Revised Common Lectionary (Complementary)
సమాధాన ప్రభువు వస్తున్నాడు
11 యెష్షయి మొద్దునుండి (వంశం నుండి) ఒక చిగురు (శిశువు) పుడుతుంది. యెష్షయి వేరులనుండి అంకురం ఎదుగుతుంది. 2 ఆ శిశువులో యెహోవా ఆత్మ ఉంటుంది. జ్ఞానం, అవగాహన, నడిపింపు, శక్తిని ఆత్మ ఇస్తుంది. ఈ శిశువు యెహోవాను తెలుసుకొని, ఘనపర్చటానికి ఆత్మ సహాయం ఉంటుంది. 3 ఈ శిశువు యెహోవాను ఘనపరుస్తాడు. అందువల్ల శిశువు సంతోషంగా ఉంటాడు.
ఈ శిశువు కనబడే వాటిని బట్టి తీర్పు తీర్చడు. అతడు వినేవిషయాలను బట్టి తీర్పు తీర్చడు. 4-5 బీదలకు అతడు న్యాయంగా, నిజాయితీగా తీర్పుచెబుతాడు. దేశంలో పేద ప్రజలకు జరగాల్సిన విషయాల్లో నిర్ణయాలు చేయాల్సినప్పుడు అతడు న్యాయంగా ఉంటాడు. ప్రజలు కొట్టబడాలని అతడు నిర్ణయిస్తే, అప్పుడు అతడు ఆదేశం ఇస్తాడు, ఆ ప్రజలు కొట్టబడతారు. ఎవరైనా చావాలని అతడు నిర్ణయం చేస్తే, అప్పుడు అతడు ఆదేశం ఇస్తాడు. ఆ దుష్టులు చంపబడతారు. మంచితనం, న్యాయం ఈ శిశువుకు బలం ప్రసాదిస్తాయి. అవి అతడు తన నడుముకు కట్టుకొనే పట్టాలా ఉంటాయి.
6 ఆ సమయంలో తోడేళ్లు గొర్రెపిల్లలతో కలిసి శాంతిగా జీవిస్తాయి. పెద్ద పులులు మేక పిల్లలతో కలిసి శాంతంగా పండుకొంటాయి. దూడలు, సింహాలు, ఎద్దులు కలిసి శాంతిగా జీవిస్తాయి. ఒక చిన్న పిల్లాడు వాటిని తోల్తాడు. 7 ఆవులు, ఎలుగుబంట్లు కలిసి శాంతిగా జీవిస్తాయి. వాటి పిల్లలన్నీ కలసి పండుకొంటాయి, ఒక దానిని ఒకటి బాధించవు. సింహాలు, ఆవుల్లా గడ్డి మేస్తాయి. చివరికి సర్పాలు కూడా మనుష్యులకు హాని చేయవు. 8 ఒక చిన్నబిడ్డ నాగుపాముపుట్ట దగ్గర ఆడుకొంటుంది. విషసర్పం పుట్టలో ఒకచిన్న పాప చేయి పెట్టగలుగుతుంది.
9 అంతా శాంతిగా ఉంటుందనీ, ఎవరూ ఒకరిని ఒకరు బాధించుకోరనీ ఈ విషయాలు తెలియ జేస్తున్నాయి. నా పరిశుద్ధ పర్వతం మీద ప్రజలు దేనినీ నాశనం చేయాలని ఆశించరు. ఎందుకంటే, ప్రజలు వాస్తవంగా యెహోవాను తెలుసుకొని ఉంటారు గనుక. సముద్రంనీళ్లతో నిండిపోయినట్టు, వారు దైవజ్ఞానంతో నిండిపోయి ఉంటారు.
మోషే మీద కొందరి నాయకుల తిరుగుబాటు
16 కోరహు, దాతాను, అబీరాము, ఓను అనువారు మోషేకు ఎదురు తిరిగారు. (కోరహు ఇస్హారు కుమారుడు. ఇస్హారు కహాతు కుమారుడు, కహాతు లేవీ కుమారుడు. దాతాను, అబీరాములు సోదరులు, ఎలీయాబు కుమారులు. ఓను పెలెతు కుమారుడు). దాతాను, అబీరాము, ఓను రూబేను వంశస్థులు. 2 ఈ నలుగురు ఇశ్రాయేలీయులలో మరో 250 మందిని పోగుజేసి మోషే మీదికి వచ్చారు. ఈ 250 మంది ఇశ్రాయేలీయులలో పేరున్న పెద్ద మనుష్యులు. వారు సభా సభ్యులుగా ఎన్నుకోబడినవారు. 3 వారు మోషే, అహరోనులకు వ్యతిరేకంగా మాట్లాడటానికి గుంపుగా వచ్చి. “మీరు చేసింది మేము ఒప్పుకోవటం లేదు. ఇశ్రాయేలీయుల నివాసంలో ఉన్న వాళ్లంతా పవిత్రులు. వారిలో ప్రతి ఒక్కరూ మంచివారు. పైగా యెహోవా వారితో ఉన్నాడు. అలాంటప్పుడు మేము ఆ దేశంలో ప్రవేశించం అని చెబుతావేమి? నిన్ను నీవే అందరికంటె గొప్ప చేసుకొంటున్నావు” అని వాళ్లు మోషే, అహరోనులతో అన్నారు.
4 మోషే ఈ సంగతులు వినగానే, వినయంతో సాష్టాంగపడ్డాడు (తాను గర్విష్ఠిని కానని చూపించటానికి). 5 అప్పుడు కోరహుతో, అతనితో ఉన్న వాళ్లందరితో మోషే ఇలా అన్నాడు: “వాస్తవానికి ఎవరు యెహోవాకు చెందినవారో రేపు ఉదయం ఆయన తెలియజేస్తాడు. అలాంటివాడిని ఆయన తన దగ్గరకు రానిస్తాడు. ఆ మనిషిని యెహోవా ఎన్నిక చేసి, యెహోవాయే అతడ్ని తన దగ్గరకు తీసుకొస్తాడు. 6 అందుచేత కోరహు, నీవూ, నీ అనుచరులంతా ఇలా చేయాలి. 7 రేపు ధూపార్తుల్లో నిప్పు, సాంబ్రాణి వెయ్యండి. అప్పుడు వాటిని యెహోవా సన్నిధికి తీసుకొనిరండి. నిజంగా పవిత్రుడ్ని యెహోవా ఎంచుకొంటాడు. కానీ, నీవూ, నీ లేవీ సోదరులు తప్పుచేసి మితిమీరిపోయారు.”
8 కోరహుతో మోషే ఇంకా ఇలా అన్నాడు: “లేవీయులారా, నా మాట వినండి. 9 ఇశ్రాయేలు దేవుడు మిమ్మల్ని వేరు చేసి, ప్రత్యేకంగా ఉంచినందుకు మీరు సంతోషించాలి. మిగతా ఇశ్రాయేలు ప్రజలందరి కంటె మీరు ప్రత్యేకం. ఇశ్రాయేలు ప్రజలు యెహోవాను ఆరాధించేందుకు సహాయకరంగా యెహోవా పవిత్ర గుడారంలో ప్రత్యేక పని చేయటానికి యెహోవా మిమ్మల్ని తనకు దగ్గరగా తెచ్చుకొన్నాడు. అది చాలదా? 10 యెహోవా తానే నిన్ను, లేవీ ప్రజలందర్నీ తన దగ్గరకు చేర్చుకొన్నాడు. కానీ ఇప్పుడు మీరే యాజకులు అయ్యేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. 11 నీవూ, నీ అనుచరులూ యెహోవా మీదికి రావటానికి ఏకమయ్యారు. మీరు అహరోను మీదికివచ్చి, అతనికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయటం తప్పు.”
12 అప్పుడు ఎలీయాబు కుమారులైన దాతాను, అబీరాములను మోషే పిల్చాడు. కానీ వాళ్లిద్దరు ఇలా చెప్పారు: “మేము రాము. 13 పాలు తేనెలు ప్రవహించే మంచి ధనిక దేశంనుండి నీవు మమ్మల్ని బయటకు తీసుకుచ్చావు. ఈ అరణ్యంలో మమ్మల్ని చంపటానికి నీవు మమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చావు. పైగా నీకు మామీద చాల అధికారం ఉన్నట్టు చూపించాలనుకొంటున్నావు. 14 మేము నిన్నెందుకు వెంబండించాలి? పాలు తేనెలు ప్రవహించే ఒక కొత్త ధనిక దేశానికి మమ్మల్ని నీవు తీసుకొని రాలేదు. దేవుడు వాగ్దానం చేసిన దేశం నీవు మాకు ఇవ్వలేదు. పొలాలు, ద్రాక్షాతోటలు ఏవి నీవు మాకు ఇవ్వలేదు. ఈ మనుష్యుల్ని నీ బానిసలుగా చేస్తావా? లేదు, మేము రాము.”
15 అందుచేత మోషేకు చాల కోపం వచ్చింది. అతడు యెహోవాతో “వారి కానుకలు స్వీకరించకు. వారి దగ్గరనుండి నేనేమి తీసుకోలేదు, కనీసం ఒక గాడిదను కూడా తీసుకోలేదు. పైగా వారిలో ఎవ్వరికీ నేనేమి కీడు చేయలేదు” అని చెప్పాడు.
16 అప్పుడు మోషే కోరహుతో అన్నాడు: “నీవూ, నీ అనుచరులంతా రేపు యెహోవా ఎదుట నిలబడాలి. మీతోబాటు అహరోనుకూడ యెహోవా ఎదుట నిలబడతాడు. 17 మీలో ప్రతి ఒక్కరూ ఒక ధూపార్తి తీసుకుని, అందులో సాంబ్రాణి వేసి దానిని యెహోవాకు అర్పించాలి. నాయకులకు 250 ధూపార్తులు, నీకు ఒక ధూపార్తి, అహరోనుకు ఒక ధూపార్తి ఉండాలి.”
18 కనుక ప్రతి ఒక్కరూ ఒక్కో ధూపార్తిని సాంబ్రాణితో నింపారు. అప్పుడు వారు సన్నిధి గుడారపు ప్రవేశం దగ్గర నిలబడ్డారు. మోషే, అహరోను కూడ అక్కడ నిలబడ్డారు. 19 కోరహు తన అనుచరులందరినీ సమావేశపర్చాడు (వీళ్లే మోషే, అహరోనులను ఎదిరించినవారు). సన్నిధి గుడార ప్రవేశం దగ్గర వీళ్లందర్నీ కోరహు సమావేశ పర్చాడు. అప్పుడు అక్కడ ప్రతి ఒక్కరికీ యెహోవా మహిమ ప్రత్యక్షం అయింది.
7 మీకు దైవసందేశాన్ని ఉపదేశించిన గురువుల్ని జ్ఞాపకముంచుకోండి. వాళ్ళ జీవిత విధానం వలన కలిగిన మంచిని గమనించండి. వాళ్ళ విశ్వాసాన్ని అనుసరించండి. 8 నిన్న, నేడు, నిరంతరం యేసు క్రీస్తు ఒకే విధంగా ఉంటాడు. 9 ఎన్నో రకాల విచిత్రమైన బోధలు ఉన్నాయి. వాటివల్ల మోసపోకండి. దైవానుగ్రహంతో మన హృదయాలు శక్తి పొందాలి గాని ఆహారంతో కాదు. ఆహార నియమాలవల్ల వాళ్ళకు లాభం కలుగదు.
10 యూదుల గుడారంలో సేవచేసే యాజకులకు మన బలిపీఠం మీద బలి ఇచ్చినదాన్ని తినే అధికారంలేదు. 11 పాపాలకు ప్రాయశ్చిత్తంగా అర్పించటానికి ప్రధాన యాజకుడు జంతువుల రక్తాన్ని అతి పవిత్రస్థానంలోకి తీసుకు వెళ్ళేవాడు. ఆ జంతువుల దేహాల్ని శిబిరానికి ఆవలి వైపు కాల్చేవాడు. 12 మనుష్యుల్ని తన రక్తంతో పవిత్రం చెయ్యాలని యేసు నగరపు సింహద్వారానికి ఆవల మరణించాడు. 13 అందువల్ల శిబిరం వెలుపలనున్న ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన అవమానాన్ని పంచుకుందాం. 14 మనకు స్థిరమైన పట్టణం లేదు. కాని మున్ముందు రానున్న పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాము. 15 అందువల్లే మనం యేసు ద్వారా దేవుణ్ణి అన్ని వేళలా స్తుతించుదాం. మన నోటి ద్వారా కలిగే స్తుతిని ఆయనకు బలిగా అర్పించి, ఆయన పేరులో ఉన్న కీర్తిని పంచుకుందాం. 16 ఇతరులకు ఉపకారం చెయ్యండి. మీకున్నదాన్ని యితరులతో పంచుకోండి. ఇలాంటి పనులు దేవునికి చాలా యిష్టం.
17 మీ నాయకుల పట్ల విధేయతగా ఉంటూ, వాళ్ళు చెప్పినట్లు చెయ్యండి. మీ ఆత్మల్ని కాపాడవలసిన పని వాళ్ళది. వాళ్ళు దేవుని ముందు లెక్క చెప్పవలసివుంటుంది. వాళ్ళకు మీరు విధేయులైవుంటే, వాళ్ళు తాము చేయవలసిన పనిని ఆనందంగా చేయగలుగుతారు. అది వాళ్ళకు భారంగా వుండదు. వాళ్ళకు భారం కలగటం మీకు మంచిది కాదు.
© 1997 Bible League International