Revised Common Lectionary (Complementary)
2 దేవుడు నన్ను రక్షిస్తున్నాడు.
ఆయన్నే నేను నమ్ముకొంటాను. నాకేం భయంలేదు. ఆయన నన్ను రక్షిస్తాడు.
యెహోవా, యెహోవాయే నా బలం.[a]
ఆయన నన్ను రక్షిస్తున్నాడు. నేను ఆయనకు స్తోత్రగీతాలు పాడుతాను.
3 రక్షణ ఊటల్లోనుండి మీ నీళ్లు తెచ్చుకోండి.
అప్పుడు మీరు సంతోషిస్తారు.
4 “యెహోవాకు స్తోత్రాలు!
ఆయన నామం ఆరాధించండి!
ఆయన చేసిన కార్యాలను గూర్చి ప్రజలందరితో చెప్పండి”
అని అప్పుడు మీరు అంటారు.
5 యెహోవాను గూర్చిన స్తోత్రగీతాలు పాడండి.
ఎందుకంటే, ఆయన గొప్ప కార్యాలు చేశాడు గనుక.
దేవుని గూర్చిన ఈ వార్త ప్రపంచ వ్యాప్తంగా ప్రకటించండి.
పజలందర్నీ ఈ విషయాలు తెలుసుకోనివ్వండి.
6 సీయోను ప్రజలారా, ఈ సంగతులను గూర్చి కేకలు వేయండి.
ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు శక్తివంతంగా మీతో ఉన్నాడు.
అందుచేత, సంతోషంగా ఉండండి!
ఇశ్రాయేలు నుండి మంచిరోజులు తొలగింపబడటం
6 సీయోను వాసులారా, మీలో కొంతమంది చాలా సుఖవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు.
సమరయ పర్వతంమీద ఉన్న ప్రజలలో కొంతమంది సురక్షితంగా ఉన్నట్లు తలంచుచున్నారు.
కాని మీకు చాలా దుఃఖము కలుగుతుంది. మీరు ప్రాముఖ్యమైన జనాంగపు ముఖ్య నాయకులు.
ఇశ్రాయేలు ప్రజలు సలహా కొరకు మీ వద్దకు వస్తారు.
2 మీరు వెళ్లి కల్నేలో[a] చూడండి.
అక్కడనుండి పెద్ద నగరమైన హమాతుకి[b] వెళ్లండి.
ఫిలిష్తీయుల నగరమైన గాతుకు వెళ్లండి.
ఆ రాజ్యాలకంటే మీరేమైనా గొప్పవారా?
లేదు. మీ దానికంటే వారి రాజ్యాలు విశాలమైనవి.
3 శిక్షా దినము బహు దూరాన ఉన్నదనుకొని,
దౌర్జన్య పరిపాలనకు దగ్గరవుతున్నారు.
4 కాని మీరు అన్ని సుఖాలు అనుభవిస్తారు.
మీరు దంతపు మంచాలపై పడుకుంటారు.
మీ పాన్పులపై మీరు చాచుకొని పడుకుంటారు. మందలోని మంచి లేత గొర్రె పిల్లలను,
పశువులశాలలోని మంచి చిన్న గిత్త దూడలను మీరు తింటారు.
5 మీరు స్వరమండలాలను వాయిస్తారు.
దావీదువలె మీరు కనిపెట్టిన వాద్య విశేషాలపై సాధన చేస్తారు.
6 చిత్రమైన గిన్నెల్లో మీరు ద్రాక్షారసం తాగుతారు.
మీరు శ్రేష్ఠమైన పరిమళ తైలాలు వాడతారు.
యోసేపు వంశం నాశనమవుతూ
ఉందని కూడా మీరు కలవరం చెందరు.
7 ఆ ప్రజలు వారి పాన్పులపైన చాచుకొని పడుకున్నారు. కాని వారి మంచి రోజులు అంతమవుతాయి. వారు బందీలవలె అన్యదేశాలకు తీసుకొనిపోబడతారు. ముందుగా అలా పట్టుకుపోబడే వారిలో ఈ ప్రజలు వుంటారు. 8 ప్రభువైన యెహోవా ఈ ప్రమాణం చేశాడు. దేవుడును, సర్వ శక్తిమంతుడును అయిన యెహోవా తన పేరుమీద ఈ ప్రమాణం చేశాడు:
“యాకోబుకు గర్వకారణమైన వస్తువులను నేను అసహ్యించుకుంటాను.
అతని బలమైన బురుజులను నేను అసహ్యించుకుంటాను.
అందుచేత ‘శత్రువు’ నగరాన్ని,
దానిలోని ప్రతి వస్తువును తీసుకునేలా చేస్తాను.”
చందాలు సేకరించటం
8 సోదరులారా! మాసిదోనియ దేశంలోని సంఘాల పట్ల దేవుడు చూపిన అనుగ్రహాన్ని గురించి మీకు తెలపాలని మా అభిప్రాయం. 2 వాళ్ళ కష్టాలు వాళ్ళను తీవ్రంగా పరీక్షించాయి. వాళ్ళు చాలా పేదరికం అనుభవించారు. అయినా వాళ్ళలో చాలా ఆనందం కలిగి, వాళ్ళు యివ్వటంలో మిక్కిలి ఔదార్యం చూపారు. 3 వాళ్ళు యివ్వగలిగింది స్వయంగా యిచ్చారు. అంతే కాదు, తాము యివ్వగలిగినదానికన్నా ఇంకా ఎక్కువే యిచ్చారని నేను ఖచ్చితంగా చెప్పగలను. 4 విశ్వాసులైనవారికి చేసే సహాయంలో తాము కూడా చేరుతామని వాళ్ళు మమ్మల్ని ప్రాధేయపడ్డారు. 5 మేము ఆశించినంతగా చేయలేదు. అయినా వాళ్ళు మొదట తమను తాము ప్రభువుకు అర్పించుకొన్నారు. తర్వాత దేవుని చిత్తానుసారంగా మాకును అప్పగించుకున్నారు.
6 ఈ కార్యాన్ని ప్రారంభించిన తీతును దీన్ని కొనసాగించమని వేడుకొన్నాము. మీరు చేయాలనుకొన్న ఈ సేవాకార్యాన్ని అతడు పూర్తిచేసాడు. 7 మీరు విశ్వాసంలో, మాటలో, జ్ఞానంలో, సంపూర్ణ ఆసక్తిలో, మా పట్ల వ్యక్తపరుస్తున్న ప్రేమలో అందరిని మించిపోయారు. మీ దాతృత్వంలో కూడా అందరిని మించిపోవాలని మిమ్మల్ని అడుగుతున్నాను.
8 నేను మీకు ఆజ్ఞాపించటం లేదు. ఇతరులు చేస్తున్న సేవతో మీ ప్రేమను పోల్చి చూడాలని ఉంది. మీ ప్రేమ ఎంత నిజమైందో చూడాలని ఉంది. 9 మన యేసు క్రీస్తు ప్రభువు అనుగ్రహం ఎంత గొప్పదో మీకు తెలుసు. ఆయన ఐశ్వర్యవంతుడైనా మీ కొరకు పేదవాడయ్యాడు. ఆయన పేదరికం వల్ల మీరు ఐశ్వర్యవంతులు కావాలని ఆ విధంగా చేసాడు.
10 ఈ విషయంలో మీకు ఏది మంచిదో అది చెబుతాను. పోయిన సంవత్సరం మీరు అందరికన్నా ఎక్కువగా యివ్వటమే కాకుండా అలాంటి ఉద్దేశ్యం ఉన్నవాళ్ళలో మీరే ప్రథములు. 11 కార్యాన్ని మొదలు పెట్టటంలో చూపిన ఆసక్తి దాన్ని పూర్తి చెయ్యటంలో కూడా చూపండి. మీ శక్త్యానుసారం చెయ్యండి. 12 మీకు యివ్వాలనే ఆసక్తి ఉంటే దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. మీ దగ్గర లేనిదాన్ని బట్టి కాకుండా ఉన్నదాన్ని బట్టి మీరిచ్చింది అంగీకరిస్తాడు. 13 మీ మీద భారం మోపి యితరుల భారం తగ్గించాలని కాదు కాని అందరికీ సమానంగా ఉండవలెనని నా ఉద్దేశ్యం. 14 ప్రస్తుతం మీ దగ్గర అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. కనుక అవసరమున్నవాళ్ళకు మీరు సహాయం చెయ్యటం సమంజసమే. అలా చేస్తే మీకు అవసరం ఉన్నప్పుడు వాళ్ళు సహాయం చేస్తారు. అప్పుడు సమంజసంగా ఉంటుంది. 15 లేఖనాల్లో ఈ విధంగా వ్రాసారు:
“ఎక్కువ కూడబెట్టిన వాని దగ్గర ఎక్కువ లేదు.
తక్కువ కూడబెట్టిన వాని దగ్గర తక్కువ లేదు.”(A)
© 1997 Bible League International