Revised Common Lectionary (Complementary)
సంగీత నాయకునికి: దావీదు కీర్తన.
19 ఆకాశాలు దేవుని మహిమను తెలియజేస్తున్నాయి.
యెహోవా చేతులు చేసిన మంచివాటిని అంతరిక్షం తెలియజేస్తుంది.
2 ప్రతి క్రొత్త రోజూ ఆ గాథను మరింత చెబుతుంది.
ప్రతి రాత్రి దేవుని గురించి మరింత ఎక్కువగా తెలియజేస్తుంది.
3 నిజానికి నీవు ఏ ఉపన్యాసం గాని మాటలుగాని వినలేవు.
మనం వినగలిగిన శబ్దం ఏదీ అవి చేయవు.
4 అయినా వాటి “స్వరం” ప్రపంచం అంతా ప్రసరిస్తుంది.
వాటి “మాటలు” భూమి చివరి వరకూ వెళ్తాయి.
అంతరిక్షం సూర్యునికి ఒక ఇల్లు లాంటిది.
5 తన పడక గది నుండి వచ్చే సంతోష భరితుడైన పెండ్లి కుమారునిలా సూర్యుడు బయటకు వస్తాడు.
పందెంలో పరుగెత్తడానికి ఆత్రంగా ఉన్న ఆటగానిలా సూర్యుడు
ఆకాశంలో తన దారిని మొదలు పెడతాడు.
6 సూర్యుడు అంతరిక్షంలోని ఒక దిశలో మొదలు పెడ్తాడు,
మరియు ఆవలి దిశకు అది పరుగెడుతుంది.
దాని వేడి నుండి ఏదీ దాక్కొలేదు. యెహోవా ఉపదేశాలు అలా ఉన్నాయి.
7 యెహోవా ఉపదేశాలు పరిపూర్ణం.
అవి దేవుని ప్రజలకు బలాన్నిస్తాయి.
యెహోవా ఒడంబడిక విశ్వసించదగింది.
జ్ఞానం లేని మనుష్యులకు అది జ్ఞానాన్ని ఇస్తుంది.
8 యెహోవా చట్టాలు సరియైనవి.
అవి మనుష్యులను సంతోషపెడ్తాయి.
యెహోవా ఆదేశాలు పరిశుద్ధమైనవి.
ప్రజలు జీవించుటకు సరైన మార్గాన్ని చూపడానికి అవి కన్నులకు వెలుగునిస్తాయి.
9 యెహోవాను ఆరాధించుట మంచిది.
అది నిరంతరము నిలుస్తుంది.
యెహోవా తీర్పులు సత్యమైనవి, న్యాయమైనవి.
అవి సంపూర్ణంగా సరియైనవి.
10 శ్రేష్ఠమైన బంగారంకంటె యెహోవా ఉపదేశాలను మనము ఎక్కువగా కోరుకోవాలి.
సాధారణ తేనె పట్టు నుండి వచ్చే శ్రేష్ఠమైన తేనె కంటె అవి మధురంగా ఉంటాయి.
11 యెహోవా ఉపదేశాలు నీ సేవకుణ్ణి చాలా తెలివిగలవాణ్ణిగా చేస్తాయి.
నీ చట్టాలు పాటించేవారు గొప్ప ప్రతిఫలాన్ని పొందుతారు.
12 యెహోవా, ఏ వ్యక్తీ, తన స్వంత తప్పులన్నింటినీ చూడలేడు.
కనుక నేను రహస్య పాపాలు చేయకుండా చూడుము.
13 యెహోవా, నేను చేయాలనుకొనే పాపాలు చేయకుండా నన్ను ఆపుచేయుము.
ఆ పాపాలు నా మీద అధికారం చెలాయించ నీయకుము.
నీవు నాకు సహాయం చేస్తే, అప్పుడు నేను గొప్ప పాపము నుండి, పవిత్రంగా దూరంగా ఉండగలను.
14 నా మాటలు, తలంపులు నిన్ను సంతోషపెడ్తాయని నేను ఆశిస్తున్నాను.
యెహోవా, నీవే నా ఆశ్రయ దుర్గం. నీవే నన్ను రక్షించేవాడవు.
అర్తహషస్త నెహెమ్యాను యెరూషలేముకు పంపటం
2 అర్తహషస్త రాజు పాలన ఇరవయ్యవ సంపత్సరం, నీసాను నెలలో,[a] ఎవరో కొంత ద్రాక్షారసం తెచ్చి ఇచ్చారు. నేను ముందు దాన్ని తాగి, పరిక్షించి, తర్వాత దాన్ని రాజుకు అందించాను. నేను రాజు సమక్షంలో వున్నప్పుడెప్పుడూ విచారంగా లేను, కాని అప్పుడు విచారంగా వున్నాను. 2 దానితో, రాజు నన్ను, “నీ ఒంట్లో బాగాలేదా, ఎందుకలా విచారంగా కనిపిస్తున్నావు? నీ గుండెల్లో విచారం గూడు కట్టుకుందన్నట్లు అనిపిస్తోంది” అని ప్రశ్నించాడు.
అప్పుడు నేను చాలా భయపడ్డాను. 3 అయితేనేమి, నేను భయపడినా కూడా, రాజుతో, “రాజు చిరంజీవిగా వర్ధిల్లాలి! నా పూర్వీకులు సమాధి చేయబడిన నగరం శిథిలమైంది. ఆ నగర ప్రాకార ద్వారాలు దగ్ధం చేయబడ్డాయి” అని విన్నవించాను.
4 అప్పుడు రాజు, “నీకు నావల్ల ఏ సహాయం కావాలి?” అని నన్ను అడిగాడు.
జవాబిచ్చేందుకు ముందు, నేను పరలోక దేవుణ్ణి ప్రార్థించి. 5 రాజుకు ఇలా సమాధానమిచ్చాను. “రాజుకు దయ కలిగితే, నేను తమపట్ల మంచిగా ప్రవర్తించివుంటే, దయచేసి నన్ను నా పూర్వీకులు సమాధి చేయబడిన యెరూషలేము నగరానికి పంపండి. నేను అక్కడికి పోయి, ఆ నగరాన్ని తిరిగి నిర్మించాలని కోరుకొంటున్నాను.”
6 అప్పుడు రాణి రాజు పక్కనే కూర్చుని వుంది. రాజు మరియు రాణి, “నీ ప్రయాణానికి ఎన్ని రోజులు పడుతుంది? నువ్విక్కడకి తిరిగి ఎప్పుడు వస్తావు?” అని అడిగారు.
అందుకని, ఇంత సమయము పట్టును అని చెప్పాను, నన్ను పంపేందుకు రాజుగారు సంతోషంగా ఒప్పుకున్నారు. 7 నేను రాజుతో ఇంకా యిలా మనవి చేసుకున్నాను: “రాజురు దయదలిస్తే మరో కోరిక కూడా కోరుకుంటాను. యూఫ్రటీసు నది పశ్చిమ ప్రాంతపు పాలనాధికార్లకు కొన్ని ఉత్తరువు లేఖలు ఇప్పించండి. నేను యూదాకి పోయే మార్గంలో వారివారి ప్రాంతాల్లో క్షేమంగా పోయేందుకు ఆ పాల నాధికార్లు నాకు అనుమతి ఇచ్చేందుకు ఈ లేఖలు నాకు అవసరము. 8 నగర ప్రాకార ద్వారాలకూ, గోడలకూ, ఆలయ ప్రాకారానికీ,[b] నా యింటికీ కలప కావాలి. తమ అడవులకు బాధ్యుడైన అధికారి ఆసాపుకి ఒక లేఖ ఇవ్వండి.”
రాజు నాకు లేఖలే కాకుండా, నేను కోరినవన్నీ ఇచ్చాడు. నా పట్ల దేవుని దయ కారణంగా రాజు ఇవన్నీ చేశాడు.
9 సరే, నేను యూఫ్రటిసు నది పశ్చిమ ప్రాంతాల పాలనాధికారి వద్దకు వెళ్లాను. నేను రాజురి లేఖలు వారికి యిచ్చాను. రాజు నాకు తోడుగా కొందరు సైనికోద్యోగులను, అశ్విక సైనికులను కూడా పంపాడు. 10 నేను చేస్తున్నదేమిటో చూసినవాళ్లు ఇద్దరు, సన్బల్లటు, టోబీయా. వాళ్లు కలత చెందారు. ఇశ్రాయేలు ప్రజలకి తోడ్పడేందుకు ఎవరో వచ్చినందుకు వాళ్లకి కోపం కలిగింది. సన్బల్లటు హారోనీయుడు, టోబీయా అమ్మోనీయుడు.
క్రొత్త జీవితము
12 అందువల్ల నా సోదరులారా! నేను మీకీ విజ్ఞప్తి చేస్తున్నాను, దేవుడు తన అనుగ్రహం చూపించాడు కనుక మీ జీవితాల్ని ఆయనకు అర్పించుకోండి. ఆయనకు ఆనందం కలిగేటట్లు పవిత్రంగా జీవించండి. ఇదే మీరు చేయవలసిన నిజమైన సేవ! 2 ఇక మీదట ఈ లోకం తీరును అనుసరిస్తూ జీవించకండి. మీ మనస్సు మార్చుకొని మీరు కూడా మార్పు చెందండి. అప్పుడు మీరు దైవేచ్ఛ ఏమిటో తెలుసుకొని, అది ఉత్తమమైనదనీ, ఆనందం కలిగిస్తుందనీ, పరిపూర్ణమైనదనీ గ్రహిస్తారు!
3 దేవుడు నాకిచ్చిన అనుగ్రహాన్ని ఆధారంగా తీసుకొని మీలో ప్రతి ఒక్కరికీ నేను చెప్పేదేమిటంటే, మిమ్మల్ని గురించి మీరు ఉన్నదాని కంటే గొప్పగా భావించకండి. సక్రమంగా ఉండి దేవుడిచ్చిన విశ్వాసంతో మిమ్మల్ని మీరు అంచనా వేసుకోండి. 4 దేహానికి ఎన్నో అవయవాలుంటాయి. ఈ అవయవాలన్నిటికీ ఒకే పని ఉండదు. 5 అదే విధంగా అధిక సంఖ్యలో ఉన్న మనమంతా క్రీస్తులో ఒకే దేహంగా రూపొందింపబడ్డాము. ప్రతి సభ్యునికి మిగతా సభ్యులతో సంబంధం ఉంది.
6 దేవుని అనుగ్రహం వల్ల మనందరికి రకరకాల కృపావరాలు లభించాయి. దైవసందేశాన్ని గురించి మాట్లాడే వరాన్ని పొందినవాళ్ళు ఆ పనిని విశ్వాసంతో చెయ్యాలి. 7 సేవ చేసే వరం పొందినవాళ్ళు సేవ చెయ్యాలి. బోధించే వరం పొందినవాళ్ళు బోధించాలి. 8 ప్రజలను ప్రోత్సాహపరచే వరం పొందినవాళ్ళు ప్రోత్సాహ పరచాలి. దానం చేసే వరం పొందినవాళ్ళు ధారాళంగా దానం చెయ్యాలి. నాయకత్వం వహించాలని వరం పొందినవాళ్ళు శ్రద్ధతో నాయకత్వం చెయ్యాలి. దయ చూపాలని వరం పొందినవాళ్ళు ఆనందంగా దయ చూపాలి.
© 1997 Bible League International