Revised Common Lectionary (Complementary)
క్రొత్త యెరూషలేము మంచితనంతో నిండిన నగరం
62 సీయోను అంటే నాకు ప్రేమ.
అందుచేత నేను ఆమె పక్షంగా ఇంకా మాట్లాడతాను.
యెరూషలేము అంటే నాకు ప్రేమ.
అందుచేత నేను మాట్లాడటం చాలించను.
మంచితనం పెద్ద వెలుగుగా ప్రకాశించేంత వరకు నేను మాట్లాడతాను.
ఒక జ్వాలలా రక్షణ నుండి ప్రకాశించేంత వరకు నేను మాట్లాడతాను.
2 అప్పుడు సకల రాజ్యాలు నీ మంచితనాన్ని చూస్తాయి.
రాజులందరూ నీ గౌరవాన్ని చూస్తారు.
అప్పుడు నీకు ఒక క్రొత్త పేరు ఇవ్వబడుతుంది.
ప్రజలారా, యెహోవా తానే మీకు ఆ క్రొత్త పేరు ఇస్తాడు.
3 యెహోవా మీ విషయం ఎంతో అతిశయిస్తాడు.
యెహోవా చేతిలో అందాల కిరీటంలా ఉంటారు మీరు.
4 “దేవుడు విడిచిపెట్టిన ప్రజలు” అని ఇంకెన్నడూ మీరు పిలువబడరు.
“దేవుడు నాశనం చేసిన దేశం” అని మీ దేశం ఇంకెన్నటికి పిలువబడదు.
“దేవుడు ప్రేమించే ప్రజలు” అని మీరు పిలువబతుతారు.
“దేవుని వధువు” అని మీ దేశం పిలువబడుతుంది.
ఎందుకంటె యెహోవా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు గనుక.
మరియు మీ దేశం ఆయనకు చెందుతుంది.
5 ఒక యువకుడు ఒక స్త్రీని ప్రేమించినప్పుడు అతడు ఆమెను పెండ్లి చేసుకొంటాడు. మరియు ఆమె అతనికి భార్య అవుతుంది.
అదేవిధంగా మీ దేశం మీ పిల్లలకు చెందుతుంది.
ఒకడు తన నూతన భార్యతో ఎంతో సంతోషిస్తాడు.
అదే విధంగా, మీ దేవుడు మీతో ఎంతో సంతోషిస్తాడు.
5 యెహోవా, నీ నిజమైన ప్రేమ ఆకాశాల కంటె ఉన్నతమైనది.
నీ నమ్మకత్వం మేఘాలకంటె ఉన్నతం.
6 యెహోవా, నీ నీతి “దేవతల పర్వతాల కంటె ఉన్నతమైనది.”
నీ న్యాయం లోతైన మహాసముద్రం కంటె లోతైనది.
యెహోవా, నీవు మానవులను, జంతువులను కాపాడుతావు.
7 ప్రేమగల నీ దయకంటె ఎక్కువ ప్రశస్తమైనది ఇంకేది లేదు.
కాపుదల కోసం మనుష్యులు, దేవ దూతలు నీ దగ్గరకు వస్తారు.
8 యెహోవా, నీ ఇంటిలోని సమృద్ధియైన ఆహారంనుండి వారు నూతన బలం పొందుతారు.
అధ్బుతమైన నీ నదిలోనుండి నీవు వారిని త్రాగనిస్తావు.
9 యెహోవా, జీవపు ఊట నీ నుండి ప్రవహిస్తుంది.
నీ వెలుగు మమ్మల్ని వెలుగు చూడనిస్తుంది.
10 యెహోవా, వాస్తవంగా నిన్ను ఎరిగినవారిని ప్రేమించటం కొనసాగించుము.
నీకు నమ్మకంగావుండే ప్రజలకు నీ మేలు కలుగనిమ్ము.
పవిత్రాత్మ వరాలు
12 సోదరులారా! పరిశుద్ధాత్మ యిచ్చే వరాలను గురించి మీరు తెలుసుకోవాలని నా అభిప్రాయము. 2 మీరు క్రీస్తులో విశ్వాసులు కానప్పుడు ఏదో ఒక విధంగా ప్రేరేపింపబడి త్రోవతప్పి, మాట్లాడలేని విగ్రహాల వైపుకు మళ్ళారు. ఇది మీకు తెలుసు. 3 అందువల్ల నేను చెప్పేదేమిటంటే, దేవుని ఆత్మ ద్వారా మాట్లాడేవాడెవ్వడూ, “యేసు శాపగ్రస్తుడని” అనడు. అదే విధంగా ఆత్మ ద్వారా మాత్రమే “యేసే ప్రభువు” అని అనగలడు.
4 దేవుని ఆత్మ ఒక్కడే అయినా ఆయన ఎన్నో రకాల వరాలిస్తాడు. 5 ప్రభువు ఒక్కడే కాని, ఆయనకు ఎన్నో విధాలుగా సేవ చేయవచ్చు. 6 దేవుడు నలుగురిలో పలువిధాలుగా పని చేస్తాడు. దేవుడు ఒక్కడే అయినా ఆయన అన్నీ చేస్తాడు. అందరిలో చేస్తాడు.
7 దేవుడు ప్రతీ ఒక్కరిలో తన ఆత్మ ఉండేటట్లు చేసాడు. ఇది మనము చూస్తున్నాము. అందరికీ శ్రేయస్సు కలగాలని ఆయన ఉద్దేశ్యం. 8 ఒకనికి పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మీయ జ్ఞానంతో మాట్లాడే వరాన్ని, ఆ ఆత్మ ద్వారానే బుద్ధి వాక్యాన్ని ఇచ్చాడు. 9 అదే పరిశుద్ధాత్మ ద్వారా ఒకనికి విశ్వాసము ఇచ్చాడు. మరొకనికి వ్యాధులు నయం చేసే వరము నిచ్చాడు. 10 ఒకనికి అద్భుతాలు చేయు శక్తిని, మరొకనికి ప్రవచించే శక్తిని ఇచ్చాడు. ఒకనికి ఆత్మలను గుర్తించే శక్తిని, మరొకనికి రకరకాల భాషల్లో మాట్లాడే శక్తిని ఇచ్చాడు. ఇంకొకనికి వాటి అర్థాలను విడమర్చి చెప్పే శక్తినిచ్చాడు. 11 ఆ ఒక్క ఆత్మయే అన్నీ చేస్తున్నాడు. ఆయన తన యిచ్ఛానుసారం ప్రతీ ఒక్కనికి వరాల్ని ఇస్తాడు.
కానా పట్టణంలో వివాహం
2 మూడవరోజు గలిలయ దేశంలోని “కానా” పట్టణంలో ఒక పెళ్ళి జరిగింది. యేసు తల్లి అక్కడ ఉన్నది. 2 యేసు, ఆయన అనుచరులు కూడా ఆ పెళ్ళికి ఆహ్వానించబడ్డారు. 3 ద్రాక్షారసం అయిపోయాక యేసు తల్లి ఆయనతో, “వాళ్ళ దగ్గర ద్రాక్షారసం అయిపోయింది!” అని చెప్పింది.
4 యేసు, “నాకెందుకు చెబుతున్నావమ్మా! నా సమయమింకా రాలేదు!” అని సమాధానం చెప్పాడు.
5 ఆయన తల్లి పనివాళ్ళతో, “ఆయన చెప్పినట్లు చెయ్యండి!” అని అనింది.
6 ప్రక్కనే రాతితో చేయబడిన ఆరు బానలు ఉన్నాయి. అలాంటి బానల్ని యూదులు ఆచారపు స్నానం చేసి పరిశుద్ధం కావటానికి ఉపయోగించే వాళ్ళు. ఒక్కొక్క బానలో ఎనభై నుండి నూరు లీటర్ల దాకా నీళ్ళు పట్టేవి.
7 యేసు పనివాళ్ళతో, “ఆ బానల్ని నీళ్ళతో నింపండి!” అని అన్నాడు. వాళ్ళు బానల నిండా నీళ్ళు నింపారు.
8 ఆ తర్వాత యేసు వాళ్ళతో, “ఇప్పుడు ఒక బానలో నుంచి కొద్దిగా తీసి పెళ్ళి పెద్ద దగ్గరకు తీసుకెళ్ళండి” అని అన్నాడు.
వాళ్ళు అలాగే చేసారు. ఆ పెళ్ళి పెద్ద, ద్రాక్షారసంగా మారిన ఆ నీళ్ళు రుచి చూసాడు. 9 ఆ పనివాళ్ళకు అది ఎక్కడనుండి వచ్చిందో తెలుసు. కానీ ఆ పెళ్ళి పెద్దకు అది ఎక్కడి నుండి వచ్చిందో అర్థం కాలేదు. కనుక అతుడు పెళ్ళి కుమారుణ్ణి ప్రక్కకు పిలిచి అతనితో, 10 “అందరూ మంచి ద్రాక్షారసమును మొదట పోస్తారు. అతిథులంతా త్రాగి మత్తులయ్యాక మాములు ద్రాక్షారసమును పోస్తారు. కాని నీవు మంచి ద్రాక్షారసమును యింతవరకు ఎందుకు దాచావు?” అని అన్నాడు.
11 యేసు చేసిన అద్భుతాలలో యిది మొదటిది. ఇది గలిలయలోని కానాలో జరిగింది. ఈ విధంగా ఆయన తన మహిమను చాటాక ఆయన శిష్యులకు ఆయన పట్ల విశ్వాసం కలిగింది.
© 1997 Bible League International