Revised Common Lectionary (Complementary)
నాలుగవ భాగం
(కీర్తనలు 90–106)
దేవుని భక్తుడైన మోషే ప్రార్థన.
90 ప్రభువా, శాశ్వతంగా నీవే మా నివాసం.
2 పర్వతాలు, భూమి, ప్రపంచం చేయబడక ముందే నీవు దేవుడిగా ఉండినావు.
దేవా, ఇదివరకు ఎల్లప్పుడూ నీవే దేవుడవు మరియు ఎప్పటికి నీవే దేవునిగా ఉంటావు.
3 మనుష్యులను తిరిగి మట్టిగా మారుస్తావు. మనుష్య కుమారులారా,
తిరిగి రండని నీవు చెప్పుతావు.
4 నీ దృష్టిలో వేయి సంవత్సరాలు గడచిపోయిన ఒక రోజువలె ఉంటాయి.
గత రాత్రిలా అవి ఉన్నాయి.
5 నీవు మమ్మల్ని ఊడ్చివేస్తావు. మా జీవితం ఒక కలలా ఉంది. మర్నాడు ఉదయం మేము ఉండము.
మేము గడ్డిలా ఉన్నాము.
6 ఉదయం గడ్డి పెరుగుతుంది.
సాయంత్రం అది ఎండిపోయి ఉంటుంది.
7 దేవా, నీకు కోపం వచ్చినప్పుడు మేము నాశనం అవుతాము.
నీ కోపం మమ్మల్ని భయపెడుతుంది!
8 మా పాపాలు అన్నింటిని గూర్చి నీకు తెలుసు.
దేవా, మా రహస్య పాపాలలో ప్రతి ఒక్కటి నీవు చూస్తావు.
9 నీ కోపం నా జీవితాన్ని అంతం చేయవచ్చు.
మా సంవత్సరాలు నిట్టూర్పులా అంతమయి పోతాయి.
10 మేము 70 సంవత్సరాలు జీవిస్తాము.
బలంగా వుంటే 80 సంవత్సరాలు జీవిస్తాము.
మా జీవితాలు కష్టతరమైన పనితోను బాధతోను నిండి ఉన్నాయి.
అప్పుడు అకస్మాత్తుగా మా జీవితాలు అంతం అవుతాయి. మేము ఎగిరిపోతాము.
11 దేవా, నీ కోపం యొక్క పూర్తి శక్తి ఏమిటో నిజంగా ఎవరికీ తెలియదు.
కాని దేవా, నీ యెడల మాకున్న భయము, గౌరవం నీ కోపమంత గొప్పవి.
12 మాకు జ్ఞానోదయం కలిగేలా మా జీవితాలు
నిజంగా ఎంత కొద్దిపాటివో మాకు నేర్పించుము.
13 యెహోవా, ఎల్లప్పుడూ మా దగ్గరకు తిరిగి రమ్ము.
నీ సేవకులకు దయ చూపించుము.
14 ప్రతి ఉదయం నీ ప్రేమతో మమ్మల్ని నింపుము.
మేము సంతోషించి, మా జీవితాలు అనుభవించగలిగేలా చేయుము.
15 మా జీవితాల్లో చాలా దుఃఖం, కష్టాలు నీవు కలిగించావు.
ఇప్పుడు మమ్మల్ని సంతోషింపచేయుము.
16 వారి కోసం నీవు చేయగల ఆశ్చర్య కార్యాలను నీ సేవకులను చూడనిమ్ము.
వారి సంతానాన్ని నీ ప్రకాశమును చూడనిమ్ము.
17 మా దేవా, మా ప్రభూ, మా యెడల దయచూపించుము.
మేము చేసే ప్రతిదానిలో మాకు సఫలత అనుగ్రహించుము.
అహరోను ప్రధాన యాజకుడని దేవుడు రుజువు చేయటం
17 మోషేతో యెహోవా చెప్పాడు: 2 “ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడు. వారి దగ్గరనుండి పన్నెండు చేతికర్రలు తీసుకురా. పన్నెండు వంశాలలో ఒక్కొక్క నాయకుని దగ్గర్నుండి ఒకటి తీసుకో, ఒక్కొక్కరి పేరు ఒక్కో కర్ర మీద వ్రాయి. 3 లేవీ వాళ్ల కర్రమీద అహరోను పేరు వ్రాయి. పన్నెండు వంశాల్లో ప్రతి పెద్దకు ఒక కర్ర ఉండాలి. 4 సన్నిధి గుడారంలో ఒడంబడిక పెట్టె ఎదుట ఈ చేతి కర్రలను పెట్టు. ఇది నేను నిన్ను కలుసుకొనే చోటు. 5 ఒక్క మనిషిని నేను ఏర్పాటు చేసుకొంటాను. ఏ మనిషిని నేను ఎంచుకుంటానో నీకు తెలుస్తుంది. ఎందుచేత నంటే అతని కర్రకు కొత్త ఆకులు మొలవటం ప్రారంభమవుతుంది. ఈ విధంగా, ప్రజలు నీకు, నాకు ఎల్లప్పుడు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయటం నేను ఆపుచేస్తాను.”
6 కనుక మోషే ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడాడు. పెద్దలంతా ఒక్కొక్కరు ఒక కర్ర అతనికి ఇచ్చారు మొత్తం కర్రల సంఖ్య పన్నెండు. ఒక్కో వంశం నాయకుని దగ్గరనుండి ఒక్కో కర్ర వచ్చింది. వాటి మధ్య అహరోను కర్ర ఉంది. 7 మోషే ఆ చేతి కర్రలను సన్నిధి గుడారంలో ఒడంబడిక పెట్టె దగ్గర యెహోవా ఎదుట ఉంచాడు.
8 ఆ మరునాడు మోషే గుడారంలో ప్రవేశించాడు. లేవీ వంశపు కర్ర, అంటే అహరోను చేతికర్ర కొత్త ఆకులు తొడగటం మొదలు పెట్టినట్టు అతడు చూసాడు. ఆ కర్రకు కొమ్మలుకూడ పెరిగి, బాదంకాయలు కాసింది. 9 కనుక యెహోవా స్థానం నుండి మోషే ఆ కర్రలంటినీ బయటకు తెచ్చాడు. ఆ చేతి కర్రలను ఇశ్రాయేలు ప్రజలకు మోషే చూపించాడు. వాళ్లంతా ఆ కర్రలను చూచి, ఎవరి కర్ర వారు తిరిగి తీసుకున్నారు.
10 అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “అహరోను చేతి కర్రను మళ్లీ గుడారంలో పెట్టు. ఎల్లప్పుడూ నాకు వ్యతిరేకంగా ఎదురు తిరుగుచున్న ఈ ప్రజలకు ఇది ఒక హెచ్చరికగా ఉంటుంది. నామీద వారు ఫిర్యాదు చేయటం ఇది ఆపుచేస్తుంది. ఈ విధంగా వారు చావకుండా ఉంటారు.” 11 కనుక మోషే తనకు యెహోవా చెప్పినట్టు చేసాడు.
యేసు మరలా వస్తాడు
3 ప్రియమైన సోదరులారా! ఇది నా రెండవ ఉత్తరం. కల్మషం లేని మీ హృదయాలను ఉత్తేజపరచాలని మీకీ రెండు ఉత్తరాలు వ్రాసాను. 2 పవిత్రులైన ప్రవక్తలు చాలాకాలం క్రిందటే చెప్పిన సందేశాలను మన ప్రభువు, రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తు మీ అపొస్తలుల ద్వారా యిచ్చిన ఆజ్ఞను మీకు జ్ఞాపకం చెయ్యాలని నా ఉద్దేశ్యం.
3 చివరి రోజుల్లో కొందరు వ్యక్తులు వచ్చి తమ వాంఛల్ని తీర్చుకుంటూ మిమ్మల్ని ఎగతాళి చేస్తారు. ఈ విషయాన్ని మీరు ముఖ్యంగా అర్థం చేసుకోవాలి: 4 “వస్తానని వాగ్దానం చేసాడే, ఎప్పుడు వస్తాడు? మా పూర్వికులు మరణించినప్పటి నుండే కాదు. ప్రపంచం సృష్టింపబడినప్పటి నుండీ అన్నీ సక్రమంగానే నడుస్తున్నాయి” అని వాళ్ళంటారు.
5 చాలా కాలం క్రితమే దేవుడు తన మాటతో ఆకాశాలను, భూమిని సృష్టించాడు. వాళ్ళు ఈ విషయాన్ని కావాలనే మరిచిపోతారు. ఈ భూమి నీళ్ళనుండి, నీళ్ళ ద్వారా సృష్టింపబడింది. 6 నీళ్ళ కారణంగా ప్రళయం వచ్చి ఆనాటి ప్రపంచం నాశనమై పోయింది. 7 దేవుడు ఆ మాటతోటే ఈనాటి ఆకాశాన్ని, భూమిని మంటలతో నాశనం చెయ్యటానికి దాచి ఉంచాడు. తీర్పుచెప్పే రోజుదాకా, అంటే దైవభక్తి లేనివాళ్ళను నాశనంచేసే రోజుదాకా దాచి ఉంచుతాడు.
8 కాని ప్రియమైన సోదరులారా! ఈ విషయాన్ని మరచిపోకండి. ప్రభువుకు ఒక రోజు వెయ్యి సంవత్సరాలుగాను, వెయ్యి సంవత్సరాలు ఒక రోజుగాను ఉంటాయి[a] 9 ప్రభువు ఆలస్యం చేస్తున్నాడని కొందరు అనుకుంటారు. కాని, ఆయన తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవటంలో ఆలస్యం చెయ్యడు. ఎవ్వరూ నాశనం కాకూడదని, అందరూ మారుమనస్సు పొందాలని ఆయన ఉద్దేశ్యం. అందుకే ఆయన మీపట్ల సహనం వహిస్తున్నాడు.
10 కాని ప్రభువు రానున్న దినం ఒక దొంగలా వస్తుంది. ఆ రోజు ఆకాశాలు గర్జిస్తూ మాయమైపోతాయి. ఆకాశాల్లో ఉన్నవన్నీ మంటల్లో కాలి నాశనమై పోతాయి. పృథ్వి, దానిలో ఉన్న సమస్త వస్తువులూ కాలిపోతాయి. 11 అన్నీ ఈ విధంగా నాశనమైపోతాయి కనుక దేవుని ప్రజలై పవిత్రంగా జీవించటం ఎంత అవసరమో గ్రహించండి. 12 దేవుని దినం రావాలని మీరు ఎదురు చూస్తున్నారు కనుక ఆ దినం త్వరలోనే రావాలని మీరు ఆశించాలి. ఆ రోజు వచ్చి ఆకాశాలను మంటలతో నాశనం చేస్తుంది. ఆ వేడికి పరమాణువులు కరిగి పోతాయి. 13 దేవుడు వాగ్దానం చేసిన క్రొత్త ఆకాశంలో క్రొత్త భూమిపై నీతి నివసిస్తుంది. వాటికోసమే మనం ఎదురు చూస్తున్నాం.
14 ప్రియ సోదరులారా! మీరు వీటికోసం ఎదురు చూస్తున్నారు గనుక మీలో ఏ దోషమూ, కళంకమూ లేకుండా ఉండేటట్లు అన్నివిధాల ప్రయత్నం చెయ్యండి. శాంతం వహించండి. 15 మన ప్రభువు యొక్క సహనము మనకు రక్షణను యిస్తుందని గ్రహించండి. దేవుడు యిచ్చిన విజ్ఞానంతో మన ప్రియమిత్రుడు పౌలు మీకు ఈ విషయాల్ని గురించి వ్రాసాడు. 16 అతడు వ్రాసిన ఉత్తరాలన్నీ యిదేవిధంగా వ్రాసాడు. వాటన్నిటిలోనూ ఈ విషయాల్ని గురించే మాట్లాడాడు. అతని ఉత్తరాల్లోని కొన్ని విషయాలు అర్థం చేసుకోవటానికి కష్టంగా ఉంటాయి. జ్ఞానం లేనివాళ్ళు, చపల చిత్తం గలవాళ్ళు యితర లేఖనాలపై తప్పుడు వ్యాఖ్యానం చేసినట్లే దీనిమీద కూడ తప్పడు వ్యాఖ్యానం చేస్తారు. ఇలా చేయటం వల్ల వాళ్ళు నాశనమైపోతారు.
17 అందువల్ల ప్రియమైన సోదరులారా! ఇప్పుడీ విషయాలు మీకు తెలుసు. కనుక జాగ్రత్తగా ఉండండి. నీతికి విరుద్ధంగా ప్రవర్తించే వ్యక్తుల తప్పుడు మాటలకు మోసపోకండి. మీలో వున్న స్థిరత్వాన్ని వదులుకోకండి. 18 మన ప్రభువు, రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తు పట్ల మీకున్న కృతజ్ఞతను పెంచుకుంటూ, ఆయన్ని గురించి జ్ఞానంలో అభివృద్ధి చెందుతూ ఉండండి. ఆయనకి ఇప్పుడూ, చిరకాలం మహిమ కలుగుగాక! ఆమేన్.
© 1997 Bible League International