Revised Common Lectionary (Complementary)
2 దేవుడు నన్ను రక్షిస్తున్నాడు.
ఆయన్నే నేను నమ్ముకొంటాను. నాకేం భయంలేదు. ఆయన నన్ను రక్షిస్తాడు.
యెహోవా, యెహోవాయే నా బలం.[a]
ఆయన నన్ను రక్షిస్తున్నాడు. నేను ఆయనకు స్తోత్రగీతాలు పాడుతాను.
3 రక్షణ ఊటల్లోనుండి మీ నీళ్లు తెచ్చుకోండి.
అప్పుడు మీరు సంతోషిస్తారు.
4 “యెహోవాకు స్తోత్రాలు!
ఆయన నామం ఆరాధించండి!
ఆయన చేసిన కార్యాలను గూర్చి ప్రజలందరితో చెప్పండి”
అని అప్పుడు మీరు అంటారు.
5 యెహోవాను గూర్చిన స్తోత్రగీతాలు పాడండి.
ఎందుకంటే, ఆయన గొప్ప కార్యాలు చేశాడు గనుక.
దేవుని గూర్చిన ఈ వార్త ప్రపంచ వ్యాప్తంగా ప్రకటించండి.
పజలందర్నీ ఈ విషయాలు తెలుసుకోనివ్వండి.
6 సీయోను ప్రజలారా, ఈ సంగతులను గూర్చి కేకలు వేయండి.
ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు శక్తివంతంగా మీతో ఉన్నాడు.
అందుచేత, సంతోషంగా ఉండండి!
ఇశ్రాయేలు వ్యాపారుల ధనాశ
4 నేను చెప్పేది వినండి! నిస్సహాయులైన ప్రజలపై మీరు నడిచి వెళ్తారు.
ఈ దేశ పేదప్రజలను నాశనం చేయాలని మీరు ప్రయత్నిస్తున్నారు.
5 వర్తకులారా, మీరిలా అంటారు,
“మేము ధాన్యాన్ని అమ్ముకొనేటందుకు అమావాస్య ఎప్పుడు వెళ్లిపోతుంది?
అమ్మకానికి మా గోధుమలు తేవటానికి
విశ్రాంతిదినం ఎప్పుడైపోతుంది?
కొలతలు తగ్గించి, ధరలు పెంచుతాము.
దొంగత్రాసు వేసి ప్రజలను మోసగిస్తాము.
6 పేదవారు ఎలాగో వారి అప్పులు తీర్చలేరు గనుక,
మేము వారిని బానిసలనుగా కొంటాము.
జత చెప్పుల విలువకు ఆ నిస్సహాయులను మేము కొంటాము.
ఆహా, నేలపై ఒలికిన ధాన్యాన్ని కూడా మేము అమ్ముకోవచ్చు.”
7 యెహోవా ఒక మాట ఇచ్చాడు. యాకోబుకు గర్వ కారణమైన తన పేరుమీద ఈ ప్రమాణం చేశాడు:
“ఆ ప్రజలు చేసిన పనులను నేనెన్నడూ మరువను.
8 ఆ పనుల కారణంగా భూమి అంతా కంపిస్తుంది.
దేశంలో నివసించే ప్రతివాడు చనిపోయినవారి కొరకు విలపిస్తాడు.
ఈజిప్టులోని నైలు నదిలా భూమి అంతా ఉవ్వెత్తుగా లేచి పతనమవుతుంది.
భూమి అటూ ఇటూ ఊగిసలాడుతుంది.”
9 యెహోవా ఈ విషయాలు కూడా చెప్పాడు:
“ఆ సమయంలో మధ్యాహ్న సమయంలో సూర్యుడు అస్తమించేలా నేను చేస్తాను.
మబ్బులేని పగటి సమయంలో భూమిపై చీకటి కమ్మేలా చేస్తాను.
10 మీ పండుగ దినాలను చనిపోయినవారి కొరకు దుఃఖించే దినాలుగా మార్చుతాను.
మీ పాటలన్నీ మృతులకొరకు విలాప గీతాలవుతాయి.
ప్రతివానిపైన విషాద సూచిక దుస్తులు వేస్తాను.
ప్రతివాని తలను బోడితల చేస్తాను.
ఏకైక పుత్రుడు చనిపోయినప్పుడు కలిగే గొప్ప
దుఃఖంలాంటి దుఃఖాన్ని నేను కలిగిస్తాను.
అది ఒక భయంకరమైన అంతం.”
దేవుని వాక్యంకొరకు కరువు
11 యెహోవా చెపుతున్నాడు:
“చూడు, దేశంలో కరువు పరిస్థితిని
నేను కల్పించే సమయం వస్తూవుంది.
ప్రజలు ఆహారం కొరకు ఆకలిగొనరు.
ప్రజలు నీటి కొరకు దప్పిగొనరు.
కాని యెహోవా వాక్యాల కొరకు ప్రజలు ఆకలిగొంటారు.
12 ప్రజలు ఒక సముద్రంనుండి
మరొక సముద్రం వరకు తిరుగుతారు.
వారు ఉత్తరాన్నుండి తూర్పుకు పయనిస్తారు.
యెహోవా వాక్యం కొరకు ప్రజలు ముందుకు, వెనుకకు పోతారు.
కాని వారు దానిని కనుగొనలేరు.
మీ ఇచ్చుబడి ఆశీర్వాదం
9 భక్తులకు చేయవలసిన సహాయాన్ని గురించి నేను మీకు వ్రాయవలసిన అవసరం లేదు. 2 సహాయం చెయ్యాలనే ఉత్సాహం మీలో ఉన్నట్లు నాకు తెలుసు. అకయలో ఉన్న మీరు, పోయిన సంవత్సరం నుండి యివ్వటానికి సిద్ధంగా ఉన్నారని మాసిదోనియ ప్రజలకు నేను గర్వంగా చెప్పాను. మీ ఉత్సాహం వాళ్ళలో చాలా మందిని ప్రోత్సాహపరిచింది. వాళ్ళు కార్యనిర్వహణకు పూనుకొన్నారు. 3 ఈ విషయంలో మేము మిమ్మల్ని గురించి పొగుడుతూ చెప్పిన మాటలు వ్యర్థం కాకూడదని నా ఉద్ధేశ్యం. మీరు సహాయం చెయ్యటానికి సిద్ధంగా ఉంటారని నాకు తెలుసు. కనుక సోదరుల్ని పంపుతున్నాను. 4 ఒకవేళ మాసిదోనియవాళ్ళు నాతో వచ్చి మీరు సిద్ధంగా లేరని తెలుసుకొంటే, మీకే కాక, మీపై యింత నమ్మకం ఉన్న మాకు కూడా అవమానం కలుగుతుంది. 5 కనుక సోదరుల్ని ముందే మీ దగ్గరకు పంపటం అవసరం అనిపించింది. వాళ్ళు వచ్చి మీరు ధారాళంగా వాగ్దానం చేసిన విరాళాన్ని ప్రోగుచేస్తారు. అలా చేస్తే మేము వచ్చినప్పుడు ఆ కానుక సిద్ధంగా ఉంటుంది. అప్పుడు ఆ కానుక అయిష్టంగా కాక, ఆనందంగా యిచ్చినట్లు అందరికీ తెలుస్తుంది.
6 కొంచెముగా విత్తేవాడు కొద్దిపంటను మాత్రమే పొందుతాడు. అదే విధంగా ఎక్కువగా విత్తేవానికి పంటకూడా ఎక్కువగా లభిస్తుంది. మీరిది జ్ఞాపకం ఉంచుకొండి. 7 ఆనందంగా యిచ్చేవాణ్ణి దేవుడు ప్రేమిస్తాడు. కనుక ప్రతి ఒక్కడూ గొణుక్కోకుండా యివ్వాలి. ఒకరి బలవంతంతో కాకుండా తాను స్వయంగా నిర్ణయించుకొని యివ్వాలి. 8 అప్పుడు దేవుడు మీకవసరమున్నదాని కన్నా ఎక్కువే యిస్తాడు, మీకు అవసరమున్నవన్నీ అన్ని వేళలా మీకు లభించేటట్లు చెయ్యటమే కాకుండా సత్కార్యాలు చెయ్యటానికి కావలిసినవి సమృద్ధిగా యిస్తాడు. 9 దీన్ని గురించి లేఖనాల్లో ఇలా వ్రాసారు:
“అతడు పేదలకు ధారాళంగా యిచ్చాడు
అతని నీతి చిరకాలం ఉంటుంది.”(A)
10 రైతుకు విత్తనాలు, తినటానికి ఆహారము యిచ్చే దేవుడే మీ పంటను సమృద్ధిగా పండించటానికి కావలసిన విత్తనాలు యిస్తాడు. తద్వారా మీ నీతికి ఫలం కలిగిస్తాడు. 11 మీరు అన్ని విషయాల్లో ధారాళంగా ఉండేటట్లు మీకు సకల ఐశ్వర్యాలు యిస్తాడు. మాద్వారా మీరిచ్చిన విరాళాలు తీసుకొని విశ్వాసులు దేవునికి కృతజ్ఞతలు చెపుతారు.
12 మీరు చేసిన సహాయం విశ్వాసుల అవసరాలను తీరుస్తుంది. అంతేకాక, వాళ్ళు దేవుణ్ణి అన్నివేళలా స్తుతించేటట్లు చేస్తుంది. 13 మీరు ఈ సేవ చేసి మీ విశ్వాసాన్ని నిరూపించుకున్నారు. క్రీస్తు సువార్తను అంగీకరించారు. దాన్ని విధేయతతో పాటించారు. మీకున్నదాన్ని వాళ్ళతో మాత్రమే కాక, అందరితో ధారాళంగా పంచుకొన్నారు. ఇది చూసి ప్రజలు దేవుణ్ణి స్తుతిస్తారు. 14 దేవుడు మీపై యింత కరుణ చూపినందుకు, వాళ్ళు ప్రార్థించినప్పుడు మనసారా మిమ్మల్ని ప్రేమతో తలచుకుంటారు. 15 దేవుడు యిచ్చిన వర్ణనాతీతమైన ఆ కానుకకు మనము ఆయనకు కృతజ్ఞతతో ఉందాము.
© 1997 Bible League International