Revised Common Lectionary (Complementary)
దేవుడు ఎల్లప్పుడు తన ప్రజలతో ఉన్నాడు
43 యాకోబూ, యెహోవా నిన్ను సృష్టించాడు. ఇశ్రాయేలు, యెహోవా నిన్ను సృజించాడు. ఇప్పుడు యెహోవా చెబుతున్నాడు: “భయపడవద్దు. నేను నిన్ను రక్షించాను. పేరుపెట్టి నిన్ను పిలిచాను. నీవు నా స్వంతం. 2 నీకు కష్టాలు వచ్చినప్పుడు నేను నీకు తోడుగా ఉన్నాను. నీవు నదులు దాటి వెళ్లేటప్పుడు, అవి నీమీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్య నడిచేటప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. 3 ఎందుకంటే యెహోవానైన నేను నీకు దేవుడను గనుక, ఇశ్రాయేలు పరిశుద్ధుడనైన నేను మీకు రక్షకుణ్ణి గనుక. మీకు విలువగా చెల్లించేందుకు నేను ఈజిప్టును ఇచ్చాను. నిన్ను నా స్వంతం చేసుకొనేందుకు ఇథియోపియాను, సెబాను నేను ఇచ్చాను. 4 నీవు నాకు ప్రియుడివి గనుక నేను నిన్ను ఘనపరుస్తాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీవు బతుకునట్లు నీకు మనుష్యులనూ, నీకిష్టమైన జనాంగాలను నేను ఇచ్చివేస్తాను.”
5 “కనుక భయపడవద్దు. నేను నీకు తోడుగా ఉన్నాను. నేను నీ పిల్లలను సమకూర్చి వారిని నీ దగ్గరకు రప్పిస్తాను. తూర్పునుండి, పడమరనుండి నేను వారిని సమకూరుస్తాను. 6 నా మనుష్యుల్ని నాకు ఇచ్చివేయి అని నేను ఉత్తరానికి చెబుతాను. నా మనుష్యుల్ని బందీలుగా చెరసాలలో ఉంచవద్దు అని నేను దక్షిణానికి చెబుతాను. దూర దేశాలనుండి నా కుమారులను, కుమార్తెలను నా దగ్గరకు తీసుకొని రండి. 7 నా ప్రజలందరినీ, నా నామం పెట్టబడిన మనుష్యులందరినీ నా దగ్గరకు తీసుకొని రండి. నేను వారిని నా కోసమే సృష్టించుకొన్నాను. వాళ్లను నేనే సృష్టించాను. వాళ్లు నావాళ్లు.”
దావీదు కీర్తన.
29 దేవుని కుమారులారా, యెహోవాను స్తుతించండి.
ఆయన మహిమ ప్రభావాలను స్తుతించండి.
2 యెహోవాను స్తుతించండి, ఆయన నామాన్ని కీర్తించండి.
మీరు ప్రత్యేక వస్త్రాలు ధరించి, ఆయన్ని ఆరాధించండి.
3 యెహోవా సముద్రం వద్ద తన స్వరం వినిపింపజేస్తున్నాడు.
మహిమగల దేవుని స్వరం మహా సముద్రం మీద ఉరుమువలె వినిపిస్తుంది.
4 యెహోవా స్వరం ఆయన శక్తిని తెలుపుతుంది.
ఆయన స్వరం ఆయన మహిమను తెలుపుతుంది.
5 యెహోవా స్వరం దేవదారు మహా వృక్షాలను ముక్కలుగా విరుగ గొట్టుతుంది.
లెబానోను దేవదారు మహా వృక్షాలను యెహోవా విరగ్గొడతాడు.
6 లెబానోను పర్వతాలను యెహోవా కంపింపజేస్తాడు. అవి గంతులు వేస్తున్న దూడలా కనిపిస్తాయి.
షిర్యోను కంపిస్తుంది. అది మేకపోతు గంతులు వేస్తున్నట్టు కనిపిస్తుంది.
7 యెహోవా స్వరం అగ్ని జ్వాలలను మండిస్తుంది.
8 యెహోవా స్వరం అరణ్యాన్ని కంపింపజేస్తుంది.
యెహోవా స్వరాన్ని విని కాదేషు అరణ్యం వణకుతుంది.
9 యెహోవా స్వరం లేళ్ళను భయపడేటట్టు చేస్తుంది.
ఆయన అరణ్యాలను నాశనం చేస్తాడు.
ఆయన ఆలయంలో ఆయన మహిమను గూర్చి ప్రజలు పాడుతారు.
10 వరదలను యెహోవా అదుపు చేసాడు.
మరియు యెహోవా ఎల్లప్పుడూ సమస్తాన్నీ తన అదుపులో ఉంచుకొనే రాజు.
11 యెహోవా తన ప్రజలను కాపాడును గాక.
యెహోవా తన ప్రజలకు శాంతినిచ్చి ఆశీర్వదించును గాక.
14 యెరూషలేములోని అపొస్తలులు సమరయ దేశం దేవుని సందేశాన్ని అంగీకరించిందని విని, పేతురును, యోహాన్ను అక్కడికి పంపారు. 15 పేతురు, యోహాను వచ్చి అక్కడివాళ్ళు పవిత్రాత్మను పొందాలని ప్రార్థించారు. 16 ఎందుకంటే అక్కడివాళ్ళు యేసు ప్రభువు పేరిట బాప్తిస్మము పొందారు. కాని వాళ్ళ మీదికి పవిత్రాత్మ యింకా రాలేదు. 17 వాళ్ళు తమ చేతుల్ని అక్కడి ప్రజలపై ఉంచిన వెంటనే ఆ ప్రజలు పవిత్రాత్మను పొందారు.
15 ప్రజలు రానున్న వాని కోసం ఆశతో కాచుకొని ఉన్నరోజులవి. వాళ్ళు యోహానే క్రీస్తు అయి ఉండవచ్చనుకున్నారు.
16 యోహాను వాళ్ళకు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “నేను మీకు నీటిలో బాప్తిస్మము[a] నిచ్చాను. కాని నాకన్నా శక్తిగలవాడు వస్తాడు. ఆయన కాలిచెప్పులు విప్పే అర్హతకూడా నాకు లేదు. ఆయన మీకు పవిత్రాత్మలో, అగ్నిలో బాప్తిస్మమునిస్తాడు. 17 చేట ఆయన చేతిలో ఉంది. ఆయన ఆ చేటతో ధాన్యాన్ని శుభ్రపరచి తన ధాన్యాన్ని కొట్టులో దాచుకొని, పొట్టును ఆరని మంటల్లో కాల్చివేస్తాడు.”
యోహాను చేత యేసు బాప్తిస్మం పొందటం
(మత్తయి 3:13-17; మార్కు 1:9-11)
21 యోహాను ప్రజలకు బాప్తిస్మమునిస్తూ వుండినాడు. అప్పుడు వాళ్ళతో సహా యేసుకు కూడా బాప్తిస్మమునిచ్చాడు. యేసు ప్రార్థిస్తుండగా పరలోకం తెరువబడింది. 22 పవిత్రాత్మ ఒక పావురం రూపంలో దిగివచ్చి ఆయనపై వ్రాలాడు. వెంటనే పరలోకం నుండి ఒక స్వరం, “నీవు నా ప్రియ కుమారుడివి, నిన్ను నేను ప్రేమించుచున్నాను. నీయందు ఎక్కువగా నేను ఆనందించుచున్నాను” అని వినబడింది.
© 1997 Bible League International