Revised Common Lectionary (Complementary)
113 యెహోవాను స్తుతించండి!
యెహోవా సేవకులారా, ఆయనను స్తుతించండి!
యెహోవా నామాన్ని స్తుతించండి.
2 ఇప్పుడు, ఎల్లప్పుడూ, యెహోవా నామము స్తుతించబడాలని నేను కోరుతున్నాను.
3 తూర్పున ఉదయించే సూర్యుడి దగ్గర్నుండి,
సూర్యుడు అస్తమించే స్థలం వరకు యెహోవా నామం స్తుతించబడాలని నేను కోరుతున్నాను.
4 యెహోవా జనాలన్నింటికంటె ఉన్నతమైనవాడు.
ఆయన మహిమ ఆకాశాలంత ఉన్నతం.
5 ఏ మనిషి మన యెహోవా దేవునిలా ఉండడు.
దేవుడు పరలోకంలో ఉన్నతంగా కూర్చుంటాడు.
6 ఆకాశాలను, భూమిని దేవుడు చూడాలంటే
ఆయన తప్పక కిందికి చూడాలి.
7 దేవుడు పేదవారిని దుమ్ములో నుండి పైకి లేపుతాడు.
భిక్షగాళ్లను చెత్తకుండీలో నుండి బయటకు తీస్తాడు.
8 ఆ మనుష్యులను దేవుడు ప్రముఖులుగా చేస్తాడు.
ఆ మనుష్యులను దేవుడు ప్రముఖ నాయకులుగా చేస్తాడు.
9 ఒక స్త్రీకి పిల్లలు లేకపోవచ్చును.
కాని దేవుడు ఆమెకు పిల్లలను ఇచ్చి ఆమెను సంతోషపరుస్తాడు.
యెహోవాను స్తుతించండి!
30 తాను యాకోబుకు పిల్లల్ని కనటం లేదని రాహేలు తెలుసుకొంది. రాహేలు తన సోదరి లేయాను గూర్చి అసూయపడింది. అందుచేత “నాకూ పిల్లల్ని యివ్వు, లేకపోతే నేను చస్తాను” అంది రాహేలు యాకోబుతో.
2 యాకోబుకు రాహేలు మీద కోపం వచ్చింది. “నేనేమి దేవుణ్ణి కాను. నీకు పిల్లలు పుట్టకుండా చేసింది దేవుడు” అని చెప్పాడు యాకోబు.
3 అప్పుడు రాహేలు “నా దాసిని బిల్హాను నీవు తీసుకో. ఆమెతో శయనించు. నా కోసం ఆమె బిడ్డను కంటుంది. అప్పుడు ఆమె మూలంగా నేను తల్లినవుతాను” అని చెప్పింది.
4 కనుక రాహేలు తన దాసియైన బిల్హాను యాకోబుకు ఇచ్చింది. యాకోబు బిల్హాతో శయనించాడు. 5 బిల్హా గర్భవతి అయింది, యాకోబుకు ఒక కుమారుని కన్నది.
6 “దేవుడు నా ప్రార్థన విన్నాడు. నాకు ఒక కుమారుని ఇవ్వాలని ఆయన నిర్ణయం చేశాడు” అని చెప్పి, రాహేలు ఆ కుమారునికి “దాను”[a] అని పేరు పెట్టింది.
7 బిల్హా మరల గర్భవతియై, యాకోబుకు మరో కుమారుని కన్నది. 8 రాహేలు “నా అక్కతో పోటీలో చాలా కష్టపడి పోరాడాను. నేనే గెలిచాను” అని చెప్పి ఆ కుమారునికి “నఫ్తాలి” అని పేరు పెట్టింది.
9 లేయా తనకు ఇక పిల్లలు పుట్టడం లేదని గ్రహించింది. అంచేత తన దాసి జిల్ఫాను ఆమె యాకోబుకు ఇచ్చింది. 10 అప్పుడు జిల్ఫాకు ఒక కొడుకు పుట్టాడు. 11 లేయా “నేను అదృష్టవంతురాలిని” అనుకొని, ఆ కుమారునికి “గాదు”[b] అని పేరు పెట్టింది. 12 జిల్ఫాకు మరో కుమారుడు పుట్టాడు. 13 “నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు స్త్రీలు నన్ను సంతోషం అని పిలుస్తారు” అని లేయా ఆ కుమారునికి “ఆషేరు”[c] అని పేరు పెట్టింది.
14 గోధుమ కోతకాలంలో రూబేను పొలాల్లోకి వెళ్లాడు. అక్కడ ప్రత్యేకమైన పూలు[d] అతనికి కనబడ్డాయి. ఆ పూలు తెచ్చి రూబేను తన తల్లి లేయాకు ఇచ్చాడు. అయితే రాహేలు, “నీ కొడుకు తెచ్చిన పూలు దయచేసి నాకూ కొన్ని ఇవ్వవూ” అని లేయాను అడిగింది.
15 లేయా, “ఇప్పటికే నీవు నా భర్తను తీసివేసుకొన్నావు. ఇప్పుడేమో నా కొడుకు తెచ్చిన పూలను తీసుకోవటానికి ప్రయత్నిస్తున్నావా” అంది.
కాని రాహేలు “నీ కొడుకు తెచ్చిన పూలు గనుక నీవు నాకు ఇస్తే, ఈ వేళ రాత్రికి నీవు యాకోబుతో శయనించవచ్చు” అని జవాబిచ్చింది.
16 ఆ రాత్రి యాకోబు పొలంనుంచి వచ్చాడు. అతన్ని చూచి, అతన్ని కలుసుకోవటానికి లేయా బయటకు వెళ్లింది. “ఈ వేళ రాత్రి నీవు నాతో పండుకోవాలి. నా కొడుకు తెచ్చిన పూలతో నిన్ను నేను కొన్నాను” అని ఆమె చెప్పింది. కనుక ఆ రాత్రి యాకోబు లేయాతో పండుకొన్నాడు.
17 అప్పుడు దేవుడు లేయాను మళ్లీ గర్భవతిని కానిచ్చాడు. ఆమె అయిదవ కుమారుని కన్నది. 18 లేయా అంది, “నా భర్తకు నా దాసిని ఇచ్చాను గనుక దేవుడు నాకు ప్రతిఫలాన్ని యిచ్చాడు.” అందుకని లేయా అతనికి ఇశ్శాఖారు[e] అని పేరు పెట్టింది.
19 లేయా మళ్లీ గర్భవతి అయింది, ఆరో కుమారుణ్ణి కన్నది. 20 లేయా అంది “ఒక చక్కని బహుమానం దేవుడు నాకు ఇచ్చాడు. ఇప్పుడు తప్పక యాకోబు నన్ను స్వీకరిస్తాడు. ఎందుకంటే ఆయనకు నేను ఆరుగురు కుమారుల్ని యిచ్చాను.” కనుక జెబూలూను[f] అని ఆ కుమారునికి పేరు పెట్టింది.
21 తర్వాత లేయాకు కూతురు పుట్టింది. ఆ కూతురుకు దీనా అని పేరు పెట్టింది.
22 అప్పుడు రాహేలు ప్రార్థన దేవుడు విన్నాడు. రాహేలుకు పిల్లలు పుట్టేట్లుగా దేవుడు చేశాడు. 23-24 రాహేలు గర్భవతి అయింది, ఒక కుమారుణ్ణి కన్నది. “దేవుడు నా అవమానం తొలగించి, నాకూ ఒక కుమారుణ్ణి ఇచ్చాడు” అని ఆమె చెప్పింది. “దేవుడు నాకు మరో కుమారుణ్ణి అనుగ్రహించు గాక” అంటూ రాహేలు ఆ కుమారునికి యోసేపు అని పేరు పెట్టింది.
రానున్న తేజస్సు
18 మనకు వ్యక్తం కానున్న తేజస్సు, మనం ప్రస్తుతం అనుభవిస్తున్న కష్టాలకన్నా ఎన్నో రెట్లు గొప్పదని నా అభిప్రాయం. 19 దేవుడు తన కుమారుల్ని బయలు పర్చాలని సృష్టి అంతా ఆతృతతో కాచుకొని ఉంది. 20 సృష్టి నాశనంకు అప్పగింపబడింది. అయితే తన కోరిక ప్రకారం కాకుండా, దాన్ని లోబర్చిన వాని చిత్తప్రకారం నిరీక్షణలో అప్పగించబడింది. 21 బానిసత్వంతో క్షీణించిపోతున్న ఈ సృష్టి ఒక రోజు విడుదలపొంది, దేవుని సంతానం అనుభవింపనున్న తేజోవంతమైన స్వేచ్ఛను అనుభవిస్తుందనే ఒక విశ్వాసం ఉంది.
22 సృష్టి అంతా ప్రసవించునప్పుడు స్త్రీకి కలిగే బాధలాంటి నొప్పులతో మూలుగుతూ ఈనాటి వరకు బాధపడుతుందని మనకు తెలుసు. 23 అంతేకాదు, దేవుని ఆత్మను మొదటి ఫలంగా పొందిన మనము కూడా మన మనస్సులో మూలుగుతున్నాము. మనం దత్త పుత్రులం కావాలనీ, మన శరీరాలకు విముక్తి కలగాలనీ ఆతృతతో కాచుకొని ఉన్నాము. 24 మనం రక్షింపబడినప్పుడు ఈ నిరీక్షణ మనలో ఉంది. కాని విశ్వాసంతో ఎదురు చూస్తున్నది లభించిన తర్వాత దాని కోసం ఆశించవలసిన అవసరం ఉండదు. తన దగ్గరున్న దానికోసం ఎవరు ఎదురు చూస్తారు? 25 కాని మన దగ్గర లేనిదాని కోసం ఆశిస్తే దానికోసం ఓర్పుతో నిరీక్షిస్తాము.
26 అదే విధంగా మనం బలహీనులం కనుక, ఏ విధంగా ప్రార్థించాలో మనకు తెలియదు. కనుక, దేవుని ఆత్మ స్వయంగా మన పక్షాన మాటలు వ్యక్తపరచలేని మూలుగులతో దేవునికి తెలిపి మనకు సహాయపడుతున్నాడు. 27 ఆయన దేవునితో తన ప్రజలకోసం ఆయన ఇచ్ఛానుసారం విన్నపం చేస్తున్నాడు. మన హృదయాలను పరిశోధించే దేవునికి ఆయన యొక్క ఆలోచనలు తెలుసు.
28 దేవుడు తనను ప్రేమించే ప్రజల కోసం, తన ఉద్దేశానుసారం పిలువబడినవాళ్ళ కోసం ఆయన సమస్తము చేయుచున్నాడని మనకు తెలుసు. ఈ ప్రజల్ని దేవుడు తన ఉద్దేశానుసారంగా పిలిచాడు. 29 దేవుడు తనకు ఇదివరకే తెలిసిన వాళ్ళను తన కుమారునిలా రూపొందించాలని ప్రత్యేకంగా ఉంచాడు. తనకు చాలామంది పుత్రులుండాలని, వాళ్ళలో యేసు మొట్ట మొదటి వానిగా ఉండాలని ఆయన ఉద్దేశ్యం. 30 దేవుడు ఎవర్ని ప్రత్యేకంగా ఉంచాడో వాళ్ళను పిలిచాడు. ఎవర్ని పిలిచాడో వాళ్ళను నీతిమంతులుగా చేసాడు. ఎవర్ని నీతిమంతులుగా చేసాడో వాళ్ళతో తన మహిమను పంచుకొన్నాడు.
© 1997 Bible League International