Revised Common Lectionary (Complementary)
యిర్మీయాకు దేవుని పిలుపు
4 యెహోవా వాక్కు నాకు చేరింది. ఈ వర్తమానం యెహోవా వద్ద నుండి వచ్చింది.
5 “నీ తల్లి గర్భంలో నిన్ను నేను రూపించక ముందే
నిన్ను నేనెరిగియున్నాను.
నీవు పుట్టకముందే
నిన్నొక ముఖ్యమైన పనికి ఎన్నుకున్నాను.
దేశాలకు నిన్నొక ప్రవక్తగా నియమించాను.”
6 అప్పుడు, యిర్మీయానగు నేను “సర్వశక్తిమంతుడవైన యెహోవా! నేనెలా మాట్లాడాలో నాకు తెలియదు. నేను బాలుడను” అని అన్నాను.
7 కాని యెహోవా ఇలా అన్నాడు:
“బాలుడనని అనవద్దు.
నేను నిన్నెక్కడికి పంపుతానో నీవచ్చటికి తప్పక వెళ్లాలి.
నిన్ను ఏమి చెప్పమని అంటానో అదంతా నీవు చెప్పాలి.
8 ఎవ్వరికీ భయపడకు.
నేను నీతో ఉన్నాను. నేను నిన్ను కాపాడతాను”.
ఈ వర్తమానం యెహోవానైన నా వద్దనుండి వచ్చినది.
9 పిమ్మట యెహోవా తన చేయి చాచి నా నోటిని తాకాడు. యెహోవా నాతో ఇలా అన్నాడు:
“యిర్మీయా, నేను నా వాక్కును నీ నోటిలో ఉంచుతున్నాను.
10 దేశాలను, సామ్రాజ్యాలను ఈ రోజు నీ జవాబుదారిలో ఉంచుతున్నాను.
నీవు వారిని కూకటి వేళ్లతో పెకలించి చీల్చివేస్తావు.
నీవు వాటిని సర్వనాశనం చేసి పడత్రోస్తావు.
నీవు వాటిని కట్టి నాటుతావు.”
71 యెహోవా, నేను నిన్ను నమ్ముకొన్నాను.
కనుక నేను ఎన్నటికీ నిరాశ చెందను.
2 నీ మంచితనాన్ని బట్టి నీవు నన్ను రక్షిస్తావు. నీవు నన్ను తప్పిస్తావు.
నా మాట వినుము. నన్ను రక్షించుము.
3 భద్రత కోసం నేను పరుగెత్తి చేరగల గృహంగా, నా కోటగా ఉండుము.
నన్ను రక్షించుటకు ఆజ్ఞ ఇమ్ము.
నీవు నా బండవు కనుక నా క్షేమస్థానమై ఉన్నావు.
4 నా దేవా, దుర్మార్గుల నుండి నన్ను రక్షించుము.
కృ-రమైన దుర్మార్గుల నుండి నన్ను రక్షించుము.
5 నా ప్రభువా, నీవే నా నిరీక్షణ.
నేను నా యౌవనకాలంనుండి నిన్ను నమ్ముకొన్నాను.
6 నేను పుట్టినప్పటినుండి నీమీదనే ఆధారపడ్డాను.
నా తల్లి గర్భమునుండి నీవు నన్ను జన్మింపజేశావు.
నేను ఎల్లప్పుడూ నిన్నే ప్రార్థించాను.
ప్రేమను నీ మార్గదర్శిగా ఉండనివ్వు
13 ఇతరుల భాషల్లో, దేవదూతల భాషల్లో మాట్లాడగలిగిన నాలో ప్రేమ లేకపోతే నా మాటలకు అర్థం ఉండదు. 2 నాకు దైవసందేశం చెప్పే వరం ఉన్నా, నాలో సంపూర్ణ జ్ఞానం ఉన్నా, నాకు అన్ని రహస్యాలు తెలిసినా, నాలో పర్వతాలను కదిలించగల విశ్వాసం ఉన్నా, నాలో ప్రేమ లేకపోయినట్లయితే నేను నిరర్థకుణ్ణి. 3 నేను నా సర్వము పేదలకు దానం చేసినా, నా దేహాన్ని అగ్నికి అర్పితం చేసినా నాలో ప్రేమ లేకపోతే అది నిరర్థకము.
4 ప్రేమలో సహనము ఉంది. ప్రేమలో దయ ఉంది. ప్రేమలో ఈర్ష్య లేదు. అది గొప్పలు చెప్పుకోదు. దానిలో గర్వము లేదు. 5 దానిలో క్రూరత్వము లేదు. దానిలో స్వార్థం లేదు. దానికి ముక్కు మీద కోపం ఉండదు. అది తప్పులు ఎంచదు. 6 ప్రేమ చెడును గురించి ఆనందించదు. అది సత్యాన్నిబట్టి ఆనందిస్తుంది. 7 ప్రేమ అన్ని సమయాల్లో కాపాడుతుంది. అది అన్ని వేళలా విశ్వసిస్తుంది. ఆశను ఎన్నటికీ వదులుకోదు. అది ఎప్పుడూ సంరక్షిస్తుంది.
8 దైవసందేశాన్ని చెప్పే వరము మనము పొందాము. అది అంతమౌతుంది. తెలియని భాషల్లో మాట్లాడే శక్తి మనకు ఉంది. అది అంతమౌతుంది. మనలో జ్ఞానం ఉంది. అది నశించిపోతుంది. కాని ప్రేమ నశించి పోదు. 9 ఎందుకంటే, మన జ్ఞానం మితమైంది, మనకుండే ఈ సందేశము అసంపూర్ణమైనది. 10 అయితే సంపూర్ణత కలిగినప్పుడు ఈ అసంపూర్ణత అంతమౌతుంది.
11 నేను పసివానిగా ఉన్నప్పుడు పసివాని మాటలు, అనుభవాలు, ఆలోచనలు నాలో ఉండేవి. నేను యవ్వనంలోకి వచ్చాక నా బాల్యంలో ఉన్న గుణాల్ని మరిచిపోయాను. 12 ప్రస్తుతం అద్దంలో మసకగా కనిపిస్తున్న ప్రతిబింబాన్ని మాత్రమే మనము చూస్తున్నాము. తదుపరి మనము ఆ ముఖాన్ని స్పష్టంగా చూస్తాము. ఇప్పుడు నాకు తెలిసింది సంపూర్ణం కాదు. కాని తదుపరి నా గురించి దేవునికి తెలిసినంత సంపూర్ణంగా నాకు ఆయన్ని గురించి తెలుస్తుంది. 13 అంతందాకా ఈ మూడు, అంటే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఉంటాయి. వీటిలో ప్రేమ గొప్పది.
21 ఆయన వాళ్ళతో, “ఈ రోజు గ్రంథములో వ్రాయబడిన ఈ వాక్యాలు మీరు వింటుండగానే నెరవేరాయి” అని అన్నాడు.
22 అంతా ఆయన్ని మెచ్చుకున్నారు. అంతే కాక ఆయన నోటినుండి వచ్చిన ఆ చక్కటి మాటలు విని అందరూ ఆశ్చర్యపోయారు. వాళ్ళు, “ఈయన యోసేపు కుమారుడు కదా!” అని అన్నారు.
23 యేసు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “‘వైద్యుడా! నిన్ను నీవు నయం చేసుకో!’ అన్న సామెత మీరు నాకు చెబుతారని తెలుసు. పైగా మీరు, ‘కపెర్నహూములో చేసిన మహాత్యాల్ని గురించి మేము విన్నాము. వాటిని యిక్కడ నీ స్వగ్రామంలో కూడా చెయ్యి!’ అని అంటారని నాకు తెలుసు. 24 ఇది నిజం. ఏ ప్రవక్తనూ అతని స్వగ్రామపు ప్రజలు అంగీకరించలేదు.
25 “ఏలీయా కాలంలో ఇశ్రాయేలు దేశంలో చాలామంది వితంతువులుండినారని ఖచ్చితంగా చెప్పగలను. ఆ కాలంలో మూడున్నర సంవత్సరాలు వర్షాలు కురియలేదు. దేశమంతటా తీవ్రమైన కరువు వ్యాపించి ఉంది. 26 సీదోను రాష్ట్రంలోని సారెపతు అనే గ్రామంలో ఒక వితంతువు ఉండేది. దేవుడు ఏలీయాను ఆమె దగ్గరకు తప్పమరెవ్వరి దగ్గరకు పంపలేదు.
27 “ప్రవక్త ఎలీషా[a] కాలంలో ఇశ్రాయేలు దేశంలో చాలా మంది కుష్టురోగులుండే[b] వాళ్ళు. కాని సిరియ దేశానికి చెందిన నయమాను అనేవాణ్ణి తప్ప దేవుడు వీళ్ళలో ఒక్కరిని కూడా నయం చేయలేదు.”
28 సమాజ మందిరములో వున్న వాళ్ళందరికి యిది విని ఆయనపై చాలా కోపం వచ్చింది. 29 వాళ్ళు లేచి ఆయన్ని గ్రామం నుండి వెళ్ళగొట్టారు. ఆ గ్రామం కొండ మీద ఉంది. వాళ్ళు ఆయన్ని క్రిందికి త్రోయాలని కొండ చివరకు తీసుకు వెళ్ళారు. 30 కాని ఆయన వాళ్ళ మధ్యనుండి నడిచి తన దారిన తాను వెళ్ళి పోయాడు.
© 1997 Bible League International