Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 119:89-96

లామెద్

89 యెహోవా, నీ మాట శాశ్వతంగా కొనసాగుతుంది. నీ మాట పరలోకంలో శాశ్వతంగా కొనసాగుతుంది.
90 నీవు ఎప్పటికీ నమ్మదగిన వాడవు.
    యెహోవా, భూమిని నీవు చేశావు, అది ఇంకా నిలిచి ఉంది.
91 నీ ఆజ్ఞ మూలంగా, ఇంకా అన్నీ కొనసాగుతాయి.
    యెహోవా, అన్నీ నీ సేవకుల్లా నీ ఆజ్ఞకు లోబడుతాయి.
92 నీ ఉపదేశాలు నాకు స్నేహితుల్లా ఉండకపోతే,
    నా శ్రమ నన్ను నాశనం చేసి ఉండేది.
93 యెహోవా, నీ ఆజ్ఞలు నన్ను జీవింపజేస్తాయి
    కనుక నేను ఎన్నటికీ వాటిని మరచిపోను.
94 యెహోవా, నేను నీ వాడను. నన్ను రక్షించుము.
    ఎందుకంటే, నేను నీ ఆజ్ఞలకు విధేయుడనగుటకు కష్టపడి ప్రయత్నిస్తాను.
95 దుష్టులు నన్ను నాశనం చేయాలని ప్రయత్నించారు.
    అయితే నీ ఒడంబడిక నాకు తెలివినిచ్చింది.
96 నీ ధర్మశాస్త్రానికి తప్ప
    ప్రతిదానికీ ఒక హద్దు ఉంది.

యిర్మీయా 36:1-10

యిర్మీయా పుస్తకాన్ని రాజైన యెహోయాకీము తగలబెట్టటం

36 యిర్మీయాకు యెహోవా నుండి వర్తమానం వచ్చింది. ఇది యెషీయా కుమారుడైన యెహోయాకీము యూదా రాజ్యాన్ని పాలిస్తున్న నాల్గవ సంవత్సరం. యెహోవా వర్తమానం ఇలా వుంది: “యిర్మీయా, నీవు పుస్తకపు చుట్ట తీసుకొని నేను యిచ్చే సందేశాలన్నిటినీ గ్రంథస్థం చేయుము. ఇశ్రాయేలు, యూదా రాజ్యాల గురించి, తదితర రాజ్యాల గురించి నేను నీతో మాట్లాడియున్నాను. యోషీయా రాజైనప్పటి నుండి ఈ నాటి వరకు నేను నీతో చెప్పిన మాటలన్నీ వ్రాయుము. యూదా వంశం వారికి నేను చేయాలని ప్రయత్నిస్తున్న కీడు అంతా బహుశః వారు వినవచ్చు. బహుశః వారు దుష్కార్యాలు చేయటం మాని వేయవచ్చు. వారలాచేస్తే గతంలో వారు చేసిన మహా పాపాలన్నిటినీ నేను క్షమిస్తాను.”

కావున బారూకు అనే వానిని యిర్మీయా పిలిచాడు. బారూకు తండ్రి పేరు నేరీయా, యెహోవా తనతో చెప్పిన సందేశాలన్నిటిని యిర్మీయా బయటికి పలికాడు. యిర్మీయా మాట్లాడుతూ ఉండగా, బారూకు గ్రంథస్థం[a] చేశాడు. పిమ్మట బారూకుతో యిర్మీయా ఇలా అన్నాడు: “నేను దేవాలయంలోనికి వెళ్లలేను. నేనక్కడికి వెళ్లటానికి అనుమతి లేదు. అందుచేత నీవే దేవాలయానికి వెళ్లాలని నా కోరిక, ఉపవాసాల రోజున నీవక్కడికి వెళ్లి, నీవు వ్రాసిన విషయాలు ప్రజలకు చదివి వినిపించుము. నీవు రాసిన యెహోవా వర్తమానాలను నేను నీకు చెప్పిన విధంగా చదివి వినిపించు. యూదా పట్టణాల నుండి యెరూషలేముకు వచ్చే ప్రజలందరికీ ఆ వర్తమానాలను చదివి వినిపించు. బహుశః ఆ ప్రజలు తమకు సహాయపడమని యెహోవాను వేడు కొనవచ్చు. బహుశః ప్రతి ఒక్కడూ చెడుకార్యాలు చేయటం మానివేయవచ్చు. వారిపట్ల తాను చాలా కోపంగా వున్నట్లు యెహోవా ప్రకటించియున్నాడు.” కావున నేరీయా కుమారుడైన బారూకు ప్రవక్త అయిన యిర్మీయా చెప్పిన ప్రకారం చేశాడు. బారూకు తాను గ్రంథస్థం చేసిన యెహోవా వర్తమానాన్ని బిగ్గరగా చదివాడు. అతను దానిని యెహోవా ఆలయంలో చదివాడు.

రాజైన యెహోయాకీము పాలన ఐదు సంవత్సరాలు దాటి తొమ్మిదవ నెల జరుగుతూ ఉండగా ఉపవాస దినం ప్రకటించబడింది. యెరూషలేము నగర వాసులు, యూదా పట్టణాల నుంచి యెరూషలేముకు వచ్చి నివసిస్తున్న వారందరం యెహోవా ముందు ఉపవాసము చేయవలసి ఉంది. 10 ఆ సమయంలో యిర్మీయా మాటలన్నిటినీ తాను వ్రాసి ఉంచిన పుస్తకంనుండి బారూకు చదివాడు. దానినతడు దేవాలయంలో చదివాడు. దేవాలయంలో చేరిన ప్రజలంతా వినేలా బారూకు తాను వ్రాసిన పుస్తకాన్ని చదివాడు. తన పత్రం (పుస్తకం) చదివినప్పుడు బారూకు పైఆవరణలో ఉన్న గెమర్యా గదిలో ఉన్నాడు. ఆలయ నూతన ద్వారం వద్ద ఆ గది నిర్మింపబడి ఉంది గెమర్యా తండ్రి పేరు షాఫాను. గెమర్యా అను వ్యక్తి దేవాలయంలో వ్రాయువాడు (లేఖికుడు)

1 కొరింథీయులకు 14:1-12

వరాలు, వాటి ప్రాముఖ్యత

14 కనుక ప్రేమ మార్గాన్ని అనుసరించండి. ఆత్మీయ శక్తి లభించాలని, ముఖ్యంగా దైవసందేశం ప్రకటించగలిగే వరం లభించాలని ఆశించండి. తనకు తెలియని భాషలో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడన్నమాట. మానవులతో కాదు. అతని మాటలు ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. అతడు పవిత్రాత్మ శక్తితో రహస్యాలను చెబుతూ ఉంటాడు. కాని దైవసందేశం చెప్పేవాడు విశ్వాసాన్ని బలపరచాలని ప్రజల్లో ఉత్సాహము, శాంతి కలిగించాలని దైవసందేశం చెపుతాడు. తనకు తెలియని భాషలో మాట్లాడేవాడు తనకు మాత్రమే మేలు కలిగించుకొంటాడు. కాని దైవసందేశం చెప్పేవాడు సంఘానికి మేలు కలిగిస్తాడు.

మీలో ప్రతి ఒక్కడూ తెలియని భాషల్లో మాట్లాడితే నాకు యిష్టమే. కాని మీరు దైవసందేశం చెప్పటం నాకు ఇంకా ఎక్కువ యిష్టం. తెలియని భాషల్లో మాట్లాడేవాని మాటలకు అర్థం విడమర్చి చెప్పేవాడు ఉంటే సంఘానికి లాభం కలుగుతుంది. అది సంభవించకపోతే తెలియని భాషల్లో మాట్లాడేవానికన్నా దైవసందేశం చెప్పేవాడే గొప్ప.

సోదరులారా! నేను అక్కడికి వచ్చి తెలియని భాషలో మాట్లాడితే మీకు ఏం లాభం కలుగుతుంది? నా ద్వారా మీకు దేవుడు ఒక క్రొత్త విషయం తెలియచెయ్యాలి. లేక నా ద్వారా మీకు జ్ఞానం కలగాలి. లేక మీకు నా ద్వారా దైవసందేశం తెలియాలి. లేక నేను మీకు ఒక క్రొత్త విషయం బోధించగలగాలి. అలా జరగనట్లయితే లాభం ఏమిటి? పిల్లన గ్రోవి, వీణ వంటి ప్రాణం లేని వస్తువులు కూడా శబ్దం చేస్తాయి. వాటి స్వరాల్లో భేదం లేకుంటే ఏ వాయిద్యం వాయిస్తున్నారో ఎట్లా తెలుస్తుంది? బాకా సక్రమంగా ఊది పిలవకుంటే యుద్ధానికి ఎవరు సిద్ధమౌతారు?

అదే విధంగా మీ నాలుకతో అర్థం అయ్యే పదాలు మాట్లాడితే తప్ప మీరేం మాట్లాడుతున్నారో యితరులకు ఎట్లా అర్థం అవుతుంది? మీరు గాలిలో మాట్లాడినట్లు ఉంటుంది. 10 ప్రపంచంలో చాలా రకాల భాషలు ఉన్నాయి. సందేహం లేదు. కాని అర్థం లేని భాష ఏదీ లేదు. 11 ఒకడు మాట్లాడే విషయం నేను అర్థం చేసుకోలేకపోతే, నేను అతనికి పరదేశీయునిగా, అతడు నాకు పరదేశీయునిగా ఉంటాము. 12 మీకు ఆత్మీయ శక్తి లభించాలని ఆసక్తి ఉంది. కనుక సంఘాన్ని అభివృద్ధి పరిచే వరాలను అమితంగా కోరుకొండి.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International