Revised Common Lectionary (Complementary)
106 యెహోవాను స్తుతించండి!
యెహోవా మంచివాడు గనుక ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి.
దేవుని ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
2 యెహోవా నిజంగా ఎంత గొప్పవాడో ఏ ఒక్కరూ వర్ణించలేరు.
ఏ ఒక్కరూ సరిపడినంతగా దేవుని స్తుతించలేరు.
3 దేవుని ఆదేశాలకు విధేయులయ్యేవారు సంతోషంగా ఉంటారు.
ఆ ప్రజలు ఎల్లప్పుడూ మంచిపనులు చేస్తూంటారు.
4 యెహోవా, నీవు నీ ప్రజల యెడల దయ చూపేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుము.
నన్ను కూడా రక్షించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము.
5 యెహోవా, నీ జనులకు నీవు చేసే మంచివాటిలో
నన్ను పాలుపొందనిమ్ము
నీ ప్రజలతో నన్ను సంతోషంగా ఉండనిమ్ము.
నీ జనంతో నన్ను నీ విషయమై అతిశయించనిమ్ము.
6 మా పూర్వీకుల్లా మేము కూడా పాపం చేసాము.
మేము తప్పులు చెడుకార్యాలు చేసాము.
7 యెహోవా, ఈజిప్టులో నీవు చేసిన అద్భుతాలను మా పూర్వీకులు సరిగ్గా అర్థం చేసుకోలేదు.
నీ అపరిమితమైన ప్రేమను వారు జ్ఞాపకముంచుకోలేదు.
ఎర్రసముద్రం వద్ద మహోన్నతుడైన దేవునికి
విరోధంగా ఎదురు తిరిగారు.
8 అయినా ఆయన తన నామము కోసం వారిని రక్షించాడు,
ఎందుకంటే తన మహాశక్తిని వారికి తెలియజేయాలని.
9 దేవుడు ఆజ్ఞ ఇవ్వగా ఎర్రసముద్రం ఎండిపోయింది.
దేవుడు మన పూర్వీకులను లోతైన సముద్రంలో ఎడారివలె ఎండిన నేలను ఏర్పరచి, దానిమీద నడిపించాడు.
10 మా పూర్వీకులను వారి శత్రువుల నుండి దేవుడు రక్షించాడు.
వారి శత్రువుల బారి నుండి దేవుడు వారిని కాపాడాడు.
11 అప్పుడు దేవుడు వారి శత్రువులను సముద్రంలో ముంచి, కప్పివేసాడు.
వారి శత్రువులు ఒక్కడూ తప్పించుకోలేదు!
12 అప్పుడు మన పూర్వీకులు దేవుణ్ణి నమ్మారు.
వారు ఆయనకు స్తుతులు పాడారు.
12 “దెబోరా మేలుకో, మేలుకో!
మేలుకో, మేలుకో, ఒక పాట పాడు!
బారాకూ లెమ్ము!
అబీనోయము కుమారుడా, వెళ్లి, నీ శత్రువులను పట్టుకో!
13 “ఆ సమయంలో బతికి ఉన్నవారు నాయకుల దగ్గరకు వచ్చారు.
యెహోవా ప్రజలు సైనికులతో కలిసి నా దగ్గరకు వచ్చారు.
14 “అమాలేకు కొండ దేశంలో
ఎఫ్రాయిము మనుష్యులు స్థిరపడ్డారు.
బెన్యామీనూ, ఆ మనుష్యులు నిన్నూ,
నీ ప్రజలను వెంబడించారు.
మాకీరు కుటుంబ వంశంనుండి సైన్యాధికారులు దిగి వచ్చారు.
జెబూలూను వంశం నుండి ఇత్తడి దండం పట్టి నడిపించు వారు వచ్చారు.
15 ఇశ్శాఖారు నాయకులు దెబోరాతో ఉన్నారు.
ఇశ్శాఖారు వంశం వారు బారాకునకు నమ్మకంగా ఉన్నారు.
ఆ మనుష్యులు లోయలోనికి కాలి నడకన సాగిపోయారు.
“రూబేనీయులలో బహు గొప్పగా హృదయ పరిశోధన జరిగింది.
16 అలాగైతే, మీరంతా గొర్రెల దొడ్ల గోడల వద్ద ఎందుకు కూర్చున్నారు?
రూబేను, వారి సాహస సైనికులు యుద్ధం గూర్చి గట్టిగా తలచారు.
కానీ వారు గొర్రెల కోసం వాయించిన సంగీతం వింటూ, ఇంటి వద్దనే కూర్చుండిపోయారు.
17 గిలాదువారు యోర్దానుకు ఆవలివైపున వారి గుడారాల్లోనే ఉండిపోయారు.
దాను ప్రజలారా,
మీరు మీ ఓడల దగ్గరే ఎందుకు ఉండిపోయారు?
ఆషేరు వంశం వారు సముద్ర తీరంలోనే ఉండిపోయారు.
క్షేమ కరమైన ఓడ రేవుల్లోనే వారు ఉండి పోయారు.
18 “కానీ జెబూలూను మనుష్యులు
నఫ్తాలి మనుష్యులు ఆ కొండల మీద పోరాడేందుకు వారి ప్రాణాలకు తెగించారు.
19 రాజులు వచ్చారు, వారు యుద్ధం చేసారు.
కనాను రాజులు మెగిద్దో జలాల వద్ద తానాకు పట్టణం దగ్గర (కనాను రాజులు) యుద్ధం చేసారు.
కానీ వారు ఐశ్వర్యం ఏమీ ఇంటికి తీసుకుని పోలేదు.
20 నక్షత్రాలు ఆకాశంలోనుంచి పోరాడాయి.
నక్షత్రాలు, వాటి మార్గం నుండి అవి సీసెరాతో పోరాడాయి.
21 కీషోను నది ప్రాచీన నది.
ఆ కీషోను నది సీసెరా మనుష్యులను తుడిచిపెట్టింది.
నా ప్రాణమా, బలము కలిగి ముందుకు సాగిపో.
చివరి మాట
13 దేవుని కుమారుని పేరులో విశ్వాసం ఉన్న మీకు నిత్యజీవం లభిస్తుంది. ఈ విషయం మీకు తెలియాలని యివన్నీ మీకు వ్రాస్తున్నాను. 14 దేవుణ్ణి ఆయన యిష్టానుసారంగా మనము ఏది అడిగినా వింటాడు. దేవుణ్ణి సమీపించటానికి మనకు హామీ ఉంది. 15 మనమేది అడిగినా వింటాడని మనకు తెలిస్తే మన మడిగింది మనకు లభించినట్లే కదా!
16 మరణం కలిగించే పాపము తన సోదరుడు చెయ్యటం చూసినవాడు తన సోదరుని కోసం దేవుణ్ణి ప్రార్థించాలి. అప్పుడు దేవుడు అతనికి క్రొత్త జీవితం యిస్తాడు. ఎవరి పాపం మరణానికి దారితీయదో వాళ్ళను గురించి నేను మాట్లాడుతున్నాను. మరణాన్ని కలిగించే పాపం విషయంలో ప్రార్థించమని నేను చెప్పటం లేదు. 17 ఏ తప్పు చేసినా పాపమే. కాని మరణానికి దారితీయని పాపాలు కూడా ఉన్నాయి.
18 దేవుని బిడ్డగా జన్మించినవాడు పాపం చెయ్యడని మనకు తెలుసు. తన బిడ్డగా జన్మించినవాణ్ణి దేవుడు కాపాడుతాడు. సాతాను అతణ్ణి తాకలేడు. 19 మనము దేవుని సంతానమని, ప్రపంచమంతా సాతాను ఆధీనంలో ఉందని మనకు తెలుసు. 20 దేవుని కుమారుడు వచ్చి నిజమైనవాడెవడో తెలుసుకొనే జ్ఞానాన్ని మనకు యిచ్చాడు. ఇది మనకు తెలుసు. మనము నిజమైనవానిలో ఐక్యమై ఉన్నాము. ఆయన కుమారుడైన యేసు క్రీస్తులో కూడా ఐక్యమై ఉన్నాము. ఆయన నిజమైన దేవుడు. ఆయనే నిత్యజీవం. 21 బిడ్డలారా! విగ్రహాలకు దూరంగా ఉండండి.
© 1997 Bible League International