Revised Common Lectionary (Complementary)
ఒక ఆనంద గానం
14 యెరూషలేమా! పాడుతూ సంతోషంగా ఉండు!
ఇశ్రాయేలూ, ఆనందంగా కేకలు వేయి!
యెరూషలేమా, సంతోషించి సరదాగా ఉండు!
15 ఎందుకంటే, నీ శిక్షను యెహోవా నిలిపివేశాడు గనుక!
నీ శత్రువుల బలమైన దుర్గాలను ఆయన నాశనం చేశాడు!
ఇశ్రాయేలు రాజా, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు.
ఏ చెడు విషయం జరుగుతున్నా దాన్నిగూర్చి నీవు దిగులు పడాల్సిన అవసరం లేదు.
16 ఆ సమయంలో యెరూషలేముతో ఇలా చెప్పబడుతుంది:
“బలంగా ఉండు, భయపడవద్దు!
17 నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు.
ఆయన శక్తిమంతుడైన సైనికునిలా ఉన్నాడు.
ఆయన నిన్ను రక్షిస్తాడు.
ఆయన నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో అది ఆయన నీకు చూపిస్తాడు.
ఆయన నీగురించి సంతోషపడతాడు, నీవంటే ఆనందిస్తాడు.
విందులో పాల్గొన్నవారివలె ఆయన నీ విషయంలో నవ్వుతూ సంతోషిస్తాడు.
18 అది విందులో పాల్గొన్న ప్రజల్లా ఉంటుంది.”
యెహోవా చెప్పాడు: “నీ అవమానాన్ని నేను తొలగించివేస్తాను.
ఆ ప్రజలు నిన్ను బాధించకుండునట్లు నేను చేస్తాను.
19 ఆ సమయంలో, నిన్ను బాధించేవారిని నేను శిక్షిస్తాను.
బాధించబడిన నా ప్రజలను నేను రక్షిస్తాను.
పారిపోయేలా బలవంతం చేయబడిన ప్రజలను నేను తిరిగి వెనుకకు తీసుకొనివస్తాను.
మరియు నేను వారిని ప్రసిద్ధి చేస్తాను.
అన్ని చోట్లా ప్రజలు వారిని పొగడుతారు.
20 ఆ సమయంలో, నిన్ను నేను వెనుకకు తీసుకొని వస్తాను.
నేను నిన్ను సమకూర్చి తీసుకొని వస్తాను.
నిన్నునేను ప్రసిద్ధి చేస్తాను. అన్ని చోట్లా ప్రజలు నిన్ను పొగడుతారు.
నీ సొంత కళ్ళయెదుట బందీలను తిరిగి నేను వెనుకకు తీసుకొని వచ్చినప్పుడు అది జరుగుతుంది!”
ఆ సంగతులు యెహోవా చెప్పాడు.
2 దేవుడు నన్ను రక్షిస్తున్నాడు.
ఆయన్నే నేను నమ్ముకొంటాను. నాకేం భయంలేదు. ఆయన నన్ను రక్షిస్తాడు.
యెహోవా, యెహోవాయే నా బలం.[a]
ఆయన నన్ను రక్షిస్తున్నాడు. నేను ఆయనకు స్తోత్రగీతాలు పాడుతాను.
3 రక్షణ ఊటల్లోనుండి మీ నీళ్లు తెచ్చుకోండి.
అప్పుడు మీరు సంతోషిస్తారు.
4 “యెహోవాకు స్తోత్రాలు!
ఆయన నామం ఆరాధించండి!
ఆయన చేసిన కార్యాలను గూర్చి ప్రజలందరితో చెప్పండి”
అని అప్పుడు మీరు అంటారు.
5 యెహోవాను గూర్చిన స్తోత్రగీతాలు పాడండి.
ఎందుకంటే, ఆయన గొప్ప కార్యాలు చేశాడు గనుక.
దేవుని గూర్చిన ఈ వార్త ప్రపంచ వ్యాప్తంగా ప్రకటించండి.
పజలందర్నీ ఈ విషయాలు తెలుసుకోనివ్వండి.
6 సీయోను ప్రజలారా, ఈ సంగతులను గూర్చి కేకలు వేయండి.
ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు శక్తివంతంగా మీతో ఉన్నాడు.
అందుచేత, సంతోషంగా ఉండండి!
4 అన్ని వేళలందును మీరు ప్రభువునందు ఆనందించండి, మళ్ళీ చెపుతున్నాను. ప్రభువునందు ఆనందించండి.
5 మీరు దయగలవాళ్ళనే పేరు పొందాలి. ప్రభువు త్వరలో రానున్నాడు. 6 ఏ విషయంలో చింతలు పెట్టుకోకండి. ప్రతిసారి ప్రార్థించి మీ కోరికల్ని దేవునికి తెలుపుకోండి. కృతజ్ఞతా హృదయంతో అడగండి. 7 దేవుడు యిచ్చే శాంతిని ఎవ్వరూ అర్థం చేసుకోలేదు. అది మీ హృదయాలను, మీ బుద్ధిని, యేసు క్రీస్తులో ఉంచి కాపలాకాస్తుంది.
7 ప్రజలు బాప్తిస్మము పొందటానికి గుంపులు గుంపులుగా యోహాను దగ్గరకు వచ్చారు. యోహాను, “మీరు సర్పసంతానం. దేవునికి కోపం రానున్నది. ఆ కోపం నుండి పారిపోవాలనుకుంటున్నారు. అలా చేయుమని ఎవరు చెప్పారు? 8 మారుమనస్సు పొందినట్లు ఋజువు చేసే పనులు చెయ్యండి. ‘అబ్రాహాము మా తండ్రి’ అని గొప్పలు చెప్పుకొన్నంత మాత్రాన లాభం లేదు. ఈ రాళ్ళనుండి దేవుడు అబ్రాహాము సంతానాన్ని సృష్టించగలడని నేను చెబుతున్నాను. 9 చెట్లవేళ్ళమీద గొడ్డలి సిద్ధంగా ఉంది. మంచి ఫలమివ్వని చెట్టును కొట్టెసి ఆయన మంటల్లో పార వేస్తాడు” అని అన్నాడు.
10 “మరి మేము ఏం చెయ్యాలి?” అని ప్రజలు అడిగారు.
11 యోహాను, “రెండు చొక్కాలున్న వాడు ఒక చొక్కాకూడా లేని వానితో వాటిని పంచుకోవాలి. అలాగే మీ ఆహారం కూడా పంచుకోవాలి” అని అన్నాడు.
12 పన్నులు సేకరించేవాళ్ళు కూడా బాప్తిస్మము పొందటానికి వచ్చారు. వాళ్ళు, “బోధకుడా! మేము ఏం చెయ్యాలి?” అని అడిగారు.
13 “సేకరించ వలసిన పన్నుల కన్నా ఎక్కువ పన్నులు సేకరించవద్దు” అని అతడు వాళ్ళతో అన్నాడు.
14 కొందరు సైనికులు కూడా వచ్చి, “మేము ఏం చెయ్యాలి?” అని అతణ్ణి అడిగారు.
అతడు సమాధానం చెబుతూ, “ప్రజల నుండి డబ్బుగుంజవద్దు! వాళ్ళపై తప్పుడు నిందలు మోపకండి. మీ జీతంతో తృప్తి చెందండి” అని అన్నాడు.
15 ప్రజలు రానున్న వాని కోసం ఆశతో కాచుకొని ఉన్నరోజులవి. వాళ్ళు యోహానే క్రీస్తు అయి ఉండవచ్చనుకున్నారు.
16 యోహాను వాళ్ళకు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “నేను మీకు నీటిలో బాప్తిస్మము[a] నిచ్చాను. కాని నాకన్నా శక్తిగలవాడు వస్తాడు. ఆయన కాలిచెప్పులు విప్పే అర్హతకూడా నాకు లేదు. ఆయన మీకు పవిత్రాత్మలో, అగ్నిలో బాప్తిస్మమునిస్తాడు. 17 చేట ఆయన చేతిలో ఉంది. ఆయన ఆ చేటతో ధాన్యాన్ని శుభ్రపరచి తన ధాన్యాన్ని కొట్టులో దాచుకొని, పొట్టును ఆరని మంటల్లో కాల్చివేస్తాడు.” 18 యోహాను వాళ్ళకు హెచ్చరిక కలిగేటట్లు యింకా ఎన్నో విషయాలు చెప్పాడు. సువార్త కూడా ప్రకటించాడు.
© 1997 Bible League International