Revised Common Lectionary (Complementary)
దావీదు కీర్తన.
29 దేవుని కుమారులారా, యెహోవాను స్తుతించండి.
ఆయన మహిమ ప్రభావాలను స్తుతించండి.
2 యెహోవాను స్తుతించండి, ఆయన నామాన్ని కీర్తించండి.
మీరు ప్రత్యేక వస్త్రాలు ధరించి, ఆయన్ని ఆరాధించండి.
3 యెహోవా సముద్రం వద్ద తన స్వరం వినిపింపజేస్తున్నాడు.
మహిమగల దేవుని స్వరం మహా సముద్రం మీద ఉరుమువలె వినిపిస్తుంది.
4 యెహోవా స్వరం ఆయన శక్తిని తెలుపుతుంది.
ఆయన స్వరం ఆయన మహిమను తెలుపుతుంది.
5 యెహోవా స్వరం దేవదారు మహా వృక్షాలను ముక్కలుగా విరుగ గొట్టుతుంది.
లెబానోను దేవదారు మహా వృక్షాలను యెహోవా విరగ్గొడతాడు.
6 లెబానోను పర్వతాలను యెహోవా కంపింపజేస్తాడు. అవి గంతులు వేస్తున్న దూడలా కనిపిస్తాయి.
షిర్యోను కంపిస్తుంది. అది మేకపోతు గంతులు వేస్తున్నట్టు కనిపిస్తుంది.
7 యెహోవా స్వరం అగ్ని జ్వాలలను మండిస్తుంది.
8 యెహోవా స్వరం అరణ్యాన్ని కంపింపజేస్తుంది.
యెహోవా స్వరాన్ని విని కాదేషు అరణ్యం వణకుతుంది.
9 యెహోవా స్వరం లేళ్ళను భయపడేటట్టు చేస్తుంది.
ఆయన అరణ్యాలను నాశనం చేస్తాడు.
ఆయన ఆలయంలో ఆయన మహిమను గూర్చి ప్రజలు పాడుతారు.
10 వరదలను యెహోవా అదుపు చేసాడు.
మరియు యెహోవా ఎల్లప్పుడూ సమస్తాన్నీ తన అదుపులో ఉంచుకొనే రాజు.
11 యెహోవా తన ప్రజలను కాపాడును గాక.
యెహోవా తన ప్రజలకు శాంతినిచ్చి ఆశీర్వదించును గాక.
1 ఇవి దావీదు కుమారుడును, యెరూషలేము రాజు అయిన ప్రసంగి చెప్పిన మాటలు.
2 అన్నీ చాల అర్థరహితాలు. “సమస్తం వృధా కాలయాపన!”[a] అంటాడు ప్రసంగి. 3 ఈ జీవితంలో తాము చేసే కాయ కష్టమంతటికీ మనుష్యులు లాభం ఏమైనా పొందుతున్నారా?[b] (లేదు!)
ఏవీ ఎన్నడూ మారవు
4 ఒక తరం మారి మరొకతరం వస్తుంది. కాని, ఈ భూమి శాశ్వతంగా ఉంటుంది. 5 సూర్యుడు ఉదయించును మరియు అస్తమించును. మరల ఉదయించే చోటుకు త్వరగా వెళతాడు.
6 గాలి దక్షిణ దిశకి వీస్తుంది, తిరిగి ఉత్తర దిశకి వీస్తుంది. గాలి, చుట్టూ తిరిగి తిరిగి చివరకు తాను బయల్దేరిన చోటుకే రివ్వున వస్తుంది.
7 నదులన్నీ మరల మరల ఒక్క చోటుకే ప్రవహిస్తాయి. అవన్నీ సముద్రంలోకే పోయి పడినా సముద్రం నిండదు.
8 ఆయా విషయాలను మాటలు పూర్తిగా వివరించలేవు.[c] అయితేనేమి, మనుష్యులు మాట్లాడుతూనే వుంటారు.[d] మాటలు మళ్లీ మళ్లీ మన చెవుల్లో పడుతూనే వుంటాయి. అయినా, మన చెవులకి తృప్తి తీరదు. మన కళ్లు ఎన్నింటినో చూస్తూ ఉంటాయి. అయినా మనకి తనివి తీరదు.
కొత్తదంటూ ఏదీ లేదు
9 అన్నీ ఆదినుంచి ఉన్నట్లే కొనసాగుతున్నాయి. ఇంతకు ముందు జరిగినవే ఇక ముందూ ఎల్లప్పుడూ జరుగుతాయి. ఈ జీవితంలో కొత్తదంటూ ఏదీ లేదు.
10 ఎవరైనా, “చూడండి, ఇదిగో ఇది కొత్తది” అని చెప్పవచ్చు. కాని, అది ఎప్పుడూ ఇక్కడ ఉన్నదే. మనం పుట్టక ముందు అది ఇక్కడ ఉన్నదే!
11 పూర్వం ఎప్పుడో జరిగిన విషయాలు మనుష్యులకి గుర్తుండవు. ఇప్పుడు జరుగుతున్న విషయాలు భవిష్యత్తులో జనానికి గుర్తుండవు. దానికి తర్వాత, అప్పటివాళ్లకి, తమ పూర్వపు వాళ్లు చేసిన పనులు గుర్తుండవు.
నిజమైన జ్ఞానము
18 ఎందుకంటే, క్రీస్తు సిలువను గురించిన సందేశము నశించిపోయే వాళ్ళకు నిష్ప్రయోజనంగా కనిపిస్తుంది. కాని రక్షింపబడుతున్న మనకు అది దేవుని శక్తి. 19 దీన్ని గురించి ప్రవచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది:
“విజ్ఞానుల్లో ఉన్న విజ్ఞానాన్ని నేను నాశనం చేస్తాను.
పండితుల్లో ఉన్న తెలివిని నిష్ప్రయోజనం చేస్తాను.”(A)
20 మరి విజ్ఞానులు ఏమయ్యారు? పండితులు ఏమయ్యారు? సమకాలిక తర్క శాస్త్రజ్ఞులు ఏమయ్యారు? అంటే, దేవుడు ఈ ప్రపంచంలో ఉన్న జ్ఞానం నిష్ప్రయోజనమని రుజువు చేసినట్లే కదా! 21 తనను జ్ఞానంతో కనుక్కోవటం సాధ్యం కారాదని దేవుడే నిర్ణయించాడు. దానికి మారుగా ప్రజలు “మూర్ఖత్వం” అని భావిస్తున్న “మా సందేశాన్ని” విశ్వసించినవాళ్ళు రక్షింపబడాలని ఆయన నిర్ణయించాడు.
22 యూదులు మహిమలు అడుగుతారు. గ్రీకులు జ్ఞానాన్ని అన్వేషిస్తారు. 23 మేమైతే, సిలువపైనున్న క్రీస్తును ప్రకటిస్తాము. మా సందేశం యూదులకు ఒక ఆటంకంగాను, యూదులుకాని వాళ్ళకు అర్థం లేనిదానిగాను కనిపిస్తుంది. 24 కాని దేవుడు పిలిచిన యూదులకు, యూదులుకానివాళ్ళకు “క్రీస్తు” దేవుని శక్తితో, ఆయన జ్ఞానంతో సమానము. 25 దేవుని అవివేకం, నిజానికి మానవుని జ్ఞానం కన్నా శ్రేష్ఠమైనది. దేవుని బలహీనత మానవుల బలంకన్నా శక్తివంతమైనది.
26 సోదరులారా! మిమ్నల్ని పిలిచినప్పుడు మీరు ఏ విధంగా ఉన్నారో జ్ఞాపకం ఉందా? ప్రపంచం మిమ్మల్ని జ్ఞానులుగా పరిగణించలేదు. మీకు పేరు ప్రతిష్ఠలు లేవు. మీరు ఉన్నత కుటుంబాలకు చెందలేదు. 27 కాని దేవుడు విజ్ఞానుల్ని సిగ్గుపరచాలని ప్రపంచంలోని మూర్ఖుల్ని ఎన్నుకొన్నాడు. బలవంతుల్ని సిగ్గుపరచాలని ప్రపంచంలోని బలహీనుల్ని ఎన్నుకొన్నాడు. 28 ప్రపంచం ముఖ్యమైనవాళ్ళని భావిస్తున్న మనుష్యుల ప్రాముఖ్యతను తీసివేయటానికి, దేవుడు ఈ లోకంలో చిన్నచూపుతో చూడబడేవాళ్ళనూ, ఏవగించుకొనబడేవాళ్ళనూ, లెక్క చెయ్యబడనివాళ్ళను ఎన్నుకొన్నాడు. 29 తనముందు ఎవ్వరూ గర్వించరాదని ఆయన ఉద్దేశ్యం. 30 కాని దేవుని కారణంగా మీకు యేసు క్రీస్తులో ఐక్యత కలిగింది. దేవుడు క్రీస్తును మీకు జ్ఞానంగా యిచ్చాడు. క్రీస్తు మనకు నీతి, పవిత్రత, విమోచన కలిగిస్తాడు. 31 అందువల్ల లేఖనాల్లో వ్రాయబడినట్లు. “గర్వించాలనుకొన్నవాడు ప్రభువు విషయంలో గర్వించాలి.”(B)
© 1997 Bible League International