Revised Common Lectionary (Complementary)
సమాధాన ప్రభువు వస్తున్నాడు
11 యెష్షయి మొద్దునుండి (వంశం నుండి) ఒక చిగురు (శిశువు) పుడుతుంది. యెష్షయి వేరులనుండి అంకురం ఎదుగుతుంది. 2 ఆ శిశువులో యెహోవా ఆత్మ ఉంటుంది. జ్ఞానం, అవగాహన, నడిపింపు, శక్తిని ఆత్మ ఇస్తుంది. ఈ శిశువు యెహోవాను తెలుసుకొని, ఘనపర్చటానికి ఆత్మ సహాయం ఉంటుంది. 3 ఈ శిశువు యెహోవాను ఘనపరుస్తాడు. అందువల్ల శిశువు సంతోషంగా ఉంటాడు.
ఈ శిశువు కనబడే వాటిని బట్టి తీర్పు తీర్చడు. అతడు వినేవిషయాలను బట్టి తీర్పు తీర్చడు. 4-5 బీదలకు అతడు న్యాయంగా, నిజాయితీగా తీర్పుచెబుతాడు. దేశంలో పేద ప్రజలకు జరగాల్సిన విషయాల్లో నిర్ణయాలు చేయాల్సినప్పుడు అతడు న్యాయంగా ఉంటాడు. ప్రజలు కొట్టబడాలని అతడు నిర్ణయిస్తే, అప్పుడు అతడు ఆదేశం ఇస్తాడు, ఆ ప్రజలు కొట్టబడతారు. ఎవరైనా చావాలని అతడు నిర్ణయం చేస్తే, అప్పుడు అతడు ఆదేశం ఇస్తాడు. ఆ దుష్టులు చంపబడతారు. మంచితనం, న్యాయం ఈ శిశువుకు బలం ప్రసాదిస్తాయి. అవి అతడు తన నడుముకు కట్టుకొనే పట్టాలా ఉంటాయి.
6 ఆ సమయంలో తోడేళ్లు గొర్రెపిల్లలతో కలిసి శాంతిగా జీవిస్తాయి. పెద్ద పులులు మేక పిల్లలతో కలిసి శాంతంగా పండుకొంటాయి. దూడలు, సింహాలు, ఎద్దులు కలిసి శాంతిగా జీవిస్తాయి. ఒక చిన్న పిల్లాడు వాటిని తోల్తాడు. 7 ఆవులు, ఎలుగుబంట్లు కలిసి శాంతిగా జీవిస్తాయి. వాటి పిల్లలన్నీ కలసి పండుకొంటాయి, ఒక దానిని ఒకటి బాధించవు. సింహాలు, ఆవుల్లా గడ్డి మేస్తాయి. చివరికి సర్పాలు కూడా మనుష్యులకు హాని చేయవు. 8 ఒక చిన్నబిడ్డ నాగుపాముపుట్ట దగ్గర ఆడుకొంటుంది. విషసర్పం పుట్టలో ఒకచిన్న పాప చేయి పెట్టగలుగుతుంది.
9 అంతా శాంతిగా ఉంటుందనీ, ఎవరూ ఒకరిని ఒకరు బాధించుకోరనీ ఈ విషయాలు తెలియ జేస్తున్నాయి. నా పరిశుద్ధ పర్వతం మీద ప్రజలు దేనినీ నాశనం చేయాలని ఆశించరు. ఎందుకంటే, ప్రజలు వాస్తవంగా యెహోవాను తెలుసుకొని ఉంటారు గనుక. సముద్రంనీళ్లతో నిండిపోయినట్టు, వారు దైవజ్ఞానంతో నిండిపోయి ఉంటారు.
8 ఓ మందల కావలిదుర్గమా,
ఓ సీయోను కుమార్తె పర్వతమైన
ఓఫెలూ, గతంలోమాదిరి
నీవొక రాజ్యంగా రూపొందుతావు.
అవును, సీయోను కుమారీ,
ఆ రాజ్యం నీకు వస్తుంది.
ఇశ్రాయేలీయులు బబులోనుకు ఎందుకు వెళ్లాలి?
9 నీవిప్పుడు అంత బిగ్గరగా ఎందుకు ఏడుస్తున్నావు?
నీ రాజు వెళ్లిపోయాడా?
నీ నాయకుని నీవు కోల్పోయావా?
ప్రసవవేదనపడే స్త్రీలా నీవు బాధ పడుతున్నావు.
10 సీయోను కుమారీ, నీవు బాధపడు.
ప్రసవించే స్త్రీలా నీవు నొప్పిని అనుభవించి “బిడ్డను” కను.
ఎందుకంటే నీవు (యెరూషలేము) నగరాన్ని ఇప్పుడు వదిలివేస్తావు.
నీవు వెళ్లి పొలంలో నివసిస్తావు.
నీవు బబులోను (బాబిలోనియా)కు వెళతావు.
కానీ నీవక్కడనుండి రక్షింపబడతావు.
యెహోవా అక్కడికి వెళ్లి, నిన్ను
నీ శత్రువులనుండి తిరిగి తీసుకొని వస్తాడు.
యెహోవా ఇతర దేశాలను నాశనం చేయుట
11 అనేక దేశాలు నీమీద యుద్ధానికి వచ్చాయి.
“సీయోనువైపు చూడు!
దానిపై దాడి చేయండి!” అని ఆ జనులు అంటారు.
12 ఆ జనులు వారి వ్యూహాలు పన్నారు.
కాని యెహోవా చేసే యోచన మాత్రం వారు ఎరుగరు.
యెహోవా ఆ ప్రజలను ఇక్కడికి ఒక ప్రత్యేక ఉద్దేశ్యంతో తీసుకొని వచ్చాడు.
కళ్లంలో ధాన్యం నూర్చబడినట్లు ఆ జనులు నలగదొక్కబడతారు.
ఇశ్రాయేలు శత్రువులను ఓడించుట
13 “సీయోను కుమారీ, లెమ్ము; ఆ జనాలను అణగదొక్కు.
నేను నిన్ను బాగా బలపర్చుతాను.
నీకు ఇనుప కొమ్ములు, కంచు గిట్టలు ఉన్నట్లవుతుంది.
అనేకమంది జనులను నీవు ముక్కలుగా చితకగొడతావు.
వారి సంపదను నేను యెహోవాకు ఇస్తాను.
వారి భాగ్యాన్ని సర్వజగత్తుకూ అధిపతియైన యెహోవాకు సమర్పిస్తాను.”
31 “మరి ఈ కాలపు ప్రజల్ని నేను దేనితో పోల్చాలి? వాళ్ళు ఏ విధంగా ఉంటారు? 32 వాళ్ళు సంతలో కూర్చొని,
‘మేము మీకోసం పిల్లన గ్రోవి ఊదాము.
కాని మీరు నాట్యం చేయలేదు.
మేము చనిపోయిన వానికోసం పాట పాడాము.
కాని మీరు దుఃఖించలేదు.’
అని మాట్లాడుకొంటున్న చిన్న పిల్లల్లాంటి వాళ్ళు. 33 బాప్తిస్మమునిచ్చే యోహాను ఆహారం తినలేదు. ద్రాక్షారసం త్రాగలేదు. మీరు అతనికి దయ్యం పట్టిందన్నారు. 34 మనుష్యకుమారుడు తింటూ, త్రాగుతూ వచ్చాడు. ఆయన్ని మీరు తిండిపోతు, త్రాగుపోతు అని అన్నారు. పన్నులు వసూలు చేసే వాళ్ళతో, పాపులతో స్నేహం చేస్తాడని ఆయన్ని విమర్శించారు. 35 జ్ఞానము దానిని పొందినవాని ద్వారా సరైనదని ఋజువు చేయబడుతుంది.”
© 1997 Bible League International