Revised Common Lectionary (Complementary)
12 యెరూషలేమా, యెహోవాను స్తుతించుము.
సీయోనూ, నీ దేవుని స్తుతించుము!
13 యెరూషలేమా, దేవుడు నీద్వారబంధాలను బలపరుస్తాడు.
నీ పట్టణంలోని ప్రజలను దేవుడు ఆశీర్వదిస్తాడు.
14 నీ దేశానికి దేవుడు శాంతి కలిగించాడు. కనుక యుద్ధంలో నీ శత్రువులు నీ ధాన్యం తీసుకొని పోలేదు.
ఆహారం కోసం నీకు ధాన్యం సమృద్ధిగా ఉంది.
15 దేవుడు భూమికి ఒక ఆజ్ఞ ఇస్తాడు.
దానికి వెంటనే అది లోబడుతుంది.
16 నేల ఉన్నిలా తెల్లగా అయ్యేంతవరకు మంచు కురిసేటట్టు దేవుడు చేస్తాడు.
ధూళిలా గాలిలో మంచు విసిరేటట్టు చేస్తాడు.
17 దేవుడు ఆకాశం నుండి బండలవలె వడగండ్లు పడేలా చేస్తాడు.
ఆయన పంపే చలికి ఎవడూ నిలువ జాలడు.
18 అప్పుడు, దేవుడు మరో ఆజ్ఞ ఇస్తాడు. వెచ్చటి గాలి మరల వీస్తుంది.
మంచు కరిగిపోతుంది. నీళ్లు ప్రవహించటం మొదలవుతుంది.
19 దేవుడు యాకోబుకు (ఇశ్రాయేలు) తన ఆజ్ఞ ఇచ్చాడు.
దేవుడు ఇశ్రాయేలుకు తన న్యాయచట్టాలు, ఆదేశాలు ఇచ్చాడు.
20 దేవుడు యిలా మరి ఏ దేశానికీ చెయ్యలేదు.
ఇతర మనుష్యులకు దేవుడు తన న్యాయ చట్టం ఉపదేశించలేదు.
యెహోవాను స్తుతించండి!
ఆలయం నిర్మాణానికి దావీదు యోచన
28 దావీదు ఇశ్రాయేలు పెద్దలందరినీ సమావేశపర్చాడు. వారందరనీ యెరూషలేముకు రమ్మని ఆజ్ఞాపించాడు. ఆయన పిలిచిన పెద్దలు ఎవరనగా: వంశాల పెద్దలు, రాజ సేవలో వున్న సైనికాధికారులు, వేయిమంది సైనికులకు అధిపతులు, వందమంది దళాలకు అధిపతులు, రాజు యొక్క, రాజకుమారుల యొక్క ఆస్తులను, పశువులను కాపాడే అధికారులు, రాజు యొక్క ముఖ్యాధికారులు, పరాక్రమశాలురు మరియు వీర సైనికులు.
2 రాజైన దావీదు నిలబడి వారినుద్దేశించి ఇలా చెప్పాడు: “సోదరులారా, నా ప్రజలారా, మీరంతా నేను చేప్పేది వినండి. యోహోవా ఒడంబడిక పెట్టెను ఉంచటానికి ఒక ఆలయాన్ని కట్టటానికి నేను నా హృదయంలో సంకల్పించాను దేవుని పాదం మోపటానికి ఒక స్థానం నిర్మించాలని నేను అనుకున్నాను. ఆలయ నిర్మాణానికి నేను ఒక పథకం కూడ తయారుచేశాను. 3 కాని దేవుడు నాతో ఇలా అన్నాడు: ‘దావీదూ, వద్దు. నా పేరు మీద నీవు ఆలయం కట్టించకూడదు. నీవు సైనికుడవై, అనేకమందిని సంహరించావు. అందువల్ల నీవు ఆలయ నిర్మాణం చేయకూడదు.’
4 “ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఇశ్రాయేలు పన్నెండు వంశాల వారిని నడిపించటానికి యూదా వంశాన్ని ఎంపిక చేశాడు. మళ్లీ ఆ వంశంలో నుండి నా తండ్రి కుటుంబాన్ని యోహోవా ఎంపిక చేశాడు. ఆ కుటుంబంలో నుండి ఇశ్రాయేలును శాశ్వతంగా ఏలటానికి యెహోవా నన్ను ఎంపికచేశాడు! దేవుడు నన్ను ఇశ్రాయేలుకు రాజుగా చేయదలచాడు! 5 యెహోవా నాకు చాలా మంది కుమారులను ఇచ్చాడు. వారందరిలో ఇశ్రాయేలుకు నూతన రాజుగా సొలొమోనును మాత్రం యెహోవా ఎంపిక చేసాడు. నిజానికి ఇశ్రాయేలు యెహోవా రాజ్యం. 6 యెహోవా నాతో, ‘దావీదూ, నీ కుమారుడు సొలొమోను నా ఆలయాన్ని, దాని ప్రాంగణాన్ని నిర్మిస్తాడు. ఎందువల్లననగా సొలొమోనును నా కుమారునిగా భావించాను. నేను అతనికి తండ్రిగా వ్యవహరిస్తాను.[a] 7 సొలొమోను ఇప్పుడు నా ధర్మాన్ని, ఆజ్ఞలను పాటిస్తున్నాడు. అతడు నా ధర్మాన్ని, న్యాయాన్ని నిరంతరం పాటిస్తే నేను సొలొమోను రాజ్యాన్ని శాశ్వతంగా బలవంతమైనదిగా చేస్తాను!’” అని అన్నాడు.
8 “ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల ముందు, దేవుని సమక్షాన నేను మీకు ఈ విషయాలు చెబుతున్నాను. యెహోవా దేవుని శాసనాలన్నిటినీ మీరు పాటించేలా జాగ్రత్త పడండి! అప్పుడు ఈ మంచి దేశాన్ని మీరు నిలబెట్టుకోగలుగుతారు. పైగా దీనిని మీరు, మీ తర్వాత మీ సంతతి వారికి కూడ శాశ్వతంగా అందజేయగలరు.
9 “కుమారుడా, సొలొమోనూ! నీ తండ్రి యొక్క దేవుని నీవు తెలుసుకో. పవిత్ర హృదయంతో దేవుని ప్రార్థించు. దేవుని సేవించటానికి హృదయానందం కలిగివుండు. ఎందువల్లననగా, ప్రతివాని మనస్సులో ఏమున్నదో దేవునికి తెలుసు. నీవు ఆలోచించే ప్రతిదీ యెహోవా అర్థం చేసుకుంటాడు! సహాయం కోరి యెహోవాను అర్థిస్తే, నీకు సమాధానం దొరుకుతుంది. నీవు దేవునికి విముఖంగా వుంటే ఆయన నిన్ను శాశ్వతంగా వదిలివేస్తాడు. 10 సొలొమోనూ, తన పవిత్ర స్థలమైన ఆలయాన్ని నిర్మించటానికి యెహోవా నిన్ను ఎంపిక చేశాడని నీవు అర్ధం చేసుకోవాలి. ధైర్యంగా వుండి కార్యం నెరవేర్చు.”
10 దేవుని అనుగ్రహం వల్ల నేను నేర్పుగల నిర్మాణకుడుగా పునాదులు వేసాను. ఇతరులు ఆ పునాదిపై కడుతున్నారు. ప్రతి ఒక్కడూ తానేవిధంగా కడుతున్నాడో గమనిస్తూ జాగ్రత్తగా కట్టాలి. 11 ఆ “పునాది” యేసు క్రీస్తు కనుక ఇదివరకే వేసిన ఆ పునాది తప్ప వేరొక పునాదిని ఎవ్వరూ వేయలేరు. 12 కొందరు బంగారము, వెండి, విలువైన రత్నాలు ఉపయోగించి ఈ పునాది మీద కడతారు. మరికొందరు చెక్కను, గడ్డిని, ఆకుల్ని ఉపయోగించి కడతారు. 13 వాళ్ళ పనితనము క్రీస్తు వచ్చిన రోజున ఆయనయొక్క వెలుగులో బయటపడుతుంది. “ఆ రోజు” నిప్పువలె వస్తుంది. ఆ నిప్పు ప్రతి ఒక్కరి పనితనాన్ని పరీక్షిస్తుంది. 14 వాళ్ళు నిర్మించింది నిలిస్తే వాళ్ళకు ప్రతిఫలం లభిస్తుంది. 15 అది కాలిపోతే వాళ్ళకు నష్టం కలుగుతుంది. కాని మంటలనుండి అతనొక్కడే తప్పించుకొన్న విధంగా రక్షింపబడతాడు.
16 మీరు దేవుని మందిరమని, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీకు తెలియదా? 17 కనుక దేవుని మందిరాన్ని నాశనం చేసినవాణ్ణి దేవుడు నాశనం చేస్తాడు. దేవుని మందిరం పవిత్రమైనది. మీరే ఆ మందిరం.
© 1997 Bible League International