాతులో పట్టుకొన్నప్పుడు అతడు రచించిన అనుపదగీతం.
56 దేవా, ప్రజలు నా మీద దాడి చేసారు గనుక నాకు దయ చూపించుము.
రాత్రింబగళ్లు వారు నన్ను తరుముతూ పోరాడుతున్నారు.
2 నా శత్రువులు రోజంతా నా మీద దాడి చేసారు.
నాకు విరోధంగా పోరాడేవారు అనేకులు.
3 నేను భయపడినప్పుడు నేను నిన్ను నమ్ముకొంటాను.
4 నేను దేవుని నమ్ముకొన్నాను. కనుక నేను భయపడను. మనుష్యులు నన్ను బాధించలేరు.
దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం కోసం నేనాయనను స్తుతిస్తాను.
5 నా శత్రువులు ఎల్లప్పుడూ నా మాటలు మెలితిప్పుతున్నారు.
వారు ఎల్లప్పుడూ నాకు విరోధంగా చెడు పథకాలు వేస్తున్నారు.
6 వారంతా కలసి దాక్కొని నా ప్రతీ కదలికనూ గమనిస్తున్నారు.
నన్ను చంపుటకు ఏదో ఒక మార్గం కోసం ఎదురు చూస్తున్నారు.
7 దేవా, వారిని తప్పించుకోనియ్యకుము,
వారు చేసే చెడ్డ పనుల నిమిత్తం వారిని శిక్షించుము.
8 నేను చాలా కలవరపడిపోయానని నీకు తెలుసు.
నేను ఎంతగా ఏడ్చానో నీకు తెలుసు
నిజంగా నీవు నా కన్నీళ్ల లెక్క వ్రాసే ఉంటావు.
9 కనుక సహాయం కోసం నేను నీకు మొర పెట్టినప్పుడు నా శత్రువులు ఓడింపబడతారు.
దేవుడు నాతో ఉన్నాడు ఇది నాకు తెలుసు.
10 దేవుడి వాగ్దానం కోసం నేను ఆయనను స్తుతిస్తాను.
యెహోవా నాకు చేసిన వాగ్దానం కోసం నేను ఆయనను స్తుతిస్తాను.
11 నేను దేవుని నమ్ముకొన్నాను అందుచేత నేను భయపడను.
మనుష్యులు నన్ను బాధించలేరు.
12 దేవా, నేను నీతో ప్రత్యేక ప్రమాణం చేసాను. దాన్ని నెరవేరుస్తాను.
నా కృతజ్ఞతార్పణ నేను నీకు యిస్తాను.
13 ఎందుకంటే మరణం నుండి నీవు నన్ను రక్షించావు.
నేను ఓడిపోకుండా నీవు కాపాడావు.
కనుక బ్రతికి ఉన్న మనుష్యులు మాత్రమే
చూడగల వెలుగులో నేను దేవుని ఆరాధిస్తాను.
8 అప్పుడు యెహోవా ఏలీయాతో ఇలా అన్నాడు: 9 “సీదోనులోని సారెపతు అను పట్టణానికి వెళ్లి, అక్కడ నివసించు. ఆ ప్రదేశంలో ఒక విధవరాలు నివసిస్తూవుంది. నీకు ఆహారం ఇవ్వమని ఆమెను ఆదేశించాను.”
10 కావున ఏలీయా సారెపతు అను పట్టణానికి వెళ్లాడు. అతడు నగర ద్వారం వద్దకు వెళ్లే సరికి అతనక్కడ ఒక విధవ స్త్రీని చూశాడు. ఆమె వంటకైపుల్లలు ఏరుకొంటూ వుంది. ఏలీయా ఆమెను, “నాకు తాగటానికి ఒక చెంబుతో నీరు తెచ్చి పెడతావా?” అని అడిగాడు. 11 అతనికి నీరు తేవటానికి ఆమె వెళ్తూండగా, “నాకో రొట్టె ముక్క కూడా దయచేసి తీసుకురా” అని ఏలీయా అన్నాడు.
12 “నీ దేవుడైన యెహోవా సాక్షిగా నేను చెబుతున్నాను. నా వద్ద రొట్టె లేదు. ఒక జాడీలో కొద్దిపిండి మాత్రం వుంది. కూజాలో కొంచెం ఒలీవ నూనెవుంది. నిప్పు రాజేయటానికి రెండు పుల్లలు ఏరుకోడానికి నేనిక్కడికి వచ్చాను. నేనవి తీసుకొని వెళ్లి మా ఆఖరి వంట చేసుకోవాలి. నేను, నా కుమారుడు అది తిని, తరువాత ఆకలితో మాడి చనిపోతాము” అని ఆ స్త్రీ అన్నది.
13 ఏలీయా ఆమెతో ఇలా అన్నాడు: “ఏమీ బాధపడకు. నేను చెప్పిన రీతిలో నీవు ఇంటికి వెళ్లి వంట చేసుకో. కాని నీ వద్దవున్న పిండిలో నుంచి ఒకచిన్న రొట్టె ముందుగా చేసి, దానిని నాకు తెచ్చి పెట్టు. తర్వాత నీ కొరకు, నీ బిడ్డ కొరకు వంట చేసుకో. 14 ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఇలా అన్నాడు: ‘ఆ పిండి జాడీ ఎప్పుడూ ఖాళీ కాదు. ఆ కూజాలో నూనె ఎప్పుడూ తరిగిపోదు. ఈ రాజ్యంమీద యెహోవా వర్షం కురింపించే వరకు ఇది కొనసాగుతుంది.’”
15 అందువల్ల ఆ స్త్రీ ఇంటికి వెళ్లింది. ఏలీయా ఆమెకు ఏమి చేయమని చెప్పాడో అదంతా చేసింది. ఏలీయా, ఆ స్త్రీ, ఆ కుమారుడు చాలా దినముల వరకు సరిపడు ఆహారం కలిగియున్నారు. 16 పిండిజాడీ, నూనె కూజా ఎన్నడూ ఖాళీ కాలేదు. యెహోవా ఎలా జరుగుతుందని చెప్పాడో, అంతా అలానే జరిగింది. ఈ విషయాలన్నీ యెహోవా ఏలీయా ద్వారా చెప్పాడు.
ఆత్మ ఇచ్చిన జ్ఞానము
6 కాని ఆత్మీయ పరిపూర్ణత పొందినవాళ్ళకు మేము జ్ఞానంతో నిండిన సందేశం చెపుతాము. ఆ సందేశం ఈ ప్రపంచానికి సంబంధించిన జ్ఞానం కాదు. అది ప్రపంచాన్ని పాలించే పాలకులకు సంబంధించిన జ్ఞానమూ కాదు. చివరికి ఆ పాలకులు లేకుండా పోతారు. 7 నేను చెపుతున్నది దేవుడు చెప్పిన రహస్య జ్ఞానం. “ఇది” ఇంతదాకా మానవులనుండి రహస్యంగా దాచబడిన జ్ఞానం. ఆ జ్ఞానం ద్వారా మనకు మహిమ కలగాలని కాలానికి ముందే దేవుడు నిర్ణయించాడు. 8 ఈనాటి పాలకులు దాన్ని అర్థం చేసుకోలేదు. దాన్ని అర్థం చేసుకొనివుంటే మహిమా స్వరూపి అయిన మన ప్రభువును సిలువకు వేసి చంపేవాళ్ళు కాదు. 9 దీన్ని గురించి ప్రవచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది:
“దేవుడు తనను ప్రేమించిన వాళ్ళకోసం సిద్ధంగా
ఉంచిన వాటిని ఎవరి కళ్ళూ చూడలేదు.
ఎవరి చెవులు వినలేదు.
ఎవరూ వాటిని ఊహించలేదు.”(A)
10 కాని దేవుడు ఈ రహస్యాన్ని మనకు తన ఆత్మ ద్వారా తెలియచేసాడు.
ఆత్మ అన్నిటినీ పరిశోధిస్తాడు. దేవునిలో దాగి ఉన్నవాటిని కూడా పరిశోధిస్తాడు. 11 మానవునిలో ఉన్న ఆలోచనలు అతనిలో ఉన్న ఆత్మకు తప్ప ఇతరులకు తెలియదు. అదే విధంగా దేవునిలో ఉన్న ఆలోచనలు ఆయన ఆత్మకు తప్ప ఇతరులకు తెలియదు. 12 మనం ఈ ప్రపంచానికి సంబంధించిన ఆత్మను పొందలేదు. దేవుడు పంపిన ఆత్మను మనం పొందాము. తాను ఉచితంగా యిచ్చినవాటిని గురించి మనం తెలుసుకోవాలని ఆయన ఉద్ధేశ్యం.
13 మానవులు తమ జ్ఞానంతో బోధించిన పదాలను వాడకుండా ఆత్మ బోధించిన పదాలను వాడి, ఆత్మీయ సత్యాలను ఆత్మీయ భాషలో చెపుతూ ఉంటాము. 14 తనలో దేవుని ఆత్మ లేని మానవుడు, దేవుని ఆత్మ ఇచ్చే వరాలను అంగీకరించడు. అతనికవి మూర్ఖంగా కనిపిస్తాయి. వాటిని ఆత్మీయంగా మాత్రమే అర్థం చేసుకోగలము కనుక అతడు వాటిని అర్థం చేసుకోలేడు. 15 ఆత్మీయంగా ఉన్నవాడు అందరిపై తీర్పు చెప్పకలడు. కాని అతనిపై ఎవడూ తీర్పు చెప్పలేడు. 16 దీన్ని గురించి ప్రవచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది:
“ప్రభువులో ఉన్న జ్ఞానం ఎవరు తెలుసుకోగలరు? ప్రభువుకు ఎవరు సలహా యివ్వగలరు?”(B)
కాని మన విషయం వేరు. మనలో క్రీస్తు మనస్సు ఉంది.
© 1997 Bible League International