Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 113

113 యెహోవాను స్తుతించండి!
యెహోవా సేవకులారా, ఆయనను స్తుతించండి!
    యెహోవా నామాన్ని స్తుతించండి.
ఇప్పుడు, ఎల్లప్పుడూ, యెహోవా నామము స్తుతించబడాలని నేను కోరుతున్నాను.
తూర్పున ఉదయించే సూర్యుడి దగ్గర్నుండి,
    సూర్యుడు అస్తమించే స్థలం వరకు యెహోవా నామం స్తుతించబడాలని నేను కోరుతున్నాను.
యెహోవా జనాలన్నింటికంటె ఉన్నతమైనవాడు.
    ఆయన మహిమ ఆకాశాలంత ఉన్నతం.
ఏ మనిషి మన యెహోవా దేవునిలా ఉండడు.
    దేవుడు పరలోకంలో ఉన్నతంగా కూర్చుంటాడు.
ఆకాశాలను, భూమిని దేవుడు చూడాలంటే
    ఆయన తప్పక కిందికి చూడాలి.
దేవుడు పేదవారిని దుమ్ములో నుండి పైకి లేపుతాడు.
    భిక్షగాళ్లను చెత్తకుండీలో నుండి బయటకు తీస్తాడు.
ఆ మనుష్యులను దేవుడు ప్రముఖులుగా చేస్తాడు.
    ఆ మనుష్యులను దేవుడు ప్రముఖ నాయకులుగా చేస్తాడు.
ఒక స్త్రీకి పిల్లలు లేకపోవచ్చును.
    కాని దేవుడు ఆమెకు పిల్లలను ఇచ్చి ఆమెను సంతోషపరుస్తాడు.

యెహోవాను స్తుతించండి!

యెషయా 42:14-21

దేవుడు చాలా ఓర్పుగలవాడు

14 “చాలా కాలంగా నేను మౌనంగా ఉన్నాను.
    నేను అలానే మౌనంగా ఉండి, నన్ను నేను నిగ్రహించుకొన్నాను.
కానీ ఇప్పుడు శిశువును కంటున్న స్త్రీలా నేను గట్టిగా అరుస్తాను.
    నేను కఠినంగా, గట్టిగా ఊపిరి పీలుస్తాను.
15 కొండలను, పర్వతాలను నేను నాశనం చేస్తాను.
    అక్కడ మొలిచే మొక్కలన్నింటిని నేను ఎండిపోయేట్టు చేస్తాను.
నదులను నేను పొడి నేలగా చేస్తాను.
    నీటి మడుగులను నేను ఎండిపోయేట్టు చేస్తాను.
16 గుడ్డివారికి ఇదివరకు తెలియని మార్గంలో నేను వారిని నడిపిస్తాను
    ఆ గుడ్డివారు ఇదివరకు ఎన్నడూ తిరుగని బాటలలో నేను వారిని నడిపిస్తాను.
చీకటిని నేను వారికి వెలుగుగా చేస్తాను.
    కరకు నేలను నేను చదును చేస్తాను.
నేను వాగ్దానం చేసే పనులను నేను చేస్తాను.
    నా ప్రజలను నేను విడువను.
17 కానీ కొంతమంది మనుష్యులు నన్ను వెంబడించటం మానివేశారు.
    బంగారపు పూత పూయబడిన విగ్రహాలు వారికి ఉన్నాయి. ‘మీరే మా దేవుళ్లు’ అని వారు ఆ విగ్రహాలతో చెబుతారు.
ఆ ప్రజలు వారి అబద్ధపు దేవుళ్లను నమ్ముతారు.
    కానీ ఆ ప్రజలు నీరాశ చెందుతారు.”

దేవుని మాట వినటానికి ఇశ్రాయేలు నిరాకరించింది

18 “చెవిటి ప్రజలారా నా మాట వినాలి.
    గుడ్డి మనుష్యులారా మీరు కళ్లు తెరిచి, నన్ను చూడాలి.
19 ప్రపంచం అంతటిలోకెల్లా నా సేవకుడు[a] ఎక్కువ గుడ్డివాడు.
    నేను ప్రపంచంలోకి పంపించిన నా సేవకుడు మహా చెవిటివాడు.
నేను ఒడంబడిక చేసుకొన్న ఆ వ్యక్తి యెహోవా సేవకుడు అందరికంటె మహా గుడ్డివాడు.
20 ఈ సేవకుడు తాను ఏమి చేయాలో అది చూడాలి.
    కానీ అతడు నాకు విధేయత చూపడం లేదు.
అతడు తన చెవులతో వినగలడు.
    కానీ అతడు నా మాట వినుటకు నిరాకరిస్తున్నాడు.”
21 యెహోవా తన సేవకుని ఎడల న్యాయం చూపగోరుతున్నాడు.
    కనుక అద్భుతమైన ఉపదేశాలను యెహోవా తన ప్రజలకు చేస్తాడు.

లూకా 1:5-25

జెకర్యా మరియు ఎలీసబేతు

హేరోదు[a] రాజు యూదయను పాలించే కాలంలో జెకర్యా అనే ఒక యాజకుడు ఉండేవాడు. ఇతడు అబీయా[b] అనబడే యాజక శాఖకు చెందినవాడు. ఇతని భార్య అహారోను శాఖకు చెందినది. ఆమె పేరు ఎలీసబెతు. ఈ దంపతులు యధార్థంగా, దేవునికి ప్రీతికరంగా నుడుచుకుంటూ ప్రభువు ఆజ్ఞల్ని పాటిస్తూ ఏ అపకీర్తి లేకుండా నిష్టాపరులై జీవించే వాళ్ళు, ఎలీసబెతు గొడ్రాలు. పైగా వాళ్ళిద్దరూ వయస్సు మళ్ళిన వాళ్ళు. వాళ్ళకు సంతానం కలుగలేదు.

తన శాఖకు చెందిన వాళ్ళు చేయవలసిన వంతు రావటంవల్ల జెకర్యా యాజక పనులు చేస్తూ ఉన్నాడు. దేవాలయంలో దేవునికి ధూపం వేయటానికి వాడుక ప్రకారం చీట్లు వేసి జెకర్యాను ఎన్నుకున్నారు. 10 అతడు ధూపం వేస్తుండగా బయట సమావేశమైన భక్తులు ప్రార్థిస్తున్నారు.

11 ధూపవేదికకు కుడివైపున జెకర్యాకు ఒక దేవదూత ప్రత్యక్షం అయ్యాడు. 12 జెకర్యా అతణ్ణి చూడగానే ఉలిక్కి పడ్డాడు. అతనికి భయం వేసింది. 13 దేవదూత అతనితో, “జెకర్యా భయపడకు. దేవుడు నీ ప్రార్థనలు విన్నాడు. నీ భార్య ఎలీసబెతు ఒక మగశిశువును కంటుంది. ఆ పిల్లవానికి యోహాను అని నామకరణం చెయ్యి. 14 ఇతని పుట్టుక వల్ల నీవు చాలా ఆనందిస్తావు. నీవేకాక ప్రజలందరూ ఆనందిస్తారు. 15 అతడు ఆధ్యాత్మికతతో గొప్పవాడౌతాడు. దేవుడతని గొప్పతనం చూసి ఆనందిస్తాడు. అతడు ద్రాక్షారసం కాని, లేక యితర రకములైన మద్యపానాల్ని కాని ముట్టడు. పుట్టినప్పటి నుండే అతనిలో పవిత్రాత్మ[c] ఉంటాడు.

16 “ఇశ్రాయేలు ప్రజల ప్రభువైన దేవుని దగ్గరకు యితడు చాలా మంది ప్రజల్ని తీసుకు వస్తాడు. 17 తండ్రుల హృదయాలను పిల్లల వైపు మళ్ళించటానికి, దేవుణ్ణి నమ్మని వాళ్ళను నీతిమంతుల జ్ఞానం సంపాదించేటట్లు చెయ్యటానికి, ప్రభువు రాకకు ప్రజల్ని సిద్ధపరచటానికి ఇతడు ఏలియాలో[d] ఉన్న ఆత్మ బలంతో ప్రభువు కన్నా ముందుగా వెళ్తాడు” అని అన్నాడు.

18 జెకర్యా దేవదూతతో, “మీరన్న విధంగా జరుగుతుందన్నదానికి నిదర్శన మేమిటి? నేను ముసలి వాణ్ణి. నా భార్యకు కూడా వయస్సు మళ్ళింది” అని అన్నాడు.

19 దేవదూత ఈ విధంగా సమాధానం చెప్పాడు: “నా పేరు గాబ్రియేలు. నేను దేవుని దూతను. నీతో మాట్లాడి నీకి సువార్త చెప్పుమని దేవుడు నన్ను పంపాడు. 20 జాగ్రత్త! నీవు నా మాటలు నమ్మటం లేదు కనుక మూగవాడవై పోతావు. తగిన సమయం వచ్చాక నా మాటలు నిజమౌతాయి. అంతవరకు నీకు మాటలు రావు.”

21 బయట ప్రజా సమూహం జెకర్యా దేవాలయంలో యింతవరకు ఎందుకున్నాడో అని ఆశ్చర్యంతో అతని కోసం కాచుకొని ఉన్నారు. 22 జెకర్యా వెలుపలికి వచ్చాడు. కాని వాళ్ళతో మాట్లాడలేక పోయాడు. ఏమీ మాట్లాడలేక సంజ్ఞలు చెయ్యటం వల్ల దేవాలయంలో అతనికి దివ్య దర్శనం కలిగినదని అక్కడున్న వాళ్ళు గ్రహించారు. 23 సేవా దినములు ముగిసాక అతడు తన యింటికి వెళ్ళిపోయాడు.

24 కొన్ని రోజుల తర్వాత అతని భార్య ఎలీసబెతు గర్భవతి అయింది. ఐదు నెలల దాకా ఆమె గడపదాటలేదు. 25 “ప్రభువు ఈ దశలో నాకీ గర్భం యిచ్చి నన్ను అనుగ్రహించాడు; నలుగురిలో నాకున్న అవమానం తొలగించాడు” అని ఆమె అన్నది.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International